04 September 2011

ఎవరు (అను ఒక మునుపటి వాచకం)

ఉరుముల నృత్యం ఇది
మధువూ గంజాయీ కలగలసి
శ్వేతసర్పాల్లా అల్లుకుని
రమించే మై/మరపించే
మెరుపుల నృత్యం ఇది

జ్వలిస్తూ సుడులు తిరుగుతూ
నిరంతరం అనంతం
కాంతిపుంజాల్ని వెదజల్లే
అవ్యక్తమైన దానియొక్క నృత్యం ఇది

వీటన్నిటిలోనూ
వీటన్నిటిమధ్యా
ఇవన్నీ అయి మరణిస్తూ
మళ్ళా అంతలోనే జన్మిస్తూ
విస్మృతిగా మారిపోతూ
మళ్ళా అంతలోనే స్మృతిగా
మిగులుతూ

ఒక మనిషి. ఒకే
ఒక్క మనిషి.

తండ్రీ తనయుడూ
తల్లీ కూతురూ
ప్రియురాలూ ప్రియుడూ
తనూ ఇతరుడూ
అయిన ఒకే
ఒక్క మనిషి.

నీతోపాటు ఈ నృత్యంలోకి
వచ్చేది ఎవరు?
నీతోపాటు ఈ నృత్యంతో
వెడలిపోయేది ఎవరు?
నీతో మాట్లాడుతూ
నీ స్వరంగా నీ చూపుగా
మారేది ఎవరు?

అనంతాలలోంచి
అద్రుశ్య ధూళిలా వచ్చి నిన్ను
తనలో దాచుకునే
ఆ అస్తిత్వపు గులాబి ఎవరు?

ఒకే ఒక్క మనిషి. అన్నీ అయ్యి
ఒక్కడిగా మిగిలిపోయే
ఒకే ఒక్క మనిషి
ఏకాంతంగా ఒంటరిగా
ఈ భూమిపై తన అస్థిత్వాన్నే
తన చైతన్యాన్నీ
తనే కాంచిన ఎరుకతో
అన్నీ తెలిసి అన్నింటినీ చూస్తూ
అన్నీ తానే అయ్యి
ఒక మహా తపనతో, దిగులుతో
వొణికిపోయే
ఒకే ఒక్క మనిషి.

పౌర్ణమినాడు సంపూర్ణతతో
అసంపూర్ణంగా
మిగిలిపోయిన జాబిలి
రేకులు పిగిలిపోయి
అసంపూర్ణతతో
సంపూర్ణతను నింపుకున్న
ఒక నీలి గులాబి
స్రవిస్తూ, సంపూర్ణ
అసంపూర్ణాల మధ్య
భాషగా మారి
భాషను అనుభూతి చెంది
జాబిలిగానూ
గులాబిగానూ మారిన
ఒకే ఒక్క మనిషి

ఉరుముల నృత్యం మధ్య
మధువుతో వివశితమైన
పగటి రాత్రి మధ్య
అవ్యక్త అనంతం మధ్య
మృత్యు మార్మిక హస్తాల మధ్యా
ఒకే ఒక్క మనిషి=

అ ఒకే ఒక్క మనిషి
మీలో మీరు
ఎపుడైనా ఎక్కడైనా
చూసారా?

2 comments: