వంకీలు తిరిగిన వజ్రాల పెదాలపై తిరుగుతున్నాయ్
తెల్లని సర్పాలు, దాగిన నవ్వులు:
నువ్వాపలేవ్ అ జలపాతపు నురగ హోరునీ
ప్రతిబింబపు హాహాకారాలనీ:
ఎదురుచూసే ఎదురుచూపే
మెలికలు తిరిగిన పాదాలేలే
ఎప్పుడూ నీకు:
జరుగు కొద్దిగా: వానని తాకిన కాంతి
సూర్యనయనాలలో పిల్లల అరుపులతో
మెరుస్తోంది, మురుస్తోన్నది
పచ్చిక బయళ్ళపైనుంచి
తెరలు తెరలుగా గాలి నువ్వు అందుకోలేని
తన హస్తాల వలె దూసుకువస్తున్నది
ఎవరిదీ కాని గీతం, అందరిదీ అయిన శోకం
దిగంతాలలోంచి దిగులుగా
నీడలుగా జాడలుగా ప్రతీకలుగా రాలుతోన్నది
తెచ్చుకున్నావా ఇంత వివశితమైన విషం
జన్మతో జన్మాంతానికై? తీరని కోరిక ఒకటి
కరుస్తోంది కరకు దంతాలతో.
ఇక ఏం చేయగలవ్ నువ్వు కరాళ స్వప్నాలతో
లిఖిత శాపాలతో? తప్పుకో కొద్దిగా
నిశ్శబ్ధపు గమనంతో సీతాకోకచిలుక ఒకటి
నిశ్శబ్ధంలో నిశ్శబ్ధంతో
నెలవంక రెమ్మల చుట్టూ గిరికీలు కొడుతుంది.
నువ్వు దారి తప్పి మత్తిల్లి రాలిపోయేందుకు
ఇదే సరైన సమయం: వేగిరంగా వెళ్ళిపో
మధుమోహిత మృత్యు కాంక్షిత స్త్రీల వద్దకూ
స్నేహితుల వద్దకూ. ఇది వినా
ఇంతకు మించీ మరో మార్గం ఉందా నీకు?
No comments:
Post a Comment