నీ అద్దంలో ఉందొక
నలుపు సరస్సు- వలలతో వస్తారిక
జాలరులు రాత్రికి
మౌనమృగ కర్మాగారపు దేహాలై నీ
నీలి కనుల గృహానికి! ఆహోయ్
యిక కరిగిన అద్దంలో
ముద్ర పడిన పెదాలు
ఏ పదాలు ఉచ్చరించాయో ఎవరికి తెలుసు?
వెళ్ళు చెల్లెమ్మా వెళ్ళు
దారిని దోచిన పవిత్రతే
నువ్వు నమ్మకూడని
ఒక ఆత్మనిందా నేరం-
యిక ఈ రాత్రికి
నువ్వు నీ దర్పణంలో నిదురించావో లేదో
ఎవరూ అడగరు!
31 July 2012
ఈ సాయంత్రంలోకి
నల్లని జలతారు పరదా కమ్ముకున్న ఈ సాయంత్రంలోకి
వాన దీపాన్ని పుచ్చుకుని తను
నీ తనువు జలదరించే గాలితోనీ
గదిలోకి అడుగిడగానే చూడెలా
టప టపా కిటికీలు కొట్టుకుని రివ్వున తలుపులు
బార్లా తెరుచుకుని, గూటిలోని పావురాళ్ళు ఒళ్ళు
విరుచుకుని నీ హృదయం రెక్కలు విదుల్చుకుని
నీ లోపలి మసక కాంతిలోకి ఆకస్మికంగా
విశ్వవ్యాప్తమైన రహస్య పూల పరిమళం
ఒకటి ఎలా తుంపరై రాలి రాలిపడుతుందో!
పరవాలేదు పరవాలేదు: కదిలే తోట నవ్వుతూ
కురిసే వానతో గదిలో గూడు కట్టుకునే గాలితో
నీ మదిలోకి వచ్చాక బ్రతకడానికి నీకెందుకింక
ఆ భయం?
వాన దీపాన్ని పుచ్చుకుని తను
నీ తనువు జలదరించే గాలితోనీ
గదిలోకి అడుగిడగానే చూడెలా
టప టపా కిటికీలు కొట్టుకుని రివ్వున తలుపులు
బార్లా తెరుచుకుని, గూటిలోని పావురాళ్ళు ఒళ్ళు
విరుచుకుని నీ హృదయం రెక్కలు విదుల్చుకుని
నీ లోపలి మసక కాంతిలోకి ఆకస్మికంగా
విశ్వవ్యాప్తమైన రహస్య పూల పరిమళం
ఒకటి ఎలా తుంపరై రాలి రాలిపడుతుందో!
పరవాలేదు పరవాలేదు: కదిలే తోట నవ్వుతూ
కురిసే వానతో గదిలో గూడు కట్టుకునే గాలితో
నీ మదిలోకి వచ్చాక బ్రతకడానికి నీకెందుకింక
ఆ భయం?
అ/జ్ఞాన సందేహం
వాన పాదాలతో లోనికి వచ్చి నా
ముఖాన్ని కురులతో చెరిపి
పెదాల్ని చల్లగా తడిపి ఆపై
ఒద్దికగా పక్కకు తిరిగి పద్దతిగా అద్దంలో నన్నూ
ఆ కరి మబ్బుల కురులని తుడుచుకునే నిన్నూ
ఎక్కడని రహస్యంగా దాచిపెట్టుకోను-?
ముఖాన్ని కురులతో చెరిపి
పెదాల్ని చల్లగా తడిపి ఆపై
ఒద్దికగా పక్కకు తిరిగి పద్దతిగా అద్దంలో నన్నూ
ఆ కరి మబ్బుల కురులని తుడుచుకునే నిన్నూ
ఎక్కడని రహస్యంగా దాచిపెట్టుకోను-?
30 July 2012
లమ్డీకె
ఓరన్నా నువ్వు ఎంతన్నా
ఈ లోకం ఒక బందీ ఖానా
ఓరన్నా నువ్వు ఎంత అన్నా
నీకు నువ్వే ఒక బంధీ ఖానా
నీకు నువ్వే ఒక పాయి ఖానా-అని- అన్నా
డతడు
ఒక నిర్ముఖ సాయంత్రాన యింత
అన్నం అడిగినందుకు తనకింత
అన్నం ఎందుకు పెట్టరని పంతం పట్టినందుకు
లమ్డీకె అని తన మూతి పగలకొట్టిన
ఈ లోక కాలపు దయగల జనాలతో-
ఈ లోకం ఒక బందీ ఖానా
తిన్నదీ లేదు తిరిగిందీ లేదు, నిండుగా ప్రేమించిందీ లేదు మనస్సు నిండుగా రమించిందీ లేదు తిరిగింది తిరగక తిరగనిది వెదకక వెదికినది దొరకక పోతూనే ఉన్నాం కాలకృత్యాలై కర్మలై పాపాలై శాపాలై శోకాలై పెళ్ల్లిల్లై సంసారాలై శవాలై ఆస్థి దస్తావేజులై భూదాహాలై భవంతుల మోహాలై వస్తు విహారాలై వికృతాలై దినదిన ప్రవర్ధమానమయ్యే పూల సంహారులమై దేహ ద్రోహులమై దేశాలు పట్టి వేలాడే చివికిన దుస్తులమై, అన్నా
ఓరన్నా నువ్వు ఎంత అన్నా
నీకు నువ్వే ఒక బంధీ ఖానా
నీకు నువ్వే ఒక పాయి ఖానా-అని- అన్నా
డతడు
ఒక నిర్ముఖ సాయంత్రాన యింత
అన్నం అడిగినందుకు తనకింత
అన్నం ఎందుకు పెట్టరని పంతం పట్టినందుకు
లమ్డీకె అని తన మూతి పగలకొట్టిన
ఈ లోక కాలపు దయగల జనాలతో-
పిల్లులు లేని రాత్రి
శవం లాగా కూర్చుంటే
రాత్రంతా అరిచే పిల్లులు
తగువులాడుకుంటూ మైధునంలో రక్కుకుంటూ కొరుక్కుంటూ కొంత
నీకు తోడుగా ఉంటాయి-
చక్కటి బలిష్టమైన పిల్లులు
నిండు జాబిలిలానో వానలానో
నల్లటి పూల గుచ్చంలానో ఈ
ఇంటి ప్రాంగణంలో చీకట్లో వేపచెట్టు కొమ్మల్లో గాండ్రుమంటూ, అంతలోనే
చల్లటి దూది పాదాలతో గుర్ గుర్ మంటూ నిన్ను రాసుకుంటూ కదిలేఆ
చక్కటి బలిష్టమైన పిల్లులు
నీలాగే నీ శరీర వాంఛలాగానే
స్పర్శ లేకుండా ఉండలేవవి-
ఎన్నడైనా ఒర్వలేనంత విసుగొచ్చి అలా విసిరి కొడతావా కాలితో తంతావా
చటాలున కనులు ముడుచుకుని నీ నుంచి దూరంగా పారిపోతాయవి. నీ
లాగే వెనువెంటనే అన్నీ మరచి తిరిగి వస్తాయవి, ఒకప్పుడు పుష్టిగా ఉండి
ఇకిప్పుడు ఇళ్ళు కనుమరుగై
చదరపు భవంతులలో అప్పుడప్పుడు తచ్చట్లాడుతూ నీకు కనపడే
బక్కచిక్కిన పిల్లులు - అవి ఇళ్ళు లేని పిల్లలు. యిక రాత్రి యింత
దీర్గంగా సాగినప్పుడు, నువ్వు ఒంటరిగా కూర్చున్నప్పుడు
ఒక మరణ నిశ్శబ్ధమే నీ అంతటా. పిల్లుల అరుపులు లేని
చీకటి సమాధే అంతటా.
యిది నిజమే. నీ హృదయమెప్పుడో
బావురుమన్న ఆ తెలుపూ నలుపూ పిల్లులుగా మారిపోయి
నువ్వు ఇల్లు ఖాళీ చేసిన నాడే
ఎక్కడో పూర్తిగా తప్పిపోయింది-
రాత్రంతా అరిచే పిల్లులు
తగువులాడుకుంటూ మైధునంలో రక్కుకుంటూ కొరుక్కుంటూ కొంత
నీకు తోడుగా ఉంటాయి-
చక్కటి బలిష్టమైన పిల్లులు
నిండు జాబిలిలానో వానలానో
నల్లటి పూల గుచ్చంలానో ఈ
ఇంటి ప్రాంగణంలో చీకట్లో వేపచెట్టు కొమ్మల్లో గాండ్రుమంటూ, అంతలోనే
చల్లటి దూది పాదాలతో గుర్ గుర్ మంటూ నిన్ను రాసుకుంటూ కదిలేఆ
చక్కటి బలిష్టమైన పిల్లులు
నీలాగే నీ శరీర వాంఛలాగానే
స్పర్శ లేకుండా ఉండలేవవి-
ఎన్నడైనా ఒర్వలేనంత విసుగొచ్చి అలా విసిరి కొడతావా కాలితో తంతావా
చటాలున కనులు ముడుచుకుని నీ నుంచి దూరంగా పారిపోతాయవి. నీ
లాగే వెనువెంటనే అన్నీ మరచి తిరిగి వస్తాయవి, ఒకప్పుడు పుష్టిగా ఉండి
ఇకిప్పుడు ఇళ్ళు కనుమరుగై
చదరపు భవంతులలో అప్పుడప్పుడు తచ్చట్లాడుతూ నీకు కనపడే
బక్కచిక్కిన పిల్లులు - అవి ఇళ్ళు లేని పిల్లలు. యిక రాత్రి యింత
దీర్గంగా సాగినప్పుడు, నువ్వు ఒంటరిగా కూర్చున్నప్పుడు
ఒక మరణ నిశ్శబ్ధమే నీ అంతటా. పిల్లుల అరుపులు లేని
చీకటి సమాధే అంతటా.
యిది నిజమే. నీ హృదయమెప్పుడో
బావురుమన్న ఆ తెలుపూ నలుపూ పిల్లులుగా మారిపోయి
నువ్వు ఇల్లు ఖాళీ చేసిన నాడే
ఎక్కడో పూర్తిగా తప్పిపోయింది-
నువ్వు పట్టుకున్న నా చేయి
రాలిపోవాలనిపించక, కొమ్మని
వీడిపోవాలనిపించక, దుమ్మూ
దుమారపు గాలికి నిలువలేక విలవిలలాడిన పూవు ఒకటి
నా చేతిని పట్టుకున్న ఆ క్షణం
ఇప్పటికీ నువ్వు లేని క్షణాలలోకి సాగి 'నాకు సమాధానం చెప్పు'
అంటూ నిలదీస్తోంది: ఎవరిని?
ఒక పూవుచే ఖండింపబడి అలా నిలబడిపోయిన
ఉప్పు కనులై మొండి చేతులై
మనిషంత కన్నీటి చుక్కై, ఒక
చితాభస్మపు ఏకాకి వనమై యిలా మిగిలే పోయిన
ఒక నీలి కంకాళానికి-
వీడిపోవాలనిపించక, దుమ్మూ
దుమారపు గాలికి నిలువలేక విలవిలలాడిన పూవు ఒకటి
నా చేతిని పట్టుకున్న ఆ క్షణం
ఇప్పటికీ నువ్వు లేని క్షణాలలోకి సాగి 'నాకు సమాధానం చెప్పు'
అంటూ నిలదీస్తోంది: ఎవరిని?
