21 September 2011

పోవా

పరిగెడతావు రాతి చదరాలలోకి
ముఖాన్ని దాచుకోలేని సిగ్గుతో

ఎవరు చెప్పారు నీకు
ఇదంతా నలుపుని/శ్శబ్దమని?

కోరుకో కొంత వినాశాన్ని
కోరుకో కొంత విపరీత
విషపు అర్థాన్ని:

వెలుతురులో ప్రతిబింబించే
గాజు పరదాలలో దూరాలలో
నక్షత్రాలని నక్షత్రాలకి
అపరచితం చేసే నక్షత్ర
మాయా మోహినీ యంత్రమోహ
సమ్మోహినీ

మేమిక చూస్తాము
నోరు పెగలని దూడలనీ తొండలనీ
చంద్ర వలయంలో చిక్కిన
సర్పనాలికల తెమ్మరలనీ
కప్పలనీ ఎప్పటికీ
కప్పలేని నీ కబోధి చూపులలో:

ఎవరు అనుకున్నారు
నువ్వొక మహిమాన్విత
మృత్యు దూతవని
ఇళ్ళను నమ్ముకున్నవాళ్ళని
కమ్ముకున్న వజ్రఖచిత
నలుపు మంచువని?

చూడక్కడ చూడొకడు
ఏడుస్తున్నాడు ఏడవక
పడీ పడీ విడివడి
వీడలేక ఓడిపోలేక:

పాపం శమించుగాక
నిరంతర వార్తావాహిని
ఒకింత విశ్రమించుగాక

సూర్యుడి ప్రేమో కరుణో
గ్రహాల మోహమో
సృష్టి కిరణ వ్యామోహమో

కావాలి నీకొక జాబిలి
నీలోపల నీడలలోపల:

ఎడవకురా పిచ్చివాడా
పదాలేప్పుడూ పాదాల్ని
ఇవ్వలేదు
విరచితమైన విచిత్ర విష
నయనం తారాల లోంచి
నీకేన్నడూ కన్నీళ్ళని
కడిగే చూపునివ్వలేదు

బ్రతకడం ఎన్నడూ నేర్వలేదు
కనుక, కానుకగా
మరణించడం ఎన్నడూ
తెలియదు, రాదు: పోదు

దిగంతాలలోంచి వస్తోంది
ఒక జాడ జతయై జాతరై
స్త్రీయై దీవెన శాపమై:

ఎత్తుకున్న చేతులూ
తాగిన చనుబాలూ
ఊగిన ఊయలా అలా
ఏడ్చిన పీడిత కలా

రమ్మని పిలుస్తోంది నిన్ను
కొంత కోపమై
కొంత కోరికై
కొంత కాంతై
కొంత రాత్రై రగిలే రాగమై:

పోవా ఇకనైనా
ఇప్పటికైనా?

No comments:

Post a Comment