అర్థరాత్రిలో మెరిసే సీతాకోకచిలుకలు. లేదా తెల్లటి పావురాళ్ళు . ఈ అర్థరాత్రి ఒకింత దిగులుతో మనం పంచుకుని, మన పాత్రలలోకి ఓంపుకునే ఒక పదం 'మనం' . సూర్యకాంతితో, పారదర్శకమైన చంద్రకాంతితో తళతళలాడే పాత్రలు: 'మనం'. ఎవరు వస్తారు ఈ కాంతితోటి? ఎవరు వస్తారు ఏ ఏ సంజ్ఞల తోటి, ఏ ఏ గాయాల తోటి? శతాబ్దాల తపనతో, లిప్త క్షణాల ప్రేమతో వ్రాయబడిన ఈ గాయాలను మాన్పేందుకు ఎవరు వస్తారు? అక్కడ, ఇక్కడే ఉన్నాం మనం
తుడిపి వేయబడలేని పదాలమై, అస్థిర నాలికలమై ఎప్పటికీ చేరుకోలేని, ఎన్నటికీ నివశించలేని ఇళ్ళమై అక్కడే ఉన్నాం మనం. ఈ లోగా, ఎవరో ఎవరో రాతి హృదయంతో పూల నవ్వుతో వచ్చి, రాత్రిలో రాత్రితో వెడలిపోతారు. ఈ లోగా, మనం, మనం ఉంటాం ఇక్కడ అర్థరాత్రి చుట్టూ గిరికీలు కొట్టి కిచ కిచ లాడే పిట్టలతో, మనల్ని ఆకస్మికంగా నింపే ఆకస్మిక మృత్యు రంగులతో, ఎరుకతో కూడిన మృత్యువుతో,మైమరపించే ఆమె పరిమళంతో, మనం ఈ లోగా ఇక్కడ మిణుగురులమై మెరిసి పోతాం మనం.మృత్యువు అంటావా?
నేను ఈ పదాలను రాసే తెల్ల కాగితం మృత్యువు. జీవితంతో అర్థాల్ని పూరించే ఈ ఖాళీ వాక్యాలు మృత్యువు. జీవితాలకి జీవితం, కలలకి కల, అందరూ వొదిలివేసిన రాత్రి సీతాకోకచిలుకలలారా, ఏం చేసాం మనం ఇలా ఇక్కడ కూర్చుని
మనం ఎప్పటికీ పొందలేని, మనం ఎప్పటికీ కాలేని రాత్రినీ, పిల్లలనీ స్త్రీలనీ దగ్ధం చేసేందుకు, ఏం చేసాం మనం ఇలా ఇక్కడ కూర్చుని? పిల్లలు. మనం ఎప్పటికీ రాయలేని పదాలు వాళ్ళు. స్త్రీలు:మనం ఎప్పటికీ అనువాదం చేయలేని పదాల మధ్య ఉండే స్థలాలూ, అర్థాలూ వాళ్ళు. అందుకని మనం, త్వరలో తొలి సూర్యకాంతిగా మారిపోయే
అర్థరాత్రిలో మెరిసే సీతాకోకచిలుకలు లేదా తెల్లటి పావురాళ్ళు గురించి మాట్లాడతాం. తొలి సూర్యకాంతి. విరిగిన వాస్తవాల నగ్నమైన అద్దాల సూర్యకాంతి. స్వఅస్తిత్వాల భస్మంతో, అందరి కన్నీళ్ళతో కరిగిపోయే స్నేహితుడి దుఃఖపు కాంతి. ఒక అపరిచిత తిరుగుబోతు మూలుగుల అక్షరాల కాంతి.
ఏం చేద్దాం మనం, ఇళ్ళకు కొన్ని సంవత్సరాలుగా వెళ్ళని, నీ పక్కగా దిగులుగా ఏమీలేని సంతోషంతో కూర్చున్న అర్థరాత్రి పావురాళ్ళనీ సీతాకోకచిలుకలనీ?
suuuuuuuuuuuuuuuuuuuuuuuuuuuuuuuuuuuuuuuuuuuuuuper
ReplyDeletegud one
ReplyDelete