ఒక పూవుచే ఖండింపబడి అలా నిలబడిపోయిన
ఉప్పు కనులై మొండి చేతులై
మనిషంత కన్నీటి చుక్కై, ఒక
చితాభస్మపు ఏకాకి వనమై యిలా మిగిలే పోయిన
ఒక నీలి కంకాళానికి-
పిల్లలు చూపించిన జీవితం
నిండుగా ఏడువా లేవు, నిర్మలంగా నవ్వాలేవు
వెన్నెల నీళ్ళలో మునక లేస్తూ
చీకటి ఒడ్డు పైకి చిట్టి నక్షత్రాలని
కప్పలుగా మార్చి వదిలే పిల్లలు
కాళ్ళు తడవకుండా, కళ్ళూ తడవకుండా దూరంగా నిలబడ్డ నిన్ను చూసి
ముసి ముసిగా నవ్వుతారు: వాళ్ళే
రాత్రి కాలువలోకి మొలతాళ్ళతో గెంతుతూ ఆడుతూ
ఈ విశ్వానికీ నీకూ తమ బెల్లంకాయలు చూయించే
అల్లరి నల్లని తెల్లని తుంటరి పిల్లలు-
చూసుకో యిక
నీ నిదురలోకి
ఎగిరి వచ్చినా
ఆకుపచ్చని కప్పలు నిన్ను వెక్కిరిస్తూ అరుస్తూనే ఉంటాయి రాత్రంతా
బెక బెక బెక బెక
బెక బెక బెక బెక
బెక బెక బెక బెక...
వెన్నెల నీళ్ళలో మునక లేస్తూ
చీకటి ఒడ్డు పైకి చిట్టి నక్షత్రాలని
కప్పలుగా మార్చి వదిలే పిల్లలు
కాళ్ళు తడవకుండా, కళ్ళూ తడవకుండా దూరంగా నిలబడ్డ నిన్ను చూసి
ముసి ముసిగా నవ్వుతారు: వాళ్ళే
రాత్రి కాలువలోకి మొలతాళ్ళతో గెంతుతూ ఆడుతూ
ఈ విశ్వానికీ నీకూ తమ బెల్లంకాయలు చూయించే
అల్లరి నల్లని తెల్లని తుంటరి పిల్లలు-
చూసుకో యిక
నీ నిదురలోకి
ఎగిరి వచ్చినా
ఆకుపచ్చని కప్పలు నిన్ను వెక్కిరిస్తూ అరుస్తూనే ఉంటాయి రాత్రంతా
బెక బెక బెక బెక
బెక బెక బెక బెక
బెక బెక బెక బెక...
29 July 2012
రాయి
దారి పక్కన
రాత్రిలో దొరికిన చందమామ ఈ గులకరాయి
ఆప్తంగా చేతిలో పుచ్చుకుని
నవ్వుతూ వస్తాను యిక
ఇంటికి. చూసావా నువ్వు
అంతిమంగా
ఒక రాయి మరొక రాయిని
ఎలా చేరుకుందో!
రాత్రిలో దొరికిన చందమామ ఈ గులకరాయి
ఆప్తంగా చేతిలో పుచ్చుకుని
నవ్వుతూ వస్తాను యిక
ఇంటికి. చూసావా నువ్వు
అంతిమంగా
ఒక రాయి మరొక రాయిని
ఎలా చేరుకుందో!
28 July 2012
సర్పగీతం
పావురాన్ని పెనవేసుకున్న త్రాచుని
హృదయంలో నింపుకున్న మనిషిని
నిండుగా ప్రేమించిన
ఈ ధరిత్రి స్త్రీవి నువ్వే-
ఓం తత్సత్!
విధిలేని నుదిటితో
మది లేని కౌగిలితో
రాత్రంతా
దారి లేని
సంసారపు దిగుడు బావుల్లో
నిక్కచ్చిగా కలసి పడుకుని
చనిపోయి
పిల్లల్ని కని పిల్లలకి ప్రేమను లేకుండా చేసిన
నా ఇద్దరికి--------------------------ఆ
ఇతరులకి
ఇదిగో ఒక
సర్ప గీతం-
హృదయంలో నింపుకున్న మనిషిని
నిండుగా ప్రేమించిన
ఈ ధరిత్రి స్త్రీవి నువ్వే-
ఓం తత్సత్!
విధిలేని నుదిటితో
మది లేని కౌగిలితో
రాత్రంతా
దారి లేని
సంసారపు దిగుడు బావుల్లో
నిక్కచ్చిగా కలసి పడుకుని
చనిపోయి
పిల్లల్ని కని పిల్లలకి ప్రేమను లేకుండా చేసిన
నా ఇద్దరికి--------------------------ఆ
ఇతరులకి
ఇదిగో ఒక
సర్ప గీతం-
ఇలాగా?
బచ్చలి ఆకులు
తాకిన కనులు
తప్పుకుంటాయి నీడల పందిరిలోకి నెమ్మదిగా
యికనీ నిద్ర
శరీరంలోకి
ఓ నిశ్శబ్ధమే
కదిలిందో ఓ
పరిమళపు సర్పమే జొరబడిందో - రేపు వచ్చే
రాత్రి వానకి
బచ్చలి ఆకుల మధ్య దాగిన
గవ్వల కళ్ళ
వెన్నెల పిల్లనే చెప్పనీ!
తాకిన కనులు
తప్పుకుంటాయి నీడల పందిరిలోకి నెమ్మదిగా
యికనీ నిద్ర
శరీరంలోకి
ఓ నిశ్శబ్ధమే
కదిలిందో ఓ
పరిమళపు సర్పమే జొరబడిందో - రేపు వచ్చే
రాత్రి వానకి
బచ్చలి ఆకుల మధ్య దాగిన
గవ్వల కళ్ళ
వెన్నెల పిల్లనే చెప్పనీ!
సవ్యంగా
అది సరే యిది నీ మాట కాదు కానీ
నువ్వు తలంటుకొచ్చాక
ఇల్లంతా రెపరెపలాడుతూ
వీచే మగ్గిన కుంకుడు చెట్ల పచ్చి ఆకుల సువాసన-
తెల్లటి మెత్తటి తువ్వాలుతో
నీలిరాత్రుళ్ళ వంటి జుత్తును
నీ వెన్నెల ఛాతికి ఓ వైపుగా వేసుకుని తుడుచుకుని, ఆనక
అలవోకగా రివ్వున వెనక్కి తిరిగి
మెరిసే పసుపు పచ్చని వీపు పైకి
కురులని విసిరేసుకుని, నా వైపు చూసి చిన్నగా నవ్వినది నువ్వేనా?
అది సరే యిది నా మాటా కూడా కాదు కానీ
నువ్వు తలంటుకున్న ఉదయాన
మెత్తగా మత్తుగా నా హృదయాన్ని
కమ్ముకున్న నీ లేత శరీరపు సాంబ్రాణీ పొగ గురించే ఇదంతా-
యిక ఆ సంజ్నని చూసిన దినం
ఎవరైనా ఎలా ఉండగలరు
నిర్మలంగా? ఎవరైనా ఎలా
పని చేసుకోగలరు సవ్యంగా?
నువ్వు తలంటుకొచ్చాక
ఇల్లంతా రెపరెపలాడుతూ
వీచే మగ్గిన కుంకుడు చెట్ల పచ్చి ఆకుల సువాసన-
తెల్లటి మెత్తటి తువ్వాలుతో
నీలిరాత్రుళ్ళ వంటి జుత్తును
నీ వెన్నెల ఛాతికి ఓ వైపుగా వేసుకుని తుడుచుకుని, ఆనక
అలవోకగా రివ్వున వెనక్కి తిరిగి
మెరిసే పసుపు పచ్చని వీపు పైకి
కురులని విసిరేసుకుని, నా వైపు చూసి చిన్నగా నవ్వినది నువ్వేనా?
అది సరే యిది నా మాటా కూడా కాదు కానీ
నువ్వు తలంటుకున్న ఉదయాన
మెత్తగా మత్తుగా నా హృదయాన్ని
కమ్ముకున్న నీ లేత శరీరపు సాంబ్రాణీ పొగ గురించే ఇదంతా-
యిక ఆ సంజ్నని చూసిన దినం
ఎవరైనా ఎలా ఉండగలరు
నిర్మలంగా? ఎవరైనా ఎలా
పని చేసుకోగలరు సవ్యంగా?
ఇలా మొదలు
దోసిళ్ళ నిండా కాంతీతో, ముఖం నిండా శాంతీతో
పెదాలపై పూసిన నవ్వుతో
కిటికీ పరదాలు పక్కకు జరిపి తలుపులు బార్లా తెరచి
గది నిండా తిరుగాడే గాలితో వీచే రావిచెట్లతో
నిదురలో ఏదో స్మృతితో నవ్వే పసి పిల్లలతో
మాట వినక ఎక్కడో కురిసే వానని
చెవి పట్టుకుని అలా లాక్కువచ్చి
యిలా నీ ముందు నిలిపిన ఆ చేతులతో, అంతిమంగా
నీ లోపలి నిశ్శబ్ధపు లయగా మారిన
తన స్వరశ్వాసతో ఈ ఉదయం ఇలా
మొదలవ్వడం బావుంది - ఆ తరువాత
ఏమి జరిగినా కానీ!
పెదాలపై పూసిన నవ్వుతో
కిటికీ పరదాలు పక్కకు జరిపి తలుపులు బార్లా తెరచి
గది నిండా తిరుగాడే గాలితో వీచే రావిచెట్లతో
నిదురలో ఏదో స్మృతితో నవ్వే పసి పిల్లలతో
మాట వినక ఎక్కడో కురిసే వానని
చెవి పట్టుకుని అలా లాక్కువచ్చి
యిలా నీ ముందు నిలిపిన ఆ చేతులతో, అంతిమంగా
నీ లోపలి నిశ్శబ్ధపు లయగా మారిన
తన స్వరశ్వాసతో ఈ ఉదయం ఇలా
మొదలవ్వడం బావుంది - ఆ తరువాత
ఏమి జరిగినా కానీ!
26 July 2012
లే యిక.
ఇలా కూర్చుంటే
అలా చెట్లలో ఆగిన గాలి కదిలి
నీ చెంత చేరుతుంది - ఎగిరెగిరి
ఆ కొమ్మలని కదిపి పూలనూ చెరిపి
నిన్న రాత్రి కురిసిన వానను మళ్ళా
నీపై చిమ్ముతుంది - ఆనక ఎందుకో
ఓ మారు నీ ముఖాన్ని మెత్తగా తన
చేతుల మధ్యకు తీసుకుని నిమిరి
నీ అలసిన కళ్ళలోకి
నింపాదిగా చూస్తుంది-
యిక యిదే సరైన సమయం
అలసినా సొలసినా విసిగినా
నువ్వు ఇంటికి వీచాల్సిన
నీటి పరదాల పన్నీరూ కన్నీరూ అయిన రక్త సమయం.
లే యిక.
అలా చెట్లలో ఆగిన గాలి కదిలి
నీ చెంత చేరుతుంది - ఎగిరెగిరి
ఆ కొమ్మలని కదిపి పూలనూ చెరిపి
నిన్న రాత్రి కురిసిన వానను మళ్ళా
నీపై చిమ్ముతుంది - ఆనక ఎందుకో
ఓ మారు నీ ముఖాన్ని మెత్తగా తన
చేతుల మధ్యకు తీసుకుని నిమిరి
నీ అలసిన కళ్ళలోకి
నింపాదిగా చూస్తుంది-
యిక యిదే సరైన సమయం
అలసినా సొలసినా విసిగినా
నువ్వు ఇంటికి వీచాల్సిన
నీటి పరదాల పన్నీరూ కన్నీరూ అయిన రక్త సమయం.
