21 January 2011

ఏదీ రాయాలనిపించనప్పుడు

ఏదీ రాయాలనిపించనప్పుడు
ఏమీ రాయకపోవటమే మంచిది

ఊరికినే అలా కూర్చో
రాయటం తప్ప ఏదైనా చేయ్

నీ పిల్లలు విసిరివేసిన బొమ్మలనూ
చించి వెదజల్లిన కాగితాలనూ
ఒక దరికి చేర్చి, గదంతా శుబ్రంగా
తడి గుడ్డతో తుడువు ((లేదా))

ఇంటిపైన గుమికూడిన నీడల కింద
కదులాడే పూల మొక్కలతో
కాసేపు సంభాషించు ((లేదా))

ఈ పూటకు కావాల్సిన కూరగాయలను
కడిగి, తురుముతూ కోస్తూ
నీ భార్యతో కాస్త మనసు విప్పి మాట్లాడు ((లేదా))

దగ్గరిగా ఉన్నా, దరి చేరలేని
నిను కని, తమని తాము కోల్పోయి
ముసలి వాళ్ళుగా మారుతున్న
నీ తల్లినీ, తండ్రినీ
కాస్తంత ఓరిమితో పలుకరించు ((లేదా))

దగ్గరిగా ఉండీ, దగ్గర కాలేని
నిను విన్న, నిను కాంచిన, ఈ లోకంలో
దారితప్పి తిరుగాడుతున్న
నీ స్నేహితులు జీవించి ఉన్నారో, ఎక్కడైనా
మరణించారో కనుక్కో ((లేదా))

కాస్తంత ఎండనీ, కాస్తంత గాలినీ
ఆరుబయట తిరుగాడుతున్న తూనిగలనీ
హృదయంలోకి తీసుకో
కనులు మూసుకుని నిన్ను నువ్వు
కాసేపు స్వప్నించుకో . ఎందుకంటే

ఏదీ రాయాలనిపించనప్పుడు
ఏమీ రాయకపోవటమే మంచిది

3 comments:

  1. chala baaga chepparu..mee vayassu enta andi?

    ReplyDelete
  2. chala matured person la thinking undi meelo..anduke adiga

    ReplyDelete
  3. am born in 1972 gangadhar gaaru.

    ReplyDelete