07 January 2011

(పోనీ)

తలను వంచి, నింగి నుంచి
నేలకు రాలిపోతున్న
ఆ తెల్లటి మొగ్గను ఎపుడైనా
చూసారా మీరు? (పోనీ)

భూమి నుంచి, నింగిలోకి
పొగలవుతూ
కనుమరుగవుతున్న
ఆ వేసవి నదిని
ఎపుడైనా చూసారా మీరు? (పోనీ)

రహదారిలో తప్పిపోయి, ఇంటికి
దారి మరచిపోయి
తల్లికై గుక్కపట్టి ఏడ్చి ఏడ్చి
ఓ మూలకు ఒదిగి ముడుచుకున్న
ఆ నాలుగు ఏళ్ల పాపను
ఎపుడైనా చూసారా మీరు? (పోనీ)

మిమ్మల్ని హత్తుకుని, భీతితో
చుట్టుకుపోయి
మీ హృదయంలోకి దాగిపోయే
ఆ హృదయంలోకి
ఎపుడైనా నడిచి వెళ్ళారా మీరు? (పోనీ)

ఎదురు చూసే కళ్ళలో కాటుకగా
ఎపుడైనా మారారా మీరు?
కాటుక వెనుకగా ఉండే రహస్య
ప్రపంచాలలో ఎపుడైనా
నిండు చందమామ అయ్యారా మీరు?
ఆ అరచేతుల్ని పొదివి పుచ్చుకుని
నీకు నేను ఉన్నాను
అని ఎపుడైనా చెప్పారా మీరు?
ఆ వదనంలో ఒక పూల తోటను
ఎపుడైనా నాటారా మీరు?
ముళ్ళ బాటలో, ఆ పాదాల కింద
మెత్తటి పచ్చికగా
ఎపుడైనా మారారా మీరు? (పోనీ)

ఎపుడైనా, ఎక్కడైనా
మీరు మీరుగా
మీకు మీకుగా
ఎపుడైనా, ఎక్కడైనా
ఉన్నారా మీరు?

4 comments:

  1. నాకు కవిత్వం చదవడం సరిగ్గా రాదనీ....ఒకవేళ ఓపిగ్గా ప్రయత్నించినా కవుల తాత్వికతా సుడిగుండంలో పడి గిర్రు గిర్రున మెలికలు తిరిగి పోతాననీ నా మీద నాకే సానుభూతి....హమ్మయ్య..పొతే 'పోనీ' గానీ చాలా రోజుల తర్వాత...మీ కవిత చదవగానే పొడిబారిన గుండెలోకి సెలయేరు దూకినట్లుగా ఉంది

    ReplyDelete
  2. sensitive n beautiful. simplicity is a great achievement that a poet can strive for. your poem has that simplicity.

    ReplyDelete
  3. పోతే పోనీ.....ఏమైనా కానీ!!
    కవిత బాగున్నది చదివేయనీ:):)

    ReplyDelete