29 September 2011

నమిలే తిను

నమిలే తిను గుండ్రటి గుండెకాయని
మొసలి కన్నీళ్ళతో:

వా/నరుడే అతడు. వామహస్త విచారస్తుడే అతడు.
ఈ చిన్ని హృదయంతో తాకాలి దివిని
దాటాలి భువిని ముద్దిడాలి చెట్ల ముంగురులని
ముడుచుకుని, కళ్ళను తుడుచుకుని
హత్తుకోవాలి నల్లటి చేతుల తెల్లటి మనుషులని

అని అనుకొన్న నరుడే అతడు.
నాగరికత తెలియని వా/నరుడే
అతడు: అందుకని నువ్వు

నమిలే తినాలి అతడి గుండ్రటి
కన్నీళ్ళ గుండెకాయని కాసింత కనురెప్పల మోసంతో
లేత చేతివేళ్ళ ద్రోహంతో దాహమైన దేహంతో

మునుపటి మున్ముందు ఉండే
మొసలి కన్నీళ్ళతో కలలతో:

సాగు ముందుకు సున్నా చుట్టుకున్న
శూన్యమైన నోటితో
ఎర్రటి నాలికతో మోహపు చూపులతో

ఇక నిన్ను ఆపేదేవరు ఆపగలిగేదెవరు?

No comments:

Post a Comment