28 January 2013

దేవతలు(నుండి)

1
ఎలాగో చెప్పు నాకు, ఇప్పుడే చెప్పు నాకు: మరొక సమయానికి చెందిన ఇప్పటి ప్రదేశంలో నిన్ను పునర్నిర్మించడం ఎలాగో ఇప్పుడే చెప్పు నాకు 
వేయి ముఖాల నువ్వు, వేయి ప్రతీకల నువ్వు. నువ్వుకి ముందూ, నువ్వుకి తరువాతా వెంటాడే జాడలతో పునరాగమనంతో వెడలిపోయే నువ్వు

ఎలాగో చెప్పు నాకు, ఇప్పుడే చెప్పు నాకు మరొక సమయంలోకి కోల్పోయిన ఈ వర్తమానంలో  నిన్ను పునరుజ్జీవనం కావించడం ఎలాగో ఇప్పుడే చెప్పు నాకు

2
హింసా దేవతా, కలల దేవతా
నగ్నంగా, వడలిపోయి ఉన్న నిన్ను అతడు కాగితాల దొంతరల మధ్యా విస్మృతి చీకటి ఆలయాల మధ్యా కనుగొంటాడు. ఇక  అతడు జీవించి ఉండటానికి నీ రూపమే కారణం.
౩.
వొంటరి వొంటరి వొంటరి

సముద్రం లేని అలలా, చెట్టు లేని పిట్టలా 
అతడు అంటాడు, వొంటరి వొంటరి వొంటరి

అలలా పిట్టలా మారిన ఈ శరీరం
ఎవరికీ అందని ఒక ఒక వొంటరి

వొంటరితనం.

ఎక్కడ అతడి స్వీయ హింసా దేవత ఎక్కడ అతడి విషాద స్వర్గం?
4
అయితే అయితే అయితే, తరచూ అతడి ముందు విచ్చుకున్న ఒక పౌరాణిక గాధలో  ధ్యానంలో మునిగిన మనుషలని సమ్మోహన పరచి మైకంలో ముంచివేసిన దేవత వలె తరచూ అతడి ముందు ఒక పదం దిగంబరం అవుతుంది:  ఎలా అంటే

కాగితం పై అచ్చు కాబడిన ఆ దేవతా  రూపాన్ని రమించాలనే అతడి కోరికవలె:  అతడు అంటాడు. ఒక పదం, నా కోరికకు ప్రత్యామ్నాయం కాజాలదు అతడు అనుకుంటాడు, ఒక పదం కాలాన్నీ అంతరిక్షాన్నీ పదునుగా కోసివేసే ఒక నయనానికి ప్రత్యామ్నాయం కాజాలదు. ఒక పదం, ఇరువురుని ఒక దగ్గరకు చేర్చే నా కోరికకు ప్రత్యామ్నాయం కాజాలదు:
6.

వాస్తవం వాస్తవంగా కాకుండాపోయినదానిని పురాణాలంటాము

నాతో ఉన్న వాళ్ళు (భౌతికంగా: అతడు అంటాడు) , నాతో ఉన్న వాళ్ళు (ప్రతీకాత్మకంగా: అతడు అంటాడు) వాళ్ళకీ, నా అరచేతుల ఖాళీ స్థలంలో, నా భీతి చెందిన కనులలో తార్లాటలాడే గాలిలో సంధ్యా కాంతిలో, వలయాలుగా రాలిపడే పండిన ఆకుల చిహ్నాలలో ఇమిడి ఉన్న నా  వాస్తవపు దేవతకి ఏమవుతుంది? 

ఆమె కూడా ఒక చిహ్నం, ఆమె ఒక దేవతా చిహ్నం. చిహ్నాలకి చిహ్నం. పురాణ గాధలకి తను ప్రారంభం: అని అతడు విలపిస్తాడు.

