21 January 2013

అనిశ్చితి

తనకి తెలుసు, ఈ నగరమొక రహస్య మృత్యు కుహరమని
    మానవ రుచి మరిగిన, పొంచి ఉన్న ఒక వ్యాఘ్రమని- అందుకనే

ప్రతీ ఉదయం, రెల్లు దుబ్బల్లా సూర్యకిరణాలు రెపరెపా వీచే వేళల్లో
     తన కళ్ళల్లో కొద్దిగా అలజడి: వంట చేస్తున్నంత సేపూ
     ఆపై, నీకై తను బాక్సు సిద్ధం చేస్తున్నంతసేపూ కొంత
     దిగులు సవ్వడి. అన్యమనస్కంగా కదులుతూ తనలో
     తానే ఏదో మాట్లాడుకుంటుంది తను

తనకు తానే ధైర్యం చెప్పుకుంటున్నట్టూ, తనను తానే ఒదార్చుకుంటున్నట్టూ-

అంతా చేసి ఇక నిబ్బరం పట్టుకుని, నువ్వు వెళ్ళే సమయానికి
     పమిటెతో ముఖం తుడుచుకుంటూ నీ చేతికి బాక్సు అందించి
     ఒక బలవంతపు చిరునవ్వుతో "వెళ్లిరా. జాగ్రత్త" అని అంటుంది
     కానీ లోపలే ఎక్కడో మొక్కలు, పూలూ పిట్టలూ గాభరాగా విసవిసా మంటూ
     పిచ్చి గాలితో, ఈకలు ఎగిరే రెక్కలతో కొట్టుకుంటున్న చప్పుడు-

"తొందరగా వచ్చేస్తాను" అని నువ్వు చెబుతావు కానీ, ఇక దారి పొడుగూతా

పల్చటి నీటిపొర అలుముకున్న తన కనులు వాసనే నీ చుట్టూతా
ఆ దినమంతా, నీ లోకమంతా నీ కాలమంతా
రెండు వొణికే చేతులై, బేలగా తాకే తన పెదాలై

నీ చిట్టి పిల్లలై, నీ ముసలి తల్లై తండ్రై, చివరికి
ఎవర్నీ ఏమీ అనలేని ఇళ్ళు లేని మహాకాలమై-  

No comments:

Post a Comment