లే యిక.
మౌనం
ఇద్దరి మధ్యా ఎదురెదురుగా ఒక మహా నగర సరస్సు. ఎదురెదురుగా ఆ ఇద్దరి మధ్యా కనుచూపు మేరా పరుచుకున్న ఒక దూరం. ఒక మౌనం. యిక ఈ పూటకి
చినుకులలో ఒదిగిన సంధ్యకాంతి అలలని తాకి వెళ్ళిపోతుంది. ఓ సందిగ్ధ నిలయ విలాప సాయంత్రానికి కొంత చీకటిని మిగిల్చీ, ఈ నీళ్ళకీ ఆ ఆకులకీ కొంత తన తడి నయనాల కాటుకనూ అంటించీ కాంతీ కనుమరుగయ్యి జారిపోతుంది- '-రాబోయే రాత్రిని ఎవరు వెలిగిస్తారో తెలియదు కానీ ముందు మనం ఇంటికి వెళ్ళాలి. పద - మనం మన కోసం కాకపోయినా పిల్లలకి యింత అన్నం వండాలి-' అని తనే అంటుంది కానీ
కన్నీళ్ళతో పాలిపోయిన నీలి ఆకాశం వాళ్ళతో ఎక్కడికీ వెళ్ళలేక యిక ఒంటరిగా నాతోనే ఈ సరస్సు చివరన ఆగిపోయింది. యిక యిక్కడ నేనేం చేయాలి?
చినుకులలో ఒదిగిన సంధ్యకాంతి అలలని తాకి వెళ్ళిపోతుంది. ఓ సందిగ్ధ నిలయ విలాప సాయంత్రానికి కొంత చీకటిని మిగిల్చీ, ఈ నీళ్ళకీ ఆ ఆకులకీ కొంత తన తడి నయనాల కాటుకనూ అంటించీ కాంతీ కనుమరుగయ్యి జారిపోతుంది- '-రాబోయే రాత్రిని ఎవరు వెలిగిస్తారో తెలియదు కానీ ముందు మనం ఇంటికి వెళ్ళాలి. పద - మనం మన కోసం కాకపోయినా పిల్లలకి యింత అన్నం వండాలి-' అని తనే అంటుంది కానీ
కన్నీళ్ళతో పాలిపోయిన నీలి ఆకాశం వాళ్ళతో ఎక్కడికీ వెళ్ళలేక యిక ఒంటరిగా నాతోనే ఈ సరస్సు చివరన ఆగిపోయింది. యిక యిక్కడ నేనేం చేయాలి?
25 July 2012
శిల్పం
శరీరాన్ని ఒక భిక్షపాత్రగా మార్చుకుని
తలను వంచుకుని, నిస్సిగ్గుగా
మనుషులని మనుషుల కోసం అడుక్కునేందుకు
నువ్వు మధుశాలలకో హృదయ వధశాలలకో వెడితే
ఏ అర్ధరాత్రికో ఎవరూ తాకని కన్నీళ్ళతో
నువ్వింటికి వచ్చి తిండి తినక
స్పృహ తప్పి అలా నిదురపోతే
ఫిరోజ్ అందులో నీ తప్పేం లేదు! కాకపోతే
నిన్ను తలుచుకునే నిన్న రాత్రంతా
ఒక పాలరాతి శిల్పం గుక్క పట్టుకుని ఏడ్చింది-
తలను వంచుకుని, నిస్సిగ్గుగా
మనుషులని మనుషుల కోసం అడుక్కునేందుకు
నువ్వు మధుశాలలకో హృదయ వధశాలలకో వెడితే
ఏ అర్ధరాత్రికో ఎవరూ తాకని కన్నీళ్ళతో
నువ్వింటికి వచ్చి తిండి తినక
స్పృహ తప్పి అలా నిదురపోతే
ఫిరోజ్ అందులో నీ తప్పేం లేదు! కాకపోతే
నిన్ను తలుచుకునే నిన్న రాత్రంతా
ఒక పాలరాతి శిల్పం గుక్క పట్టుకుని ఏడ్చింది-
24 July 2012
సత్యం
ముఖాలలో లక్ష సీతాకోకచిలుకలు
మంచు రాలిన గడ్డిపరకల వాసనతో
వెన్నెల అలికిడిలతో
అలలా రివ్వున వాలి
తిరిగి పూల పొదరిళ్లై చెంగు చెంగున
అలా గుబాళించడం
ఏనాడైనా చూసావా?
ఏమీ లేదు
సత్యమేమిటంటే, ఈ వేళ స్కూళ్ళు లేవని
ఈ ఉదయమే పిల్లలకి
ఆకస్మికంగా తెలిసింది-!
మంచు రాలిన గడ్డిపరకల వాసనతో
వెన్నెల అలికిడిలతో
అలలా రివ్వున వాలి
తిరిగి పూల పొదరిళ్లై చెంగు చెంగున
అలా గుబాళించడం
ఏనాడైనా చూసావా?
ఏమీ లేదు
సత్యమేమిటంటే, ఈ వేళ స్కూళ్ళు లేవని
ఈ ఉదయమే పిల్లలకి
ఆకస్మికంగా తెలిసింది-!
23 July 2012
రావి చెట్ల గుబులు
చిన్నగా నవ్వే నీ పల్చటి పసుపు ముఖంపై
గలగలలాడతాయి ఈ రావి ఆకుల నీడలు
నీ ముంగురలను వేళ్ళ అంచులతో చెరిపి
నిన్ను తనతో పరిగెత్తించుకుపోయే గాలితో
చిన్నగా నవ్వలేని, చెప్పలేని నా దిగులుతో-
నిజం ఏంటంటే, అప్పటినుంచీ ఇప్పటిదాకా
యిక నా రాత్రుళ్ళులో ఆ ప్రమిదెలలో
ఈ చీకటి విషపు వలయాలుగా మారి
తను లేని నా ఒంటరి శరీరంలో నెత్తురోడుతూ దిగి ఒదిగేదాకా
ముసురు పట్టి తడిచి వొణికిన
ఈ హృదయంలోని
రావి చెట్ల గుబులు తడి
యింకా నన్ను వదలనే లేదు, యింకా ఆరనూ లేదు-
గలగలలాడతాయి ఈ రావి ఆకుల నీడలు
నీ ముంగురలను వేళ్ళ అంచులతో చెరిపి
నిన్ను తనతో పరిగెత్తించుకుపోయే గాలితో
చిన్నగా నవ్వలేని, చెప్పలేని నా దిగులుతో-
నిజం ఏంటంటే, అప్పటినుంచీ ఇప్పటిదాకా
యిక నా రాత్రుళ్ళులో ఆ ప్రమిదెలలో
ఈ చీకటి విషపు వలయాలుగా మారి
తను లేని నా ఒంటరి శరీరంలో నెత్తురోడుతూ దిగి ఒదిగేదాకా
ముసురు పట్టి తడిచి వొణికిన
ఈ హృదయంలోని
రావి చెట్ల గుబులు తడి
యింకా నన్ను వదలనే లేదు, యింకా ఆరనూ లేదు-
నా కపిలం అను సొంత డబ్బా
డమరుకం వలె డం డం డం డమ డమ డం
దివారాత్రులంతా జుం జుం జుం
ఆత్మ ఉన్నదో లేదో తెలియదు కానీ
ఆత్మ జ్ఞానా జ్ఞానం ఎంత యున్నదో
నీ మహా వానరపు బుర్ర నిండా - యిక వెయ్యిరా వెయ్
పదిమంది ముఖాల నిండా
నువ్వనేది లేదనే నువ్వైనా
మహా సర్వసుందర అబద్ధాన్నీ, రికామీ రిక్త పదాలనీ
కీర్తి మృదంగ కులాలనీ మతాలనీ
అంతిమ ప్రాంతాల ఆదిమ సత్యాలనీ - వెయ్ రా వెయ్
ఎగిరెగిరి వెయ్ తిరిగి తిరిగి వెయ్ తిరుగాడుతూ వెయ్
వెనుదిరుగుతూ వెయ్, వెయ్ వెయ్ వెయ్
డం డం డం జుం జుం జుం
జుం జుం జుం డం డం డం
యిక నిన్ను ఆపేదెవరు
యిక నిన్ను లేపేదెవరు?
All Hail - You are the New King in town!
దివారాత్రులంతా జుం జుం జుం
ఆత్మ ఉన్నదో లేదో తెలియదు కానీ
ఆత్మ జ్ఞానా జ్ఞానం ఎంత యున్నదో
నీ మహా వానరపు బుర్ర నిండా - యిక వెయ్యిరా వెయ్
పదిమంది ముఖాల నిండా
నువ్వనేది లేదనే నువ్వైనా
మహా సర్వసుందర అబద్ధాన్నీ, రికామీ రిక్త పదాలనీ
కీర్తి మృదంగ కులాలనీ మతాలనీ
అంతిమ ప్రాంతాల ఆదిమ సత్యాలనీ - వెయ్ రా వెయ్
ఎగిరెగిరి వెయ్ తిరిగి తిరిగి వెయ్ తిరుగాడుతూ వెయ్
వెనుదిరుగుతూ వెయ్, వెయ్ వెయ్ వెయ్
డం డం డం జుం జుం జుం
జుం జుం జుం డం డం డం
యిక నిన్ను ఆపేదెవరు
యిక నిన్ను లేపేదెవరు?
All Hail - You are the New King in town!
22 July 2012
ఒక
అన్నో ఇన్నో ఊళ్లు తిరిగి తిరిగి, ఎంతో కొంత అరిగి విరిగి
ఏవో కొన్నిటిని అమ్ముకుని
ఇన్ని రూకలని దాచుకుని
మట్టి గొట్టుకుని నీకు నువ్వే
మొహం మొత్తుకుని అద్దంలో నీ ముఖం నువ్వే దాచుకుని
అపుడో ఇపుడో ఎపుడో
తిరిగొస్తావ్, నీ పెళ్ళాన్నీ
నీ లేతబిడ్డల ముఖాల్నీ
చూద్దామని, తెచ్చిన
కొన్ని కొన్న బొమ్మలతో
ఆత్రుతతో - చివరాఖరికి
కొంత మిగిలే ఉంటావ్
నీకో నీ స్నేహితులకో! యిక చూడు, యిక చూసుకో ఆ రాత్రంతా
హే రాజన్! ఎక్కడ నా
దివ్యనగర దీప్తి ప్రదాత
వికసిత మధునయనీ నా మహాశాంతిదాయనీ?
ఏవో కొన్నిటిని అమ్ముకుని
ఇన్ని రూకలని దాచుకుని
మట్టి గొట్టుకుని నీకు నువ్వే
మొహం మొత్తుకుని అద్దంలో నీ ముఖం నువ్వే దాచుకుని
అపుడో ఇపుడో ఎపుడో
తిరిగొస్తావ్, నీ పెళ్ళాన్నీ
నీ లేతబిడ్డల ముఖాల్నీ
చూద్దామని, తెచ్చిన
కొన్ని కొన్న బొమ్మలతో
ఆత్రుతతో - చివరాఖరికి
కొంత మిగిలే ఉంటావ్
నీకో నీ స్నేహితులకో! యిక చూడు, యిక చూసుకో ఆ రాత్రంతా
హే రాజన్! ఎక్కడ నా
దివ్యనగర దీప్తి ప్రదాత
వికసిత మధునయనీ నా మహాశాంతిదాయనీ?
కోరిక
చీకటి పరదాని తొలగించి ఎవరైనా
నీ ముఖాన్ని చూపిస్తే బావుండు-
నేనెంత చీకటి నైనా, ఇంత
చీకటిని ఎలాగని ఒర్వడం?
