11 January 2011

తెలుసా మీకు

౧.
తెలుసా మీకు
ఒక్కొకటిగా నక్షత్రాలను లెక్కపెట్టుకుంటూ
రాత్రిపూట చీకటిని బొట్టు బొట్టుగా మార్చి
తడి ఆరిన కళ్ళల్లో వొంపుకుంటూ ఇంటికి వెళ్ళటం
ఎలాగో తెలుసునా మీకు?

ఇంటికి వెళ్తావో లేదో
ఈ నగరపు రహదారుల్లో ఎక్కడైనా ఆగిపోతావో ఏమో

తెలుసా మీకు
అది ఎలా ఉంటుందో, అది ఎలా జరుగుతుందో
తెలుసునా మీకు?

నేను మీకు చెబుతాను.

౨.
ఒక వేయి తెల్లటి గులాబీలతో ఉదయం మొదలవుతుంది. నీకు మాత్రం
ఒక వేయి నల్లటి పదాలతో
వేదన మొదలవుతుంది.

నువ్వు ఎక్కడా ఉండవు. ఎక్కడా ఉండలేవు.

మనుషులనుంచి పారిపోతావు. వెగటు పుట్టి సంబంధాలనుకునే
బంధాలనుంచీ పారిపోతావు.
ఎవరికీ చెందక, ఎవరికీ అందక
నువ్వు ఈ లోకం నుంచీ నీ నుంచీ పారిపోతావు. ఇక

ఒక వేయి నల్లటి గులాబీలతో రాత్రి మొదలైనప్పుడు, నీకు మాత్రం
ఒక వేయి మెరుపులతో
ఒక వేయి ఉరుములతో
కనులు కాంచలేని తెల్లటి మహా కాంతితో
నీ దినం మొదలవుతుంది.

తెలుసా మీకు
ఆ దినం ఎలా ఉంటుందో, ఎలా అంతం అవుతుందో
తెలుసునా మీకు?

నేను మీకు చెబుతాను.

౩.
ఎవరికీ చెందక, ఎవరి వద్దకూ వెళ్లక
వెళ్ళలేకా, నువ్వు ఒక్కడివే ఒక మహాప్రతీకారంతో
ఒక మహాప్రేమతో
ఒక మహాశాంతితో

కూర్చుంటావు, వీధుల్లో
కరడు కట్టిన రహదారుల్లో, చనుబాల వంటి మధుశాలల్లో
కూర్చుంటావు నువ్వు, తెల్లటి కాగితాలతో:

మంచు పరదాలలో దాగిన అప్సరసలు
దిగి వస్తారు, కపటాలలో నడయాడే మిత్రులు ఎదురొస్తారు
ఆకలికి విలవిలలాడిన దినాలూ
భూమిని నమ్ముకుని ఆర్చుకుపోయి ఎండిపోయీ
పండిపోయిన అమ్మా నాన్నలు గురుతుకొస్తారు

చచ్చిపోదామనుకున్న క్షణాలూ
ఎవరినన్నా చంపేద్దామనుకున్న సమయాలూ, డబ్బులేని
మబ్బులు కమ్మిన మసక చీకటిలో
తొలి చినుకులు రాలిన చల్లటి మట్టి వాసనై
నిన్ను చుట్టుకుని, నిన్ను తన వక్షోజాలలో పొదుపుకున్న
ఆ స్త్రీ హస్తాలూ, ఆమె అరచేతుల మధ్య
నిస్సహాయంగా రాలిపోయి, పాలిపోయి ఏడ్చిన క్షణాలూ
గురుతుకొస్తాయి:

వొదలలేని ఊరూ, వొదిలి తిరిగి వెళ్ళలేని ఊరులోని ఇల్లూ
ఇక ఇప్పటికీ, ఎప్పటికీ
నిన్ను నిర్ధయగా వేటాడతాయి: సరిగ్గా ఎప్పుడంటే

ఒక వేయి నల్లటి గులాబీలతో రాత్రి మొదలైనప్పుడు
ఒక వేయి మెరుపులతో
ఒక వేయి ఉరుములతో
కనులు కాంచలేని తెల్లటి మహా కాంతితో
నీ దినం మొదలైనప్పుడు:

తెలుసా మీకు, ఆ తరువాత ఎలా ఉంటుందో
తెలుసునా మీకు
ఆ తరువాత ఎలా అంతం అవుతుందో?

నేను మీకు చెబుతాను.

౪.

ఒక ప్రళయ ఘోషతోటి, ఒక మహా నిశ్శబ్దంతోటీ
రాత్రి అర్థరాత్రిగా మారుతుంది.
తూలుతూ, మరచి వచ్చిన ఏ బ్రతుకులోని భారంతోనో

నువ్వు నీ వస్తువులను పడేసుకుంటావు
నువ్వు నీ పర్సుని పడేసుకుంటావు, మధుశాలల్లో పడి
తిరుగాడుతున్న ఆత్మల కాంతిలో
నిన్ను నువ్వు నిర్భయంగా వొదిలి వేసుకుంటావు:

ఇక ఇంటికి వెడతావో, దారి పక్కన చలిలో వెలుగుతున్న
ఏ పాక పక్కగా, బిక్షగాళ్ళతోటీ
నేరస్తులతోటీ, పాపులతోటీ దేవతలతోటీ
పాటలు పాడుకుంటూ గడుపుతావో, పోలీసు స్టేషన్లో అంతమవుతావో

నీకూ తెలియదు, నిన్ను కన్న నీ తల్లికీ
నీకై ఎదురుచూస్తున్న నీ భార్యా పిల్లలకీ తెలియదు. పోనీ

తెలుసా మీకు, ఆ తరువాత ఎలా ఉంటుందో
తెలుసునా మీకు
ఆ తరువాత ఎలా అంతం అవుతుందో?

ఇది మాత్రం నేను మీకు చెప్పలేను.

3 comments:

  1. naku telusu..aa rathrulu ela anthamavuthayo...bayankaranga...rakshasanga...mruthuyuvula...pi ni kavithalo ni...padalla..anthamavuthai...authentic poem...

    ReplyDelete
  2. బావుంది. భయం కూడా వేసింది.

    ReplyDelete