7
ఒక దేహంతో గడిపే సౌఖ్యాన్ని నీకు కవిత్వం అందించదు: అతడు అంటాడు


ఒక శరీరంతో, రక్తంతో ఆమె ఎముకలతో గడిపే సౌఖ్యాన్ని నీకు కవిత్వం అందించదు. అదొక మేలిముసుగు, తొలగించకు. అతడు అంటాడు మేలిముసుగు వెనుకగా ఉంటాయి జ్వలిస్తూ, నా రతి మృత్యు జీవితపు దేవతా మర్మావయాలు.  ఆమె రుతుస్రావవు రక్తాన్ని త్రాగు, ఇక నువ్వు రుచి చూస్తావు శాశ్వత జీవితపు స్వర్గాన్నీ, నరకాన్నీ:
8
నీ దేహాన్ని మరచిపోయేటట్టు చేసే ఒక గీతం ఈ కవిత్వం, అతడు అంటాడు, ఈ పదాలతో నువ్వు చేయగలిగేదల్లా, మోరెత్తి రోదించడం సర్వాన్నీ కీర్తించడం పాప విమోచనం కలగాలనీ ఎలుగెత్తి అరవడం: ఈ దుస్తులను పెరికివేయి, ఈ పదాలను వొదిలివేయి ఇక అంతకు మునుపూ, ఇక ఆ తరువాతా ఉంటాయా అక్షరాలు నా దు:క్కపు దేవతను ఉచ్చరించేందుకు? ఇక అంతకు  నుపూ, ఇక ఆ తరువాతా ఉంటాయా పదాలు నా నీలి కళ్ళ ఉన్మాధపు దేవతను నాలికలపై చేక్కేందుకూ?

ఆహ్, అతడు అంటాడు, ఇదంతా ఇది అంతా నా కవిత్వపు దేవత విలవిలలాడే ఆకులు లేని వృక్ష విలాపం.
9
గతించిన కాలంలో రాసిన పదాలపై, గతించిన పదాలపై జీవించే వాళ్ళందరూ మృతులు మరణించి, ఇక వాళ్ళు ఒక పదాన్ని ఉచ్చరించలేరు మరణించి, ఇక వాళ్ళు ఒక పదానికి రంగులు వేయలేరు, మరణించి మరణించి, మరణించీ ఇక వాళ్ళు ఒక స్వరంతో, తమ స్వరంతో గానం చేయలేరు  మరణించి, ఇక వాళ్ళు  గతించిన కాలంలో రాసిన పదాలలోంచి, గతించిన  పదాలలోంచి ఒక పాచిపట్టిన నాలికవలె దూసుకు వచ్చే  ఒక నామవాచకం పై బ్రతుకుతారు: అతడు అంటాడు

పదాలు ఈ క్షణపు ముద్రను తమలో నింపుకుంటాయి, నిన్నూ నన్నూ కాదు. మరణించారు అందరు కవులు గతకాలంలో రాసిన పదాలపై జీవించే వాళ్ళూ గతించిన పదాలపై బ్రతికే వాళ్ళూ. మరణించారు అందరు కవులూ నా కవిత్వ దేవత కనుల నృత్యాన్ని చూడలేని వాళ్ళు. మరణించారు వాళ్ళు కూడా నీతి భావాజాలపు భూతాల కోరల్లో చిక్కుకున్న వాళ్ళూ. మరణించారు కవులూ మరణించారు మనుషులూ మరణించాయి కలలూ నీతీ భావజాలపు లోగిళ్ళలో ఆగిపోయినవారూ: అతడు అంటాడు

తెలీదా మీకు, నా అస్తిత్వపు దేవతకి కావలసింది: విశృంఖలమైన జీవితం:
10
సత్యం అనేది ఒక కాముక వినోదం, సత్యం అనేది ఒక విశ్వాస ద్రోహం 