అది సరే కానీ యిక ఎవరైనా
ఈ రాత్రి పరదాని తొలగించి
నిన్ను మననం చేసుకునే
ఈ కనుల అంచున యింత
వెలుతురు సుర్మాను దిద్దితే ఎంత బావుండు!
నీ ముఖాన్ని చూపిస్తే బావుండు-
నేనెంత చీకటి నైనా, ఇంత
చీకటిని ఎలాగని ఒర్వడం?
అది సరే కానీ యిక ఎవరైనా
ఈ రాత్రి పరదాని తొలగించి
నిన్ను మననం చేసుకునే
ఈ కనుల అంచున యింత
వెలుతురు సుర్మాను దిద్దితే ఎంత బావుండు!
21 July 2012
ఎంత కాలం
ఆకాశం నవ్విన చప్పుడికి
ఇక్కడి చెట్లు
నీ నిదురలో పెనవేసుకున్న చినుకులతో
పురాస్మృతుల మర్రి ఊడలతో
ఒక్కసారిగా కదులాడుతాయి-
నిజం చెప్పు -నువ్వు.
వానని శపించకుండా
దాని తెరలలో నిండుగా
హాయిగా తేలికగా తడచి
ఎంత కాలం అయ్యింది?
ఇక్కడి చెట్లు
నీ నిదురలో పెనవేసుకున్న చినుకులతో
పురాస్మృతుల మర్రి ఊడలతో
ఒక్కసారిగా కదులాడుతాయి-
నిజం చెప్పు -నువ్వు.
వానని శపించకుండా
దాని తెరలలో నిండుగా
హాయిగా తేలికగా తడచి
ఎంత కాలం అయ్యింది?
20 July 2012
నిన్న రాత్రి
చినుకుల పూలు రాలుతున్న
వాన చెట్టు కింద నిల్చున్నాం
నేనూ ఫిరోజ్
ఆ నీటి చెట్టుకి పూసిన చిక్కని
చీకటి చంద్రుడిని అలానే చూస్తో
అంటాడు కదా అప్పుడు తను ఒక మైకపు తన్మయత్వంతో
"భాయ్, మనం నిల్చున్న ఈ భూమి
ఒక సుందరమైన స్త్రీ వంటిది-ఈ చెట్లకీ
ఈ కుక్కపిల్లకీ ఆ పురుగులకీ పిట్టలకీ
ఈ రాళ్లకీ ఆ కొండలకీ మనకీ
జన్మనివ్వగలిగేదీ సాకగలిగేదీ
ప్రాణమున్న ఓ జీవమే కదా - భాయ్
ఈ భూమికి ప్రాణం ఉంది. అది
మనల్ని వింటుందీ కంటుందీ. భాయ్
ఇవాళ నాకు తెలిసింది
దైవం పురుషుడు కాదు
దైవం ఒక స్త్రీ-". యిక
ఆ అర్థరాత్రి రెండున్నరకి ఇంటికి వస్తూ
నాకే అర్థం కాదు, ఏడు పాత్రల విస్కీ
తాగాక, మరలా తలా మూడు బీర్లు
ప్రతీసారీ తనకీ నాకే
ఎందుకు అవసరం
పడతాయో, ఎంతకూ తీరని ఈ బ్రతుకు దాహమేమిటో!
వాన చెట్టు కింద నిల్చున్నాం
నేనూ ఫిరోజ్
ఆ నీటి చెట్టుకి పూసిన చిక్కని
చీకటి చంద్రుడిని అలానే చూస్తో
అంటాడు కదా అప్పుడు తను ఒక మైకపు తన్మయత్వంతో
"భాయ్, మనం నిల్చున్న ఈ భూమి
ఒక సుందరమైన స్త్రీ వంటిది-ఈ చెట్లకీ
ఈ కుక్కపిల్లకీ ఆ పురుగులకీ పిట్టలకీ
ఈ రాళ్లకీ ఆ కొండలకీ మనకీ
జన్మనివ్వగలిగేదీ సాకగలిగేదీ
ప్రాణమున్న ఓ జీవమే కదా - భాయ్
ఈ భూమికి ప్రాణం ఉంది. అది
మనల్ని వింటుందీ కంటుందీ. భాయ్
ఇవాళ నాకు తెలిసింది
దైవం పురుషుడు కాదు
దైవం ఒక స్త్రీ-". యిక
ఆ అర్థరాత్రి రెండున్నరకి ఇంటికి వస్తూ
నాకే అర్థం కాదు, ఏడు పాత్రల విస్కీ
తాగాక, మరలా తలా మూడు బీర్లు
ప్రతీసారీ తనకీ నాకే
ఎందుకు అవసరం
పడతాయో, ఎంతకూ తీరని ఈ బ్రతుకు దాహమేమిటో!
కబోధి
దూరమైనదేదీ దగ్గరగా రాలేదు
అందుకే గుర్తుకు వస్తుంది నీ ముఖం
ఈ రాత్రి వికసించిన మసక వెన్నెలలా-
వొంగి పూల పాత్రలో
నీ తోటలో పూసిన
తెల్లటి లిల్లీ పూలను ఉంచుతూ
నా వైపు తిరిగి చిన్నగా నవ్విన
ఆ సన్నటి సవ్వడే
యింకా యిక్కడ
చినుకుల చిలుకల కలకలంతో
మెత్తగా తేలికగా
కదులాడుతోంది-
యిక ఏం చేయను?
వాన కురిసిన రాత్రి
చీకటి వెలిగిన రోజా పూల కాంతిలో
చల్లటి చామనఛాయతో నీ ముఖం
వెచ్చటి నక్షత్రాలతో మెరిసిన, నేను
మోహించిన నీ తామర పూల శరీరమూ గుర్తుకువచ్చి
ఇదిగో ఇలా, నల్లటి కన్నీళ్ళతో ఓ అడవి మనిషి
ఈ పదాలను రాసుకుంటున్నాడు
ఆకస్మికంగా తనకు చూపు లేదని
గ్రహించి తల్లడిల్లే కబోధిలా-
అందుకే గుర్తుకు వస్తుంది నీ ముఖం
ఈ రాత్రి వికసించిన మసక వెన్నెలలా-
వొంగి పూల పాత్రలో
నీ తోటలో పూసిన
తెల్లటి లిల్లీ పూలను ఉంచుతూ
నా వైపు తిరిగి చిన్నగా నవ్విన
ఆ సన్నటి సవ్వడే
యింకా యిక్కడ
చినుకుల చిలుకల కలకలంతో
మెత్తగా తేలికగా
కదులాడుతోంది-
యిక ఏం చేయను?
వాన కురిసిన రాత్రి
చీకటి వెలిగిన రోజా పూల కాంతిలో
చల్లటి చామనఛాయతో నీ ముఖం
వెచ్చటి నక్షత్రాలతో మెరిసిన, నేను
మోహించిన నీ తామర పూల శరీరమూ గుర్తుకువచ్చి
ఇదిగో ఇలా, నల్లటి కన్నీళ్ళతో ఓ అడవి మనిషి
ఈ పదాలను రాసుకుంటున్నాడు
ఆకస్మికంగా తనకు చూపు లేదని
గ్రహించి తల్లడిల్లే కబోధిలా-
19 July 2012
తెలియనితనం
నువ్వు తిరిగి వచ్చే లోపల, లోపల ఎవరుంటారో తెలియదు -
ఖాళీ ఉద్యానవనంలో ఒక నిశ్శబ్ధం
అలలపై తేలే పల్చటి గాలిలా కదులాడుతుండవచ్చు
అపరిచితులెవరో కత్తులతో నీకై మాటు వేసి ఉండవచ్చు
పసి చేతులు పూలహారాలై
ఆకుపచ్చటి అల్లరితో, ఇల్లంతా బిర బిరా తిరుగాడుతుండవచ్చు
నీ లోపలి అస్థవ్యస్థతని
అతి తేలికగా సర్దుతూ
ఒక స్త్రీ మౌనంగా నిను మననం చేసుకుంటూ ఉండవచ్చు-లేదా
నీ తల్లి ఒక ఒంటరి దీపం ముందు
ఒక ఒంటరి ద్వీపమై కూర్చుని
తనని కరుణించమని నిను మోకరిల్లి ప్రార్ధిస్తూ ఉండవచ్చు. లేదా
నువ్వే నీకై ఎదురుచూస్తూ ఉండి ఉండవచ్చు. నీ నుంచి నువ్వే
పారిపోయీ ఉండవచ్చు. నిజంగా
నువ్వు తిరిగి వచ్చేసరికి
లోపలా బయటా ఎవరుంటారో, చివరికి ఎవరు ఎవరుగా మిగిలి ఉంటారో
నిజంగా ఎవరికీ తెలియదు
ఖాళీ ఉద్యానవనంలో ఒక నిశ్శబ్ధం
అలలపై తేలే పల్చటి గాలిలా కదులాడుతుండవచ్చు
అపరిచితులెవరో కత్తులతో నీకై మాటు వేసి ఉండవచ్చు
పసి చేతులు పూలహారాలై
ఆకుపచ్చటి అల్లరితో, ఇల్లంతా బిర బిరా తిరుగాడుతుండవచ్చు
నీ లోపలి అస్థవ్యస్థతని
అతి తేలికగా సర్దుతూ
ఒక స్త్రీ మౌనంగా నిను మననం చేసుకుంటూ ఉండవచ్చు-లేదా
నీ తల్లి ఒక ఒంటరి దీపం ముందు
ఒక ఒంటరి ద్వీపమై కూర్చుని
తనని కరుణించమని నిను మోకరిల్లి ప్రార్ధిస్తూ ఉండవచ్చు. లేదా
నువ్వే నీకై ఎదురుచూస్తూ ఉండి ఉండవచ్చు. నీ నుంచి నువ్వే
పారిపోయీ ఉండవచ్చు. నిజంగా
నువ్వు తిరిగి వచ్చేసరికి
లోపలా బయటా ఎవరుంటారో, చివరికి ఎవరు ఎవరుగా మిగిలి ఉంటారో
నిజంగా ఎవరికీ తెలియదు
18 July 2012
నాకేం తెలుసు
మొగ్గ విచ్చుకోవచ్చు
పూవై మిగిలిపోవచ్చు
నడి జీవితంలో అనుకోని వానలో రాలీ పోవచ్చు
గాలికి ఎగిరీ పోవచ్చు
హృదయాన్ని నలిపేసే
ఓ మెత్తని లేత ఎరుపు పాదాల కింద నలిగీ పోవచ్చు
కొమ్మ నుంచి తెగిపోవచ్చు
గుండెలోకి దారం దిగి
మాలగా మారి చిత్రంగా
చిత్రానికో శిరోజాలలోకో మృత నయనాల కిందకో చేరావచ్చు
పుష్పగుచ్ఛమవ్వొచ్చు
నిను గుర్తించూకోవచ్చు
తేలికగా మరచీ పోవచ్చు
చివరికి
ఎర్రటి ఎండను తాకిన నీడలో
ఒక తెల్లని కన్నీటి చుక్కై
మెరువావచ్చు కరిగీపోవచ్చు
ఇంతా చేసీ నేను నువ్వూ
ఎలా ఎక్కడ ఎందుకు
చనిపోతామో చెప్పమంటే
యిక నాకేం తెలుసు?
