నిండుగా ఏడువా లేవు, నిర్మలంగా నవ్వాలేవు
వెన్నెల నీళ్ళలో మునక లేస్తూ
చీకటి ఒడ్డు పైకి చిట్టి నక్షత్రాలని
కప్పలుగా మార్చి వదిలే పిల్లలు
కాళ్ళు తడవకుండా, కళ్ళూ తడవకుండా దూరంగా నిలబడ్డ నిన్ను చూసి
ముసి ముసిగా నవ్వుతారు: వాళ్ళే
రాత్రి కాలువలోకి మొలతాళ్ళతో గెంతుతూ ఆడుతూ
ఈ విశ్వానికీ నీకూ తమ బెల్లంకాయలు చూయించే
అల్లరి నల్లని తెల్లని తుంటరి పిల్లలు-
చూసుకో యిక
నీ నిదురలోకి
ఎగిరి వచ్చినా
ఆకుపచ్చని కప్పలు నిన్ను వెక్కిరిస్తూ అరుస్తూనే ఉంటాయి రాత్రంతా
బెక బెక బెక బెక
బెక బెక బెక బెక
బెక బెక బెక బెక...
No comments:
Post a Comment