28 July 2012

సవ్యంగా

అది సరే యిది నీ మాట కాదు కానీ
నువ్వు తలంటుకొచ్చాక
ఇల్లంతా రెపరెపలాడుతూ
వీచే మగ్గిన కుంకుడు చెట్ల పచ్చి ఆకుల సువాసన-

తెల్లటి మెత్తటి తువ్వాలుతో
నీలిరాత్రుళ్ళ వంటి జుత్తును
నీ వెన్నెల ఛాతికి ఓ వైపుగా వేసుకుని తుడుచుకుని, ఆనక

అలవోకగా రివ్వున వెనక్కి తిరిగి
మెరిసే పసుపు పచ్చని వీపు పైకి
కురులని విసిరేసుకుని, నా వైపు చూసి చిన్నగా నవ్వినది నువ్వేనా?

అది సరే యిది నా మాటా కూడా కాదు కానీ
నువ్వు తలంటుకున్న ఉదయాన
మెత్తగా మత్తుగా నా హృదయాన్ని
కమ్ముకున్న నీ లేత శరీరపు సాంబ్రాణీ పొగ గురించే ఇదంతా-

యిక ఆ సంజ్నని చూసిన దినం
ఎవరైనా ఎలా ఉండగలరు
నిర్మలంగా? ఎవరైనా ఎలా
పని చేసుకోగలరు సవ్యంగా?

No comments:

Post a Comment