పూవై మిగిలిపోవచ్చు
నడి జీవితంలో అనుకోని వానలో రాలీ పోవచ్చు
గాలికి ఎగిరీ పోవచ్చు
హృదయాన్ని నలిపేసే
ఓ మెత్తని లేత ఎరుపు పాదాల కింద నలిగీ పోవచ్చు
కొమ్మ నుంచి తెగిపోవచ్చు
గుండెలోకి దారం దిగి
మాలగా మారి చిత్రంగా
చిత్రానికో శిరోజాలలోకో మృత నయనాల కిందకో చేరావచ్చు
పుష్పగుచ్ఛమవ్వొచ్చు
నిను గుర్తించూకోవచ్చు
తేలికగా మరచీ పోవచ్చు
చివరికి
ఎర్రటి ఎండను తాకిన నీడలో
ఒక తెల్లని కన్నీటి చుక్కై
మెరువావచ్చు కరిగీపోవచ్చు
ఇంతా చేసీ నేను నువ్వూ
ఎలా ఎక్కడ ఎందుకు
చనిపోతామో చెప్పమంటే
యిక నాకేం తెలుసు?
దర్శనం
ఈ రాత్రి కళ్ళు కప్పి, నెమ్మదిగా
మునివేళ్ళతో నీ గదిలోకి రావాలని
పాపం ఈ వెలుతురు ఉడత
ఎంతగా ఉబలాట పడుతుందో చూడు
ఈవేళ సూర్య దర్శనం ఎలాగూ లేదు
బిగియారా చలి కౌగాలించుకున్న
ఈనాటి రాతి దినాలలో
అమ్మాయీ, కనీసం
నీ ముఖ దర్శనమైనా కానివ్వు
కొంచెం నా ప్రపంచం తేలికయ్యి
పూలతో మెరుగుపడుతుంది-!
మునివేళ్ళతో నీ గదిలోకి రావాలని
పాపం ఈ వెలుతురు ఉడత
ఎంతగా ఉబలాట పడుతుందో చూడు
ఈవేళ సూర్య దర్శనం ఎలాగూ లేదు
బిగియారా చలి కౌగాలించుకున్న
ఈనాటి రాతి దినాలలో
అమ్మాయీ, కనీసం
నీ ముఖ దర్శనమైనా కానివ్వు
కొంచెం నా ప్రపంచం తేలికయ్యి
పూలతో మెరుగుపడుతుంది-!
16 July 2012
మత్తిల్లి
'తాగని వారెవరో నాకు చూపించు'
అన్నాడు ఫిరోజ్ ఒకనాడు 'నేనైతే
ఎలాగూ లేత ఎరుపు గులాబీలతో మత్తిల్లే వాడిని కానీ'- అని.
ఎదురుగా మత్తిల్లి వెన్నెల
చుట్టూతా మత్తిల్లి తెమ్మర
కింద మత్తిల్లి తిరిగే భూమీ పైన మత్తిల్లి ఎగిరే నింగీ
మత్తిల్లి రాలే ఆ వానా
మత్తిల్లి మొలిచే మట్టి
మత్తిల్లి చిట్లే మొగ్గా మత్తిల్లి కురిసే గింజా
మత్తిల్లి మత్తిల్లి మత్తిల్లి ఆదిమ అనాధని
పసిపాపల పాల కలలతో
ప్రార్ధించే ఈ అనంత విశ్వం -
పచ్చికలో వాలిన మంచు రెక్కలని నిమిరి
ఫిరోజ్ వెర్రిగా నవ్వుతుండగా, యిక
రాత్రి చాపని చక్కా చుట్టుకుని నేను
దీపం లేని ధూపంలోకి ఒక పగటిలోకి
నా కళ్ళు తుడుచుకుంటో
తిన్నగా నడచే పోయాను-
అన్నాడు ఫిరోజ్ ఒకనాడు 'నేనైతే
ఎలాగూ లేత ఎరుపు గులాబీలతో మత్తిల్లే వాడిని కానీ'- అని.
ఎదురుగా మత్తిల్లి వెన్నెల
చుట్టూతా మత్తిల్లి తెమ్మర
కింద మత్తిల్లి తిరిగే భూమీ పైన మత్తిల్లి ఎగిరే నింగీ
మత్తిల్లి రాలే ఆ వానా
మత్తిల్లి మొలిచే మట్టి
మత్తిల్లి చిట్లే మొగ్గా మత్తిల్లి కురిసే గింజా
మత్తిల్లి మత్తిల్లి మత్తిల్లి ఆదిమ అనాధని
పసిపాపల పాల కలలతో
ప్రార్ధించే ఈ అనంత విశ్వం -
పచ్చికలో వాలిన మంచు రెక్కలని నిమిరి
ఫిరోజ్ వెర్రిగా నవ్వుతుండగా, యిక
రాత్రి చాపని చక్కా చుట్టుకుని నేను
దీపం లేని ధూపంలోకి ఒక పగటిలోకి
నా కళ్ళు తుడుచుకుంటో
తిన్నగా నడచే పోయాను-
కొన్నిసార్లు
దాహమయ్యి అల్లాడే కళ్ళతో
కనురెప్పలు తెరవలేక, ఏవో
నీకు మాత్రమే కనిపించే లోకాల గురించి
తడిలేని పెదాలతో ఏదోఏదో
భీతిగా చెప్పాలనుకుంటావ్
కదలాలేని చేతులతో వొణికే
నీ నిప్పుల శరీరంతో, కానీ తను
తన తనువంత, ఓ చల్లని అమ్మంత
అరచేయిని నీ కాలే నుదిటిపై వేసాక
రౌరవ నరకాలలోకి జారిపోతున్న నీ
ప్రాణం వాన తెరలతో ఈ
లోకంలోకి తిరిగివచ్చాక
మట్టికి పూసిన ఓ పూవుకీ
పూవుకి మెరిసిన ఓ పిట్టకీ
అలా రాత్రుళ్ళంతా నీ పక్కనే కూర్చుండిపోయిన
నల్లని చారాల ఎర్రని కళ్ళ
తనకీ, తన ఆ తనువుకీ
యిక నువ్వేం చెప్పగలవ్
యిక నువ్వేం ఇవ్వగలవ్?
కనురెప్పలు తెరవలేక, ఏవో
నీకు మాత్రమే కనిపించే లోకాల గురించి
తడిలేని పెదాలతో ఏదోఏదో
భీతిగా చెప్పాలనుకుంటావ్
కదలాలేని చేతులతో వొణికే
నీ నిప్పుల శరీరంతో, కానీ తను
తన తనువంత, ఓ చల్లని అమ్మంత
అరచేయిని నీ కాలే నుదిటిపై వేసాక
రౌరవ నరకాలలోకి జారిపోతున్న నీ
ప్రాణం వాన తెరలతో ఈ
లోకంలోకి తిరిగివచ్చాక
మట్టికి పూసిన ఓ పూవుకీ
పూవుకి మెరిసిన ఓ పిట్టకీ
అలా రాత్రుళ్ళంతా నీ పక్కనే కూర్చుండిపోయిన
నల్లని చారాల ఎర్రని కళ్ళ
తనకీ, తన ఆ తనువుకీ
యిక నువ్వేం చెప్పగలవ్
యిక నువ్వేం ఇవ్వగలవ్?
వెన్నెల వల
తొణకని నీటి పాత్రలోని
ఈ చల్లని సాయంత్రంలో
అంచున వాలి
లోపలికి తొంగి
చూసుకుంటున్నాయి ఒక పావురం ఒక పసి వదనం-
యిక రాత్రంతా నీ
పెదాలపై దాగలేని
ఆ వెన్నెల ఎన్ని చిన్ని నవ్వులతో
నీతో కలల దొంగాటలు
ఆడుతుందో చూడిక-!
ఈ చల్లని సాయంత్రంలో
అంచున వాలి
లోపలికి తొంగి
చూసుకుంటున్నాయి ఒక పావురం ఒక పసి వదనం-
యిక రాత్రంతా నీ
పెదాలపై దాగలేని
ఆ వెన్నెల ఎన్ని చిన్ని నవ్వులతో
నీతో కలల దొంగాటలు
ఆడుతుందో చూడిక-!
15 July 2012
స్వస్థత
ఈ రాత్రిలో పచ్చగా మెరుస్తాయి
పసుపు రాసుకున్న నీ చేతులు-
ఒక లేత సాయంత్రపు ఎండ
తప్పించుకుని వచ్చి చల్లగా
నీ చేతులను చుట్టుకున్నట్టు యిక గదంతా నీ గాజుల జల్లు-
ఆనక
మనల్ని కలిపే రాత్రిలోనే
ఆ వానలోనే, నీ శరీరపు
కమ్మటి పసుపు వాసన నా మాలిన్యాలను శుభ్రం చేస్తుంది
యిక చూస్తుండు అలా
రేపటి నీ ఉదయానికల్లా
అతను ఒక పొద్దుతిరుగుడు పూవై నీలా ఎంత పచ్చగా వికసిస్తాడో!
పసుపు రాసుకున్న నీ చేతులు-
ఒక లేత సాయంత్రపు ఎండ
తప్పించుకుని వచ్చి చల్లగా
నీ చేతులను చుట్టుకున్నట్టు యిక గదంతా నీ గాజుల జల్లు-
ఆనక
మనల్ని కలిపే రాత్రిలోనే
ఆ వానలోనే, నీ శరీరపు
కమ్మటి పసుపు వాసన నా మాలిన్యాలను శుభ్రం చేస్తుంది
యిక చూస్తుండు అలా
రేపటి నీ ఉదయానికల్లా
అతను ఒక పొద్దుతిరుగుడు పూవై నీలా ఎంత పచ్చగా వికసిస్తాడో!
అందం
అమ్మాయీ
నా తనవి తీరక, నీ తనువూ తీరక
నా దిస్టే నీకు తగిలేటట్టుగా ఉంది-
అమ్మాయీ
యిక నీ అరిపాదంలో
ఆ కాటుక చినుకుగా
నన్నే నువ్వు చక్కగా దిద్దుకో!
నా తనవి తీరక, నీ తనువూ తీరక
నా దిస్టే నీకు తగిలేటట్టుగా ఉంది-
అమ్మాయీ
యిక నీ అరిపాదంలో
ఆ కాటుక చినుకుగా
నన్నే నువ్వు చక్కగా దిద్దుకో!
వాన
తేలికగా ఈ వాన మొగ్గ ఇలా హాయిగా విచ్చుకుంటుంటే
ఆ పిల్లల కళ్ళల్లో చమక్కుమని
మెరుపులు మెరుస్తాయి- యిక
వాళ్ళ లేత శరీరాలపై చల్లటి గాలి వీచి
వాళ్ళ లేత ఎరుపు పెదాలపై
పచ్చిక తెరలేవో ఊగుతాయి-
మంచంపై ముంగాళ్ళపై కూర్చుని
కిటికీలోంచి అలా చేతులూపుతూ
అడుగుతారు కదా పిల్లలు అప్పుడు
ఎప్పుడో ఎక్కడో కోల్పోయిన నిన్ను-
'నాన్నా నాన్నా చూడీ వర్షం
ఎలా ఎగిరెగిరి గెంతుతుందో
ఎలా పడి పడి పారిపోతుందో
రా నాన్నా చూడటానికి-'.
అప్పడు, ఆ క్షణాన
తొలిసారిగా నీకు
ఈ వాన వెన్నెల
ఇలా వచ్చి అలా వెళ్ళిపోయే
ఓ తేమ తేనె పిట్ట అనీ, ఒక
తుంటరి పిల్లనీ అర్థమయ్యి
అరిచే పిల్లలలోంచి ఏరుకున్న
కొన్ని ఇకిలింతలతో
పై పదాలు రాస్తావు-
యిక ఆ తరువాత
చెప్పడానికి నీకు
ఏం మిగిలి ఉంది?
