30 July 2012

లమ్డీకె

ఓరన్నా నువ్వు ఎంతన్నా
ఈ లోకం ఒక బందీ ఖానా
తిన్నదీ లేదు తిరిగిందీ లేదు, నిండుగా ప్రేమించిందీ లేదు మనస్సు నిండుగా రమించిందీ లేదు తిరిగింది తిరగక తిరగనిది వెదకక వెదికినది దొరకక పోతూనే ఉన్నాం కాలకృత్యాలై కర్మలై పాపాలై శాపాలై శోకాలై పెళ్ల్లిల్లై సంసారాలై శవాలై ఆస్థి దస్తావేజులై భూదాహాలై భవంతుల మోహాలై వస్తు విహారాలై వికృతాలై దినదిన ప్రవర్ధమానమయ్యే పూల సంహారులమై దేహ ద్రోహులమై దేశాలు పట్టి వేలాడే చివికిన దుస్తులమై, అన్నా

ఓరన్నా నువ్వు ఎంత అన్నా
నీకు నువ్వే ఒక బంధీ ఖానా
నీకు నువ్వే ఒక పాయి ఖానా-అని- అన్నా
డతడు

ఒక నిర్ముఖ సాయంత్రాన యింత
అన్నం అడిగినందుకు తనకింత
అన్నం ఎందుకు పెట్టరని పంతం పట్టినందుకు

లమ్డీకె అని తన మూతి పగలకొట్టిన
ఈ లోక కాలపు దయగల జనాలతో-

1 comment:

  1. సత్యాగ్రహం. సత్యమైన ఆగ్రహం. ఏమైనా చెయ్యొచ్చు, చెయ్యలేకపో వచ్చు. భుజం మీద అమ్ముల పొదిలో ఆగ్రహాన్ని దాచుకోవాలి. ఎప్పటికప్పుడు నొప్పిని ఒకరితో ఒకరం ఇంత బలంగా పంచుకోవాలి. సత్యమైన ఆగ్రహ ప్రకటన... దానికదే ఒక యుద్ధం. కాసింత కనికరం లేని ‘లోక కాలం’ మీద కొనసాగాల్సిన యుద్ధం. గొప్ప పద్యం. మా నిషాద శ్లోకాన్ని తలపించింది. బాధ పక్షి కోసం కాకపోవడం వల్ల మరింత బాగుంది.

    ReplyDelete