06 January 2013

01-01-2013

అందరూ పడుకున్నాక, ఇదిగో ఈ సమయానికి
కిటికీ పక్కన నేను

చల్లటి చీకటి వాసన, మెత్తగా ఒరుసుకుని ఒక
పాల నది వెడుతున్నట్టు, శరీరంలో ఒక శాంతీ
కనురెప్పల కింద అరనిద్ర ఒత్తిడీ-

అరచేతితో నోరు కప్పుకుని
నవ్వు ఆపుకుంటూ నువ్వు, నవ్వు ఆపుకోలేకా
అటువైపు తిరిగిన నీ నవ్వులా
రెపరెపలాడే కాయితాల గాలిలా

ఇంత రాత్రీ, అక్కడక్కాడా లోకం ఎక్కడో మునిగి
మరలా తేలుతున్న శబ్ధం. ఇక

అలలై వెళ్ళిపోయే నీళ్ళపై
ఈ పొరల  పొరల  చీకటిపై

నేనో శ్వాసను ఊది వెలిగించేలోగా, వెళ్లిపోయిందీ
రాత్రి ఇలాగే, నిన్నటి లాగే

నువ్వు నిద్ర లేచే సమయానికి
నిద్రలోకి కరిగిపోయిన -నాలాగే.

No comments:

Post a Comment