ఆ పిల్లల కళ్ళల్లో చమక్కుమని
మెరుపులు మెరుస్తాయి- యిక
వాళ్ళ లేత శరీరాలపై చల్లటి గాలి వీచి
వాళ్ళ లేత ఎరుపు పెదాలపై
పచ్చిక తెరలేవో ఊగుతాయి-
మంచంపై ముంగాళ్ళపై కూర్చుని
కిటికీలోంచి అలా చేతులూపుతూ
అడుగుతారు కదా పిల్లలు అప్పుడు
ఎప్పుడో ఎక్కడో కోల్పోయిన నిన్ను-
'నాన్నా నాన్నా చూడీ వర్షం
ఎలా ఎగిరెగిరి గెంతుతుందో
ఎలా పడి పడి పారిపోతుందో
రా నాన్నా చూడటానికి-'.
అప్పడు, ఆ క్షణాన
తొలిసారిగా నీకు
ఈ వాన వెన్నెల
ఇలా వచ్చి అలా వెళ్ళిపోయే
ఓ తేమ తేనె పిట్ట అనీ, ఒక
తుంటరి పిల్లనీ అర్థమయ్యి
అరిచే పిల్లలలోంచి ఏరుకున్న
కొన్ని ఇకిలింతలతో
పై పదాలు రాస్తావు-
యిక ఆ తరువాత
చెప్పడానికి నీకు
ఏం మిగిలి ఉంది?
అసూయ
నిదురోతున్న ఆ అమ్మాయి ముఖంపై
ఎగురుతోంది ఒక ఆకుపచ్చని
సీతాకోకచిలుక-ఒక చల్లచల్లని
గాలి తాకిన నీరెండ నీడ. యిక నేను
తన చెంపపై రాలిన ఆ గడ్డిపరకను నెమ్మదిగా తొలగించి
పచ్చికపై సాయంత్రం వాలిన ఆ
వెన్నెలని చూస్తాను అబ్బురంగా
కొంత అసూయగా కొంత ప్రేమగా-
భగవంతుడా! తనలా అలా
ఒక కలలో చక్కగా చిన్నగా
నేను నిదురోగలిగితే ఎంత బావుండు!
ఎగురుతోంది ఒక ఆకుపచ్చని
సీతాకోకచిలుక-ఒక చల్లచల్లని
గాలి తాకిన నీరెండ నీడ. యిక నేను
తన చెంపపై రాలిన ఆ గడ్డిపరకను నెమ్మదిగా తొలగించి
పచ్చికపై సాయంత్రం వాలిన ఆ
వెన్నెలని చూస్తాను అబ్బురంగా
కొంత అసూయగా కొంత ప్రేమగా-
భగవంతుడా! తనలా అలా
ఒక కలలో చక్కగా చిన్నగా
నేను నిదురోగలిగితే ఎంత బావుండు!
14 July 2012
ఇలా
స్నేహితులలో ముఖాన్ని ముంచుకుని
హృదయాన్నలా అలసటగా కడుక్కుని
ఆపై తేలికగా
ఇదిగో ఇల్లా
ఈ రాత్రంతా
విరిసిన మట్టి మల్లి వాసనని
పీలుస్తూ గడిపాను. తెలుసు
కదా నీకు, నాకూ నీకూ
యింతకంటే
ప్రియమైన మరణం
మరొకటి ఏముంది?
హృదయాన్నలా అలసటగా కడుక్కుని
ఆపై తేలికగా
ఇదిగో ఇల్లా
ఈ రాత్రంతా
విరిసిన మట్టి మల్లి వాసనని
పీలుస్తూ గడిపాను. తెలుసు
కదా నీకు, నాకూ నీకూ
యింతకంటే
ప్రియమైన మరణం
మరొకటి ఏముంది?
13 July 2012
తెలిసినది
చిన్నగా నిను తాకి
సన్నగా చెవి పక్కగా నవ్వుతూ గుసగుసగా ఇలా అంటారు ఎవరో-
'రాత్రిని దోసిళ్ళతో తాగని వారితోనూ
ఒక కన్నీటి చుక్కలో సముద్రాన్ని
చూడని వారితోనూ, మనుషులలో
కురిసే వానలని తాకని వారితోనూ యిక నీకేం పని-?'
నీకు తెలిసినదే అయినా
మళ్ళా అతను ఆ రాత్రికి
ఆ రద్దీ నగర మధుశాలల్లో
ఒంటరి బాహువులచే మళ్ళా మళ్ళా శిలువ వేయబడ్డాడు-
సన్నగా చెవి పక్కగా నవ్వుతూ గుసగుసగా ఇలా అంటారు ఎవరో-
'రాత్రిని దోసిళ్ళతో తాగని వారితోనూ
ఒక కన్నీటి చుక్కలో సముద్రాన్ని
చూడని వారితోనూ, మనుషులలో
కురిసే వానలని తాకని వారితోనూ యిక నీకేం పని-?'
నీకు తెలిసినదే అయినా
మళ్ళా అతను ఆ రాత్రికి
ఆ రద్దీ నగర మధుశాలల్లో
ఒంటరి బాహువులచే మళ్ళా మళ్ళా శిలువ వేయబడ్డాడు-
11 July 2012
కసురుకోకు
నీకు ఎక్కడైనా ఎన్నడైనా
దారి పక్కగా రాలిన ఓ
చిన్న పూవు కనపడితే
ఏ మలుపులోనైనా
దారి దాటేందుకు ఓ
అంధుడు భీతిల్లి అవస్థ పడుతుంటే
నిన్ను ఎన్నడైనా ఎక్కడైనా
మసిబారిన ఓ పసి బాలుడు
చికాకుపరిచేంతగా వెంటపడి
వేలాడబడి అడుక్కుంటుంటే
ఈ లోకాన్ని విసురుకోకు
మనుషులని కసురుకోకు -
ఎందుకంటే
అమ్మాయీ
వాళ్ళల్లో నేను
నాలో వాళ్ళూ
విధిలేక బేలగా దాగి ఉండొచ్చు-
దారి పక్కగా రాలిన ఓ
చిన్న పూవు కనపడితే
ఏ మలుపులోనైనా
దారి దాటేందుకు ఓ
అంధుడు భీతిల్లి అవస్థ పడుతుంటే
నిన్ను ఎన్నడైనా ఎక్కడైనా
మసిబారిన ఓ పసి బాలుడు
చికాకుపరిచేంతగా వెంటపడి
వేలాడబడి అడుక్కుంటుంటే
ఈ లోకాన్ని విసురుకోకు
మనుషులని కసురుకోకు -
ఎందుకంటే
అమ్మాయీ
వాళ్ళల్లో నేను
నాలో వాళ్ళూ
విధిలేక బేలగా దాగి ఉండొచ్చు-
ఎందుకో
'ఒరే ఎర్రి కర్రి నా కొడకా
నీ అమ్మ ఒక లంజ
నీ నాన్న ఎవడో నీకే
తెలియదు-థూ. ఏం
బ్రతుకారా నీది ఇది?
బాడకవ్- ఏడన్నా పోయి దుంకి చావుపోరా'
అమ్మ లేని అతను ఆ
అమ్మను తలచుకుని
తన తండ్రి అన్నఅప్పటి
మాటలని గుర్తుకు తెచ్చుకుని ఇదిగో
ఈ నిన్నటి సాయంత్రాన్ని
దిగమింగుకుంటున్న
నీలిసూర్యుని పాకలో
రాత్రిళ్ళని వెక్కిళ్ళతో కూర్చిన
మధుపాత్రతో తన తనువుతో
అతను చీకటి ముందు వొణికి
వొణికి పిగిలి పిగిలి పొర్లి పొర్లి ఏడ్చాడు- ఇక
ఆ తరువాత ఎందుకో
నా ముందు తొణికిన
ఆ నల్లని చల్లని వెన్నెల
మట్టిని చీల్చిన వాన కన్నీళ్ళతో స్పృహ తప్పింది-
ఎందుకో నీకు తెలుసా?
నీ అమ్మ ఒక లంజ
నీ నాన్న ఎవడో నీకే
తెలియదు-థూ. ఏం
బ్రతుకారా నీది ఇది?
బాడకవ్- ఏడన్నా పోయి దుంకి చావుపోరా'
అమ్మ లేని అతను ఆ
అమ్మను తలచుకుని
తన తండ్రి అన్నఅప్పటి
మాటలని గుర్తుకు తెచ్చుకుని ఇదిగో
ఈ నిన్నటి సాయంత్రాన్ని
దిగమింగుకుంటున్న
నీలిసూర్యుని పాకలో
రాత్రిళ్ళని వెక్కిళ్ళతో కూర్చిన
మధుపాత్రతో తన తనువుతో
అతను చీకటి ముందు వొణికి
వొణికి పిగిలి పిగిలి పొర్లి పొర్లి ఏడ్చాడు- ఇక
ఆ తరువాత ఎందుకో
నా ముందు తొణికిన
ఆ నల్లని చల్లని వెన్నెల
మట్టిని చీల్చిన వాన కన్నీళ్ళతో స్పృహ తప్పింది-
ఎందుకో నీకు తెలుసా?
10 July 2012
దుర్ధినం
ఎక్కడో తిరిగి, ఎక్కడో విరిగి
తవ్వుకున్న కళ్ళనే మళ్ళా
తవ్వుకుని తుడుచుకుని
దిక్కుతోచక దాహమయ్యి
దాహమయ్యీ ఆకలయ్యీ
యిక నీ ఆ తెల్లని రాత్రి గుడిసెలోకి
ఇంత మధువు కోసం
నీ హృదయంలోనింత
గంజాయి శ్వాస కోసం
ఆ అరవు తెచ్చుకున్న గదిలో
మోగే మృణ్మయ నాదాల ఒక
తంత్రీ తంత్రమై మంత్రించిన ఆ
ఆదిమ స్త్రీ సంతోష స్వరం కోసం
నీ కోసం నా కోసం మనని
మాన్పలేని ఆ చీకటి కోసం
ఈ బ్రతుకు భూగ్రహపు
గర్భశోక అనాత్మ కోసం
అందుకోసమో ఎందుకోసమో
వచ్చేవాళ్ళం మరి నాలోంచి
నీలోకి - నీలోంచి నాలోకీ
ఆ దూర అర్థ అద్దాలలోంచి
గింజుకునీ విదుల్చుకునీ వదిలించుకునీ- కానీ
రాకీ - మరి ఎందుకో
ఎవరూ లేక ఈ రాత్రి
సగం వెన్నెలై ఇలా అమావాస్యలా కాలిపోయింది-
తవ్వుకున్న కళ్ళనే మళ్ళా
తవ్వుకుని తుడుచుకుని
దిక్కుతోచక దాహమయ్యి
దాహమయ్యీ ఆకలయ్యీ
యిక నీ ఆ తెల్లని రాత్రి గుడిసెలోకి
ఇంత మధువు కోసం
నీ హృదయంలోనింత
గంజాయి శ్వాస కోసం
ఆ అరవు తెచ్చుకున్న గదిలో
మోగే మృణ్మయ నాదాల ఒక
తంత్రీ తంత్రమై మంత్రించిన ఆ
ఆదిమ స్త్రీ సంతోష స్వరం కోసం
నీ కోసం నా కోసం మనని
మాన్పలేని ఆ చీకటి కోసం
ఈ బ్రతుకు భూగ్రహపు
గర్భశోక అనాత్మ కోసం
అందుకోసమో ఎందుకోసమో
వచ్చేవాళ్ళం మరి నాలోంచి
నీలోకి - నీలోంచి నాలోకీ
ఆ దూర అర్థ అద్దాలలోంచి
గింజుకునీ విదుల్చుకునీ వదిలించుకునీ- కానీ
రాకీ - మరి ఎందుకో
ఎవరూ లేక ఈ రాత్రి
సగం వెన్నెలై ఇలా అమావాస్యలా కాలిపోయింది-
ఋణం
వేల సీతాకోకచిలుకలు రివ్వున వాలినట్టు
లక్ష రంగుల లిల్లీ పూవులు
ఒక్కసారిగా వికసించినట్టు-
పచ్చిక మైదానాలపై నుంచి
అలలు అలలుగా
గాలులు వీచినట్టు
తెరలు తెరలుగా వాన రాలినట్టు- భగవంతుడా!
