29 January 2013

పచ్చి ముళ్ళ వాసన

"తప్పుగా అనుకోకు. కానీ, ఒక మనోహరమైన గాజు పాత్ర

తేనె పూవై, నీ పెదాలపై
సాయంకాలపు ధూళితో
                                 వాన వెలిసిన వాసనతో మెత్తగా వీస్తే
నువ్వైనా నేనైనా
ఏం చేయగలం?
ఒక స్త్రీ నిను తపనగా తన వక్షోజాలకు అదుముకుంటే

నువ్వైనా నేనైనా ఇక
ఏం మాట్లాడగలం? చూడు ఆ లేత ఎరుపు గులాబీ రెక్కలున్న
తెల్లని లిల్లీ వనాన్ని

తను మాట్లాడే విధానాన్ని
తను నడిచే పద్ధతినీ. ఒక
సన్నటి నవ్వుతో నిన్ను
                                 నిలువునా కోసే స్త్రీని నువ్వు చూసాక

ఇక నువ్వైనా నేనైనా
తాగకుండా ఎలా
ఉండగలం. త్రాగు
                        ఈ మట్టి కుండ నిండి పోర్లిపోయేదాకా, మత్తుతో

నీ శరీరం ఒక నావై ఆ రహస్య
లోకాలలోకి సాగిపోయేదాకా -"

అని అన్నాడు జోర్భా నిన్న రాత్రి
కృతజ్ఞతతో ఏడ్చి ఏడ్చి
నను గట్టిగా పట్టుకుని
                                వెక్కిళ్ళు పెడుతో: అది సరే కానీ

ఆ పచ్చి ముళ్ళ వాసన
ఎంత బావుంటుంది నీ
నెత్తురుని తొలిసారిగా తాకుతూ, నీ హృదయంలోకి సలుపుతూ దిగినాంక!

1 comment:

  1. పచ్చి ముళ్ళ వాసన !!
    ఈ వాచకా కారుడు మహా కానివాడు...

    ReplyDelete