23 September 2011

ఏడువు

ఏడువు నాయనా ఏడువు
నన్ను పట్టుకునో ఒక స్త్రీని పట్టుకునో
ఒక రాతిని పట్టుకునో
ఒక రాత్రిని పట్టుకునో
ఏడువు నాయనా ఏడువు

బద్దలు కొట్టుకో నుదుటిని
విరుచుకో హృదయాన్ని
శపించు జాలిలేని జనాన్ని

నిర్మించకు
నివారించకు
వివరించకు

రహదారులలోనో
మధుశాలలలోనో
మతిమరుపు లేని
పూలతో ముళ్ళతో
పుణ్య పాపాలతో
ప్రేమించే ద్వేషాలతో

నీ అవసరం లేని
స్నేహితులకై
నిన్ను బంధించే
నినదించే భార్యకై
నువ్వు కాలేని
నీ బిడ్డకై

ఏడువు నాయనా ఏడువు
కడుపారా కసిదీరా ఏడువు

లోకం కరిగిపోవాలి
కాలం రాలిపోవాలి
ఈ జన్మ ఋణం ఏదో
ఇప్పుడే తీరిపోవాలి
ఇప్పుడే చచ్చిపోవాలి

చదరపు గదుల్లో
ఇమడని జీవితం
నేల లేని స్థలానికి
నీవు లేని స్థలానికి
రూపాయి మూల్యం
అంతా దరిద్రం

ఏడువు నాయనా ఏడువు
ఇంతకు మించీ
ఇంతకు మినహా
నీకూ నాకూ

మరో మార్గం లేదు
మరో మోక్షం లేదు

1 comment:

  1. గుండె కాయ పెకలించి పెట్టినట్టుగా ఉంది

    ReplyDelete