23 January 2013

ఆదిమ ప్రశ్న

'నీతో నే లేనపుడు ఏం చేస్తావు నువ్వు', అని అడుగుతావు కానీ నువ్వు
నిజానికి ఎవరూ ఏమీ చేయరు

తొలిసారిగా, ఎండ ఒక పొద్దుతిరుగుడు పూవులా ఉందని గ్రహిస్తారు వాళ్ళు

గాలి నీళ్ళలా తోస్తేనూ, తోసుకుపోతుంటేనూ ప్రవహిస్తుంతుంటేనూ
తొలిసారిగా చేతులు ఊపుకుంటూ, నీళ్ళు
చిందించుకుంటూ నడుస్తారు వాళ్ళు

తళతళలాడే కాంతిలో ఎగిరే తూనీగలనీ, వేప చెట్ల బెరడు మెత్తదనాన్నీ
రాళ్ళల్లో ఊగే పూల వాసననీ తొలిసారిగా
సంభ్రమంతో ఆఘ్రాణిస్తారు వాళ్ళు. రాత్రి

చీకటి ఒక వానలా ఉంటుందనీ, ఒక పొగమంచులా తమని హత్తుకుంటుందనీ
ఊరి చివరి పాకలో వెలిగించిన చిరుదీపం
ఒక పొదుగులా, తమని ఆదరిస్తుందనీ

ఎవరివో రెండు చేతులు -తమ చుట్టూతా కప్పిన ఒక దుప్పటిలా - తొలిసారిగా
తమని కావలించుకుంటే జీవితం పట్ల కృతజ్ఞత కలిగి కనులు చెమర్చుతాయని

తెలుసుకుంటారు వాళ్ళు. ఆకలికి దొరికిన చద్దన్నం
తాగడానికి దొరికిన మట్టికుండలోని నీళ్ళూ
పడుకునేందుకు దొరికిన ఆరడుగుల స్థలం

ఇవి అన్నీ, ఇవన్నీ దివ్యమైనవనీ, ఈ లోకపు అధ్బుతాలనీ, విత్తు చిట్లి మొలకెత్తే
మహా నిశ్శబ్ధంలోని విశ్వ రహస్యమనీ
తెలుసుకుంటారు వాళ్ళు. చిరునవ్వూ

ఆక్రందనా, అలకా ఏడుపూ తడిచిన
కనురెప్పల్ని తుడిచే ఏ చేతివేళ్లైనా
పసిచేతులతో సమానమనీ, ఒక అంతిమ శబ్ధ రహిత భాష అనీ తెలుసుకుంటారు             

దారి తప్పి దిగులు వేసి ఒంటరిగా
ఆగిపోయి, భయంతో విరిగిపోయి
తాకితే ముడుచుకుపోయి, పలుకరిస్తే దూరంగా పారిపోయే శరనార్ధుల హృదయాల్లోని       

ఏకాకి గూళ్ళ అనాధ నిశ్శబ్ధపు ప్రతిధ్వనులని
వింటారు వాళ్ళు. అవి తమ కన్నా భిన్నమైన
వేమీ కావనీ, దగ్గరగా తీసుకుని ఊపిరి ఊదితే

వొళ్ళంతా నిలువెత్తు వేణువులై, వెదురువనాలై
నాట్యం చేసి శరీర ఖగోళ గీతాలని సాంద్రతతో ఆలపిస్తాయని గ్రహిస్తారు వాళ్ళు: సర్వ
లోకాలనీ సప్తరంగులతో తనలో ఇముడ్చుకుని
ఒక గడ్డి పరక అంచున ఊగిసలాడే ఓ చినుకులో      

తమ జననం, మరణం పుణ్యం పాపం వరం శాపం
అర్థం పరమార్ధం అలా ఆగి ఉన్నాయనీ, సర్వమూ
రాలి, అంతం అయ్యి తిరిగి మొదలయ్యే ఒక క్రీడ ఇది కదా అనీ కూడా అనుకుంటారు
వాళ్ళు. 'నీతో నే లేనపుడు, ఏం చేస్తావు నువ్వు?'

అని నువ్వు అడుగుతావు కానీ, నిజానికీ ఎవరూ
ఏమీ చేయరు. ఇన్నాళ్ళూ, అన్నీ నువ్వైనందుకు
అన్నీ అయిన నీలో సర్వం మరచినందుకు, మరచినవారికి తిరిగి స్మృతి కలిగించినందుకు
స్మృతిలో సర్వాన్నీ, సర్వంలో తిరిగి నిన్నూ, నీలో

తిరిగి తమనూ కనుగొన్నందుకు, నీ రాహిత్యానికి
కృతజ్ఞతలు చెప్పుకుంటారు. నీ 'రాహిత్యాన్ని' ఓ
ముగ్గుగా మార్చి, పుప్పొడితో ఇంద్రధనుస్సులతో

ఒక చైతన్యంతో నలుదిశలా వెదజల్లుతారు వాళ్ళు
ఇక్కడ నీచే లిఖించబడ్డ వాళ్ళు, నీ భాషైన వాళ్ళూ
ఇక ఆఖరకు, విచ్చుకున్న రోజా పూవులతో సమాధుల ముందు ప్రణమిల్లి ఇలా అడుగుతారు

నిన్నే, లేకపోవడం వాళ్ళ ఉంటూ, ఇరువైపులా
'లేనితనమై' ఉండే, ఉన్న వెళ్లిపొవడమైన నిన్ను
ఇలా: "ఛాతిపై ముద్రికయై జ్వలించే నువ్వు ,  

నువ్వు , మేం నీ వద్ద లేనప్పుడు, మరి మేం లేక, కానరాక, కనలేక  ఏం చేస్తావు నువ్వు?" 

No comments:

Post a Comment