30 January 2013

అన్నం

నేను నీకు అవసరం లేదు. నువ్వు నాకు అవసరం లేదు. అందుకని

రాత్రి అంచున పరావర్తనమయ్యే, పరివర్తన లేని ఒక కాంతి రేఖనై
ఊగిసలాడుతూ ఉంటాను (ఆ రాత్రి అంచునే). మరి నీ అంచులకు

ఒక వైపున పూల దహనం, మరో వైపు చీకటి శూన్యం.
ఎలా బ్రతికించుకోగలం ఇటువంటి సంబంధాన్ని-?
కలసి ఉండలేనీ, విడిపోయి వెళ్లిపోలేనీ కాలాన్ని-?

నుదిటికి పైగా చేతిని వాల్చుకుని, కళ్ళను ఆ నీ మణికట్టు నీడల్లో కప్పుకున్న
నీ నిశ్శబ్ధం - నీకు కొద్ది దూరంలో కూర్చుని
నా చర్మాన్ని నీ నిశ్శబ్ధంతో కుట్టుకుంటున్న

నా మౌనం - ఎంత దగ్గరి దూరం. ఎంత అంతం లేని వలయాల భ్రమణం: చూడు
వొండిన అన్నం, చల్లబడుతోంది
గదీ మదీ గాలి విహీనమౌతోంది.

మనకి మన అవసరం లేకపోయినా ఒక పాపకి మనం అవసరం.
ఆ పాపకై, ఈ పరమ పంకిల పవిత్ర రాత్రికై
మనకై అన్నం అవసరం.దా.తిందాం మనం

ఎందుకంటే మరి మళ్ళా
రేపు రాత్రికి, ఈ గోడలపై
నీడలు మళ్ళా నిన్నూ నన్నూ కలపలేని నీ నా నీడల్ని కంటాయి!   

No comments:

Post a Comment