స్కూళ్ళు వొదిలిన ఈ చిన్నారుల
మేలిమి నురుగల నవ్వుల మధ్య
ఇలా చిక్కుకుపోయి
ఎంతగా రుణపడ్డాను
నన్ను నాకు గుర్తు చేసిన
వాళ్ళ గడబిడ గందరగోళ
అల్లరి లోకాలకీ కాలాలకీ!
లక్ష రంగుల లిల్లీ పూవులు
ఒక్కసారిగా వికసించినట్టు-
పచ్చిక మైదానాలపై నుంచి
అలలు అలలుగా
గాలులు వీచినట్టు
తెరలు తెరలుగా వాన రాలినట్టు- భగవంతుడా!
స్కూళ్ళు వొదిలిన ఈ చిన్నారుల
మేలిమి నురుగల నవ్వుల మధ్య
ఇలా చిక్కుకుపోయి
ఎంతగా రుణపడ్డాను
నన్ను నాకు గుర్తు చేసిన
వాళ్ళ గడబిడ గందరగోళ
అల్లరి లోకాలకీ కాలాలకీ!
09 July 2012
మృత క్షణం
ఒకప్పుడు
పూలవనమై సాగిన తనువూ
వెన్నెల గంధమై మెరిసిన నీ
చల్లటి ముఖమూ, చుక్కలై
చిక్కగా రగిలిన నీ కనులూ
ఇలా
ఈ మహానగర
రహదారులలో
ఆకస్మికంగా
కన్నీరోడ్చే కపాలమై
చితా భస్మం రాలే ఓ
ఆస్థిపంజరమై
ఎదురుపడితే
చనిపోడానికి నేను
కాదా యిది సరైన
నర హంతక విధి విలాప రిక్త సమయం?
పూలవనమై సాగిన తనువూ
వెన్నెల గంధమై మెరిసిన నీ
చల్లటి ముఖమూ, చుక్కలై
చిక్కగా రగిలిన నీ కనులూ
ఇలా
ఈ మహానగర
రహదారులలో
ఆకస్మికంగా
కన్నీరోడ్చే కపాలమై
చితా భస్మం రాలే ఓ
ఆస్థిపంజరమై
ఎదురుపడితే
చనిపోడానికి నేను
కాదా యిది సరైన
నర హంతక విధి విలాప రిక్త సమయం?
కలబంద పిల్ల
గుప్పిళ్ళ నిండుగా గాలి తీసుకుని
నీ ముఖం మీద నిండా పోసుకుని
నీ కనులు తుడుచుకుని, రాత్రినలాగే లాగే నిదుర నీడలోంచి చూస్తే
ఎదురుగా మిద్దెపై
ఆ కలబంద పిల్ల
ఆకునొకదాన్ని సుతారంగా తెంపుకుంటూ
ఆకాశపు కళ్ళతో నవ్వుతూ
నీ వైపు చూస్తుంది- ఆహ్! యిక నీకు
తొలిసారిగా దైవం పట్ల ఒక నమ్మకం కలిగి
ఈ విశ్వం పట్ల ఓ కృతజ్ఞత పెరిగి
ఈ లోకం మీదా ఈ దినం మీదా
ఒక తీరని కోరికా ప్రేమా రగిలి రగిలి
విస్మయంతో అలాగే నిలబడిపోతావ్-
ఇక ఆ రోజు
నువ్వు నువ్వులా
ఎలా ఉండగలవ్-?
నీ ముఖం మీద నిండా పోసుకుని
నీ కనులు తుడుచుకుని, రాత్రినలాగే లాగే నిదుర నీడలోంచి చూస్తే
ఎదురుగా మిద్దెపై
ఆ కలబంద పిల్ల
ఆకునొకదాన్ని సుతారంగా తెంపుకుంటూ
ఆకాశపు కళ్ళతో నవ్వుతూ
నీ వైపు చూస్తుంది- ఆహ్! యిక నీకు
తొలిసారిగా దైవం పట్ల ఒక నమ్మకం కలిగి
ఈ విశ్వం పట్ల ఓ కృతజ్ఞత పెరిగి
ఈ లోకం మీదా ఈ దినం మీదా
ఒక తీరని కోరికా ప్రేమా రగిలి రగిలి
విస్మయంతో అలాగే నిలబడిపోతావ్-
ఇక ఆ రోజు
నువ్వు నువ్వులా
ఎలా ఉండగలవ్-?
08 July 2012
నక్స్ వామికా
కూర్చుంటావు కదా
పాపం, రాత్రంతా
నీ స్నేహితులతో
కొంచం పలచన చేద్దామనీ
ఈ లోకంనీ
ఈ కాలంనీ
కొంచం తేలిక చేద్దామనీ
ఈ శరీరపు
బరువు నీ
హృదయపు
దిగులునీ నీ
అంతిమ ఆదిమ తపననీ
ఈ నీ జీవితం యిచ్చిన
నెత్తురు వెదురువనపు
విరహపు వేణుగానాన్నీ
యిక చూడు ఆ
జాగ/రణ రాత్రి తరువాత
మిగిలిన మత్తు పగలంతా
ముప్పొద్దులా
వేసుకుంటావ్
ఎప్పటికైనా తగ్గుతుందని
ఆరు వెన్నెల చినుకులు
నోటిలో గొంతులో
తిరిగి చుక్కలు చక్కగా
నీ రాత్రిలో మెరిసేదాకా-
పాపం, రాత్రంతా
నీ స్నేహితులతో
కొంచం పలచన చేద్దామనీ
ఈ లోకంనీ
ఈ కాలంనీ
కొంచం తేలిక చేద్దామనీ
ఈ శరీరపు
బరువు నీ
హృదయపు
దిగులునీ నీ
అంతిమ ఆదిమ తపననీ
ఈ నీ జీవితం యిచ్చిన
నెత్తురు వెదురువనపు
విరహపు వేణుగానాన్నీ
యిక చూడు ఆ
జాగ/రణ రాత్రి తరువాత
మిగిలిన మత్తు పగలంతా
ముప్పొద్దులా
వేసుకుంటావ్
ఎప్పటికైనా తగ్గుతుందని
ఆరు వెన్నెల చినుకులు
నోటిలో గొంతులో
తిరిగి చుక్కలు చక్కగా
నీ రాత్రిలో మెరిసేదాకా-
07 July 2012
ఎలా?
వేర్లలోకి ఆకాశం
ఆకాశంలోకి చెట్లూ
చెట్లలోకి పిట్టలూ
పిట్టలలోకి పిల్లలూ
పిల్లలలోకి స్త్రీలూ
స్త్రీలలోకి నువ్వూ
నీలోకి ఒక నవ్వూ
నవ్వులోకి ఒక కాలం ఒక లోకం ఒక విశ్వం
అలా లేకపోతే
నువ్వు ఎలా?
ఆకాశంలోకి చెట్లూ
చెట్లలోకి పిట్టలూ
పిట్టలలోకి పిల్లలూ
పిల్లలలోకి స్త్రీలూ
స్త్రీలలోకి నువ్వూ
నీలోకి ఒక నవ్వూ
నవ్వులోకి ఒక కాలం ఒక లోకం ఒక విశ్వం
అలా లేకపోతే
నువ్వు ఎలా?
తెలియదా నీకు?
ఆకాశం ఎండిపోతే
అది నేల రాలిపోతే
తెలియదా నీకు
సూర్య చంద్రల నయనాలు రోదిస్తాయనీ
ఈ గాలి పిచ్చిగా వెక్కిళ్ళు పెడుతుందనీ
ఒక గడ్డి పరక
ఆఖరి శ్వాసతో
ఒక రైతై అలా తల
వాల్చేస్తుందనీ-?
అది నేల రాలిపోతే
తెలియదా నీకు
సూర్య చంద్రల నయనాలు రోదిస్తాయనీ
ఈ గాలి పిచ్చిగా వెక్కిళ్ళు పెడుతుందనీ
ఒక గడ్డి పరక
ఆఖరి శ్వాసతో
ఒక రైతై అలా తల
వాల్చేస్తుందనీ-?
సూచన
జాగ్రత్తగా దాటు ఈ రాత్రిని
నీ హృదయాన్ని తెంపుకుని
కురులలో ధరించి వెళ్ళిన
వారెవరో తిరిగి
రానున్నారు ఈ
చీకటి వనానికీ నీ
స్థిమిత నయనాల నీళ్ళ లోగిళ్ళలోకీ-
కొద్దిగా జాగ్రత్త
కొద్దిగా జాగ్రత్త
కొద్దిగా జాగ్రత్త
కొద్దిగా...
నీ హృదయాన్ని తెంపుకుని
కురులలో ధరించి వెళ్ళిన
వారెవరో తిరిగి
రానున్నారు ఈ
చీకటి వనానికీ నీ
స్థిమిత నయనాల నీళ్ళ లోగిళ్ళలోకీ-
కొద్దిగా జాగ్రత్త
కొద్దిగా జాగ్రత్త
కొద్దిగా జాగ్రత్త
కొద్దిగా...
రహస్యం
కనుచూపు మేరలో
ఆ చెరగని చీకటిలో
వెలిగే ఒక వెన్నెల వలయం నీ ముఖం-
అలలపై కదిలే
చంద్ర బింబాన్ని
అరచేతుల మధ్యకు తీసుకుని దాచుకోవడం ఎలానో
నాకు ఇప్పటికీ
తెలియ రాలేదు
ఆ చెరగని చీకటిలో
వెలిగే ఒక వెన్నెల వలయం నీ ముఖం-
అలలపై కదిలే
చంద్ర బింబాన్ని
అరచేతుల మధ్యకు తీసుకుని దాచుకోవడం ఎలానో
నాకు ఇప్పటికీ
తెలియ రాలేదు
ప్రాధమిక వాస్తవం
అలసటతో ఆకలితో వచ్చిన నువ్వు
తనని ఆనుకుని కూర్చున్నాక
ఓర్పుగా పట్టుకుంటుంది కదా
తను నీ అరచేతిని అలా అలవోకగా అనునయంగా
ఇకా క్షణంలో నువ్వు
తనకి ఏమివ్వగలవు?
తనని ఆనుకుని కూర్చున్నాక
ఓర్పుగా పట్టుకుంటుంది కదా
తను నీ అరచేతిని అలా అలవోకగా అనునయంగా
ఇకా క్షణంలో నువ్వు
తనకి ఏమివ్వగలవు?
ఎందుకలా
నేల రాలిన పూవుని పుచ్చుకుని
పిచ్చుక వలె నీ వద్దకు
కిలకిలా నవ్వుకుంటూ
ఎగిరి వచ్చిన ఆ పసుపు పచ్చని బాలుని
చంద్రబింబ వదనం ఈ వేళ
ఎందుకలా మూగవోయింది?
పిచ్చుక వలె నీ వద్దకు
కిలకిలా నవ్వుకుంటూ
ఎగిరి వచ్చిన ఆ పసుపు పచ్చని బాలుని
చంద్రబింబ వదనం ఈ వేళ
ఎందుకలా మూగవోయింది?
