06 September 2011

మనిద్దరం (అను ఒక పూర్వ వాచకం)*

అనాదిగా అతడిని మొహిస్తున్న యువతి
ఈ కింది పదాలను పలువరించింది:

"పట్టించుకోవడం హింస అవుతున్నప్పుడు
ప్రేమించడం విడిపోవడం అవుతుంది:
మనిద్దరమూ, మనం ఇద్దరమూ ఇప్పటికీ
ప్రేమికులమేనా?"

౧.

శిధిల ఆకాశంలో మిగిలిన రాత్రిలో
దారినీ దాహాన్నీ తాకుతో నడుస్తావ్ నువ్వు
ఒక దీపం ఒక దేహం ఉండే గూటికై=

పదాలు, నువ్వు ప్రవచించిన పదాలు మాత్రమే
ప్రార్ధన వలె, స్వప్నావస్థలో మిగిలిన
శబ్దాల వలె అతడికి సర్వస్వం అవుతాయ్: అప్పుడు
అడుగుతాడు అతడు అడగలేక
ఇక ముందుకి సాగలేక=

౨.

ఎక్కడ ఉన్నావ్ నువ్వు నేను రాలి
పోతున్నప్పుడు?
ఏం చేస్తున్నావ్ నువ్వు నేను రాలి
పాలి పోతున్నప్పుడు?

ఒడి ఏది తడి మది ఏది
వడివడిగా సాగే నీ హృదయపు ధ్వనుల
చప్పట్లు ఏవి?

రెండు నిమిషాల మౌనం పాటించావా
నువ్వు? చూడటానికైనా
వినడానికైనా ఉన్నావా నువ్వు? అక్కడ
స్రవించే సరిహద్దు కావల?

వద్దు. మాట్లాడవద్దు. సైగ చేయవద్దు.
వద్దు. మాట్లాడ
వద్దు.

౩.

నువ్వక్కడే ఉన్నావు. ఎల్లప్పుడూ
దిగంతాల నుంచి తిరిగి వచ్చే
దిగులు చూపులతో ఆ చేతులతో:

అతడు చూసి ఉండడు ఎదురు
చూసే చూపునీ నిశ్శబ్దాలలో
చిక్కుకున్న నీ పెదాలనీ:

దహనానికై నెగళ్లు రగిలినప్పుడు
మననానికై ధరిత్రి పూవై
చిగురించినప్పుడు
చిగురులో చింతలో వెన్నెల రాలి
వాన రాలి శరీరం చిట్లినప్పుడు
చిరుసవ్వడులతో ఆత్మ
ప్రవహించినప్పుడు

ఇవన్నీ అవన్నీ ఎందుకు?
తను ఎలా మరణించినదో
తను ఎలా జీవించిందో తన
జీవి ఎలా ఇంకిపోయిందో

తెలుసా నీకు?

౪.

పదాలతో అనాధులతో

అనాధుల పదపాదాలతో

పాదాలు లేని
పద అనాధులతో పదే పదే
వచ్చిందీ అతడే
వెళ్లిపోయిందీ అతడే:

ఎవరూ వారెవరూ వీడని
జాడ లేని తన గురించి
పలుక లేదు.
పలుకే లేదు.

౫.

అనాదిగా ఆమెను ప్రేమిస్తున్న
అతడు ఈ కింది పదాలను రాసాడు:
(అని అనుకున్నాడు)

"పట్టించుకోవడం హింస అవుతున్నప్పుడు
ప్రేమించడం విడిపోవడమౌతుంది.
మనిద్దరమూ, మనం ఇద్దరమూ ఇప్పటికీ
ప్రేమికులమేనా?
__________________________
*06.01.2001

No comments:

Post a Comment