17 January 2011

త్వరగా రా ఇక*2

నిశ్శబ్దంగా నువ్వు కూర్చుంటే
నేను ఒక మహా
శబ్ధంగా మారిపోతాను

వడలిపోయి నువ్వు అలా
ఒక మూలకు ముడుచుకుపోతే
నేను ఒక మహా
కన్నీటి చుక్కనై రాలిపోతాను

నిదురలో నువ్వు
విరిగిన పదాలై చిట్లిపోతుంటే
నేను మూగవాడినై పోతాను

రాత్రంతా నువ్వు
ఒక మహా కలవరింతై
పానుపుపై నుంచి
అపస్మారక కలలతో
నేను కాంచలేని
ఒక మహాప్రపంచంలోకి
జారిపోతుంటే
నేను నిస్సహాయుడినై
ఇక్కడే మిగిలిపోతాను

ఏమీ చేయలేక
ఏమీ చేయరాక

ఇద్దరమే అలా నీ పక్కన

రాత్రంతా గదిలో, నీ మదిలో
అలజడిగా మెదిలే నీడలతో=

ఇద్దరమే అలా నీ పక్కన

పగలంతా ఆవరణలో
నీకై ఎదురుచూసే పిచ్చుకలతో
నీకై ఎదురు చూసి చూసి
అలిగి మబ్బుల మధ్య దాగిన
పాపం ఆ ఒంటరి
నునువెచ్చని సూర్యుడితో=

తెలియదా నీకైనా
నువ్వు ఆమె కళ్ళలో పూచే
తెల్లటి లిల్లీ పూవువని?
తెలియదా ఆమెకైనా
నువ్వు నా అరచేతుల్లో
చిందే మెత్తటి చినుకువని?

తెల్లటి కళ్ళతో, ఎత్తు పళ్ళతో
కిలకిలా నవ్వులతో, ఇకిలింతలతో
నీలో నువ్వు మురిసిపోయే వాడా
నీ నల్లటి పిర్రల గురించి ఇక
ఎవరికీ చెప్పను గాక చెప్పనులే

త్వరగా రా ఇక, సాయంత్రం వేళ
పిచ్చి పిచ్చిగా పరిగెత్తుతూ మనం
ఆడుకునే వేళైంది
ఇక ఆలస్యం చేయకు=

No comments:

Post a Comment