12 September 2011

అది చదవొద్దు

నా సామిరంగా నువ్వసలు అది చదవొద్దు

ఎవరు ఎక్కడ మొదలు పెడతారో
ఎవరు ఎక్కడ అంతం అవుతూ అనంతంగా మారతారో
ఎవరు ఎక్కడికి ఎలా పోతారో
ఎందుకు పోతారో ఎవరు ఎందుకు ఎవరు అవుతారో
ఎవరు ఎందుకు ఎవరు కారో అయినవాళ్ళు ఎవరూ
ఎందుకు అవ్వరో అవ్వకుండా అవుతూ ఎవరూ
ఎందుకు ఎక్కడా కానరారో, కానరానివాళ్ళు కనుమరుగు
కన్ను మరుగు ఎలా కారో
కనుగుడ్డు మీద మీగాడలా పదాల జాడలలా కలల్లా ఎలా
ఇలా ఇలలో ఇందులో అందుకునేందుకు
అందుకు మున్ముందు నుంచి ముసుగులలోంచీ ముందు
మాటలు లేకుండా కాకుండా వస్తారో

ఒరే నా నాయనా నీకు ఎప్పటికీ అర్ధం కాదు. వినిర్మాణం ఒక
విచిత్ర వాహనం నీకు నాకూ
మన ముందున్న వెనకి నుంచి వచ్చే మూడు కాలాల సప్తలోకాల
తత్వవేత్తలకూ: రా నా బిడ్డా

పాక కింద కల్లూ, కల్లులోని ముంతా
ముంతలోని చిగురు చింతాకు, ఆకులలో బోమికలూ బోటీ
కలలలో కాలిన కాలేయంలో

మెరుస్తున్నాడు ఒక చంద్రుడు నిండిన వానలో: ఇక నీకూ
నాకూ విదేహ విధేయులతోటీ, నిర్యాణ న్యాయాల తోటీ,తోటి
వారితోటీ ఏం పని? పిలుస్తోంది ఒక

అనాది వాచకం సంగర్షణల యుద్ధ జీవితమై
కదను తొక్కుతోంది ఒక చరిత్ర గీతం ముద్రణ

కాని, కానరాక తిరిగి వచ్చే జాడై, మన నీడై: దుముకు నాయన
దుముకు రాజ వాచకాలలోంచి అనేక ప్రతిపతార్ధాలలోకి
ఇతర పునర్ నిర్వాచాకాలలోకి, కాలాలలోకీ:

ఇంతకు మించీ ఇంతకు మినహా
నీకూ నాకూ మరో మరణం లేదు.

3 comments: