02 September 2011

మూర్ఖుడు

తన చేతిలో ఛాతిలో ఉందొక రహస్య ఖడ్గం

రంగులను వెదజల్లే తన కళ్ళు. అవి
పదాలను వెదజల్లే పూలు.

వానని ఆపే అరచేతులు కావు నీవి
శ్వాసను ఆపే ఆ పెదాలు కావు నీవి

తన వెన్నముక ఒక శ్వేతసర్పం
తన వదనం ఒక వెన్నెల వనం

గరళ కంటుడివి కావు నీవు
వనంలో విరిసే తోటమాలివి
కావు నీవు

తన సన్నటి తెల్లటి వెళ్ళే అవి
పాకుతాయి నీ వద్దకు పరమ
పవిత్ర పాపంతో

అంతులేని దయతో దిగులుతో

తన పొడుగాటి తెల్లటి కాళ్ళే అవి
సాగి వస్తాయి నీ వద్దకు విరామ
వేగిరంతో కోరికతో

ఎదురుచూసే తెల్లటి కళ్ళే తనవి
బావురుమంటో కావలించుకుంటాయి
నీ ముందు రాయలేని కన్నీళ్ళతో

దినమొక శ్వేతాశ్రువు. క్షణమొక
పదమృత్యువు. పద పద పద
త్వరగా త్వరత్వరగా

తన పద సన్నిధికి పరమపద
సోపానంతో ప్రేమ శాపంతో=

ఎందుకంటే ఉందొక రహస్య ఖడ్గం
తన చేతిలో ఛాతిలో

నీ అస్తిత్వపు పరిమళంతో
నువ్వు ఊహించని
ప్రేమ పగతో, తేనె తాపంతో
వింత విషంతో=

హతం కావడానికి
నీలి రాత్రిలో కుంగి
కరిగిపోడానికీ

ఇంతకంటే ఏం కావాలి
నీకు? నీకూ?

No comments:

Post a Comment