15 September 2011

కోతులు

అక్కడ ఉంటాయి అవి
అప్పుడప్పుడు నిన్ను
నీ చూపులతో చూస్తో:

జతలుగా మిగిలిన జాతులుగా
చెట్లపై చెదిరిన ఇళ్ళ కప్పులపై

జారుతో జాగ్రత్తగా దిగుతో
తలకిందులుగా వేలాడుతో

తలకిందులైన లోకానికి తమ
పదును దంతాలను చూపిస్తో

ఉంటాయి అవి అక్కడ
వొంటరిగా విచిత్రంగా
ఒక మహా దిగులుతో తపనతో:

ఎక్కడనుంచి వచ్చాయవి?
ఎలా వచ్చాయవి?
ఎలా బ్రతుకతాయి అవి ఈ
నిర్ధయ మానవ లోకంలో?

ఏమీ తోచక, ఏమీ చేయలేక

సంచార జాతులని మిగల్చని
ఈ సదా యంత్ర మోహిత
వస్తు వికసిత కరకు కాలంలో

నువ్వు నీ తలను బరుక్కుంటూ
కళ్ళు చికిలించుకుని

నువ్వు కోతివి ఎందుకు కాలేదో
కనీసం తోక అయినా ఎందుకు
లేదో అని యోచించుకుంటో

ఎర్రని ముడ్లని చూపించిన
ఆ కోతులను స్మరించుకుంటో

ఆ ఇంటికి నీడల ముగ్గులను వేసే
చీకటి కమ్ముకున్న
తన ఇంటికి వెళ్ళిపోతావు=

No comments:

Post a Comment