28 January 2013

Rowson's Reserve గ్లాసులో AC Premium మందు

నడిచొచ్చీ నడిచొచ్చీ, ఈ చెట్టుకు ఆనుకుని
     ఎండకి తాళలేక, నీ వైపు తల ఎత్తి కళ్ళు చికిలించి చూస్తాను కదా: మరి

ఇన్ని ఆకుల మధ్య తళతళలాడుతూ, అన్ని
     చేతివేళ్ళతో నా ముఖంపై వేడిగా రాపాడేందుకు నువ్వు.
     కొంత పచ్చదనం కొంత కరకుదనం, మరి కొంత గాలీ కొంత నీడా
     మరి కొంత బెరడుతనంతో, గూళ్ళతో వొంగి

మట్టితో నింగిలోకి ఎగిరే నువ్వు: వానల్లో వెన్నెల్లో
నెత్తురు కురిసిన రాత్రుళ్ళలో, చిగురాకులు మొలిచే వేళల్లో
మొగ్గలని నులిమే కాలాలలో

కళ్ళు కురిసే దినాలలో, పెదాలు విరిసే క్షణాలలో
కడుపు చించుకుని రహదారులపై పడి ఒంటరిగా
గుండెలు చరుచుకుంటూ 'మ్మా, మ్మా' అంటో ఈ

లోకంలో ఒక మిత్రుడి కోసమో, ఒక శత్రువు కోసమో
ఒక తల్లి కోసమో ఒక వేశ్య కోసమో
ఒక తండ్రి కోసమో ఒక ప్రియురాలి

కోసమో ఎలుగెత్తి ఏడ్చి ఏడ్చి, ఆఖరికి తుపుక్కున ఈ ఎండమావి లోకంపై
ఉమ్మినప్పుడో, నడిచొచ్చీ నడిచొచ్చీ-

ఇక నీ వీపుకి నా వీపుని ఆనించి కూర్చుంటాను కదా
ఇక అప్పుడు, నువ్వు యధాలాపంగా తల ఎత్తి
నా వైపు చూసి "How's the day?" అని అడిగితే
ఇల్లా అంటాను:

"The day was like AC premium whiskey in a Rowson's Reserve glass.
What would you like to have?"

No comments:

Post a Comment