కోరిక
మంచు తెమ్మరని శిరస్సుపై ధరించి
తల వంచుకుని ఎవరూ లేని
ఈ రాత్రి దారులని ఒంటరిగా
దాటుతావు నువ్వు - నువ్వే
హృదయంలో ఒక రహస్య దీపం
వెలిగించుకుని, అరచేతులలో
ఒక చలి మంటని రాజేసుకుని
ఏనాటి జ్ఞాపకాలతో ఒక్కడివే -
ఈ దారిని కాస్త తెరిపిగా
దాటేందుకు సాగేందుకు
నా పక్కన నువ్వు ఉంటే
ఎంత బావుండేది ఈ లోకం బ్రతికి ఉండేందుకు!
తల వంచుకుని ఎవరూ లేని
ఈ రాత్రి దారులని ఒంటరిగా
దాటుతావు నువ్వు - నువ్వే
హృదయంలో ఒక రహస్య దీపం
వెలిగించుకుని, అరచేతులలో
ఒక చలి మంటని రాజేసుకుని
ఏనాటి జ్ఞాపకాలతో ఒక్కడివే -
ఈ దారిని కాస్త తెరిపిగా
దాటేందుకు సాగేందుకు
నా పక్కన నువ్వు ఉంటే
ఎంత బావుండేది ఈ లోకం బ్రతికి ఉండేందుకు!
అతనేనా
నీ కళ్ళ అంచులలో రాత్రి గుమికూడుతుంది
మంచుపొగలై మబ్బులై కన్నీళ్ళై
చివరికి చీకటి చినుకులు అంటిన
పాలరాళ్లై మిగిలిపోతుంది-
ఇంతకూ ఎర్రని హృదయంతో
ఏమైనా వచ్చాడా అతను నీ
ఇంటికి తనువుకీ
తెల్లని పూలతోటి?
మంచుపొగలై మబ్బులై కన్నీళ్ళై
చివరికి చీకటి చినుకులు అంటిన
పాలరాళ్లై మిగిలిపోతుంది-
ఇంతకూ ఎర్రని హృదయంతో
ఏమైనా వచ్చాడా అతను నీ
ఇంటికి తనువుకీ
తెల్లని పూలతోటి?
05 July 2012
నిదుర
విచ్చుకున్న రాత్రి రోజాలోకి
మెత్తని మత్తైన ఆ విషం పోసి
ఈ హృదయ శిల్పంలోకి
గాలి నీళ్ళతో చేప కళ్ళతో
ఆకు వేళ్ళతో
నువ్వే ఒంపు-
చూద్దాం యిక
స్మృతిలేని నిదురలోకి
యిక ఈ నా ప్రాణం
తరలిపోతుందో లేదో-
మెత్తని మత్తైన ఆ విషం పోసి
ఈ హృదయ శిల్పంలోకి
గాలి నీళ్ళతో చేప కళ్ళతో
ఆకు వేళ్ళతో
నువ్వే ఒంపు-
చూద్దాం యిక
స్మృతిలేని నిదురలోకి
యిక ఈ నా ప్రాణం
తరలిపోతుందో లేదో-
విరమణ
విచారించకు
రెక్కలపై చుక్కల చినుకులతో
మెరిసే గాలిలో తళతళమంటూ
సాగిపోయే ఈ విశ్వపు సీతాకోకచిలుక
నీదీ నాదీనూ!
సరేలే - నీకులాగానే
నేను కూడా
ఒక తప్పునే-
రెక్కలపై చుక్కల చినుకులతో
మెరిసే గాలిలో తళతళమంటూ
సాగిపోయే ఈ విశ్వపు సీతాకోకచిలుక
నీదీ నాదీనూ!
సరేలే - నీకులాగానే
నేను కూడా
ఒక తప్పునే-
ఆత్మ దాహం
రెండు అరచేతులు కావాలి
నిప్పులానో నేలలానో
గాలిలానో వానలానో
ధూళిలానో దీవెన లానో
శోకం లానో శాపంలానో
జననంలానో
మరణంలానో
రెండు పెదాలు కావాలి-
యిక
పూలదహనాల
ఈ కాటికాపరికి
కలల అంచులలో కదిలే
ఆ చనుబాల చేతుల
నిప్పుల వెన్నెల
పందిరి ఎక్కడ?
నిప్పులానో నేలలానో
గాలిలానో వానలానో
ధూళిలానో దీవెన లానో
శోకం లానో శాపంలానో
జననంలానో
మరణంలానో
రెండు పెదాలు కావాలి-
యిక
పూలదహనాల
ఈ కాటికాపరికి
కలల అంచులలో కదిలే
ఆ చనుబాల చేతుల
నిప్పుల వెన్నెల
పందిరి ఎక్కడ?
ఈ రాత్రికి
రాత్రి నేలపై రాలిన
పూలు నీ కనులు
మట్టికి రేగీ నీటిని తాకీ
అలసటగా అలా ఈ దివంగత దారుల పక్కగా
ఎవరూ తాకని రాళ్లై, వానకి
తడిచిన మోడులై అలా పడి
ఉంటాయి నీ చేతులు - అవీ
నీ కళ్ళే- అవీ నీ చూపులే- చూడు యిక, ఇకనైనా
ఎవరైనా
చీకటింట ఒక దీపం పెట్టినట్టు
నీ కళ్ళని ఓర్పుగా ఏరుకుని
ప్రేమగా పెదాలతో తాకి లాగి వొదిలితే
ఈ రాత్రి ఎంత బావుండును-
పూలు నీ కనులు
మట్టికి రేగీ నీటిని తాకీ
అలసటగా అలా ఈ దివంగత దారుల పక్కగా
ఎవరూ తాకని రాళ్లై, వానకి
తడిచిన మోడులై అలా పడి
ఉంటాయి నీ చేతులు - అవీ
నీ కళ్ళే- అవీ నీ చూపులే- చూడు యిక, ఇకనైనా
ఎవరైనా
చీకటింట ఒక దీపం పెట్టినట్టు
నీ కళ్ళని ఓర్పుగా ఏరుకుని
ప్రేమగా పెదాలతో తాకి లాగి వొదిలితే
ఈ రాత్రి ఎంత బావుండును-
03 July 2012
దీపద్వీపం
రాతిరి వీచిన చీకటిలో
లేత బొటను వేలంత
వెలుతురిని తీసుకుని నుదిటిన అద్దుకున్న క్షణం యిది - నీది.
యిక, తొలిసారిగా
ఆదిమ హృదయాన్ని వీడి
మట్టిని తాకిన ఒక పదాన్ని
నీ ముఖపు పర్ణశాలలో చిదిమి దీపం పెట్టుకున్నాను - యిక
అదే తొలిసారి. యిక అదే మలిసారి.
లేత బొటను వేలంత
వెలుతురిని తీసుకుని నుదిటిన అద్దుకున్న క్షణం యిది - నీది.
యిక, తొలిసారిగా
ఆదిమ హృదయాన్ని వీడి
మట్టిని తాకిన ఒక పదాన్ని
నీ ముఖపు పర్ణశాలలో చిదిమి దీపం పెట్టుకున్నాను - యిక
అదే తొలిసారి. యిక అదే మలిసారి.
సంకేతం
నీ పరిసరాలలోనే తిరిగే
ఒక నీలి సరీసృపం
నీ జాడను కాంచినంతనే
నీళ్ళల్లో మునకలేసే
ఒక పసుపు పచ్చని
పిచ్చుక అవుతుంది-
చూడు యిక. ఆలనాటి
రాత్రి మొగ్గల్లో దాగి
ఈ కాంతి పూలను వికసింపజేసే
ఆ సూర్య సంకేతం
నేను మాత్రం కాదు-
యిక పిచ్చుకులకు
రంగుల నీడల్ని జల్లి
నీ శరీరమంత వలతో
విలాపంతో ఎదురు చూస్తున్నది ఎవరు?
చూడు యిక. ఆలనాటి
రాత్రి మొగ్గల్లో దాగి
ఈ కాంతి పూలను వికసింపజేసే
ఆ సూర్య సంకేతం
నేను మాత్రం కాదు-
యిక పిచ్చుకులకు
రంగుల నీడల్ని జల్లి
నీ శరీరమంత వలతో
విలాపంతో ఎదురు చూస్తున్నది ఎవరు?
02 July 2012
ప్రాధమిక ప్రశ్న
ఛాతిని త్రవ్వి
పాదును చేసి
నిన్ను నాటి
నీరు పోసి -నా శ్వాసను మరలించి
నిను అతి భద్రంగా కాపాడుకున్నదీ
ఇలా దినాల తరబడి
ఎదురు చూసినదీఈ
విషపు రేకుల వింత రంగుల ప్రాణాంతక పరిమళాల
ఇట్లాంటి నిన్ను
చూసేందుకేనా?
పాదును చేసి
నిన్ను నాటి
నీరు పోసి -నా శ్వాసను మరలించి
నిను అతి భద్రంగా కాపాడుకున్నదీ
ఇలా దినాల తరబడి
ఎదురు చూసినదీఈ
విషపు రేకుల వింత రంగుల ప్రాణాంతక పరిమళాల
ఇట్లాంటి నిన్ను
చూసేందుకేనా?
పవిత్రత
తొడిమను వీడి
ఆకు జారిన
ఒక తేలికైన శబ్ధం నీ సమక్షంలో
నింగిని వొదిలి
నేలపై వాలిన
ఓ చినుకు చిరు వాసన నీ నిశ్శబ్దంలో
యిక నువ్వు ఉన్న
పరిధి మేరా
రాత్రి వృత్తాల
లేత వెన్నెల వానా తడిచిన చలి!
ఆహ్!
ఎవరో తలుపులు
తట్టినట్టు ఉన్నారు
యిక నీ తనువు
తెరవడమే
తరువాయి-
ఆకు జారిన
ఒక తేలికైన శబ్ధం నీ సమక్షంలో
నింగిని వొదిలి
నేలపై వాలిన
ఓ చినుకు చిరు వాసన నీ నిశ్శబ్దంలో
యిక నువ్వు ఉన్న
పరిధి మేరా
రాత్రి వృత్తాల
లేత వెన్నెల వానా తడిచిన చలి!
ఆహ్!
ఎవరో తలుపులు
తట్టినట్టు ఉన్నారు
యిక నీ తనువు
తెరవడమే
తరువాయి-
ఎవరి రాక
మూసుకున్న కనురెప్పల కింద
కదులుతుంది నీ ప్రపంచం
కొద్దిగా తడితో కొంత అశాంతితో-
నిజమే, ఇవి
అరచేతులలో
మన ముఖాల్ని మనం రాజేసుకుని
కదిలే ఈ నీడలనీ
వెలిగే ఆ శీతల
దిగులు గాలినీ
బాహువులలో
మనం అదిమిపట్టుకునే మన ఒంటరి రోజులు-
ఇక ఎవరి రాక
ఒక పూలవనం
కాగలదు మన ఇద్దరికీ?
కదులుతుంది నీ ప్రపంచం
కొద్దిగా తడితో కొంత అశాంతితో-
నిజమే, ఇవి
అరచేతులలో
మన ముఖాల్ని మనం రాజేసుకుని
ఒక మూలకు ఒదిగి ఒదిగి
కదిలే ఈ నీడలనీ
వెలిగే ఆ శీతల
దిగులు గాలినీ
బాహువులలో
మనం అదిమిపట్టుకునే మన ఒంటరి రోజులు-
ఇక ఎవరి రాక
ఒక పూలవనం
కాగలదు మన ఇద్దరికీ?
Subscribe to:
Posts (Atom)