22 January 2011

ఎలా

ఎవరో వయస్సు అడుగుతారు

శరీరానిదో, మనస్సుదో
తెలిసేదెలా?

దారి పక్కన, నీటి చివర్న
ఆగి ఉన్న ఎర్ర పూవు=
రాలిపడిందో, తెంపబడిందో
తెలిసేదెలా?

మధుపాత్రాలలో, నక్షత్రాలకింద
విందులో
తాగిందెవరో, తూలిందెవరో
ఇళ్ళని వదిలిందెవరో
ఇళ్ళని చేరిందెవరో
తెలిసేదెలా?

ప్రేమలో, జ్వలించిపోయే ఆకర్షణలో
అతడెవరో, ఆమెవరో
రమించినది ఎవరో, రమింపబడినది
ఎవరో, ఎవరు ఎవరో
తెలిసేదెలా?

దారుల్ని వొదిలి, దేహాల్ని వొదిలి
తనలోనే సంచరిస్తున్నవాడికి
మిత్రులు ఎవరో, శత్రువులు ఎవరో
మూలం ఎవరో, అనువాదం ఎవరో
తెలిసేదెలా?

అంచులలో పదాలని, పదాలలో
అంచులని నింపేవాడికి
నిప్పు ఏదో, నీరు ఏదో
నింగి ఏదో, నేల ఏదో
తెలిసేదెలా?

నా గురించి తిరుగాడే అతడికి
అతడి గురించి ఎదురుచూసే ఆమెకీ
వ్యాకరణం లేని అందరికీ
ఈ భాషణ అంతం అయ్యేదేలాగో
తెలిసేదెలా?

జననమేదో, మరణమేదో
జీవన కారణమేదో, మరణ ప్రేరకమేదో
హృదయ మర్మమేదో
నిశ్శబ్ద తంత్రమేదో
తెలిసేదెలా?
ఎలా?

1 comment: