10 September 2011

కాదు/పోదు

చేతులే, వికసిత పద్మాల వలె విచ్చుకున్న అర
చేతులే, వాటితోనే వాటితో కదిలే రెండు

పాదాలతోనే వచ్చాను ఇక్కడికి. ఏమీ తెచ్చుకోలేదు
ఎవరినీ నమ్ముకోలేదు
ఎవరినీ అమ్ముకోలేదు.

శరీరమే, వికసితమైన పక్షుల గూళ్ళను నింపుకున్న
శరీరమే, దానితోనే దానితో వలయమై చూసే

కళ్ళతోనే, చూపులని తిరిగి తీసుకువచ్చే చూపులనే
తెచ్చుకున్నాను ఇక్కడికి.

ఎవరు కావాలి? ఎవరు పోవాలి? స్నేహితులూ వద్దు
స్త్రీలూ వద్దు. వాడిపోని పూల పరిమళమూ వద్దు.

గుండెలో రాతి దిగులు తెల్లటి సర్పమై చుట్ట చుట్టుకుని
ఉన్నది, విషంతో వేగిరంగా ఎదురు చూస్తో ఉన్నది

పదాలు, నేను వెదజల్లిన పదాలు విస్తృతమై వస్తున్నవి
నా వైపే మహా దాహంతో, ప్రతీకారంతో వేచి ఉన్నవి

ప్రతీకలు, నువ్వు ఇచ్చిన ప్రతీకలే
వీడని బహుమతుల వలె, ఉరికొయ్యలై తలారులై
మృత్యు ఆహ్వాన గీతాలను పంపుతున్నవి

శ్రద్ధాంజలి రాసే వేళ్ళకి నీ తలపుల విలాపం ఎందుకు?
కడతేరిన కలలకి మళ్ళా నీ పునర్యాన
విషాద విన్యాసం ఎందుకు?

చేతులే, ముఖాన్ని తమ లోపలి లాక్కున్న అరచేతులే
నీ కళ్ళ తడిని నా కళ్ళ నిండుగా నింపుకుని
పగిలిని గోడలవలె తడిని పీల్చున్న అరచేతులే అవీ ఇవీ=

ఇక ఈ వాక్యాన్ని మరింతగా కొనసాగించలేను. తప్పుకో
తరువాతి ఖననానికి తగినంత సమయమయ్యింది:

No comments:

Post a Comment