నువ్వే దూరం. దూరపు తీరాన్ని చేరని
పదపు చూపే దూరం.
ఎవరు చూసారు నిన్ను
తమ కళ్ళతో. స్వప్నవాచాకాల్ని లిఖిస్తూ
మూగవాళ్ళం అవుతున్నాం ఇక్కడ: అక్కడ
సమీరంలోకి జారే నీ శరీరం
నీ శరీరంలోకి జారే
అతడి మృగనయనం. మృగనయనంలో
ముద్రితమయ్యే ముద్రిత సమయం.
రాలేదు నేను ఇక్కడికి ఇది చెప్పటానికి
పుటల మధ్య నిలిచిన నిర్మాణాలలో
తిరిగి వచ్చే తిరిగి తిరిగి వచ్చే
ప్రేతాత్మొకటి తిరుగాడుతోంది
తిరగతోడుతోంది తోడునీ
తోటి చరిత్రనీ ఒక నిర్మానుష్య జాగ్రత్తతతో:
జాగ్రత్త: రాలేదు నేను ఇక్కడికి
అది చెప్పడానికీ రాయడానికీ
వాచక వాగ్దానాన్ని
భంగం చేయడానికీ:
చూడు: రాత్రి కురిసిన వానలో మిగిలిన
పచ్చిగడ్డి జాడలో కదులుతోంది
తన మెత్తటి పాదం
పురుషుడు కాని పు/రుషిడికై
తప్పుకో. దారి ఇవ్వు. నీటిలో దాగిన
కప్పల కన్నీళ్ళని వినే నిశ్శబ్దం తనది
కరుణా వ్యా/కరణం తనది
తప్పుకో. దారి ఇవ్వు. ఇక వేరే దారి లేదు
నీకు. ఇక నిదురపో నువ్వు
చీకటి కనురెప్పల కింద ఊగే
కన్నీటి అలల అలజడిలో
ని/స్పృహలో ప్రతిధ్వని ప్రతిధ్వనించే
ప్రతిధ్వనిలో, ప్రతి ధ్వనిలో=
ఆమెన్.
No comments:
Post a Comment