16 September 2011

అ/సాధ్యం

తెరిచే తాళం ఏదీ లేదు నీ వద్ద

రంగుల అద్దాలు చుట్టూతా
అద్దంలోంచి అద్దంలోకి
అనంతంలోకి జాడలలోకీ:

పాపం పదాలతో పదాల
పాపంతో ముగ్గురు ఏడు
లోకాలలో తిరుగాడారు

తిరుగాడుతూ ఇక తిరగలేక
తను వాక్యానికి చిక్కుకుని
వ్యాకరణానికి తట్టుకోలేక
వాక్యానికి చెప్పుకోలేక
శిధిలాల వద్ద శిధిలమయ్యింది.

వదనం. విషముఖ నిర్మిత
సదనం. యంత్రోపనిషత్తులో
ఆగుతూ సాగుతూ

ఏడు ఏళ్ల తరువాత ఏడు పదాల
ఏడు అడుగుల నిశ్శబ్ధం తరువాత
మూడే ముళ్ళతో అతడు

అనేక శబ్దాలను పుటలనిండా
అబద్ధానికి నిబద్ధుడై
అందంతో అలికాడు.

లిఖిత నీడలకీ, ఖాళీ కాగితాలకీ
రాత్రి వొదలని జాబిలీ
జాబిలిని వొదలని రాత్రికీ అతడు
విరిగిన వెన్నెముక అయ్యాడు.

ఇక ఆ తరువాత ఎవరూ
హాస్యానికైనా వివాహం గురించీ
విరోధం గురించీ పలుకలేదు!

= ఆ తరువాతా అంతకుమునుపూ
ఇద్దరూ నిప్పుకణికెలను
గుండె నిండుగా తాగుతూ

ఇతరులతో ఎన్నడూ సమ
భాషించలేదు. మరణించలేదు.
జీవించనూ లేదు =

: దీనితో, దీని అనే పదంతో
దీని అనే పదవాక్యాంతంతో
ఏకాంతంలో తాళంలో
రాగంతో ఒక వాన మొదలయ్యింది:

= నీకు చూపు పోయేదాక
దానినీ దీనినీ చూడకు=

No comments:

Post a Comment