07 January 2011

నువ్వు అనుకుంటావు

నువ్వు అనుకుంటావు
పిల్లలకి ఏమైనా కావాలా అని
వాళ్ళు ఏమైనా అడుగుతారని

అడిగేది, ఆశించేదీ పెద్దలే అని
నీకు ఎప్పటికీ తెలియదు

నువ్వు అనుకుంటావు
పిల్లలకి ఏదైనా దాచిపెడదామని
ఏదైనా నిలువ చేద్దామని

నిన్నా, రేపూ ఇవాళా పెద్దలకే కానీ
చెట్లల్లో, పూలల్లో
విరిగిన బలపాలతో
మెరిసే పదాలతో
ఎగిరే సీతాకోకచిలుకలకు కాదని
నీకు ఎప్పటికీ తెలియదు

నువ్వు అనుకుంటావు
పిల్లలకు ఏమీ తెలీదని, వాళ్లకు
విడమర్చి లోకాన్ని వివరిద్దామని
చూపునిద్దామని=

అంధుడవి నీవనీ, అంధత్వం నీవేనని
నీకు ఎప్పటికీ తెలియదు
నీకు ఎప్పటికీ తెలియదు

మూర్ఖుడా
వెళ్ళు. వెళ్ళిపో ఇక్కడనుంచి.
ఇది నీ ప్రపంచం కాదు.

1 comment:

  1. sreekanth... poem cute gaa vundi...but, chivari moodu lines maatram konchem panti kinda raayilaa thagilaayi...

    ReplyDelete