19 July 2012

తెలియనితనం

నువ్వు తిరిగి వచ్చే లోపల, లోపల ఎవరుంటారో తెలియదు -

ఖాళీ ఉద్యానవనంలో ఒక నిశ్శబ్ధం
అలలపై తేలే పల్చటి గాలిలా కదులాడుతుండవచ్చు

అపరిచితులెవరో కత్తులతో నీకై మాటు వేసి ఉండవచ్చు

పసి చేతులు పూలహారాలై
ఆకుపచ్చటి అల్లరితో, ఇల్లంతా బిర బిరా తిరుగాడుతుండవచ్చు

నీ లోపలి అస్థవ్యస్థతని
అతి తేలికగా సర్దుతూ
ఒక స్త్రీ మౌనంగా నిను మననం చేసుకుంటూ ఉండవచ్చు-లేదా

నీ తల్లి ఒక ఒంటరి దీపం ముందు
ఒక ఒంటరి ద్వీపమై కూర్చుని
తనని కరుణించమని నిను మోకరిల్లి ప్రార్ధిస్తూ ఉండవచ్చు. లేదా

నువ్వే నీకై ఎదురుచూస్తూ ఉండి ఉండవచ్చు. నీ నుంచి నువ్వే
పారిపోయీ ఉండవచ్చు. నిజంగా

నువ్వు తిరిగి వచ్చేసరికి
లోపలా బయటా ఎవరుంటారో, చివరికి ఎవరు ఎవరుగా మిగిలి ఉంటారో
నిజంగా ఎవరికీ తెలియదు

No comments:

Post a Comment