దూరంగా ఉండి అది మైమరుస్తుంది. దగ్గర ఉండి అది నీ శిరస్సుని ఖండిస్తుంది. ఉంటుంది దానిలోనే, నువ్వు ఆత్మహత్య చేసుకునే ఒక సమ్మోహన క్షణం, నిజం సత్యం ఒక లైంగిక దేవత. అనేక పొరలతో నిరంతరం తప్పించుకుపోయే తనని తాను ఎప్పటికప్పుడు తుడిపి వేసుకునే నిన్ను నిరంతరం  మరో తీరానికి ఆహ్వానించే ఈ సత్యం - అతడు అంటాడు- రాతి కళ్ళ రాతి వక్షోజాల పేరులేని వాంఛా దేవత.
11
ఎవరికీ కావాలి అది, ఎవరు జీవిస్తారు దానితోటి?
వెడలిపోకుండా ఎవరు వెడలిపోతారు దాని నుండి, అతడు అడుగుతాడు: నా రాతి కళ్ళ దేవతా, నీ వేయి ముఖాలలో, వేయి విధాలుగా వేయి రాత్రుల్లలో పునర్ జన్మించేది ఎవరు?

ఒకప్పుడు మట్టిలోకి కరిగిపోయినదీ, ఒకప్పుడు దిగంబరుడై రాళ్ళతో చంపబడినదీ ఒకప్పుడు వాళ్ళ మధ్య జీవించినదీ, ఇకప్పుడు వాళ్ళ మధ్యే జీవిస్తున్నదీ ఒక్కడే. ఒక్కతే: అతడు అంటాడు: నా గాయాల దేవతను నువ్వు చూసావా? నా గాయాల రక్తాల కన్నీళ్ళ దేవతను  నువ్వు గుర్తుపట్టావా?
12
సత్యం ఆమె గర్భంలో ఎదిగే పిండం, సత్యం ఒక గర్భం: తండ్రి ఎవరూ లేని ఒక విశ్వపు అందం, ముఖ్యంగా  నా జీవితపు దేవతకి- అతడు అంటాడు -  ఎవరికీ కావాలి తను, ఎవరు జీవిస్తారు తనతోటి వెడలిపోకుండా ఎవరు వెడలిపోతారు తన నుండి, అతడు అడుగుతాడు

వేయి శరీరాలలో వేయి విధాలుగా వేయి శతాబ్దాలుగా పునర్ జన్మించిన గర్భవతి అయిన నా దేవతని? సత్యం తప్పక ఒక గర్భం అందరూ పంచుకుని వాడుకుని వొదిలివేసిన సత్యం తప్పక ఒక అవాంచనీయ గర్భం. సత్యం ఒక వొంటరి గర్భం భాషలో, ప్రతీకలలో జాడలలో, ఎప్పటికీ తిరిగి పునరావృతం కాలేని శబ్దాలలో, నిశబ్దాలలో తిరుగాడే సత్యం ఎవరికీ చెందని ఒక తల్లి గర్భం, అని అంటూ  అతడు నేలపై రాలిపడి రోదిస్తాడు.
13
నా ఈ ముఖం మరో కాలంలోంచి ఇక్కడికి ప్రకాశిస్తున్న మరొకరి వదనం: అతడు అంటాడు

నేను మరెక్కడో ఉన్నాను, నీకు తెలుసా అది? ఎక్కడైతే ఏకాంతం అంతం అవుతుందో అక్కడ  అంగడి ప్రదేశం మొదలవుతుంది, నీకు తెలుసా అది? ఎవరూ జీవించరు ఒక గృహంలో, ఒక దేశంలో. ప్రతి ఒక్కరూ జీవిస్తారు తమలో ఉన్న ఒక రహస్యమైన ప్రదేశంలో ఒక వలయపు కాలంలో, నీకు తెలుసా అది?  తమలోనే దాగి ఉన్న ఉద్యానవనాలో, ఎడారులలో ఎప్పటికీ వెళ్ళలేని దారులలో ప్రయాణిస్తారు అందరూ అక్కడినుంచే వెడలిపోతారు అందరూ. తెలుసా నీకది? అతడు అంటాడు

