19 September 2011

అమృతవిషం. 1

ప్రపంచ తీరాన నడుద్దామని అనుకొంటావ్
ఆమె చేయి పుచ్చుకుని

కష్టాలో నష్టాలో కన్నీళ్ళో, ఏమైనా కానీ రానీ
కాలాన్ని జయిద్దామని అనుకొంటావ్
ఆమె సాహచార్యపు నీడలో

కౌగిలించుకోవచ్చు ముద్దాడవచ్చు
వెన్నెల నీటిలో మంటను రగిల్చి
సమయాన్ని స్థంబింపచేయవచ్చు
ఆమె శరీరంతో నీ శరీరంతో

కలలలో పరిమళంతో, పరిమళంలో కలలతో
కలువరింతలతో ఎగురుతాయి
చిన్ని పిచ్చుకలు అప్పుడు
చినుకులతో చిగురాకులతో
ఉడుతలతో ఉరుములతో
పచ్చగడ్డిలో ఆడతాయి మిడతలు అప్పుడు
రాత్రిలో నక్షత్రాలలో రహస్య భాషలో
దాగిన కలలలో ఊయలలూగుతారు
పసినవ్వులతో పిల్లలు అప్పుడు

బావుంటుంది కదా లోకం అప్పుడు
వదనం దర్పణం అయినప్పుడు
శరీరం శాంతిసదనం అయినప్పుడు

నువ్వు యవ్వనంలో ఉన్నప్పుడు
నువ్వు తొలిప్రేమలో ఉన్నప్పుడు
తొలిసారిగా నిన్ను
ఎవరో తాకినప్పుడు

చేతులతో ఎవరో నీకు కళ్ళగంతలు
కట్టినప్పుడు, చెవులలో ఎవరో రహస్యంగా
నీ పేరుని గుసగుసలాడినప్పుడు
అద్రుస్యంగా ఎవరో నిన్ను
పూల వనాలకు తోడ్కొనిపోయినప్పుడు

బావుంటుంది కదా అప్పుడు
నీకు తొలి యవ్వనం వచ్చినప్పుడు
అమృత విషాన్ని తాగినప్పుడు
ఆమెను తొలిసారిగా తాకినప్పుడు=

1 comment: