దూరం కాని దూరం
నువ్వే చెబుతావ్
దూరం ఏదో తీరం ఏదో
ఎందుకో ఏమిటో
వెన్నెల్లో కనుసన్నల్లో
నిశ్శబ్ధపు పలుకు
బాహువుల్లో పెదాల్లో
వెచ్చటి వొణుకు
ఇంద్రజాల దర్పణాలు
దర్పణాల శరీరాలు: కరిగి
కలసిపోయే దహనాలు
నువ్వేం చెబుతావు
మరో అంచునుంచి
దేహమేదో ధూపమేదో
వానలో వొణికే
ఇంద్రధనుస్సు ఏదో
ఎవరిదో ఎప్పటిదో
చినుకులని దాటి
చిగురాకుల మీద
మెరుస్తున్నాయ్ కిరణాలు
నువ్వు నవ్వేందుకు
కారుణ్య కారణాలు
రాత్రీ అయ్యింది పగలూ
అయ్యింది. నువ్వు
వొదిలిన దుస్తులు
ఇక్కడే ఛాతిపై కోస్తున్నాయి
మునుపటి కన్నీళ్ళతో=
తీసుకువెళ్ళవా వాటిని
తిరిగి రాలేని
నీ చేతులతో?
No comments:
Post a Comment