నా అస్తిత్వపు దేవత, వెడలిపోవడంలోనే జీవితాన్ని కనుగొనడంలోనే తను జీవిస్తుంది, పదం పై పదాన్నీ జాడ పై జాడనీ ఎప్పటికీ విప్పి చెప్పలేని అనంతపు నిశబ్దాన్ని  శబ్దంపై ఓపికగా  పేరుస్తూ, నా అస్తిత్వపు దేవత  వెడలిపోవడంలోనే తిరిగి వస్తూ జీవిస్తుంది.
14
మాతృదేశం అనేది ఒక అభిసంధానం, అతడు అంటాడు, ఇతర దేశం సరైన ప్రదేశం, పదం తల్లితనం, తల్లీ ఎప్పుడూ ఇతరం, ఎప్పుడూ ఉండే ఒక కోల్పోయినతనం తనని తాను బయటా లోపలా రాసుకునే ఒక  పునరావృతం, పురాకృతం: అతడు అంటాడు

లేనిదాని ఆనవాళ్ళకై జీవిస్తూ వాళ్ళు, ఉన్నదానిని హత్య చేస్తారు వాళ్ళు గతించినదానికై తవ్వుతూ వాళ్ళు ఇతరుని కళ్ళనూ కడుపులనూ చేతులనూ కాళ్ళనూ తవ్వుతారు వాళ్ళు. గర్భాలను రక్తపు చెలమలుగా మారుస్తారు వాళ్ళు  వక్షోజాలని నరికి హారాలుగా వేసుకుని తిరుగుతారు వాళ్ళు  యోనులను చించివేసి, పిండాలను నరికివేసి సర్వాన్నీ మూడు తలల మర్మావయపు అయుధంగా మార్చి మూడు నెలల పిండాన్ని ఈ మాతృదేశానికి అర్పిస్తారు వాళ్ళు. దేశభక్తి అంటే ఏమిటో, మాతృభక్తి అంటే ఏమిటో శతాభ్దాల సమాధులపై లిఖిస్తారు వాళ్ళు. చూసావా నువ్వు, అతడు అంటాడు: నా సమాధుల, కన్నీళ్ళు అడుగంటిన, మొండి గర్భంతో తిరుగాడే ఈ దేశపు దేవతని?
15
వేయి తలల సర్పపు నీడ కింద, పేరులేని వాళ్ళూ నీడ లేని వాళ్ళూ  ఎక్కడికి వెళ్ళగలరు? 

వస్తారు వాళ్ళు వేయి హస్తాలతో, వేయి తలలతో వేయి ఆయుధాలతో  వస్తారు వాళ్ళు ఆకాశం నుండి ఆశ్వాలపై ఐరావతాలపై భూమిలోంచీ సముద్రాలలోంచీ నదులలోంచీ వస్తారు వాళ్ళు, నలువైపులనుండి వేయి ఖడ్ఘాలతో వేయి నాలుకలపై ప్రతిధ్వనించే వేయి శాపాలతో వస్తారు వాళ్ళు, శిధిలాల మధ్య వొంటరిగా కూర్చుని ఒంటరి మనిషికై ప్రార్ధిస్తున్న ఒక వొంటరి మనిషి వద్దకు, అంగుళం భూమైనా లేని అతడి వద్దకు  హత్య కావింపబడ్డ తన పిల్లలను తలచుకుని, మానభంఘం చేయబడ్డ తన స్త్రీలను గుర్తు తెచ్చుకుని మోకాళ్ళ మధ్య ముఖాన్ని దాచుకుని ఈ భూమి యొక్క మొదటి ఆఖరి శభ్దాన్నిఆలపించే అతడి వద్దకు వస్తారు వాళ్ళు 

చేతులోని పుర్రెల హారాలతో వేయి త్రిశూలాలతో అతడిని నరికివేసేందుకు, అతడి జీవితపు జనన మరణాల దేవతను పెరికివేసేందుకు వస్తారు వాళ్ళు. ఇంతకూ చూసావా నువ్వు 

మానభంగం చేయబడిముక్కలు కావింపబడిన నా దేవతను? 

(excerpt) 

1 comment: