15 September 2011

సరైన సమయం

మెత్తటి మంట సోకే నాలిక
చేతివేళ్ళ నుంచి రాలే
నీలి నిప్పు చినుకులు

కొంత మౌనం కొంత గానం

ఎవరో తెచ్చారు
వెన్నెల వనాన్ని
శరీరంలోకి

ఎవరో వొంపారు
అలల తాకిడిని
పెదాలలోకి

ఎవరివో అల్లారు
రంగుల కాలాన్ని
వక్షోజాలలోకి

చిలికారు ఎవరో
కొంత అమృతాన్నీ
కొంత విషాన్నీ నీ
పద సన్నిధిలోకి

సాగుతున్నాయ్
నెమ్మదిగా నీడలు
నీ హృదయ
ప్రాంగణంలో
చుట్టుకుంటోంది
సంధ్యాసమయపు
చల్లటి గాలి
వృక్షాలలో
వృత్తాలలో నీ
నయనాలలో

చూడు ఇటువైపు
అటువైపు నుంచి

వస్తునాడు అతడు
ఏమీ కాలేక
ఎక్కడా తనని తాను
కనుక్కోలేక

రాత్రివంటి కాంతితో
కాంతి వంటి భీతితో
నీ వద్దకు=

వెనుతిరగమని
తిరిగి వెళ్లిపోమ్మనీ
చెప్పేందుకు

ఇదే సరైన సమయం.

No comments:

Post a Comment