కూర్చుంటావు ఒక విచిత్ర దీపం కింద ద్వీపమై
ఒక విచిత్ర వదనంతో
ఎందుకు వచ్చావో తెలియదు
ఎవరూ చెప్పరు ఎవరూ: రాత్రి
ఒక మోహిత శరీరమై కదులుతోంది
నీ పరిసరాల్లో నీ నిశ్శబ్ధంలో
ఎముకలు విరిగే సవ్వడి
కలలు కూలిపడే సవ్వడి
ఎంతని తీసుకోగలవు నీ రెండు కళ్ళైనా
ఎంతదాకని సాగగలవు నీ చూపులైనా
ఎంతమందినని ఎన్నిసార్లని
దారులలో ఇమడని వాళ్ళని
ఒంటరిగా ఏడిచేవాళ్ళని శాప
గ్రస్థులని దిగులుదాహార్తులని
హత్తుకోగలవు రోదించగలవు?
ఎన్ని పూవులని
ఎన్ని పిట్టలని నీ రెక్కల కింద
దాచుకోగలవు
తెలుపు లేదు తెల్లవారలేదు
నలుపే నయనాలుగా నల్లటి
కన్నీళ్ళుగా మారిన మనిషికి
మోక్షం లేదు
ఇళ్ళని నమ్ముకున్న వాళ్ళెవ్వరూ
ఇక్కడ జీవించిన దాఖలాలు లేవు
ఎలుగెత్తి పిలిచి
ఎదురువెళ్ళి ఏకాకిగా మిగిలిపోయి
ఎదురుచూసి చూసే
ఏమీ కాక పిగిలిపోయి
విచిత్ర దీపం కింద ఒక్కడివే
అరచేతిని చదువుకుంటావు
గీతలని రాసుకుంటావు
రగిలిపోతావు రహస్యమైపోతావు
వెన్నెల లేని నీడలు
ఎప్పటివో పదాల జాడలు నిన్ను
వింటాడుతున్న అడుగులూ
రాలే ఆకుల తుంపర
వీచే గాలుల గలగల
నింగిలో నిర్మానుష్యంలో
నక్షత్రాల మౌనంలో
ఉందా నీ మృత్యువు?
మోము మీద మోము
పెదవిపై పెదవి
అరచేతిలో ఇమిడిపోయిన
ఒక పసి చేయి
ఒక పసి మాట
ఇప్పటికిదే నీ జీవితం
ఇక బ్రతుకు అంతదాకా
తెల్లని తెలెవారేదాకా
అనంతంలోకి జాడలా
తేలిపోయేదాకా
ఇంతకుమించి ఇంతకుమినా
నీకు మరో మార్గం ఉందా?
Good..
ReplyDelete