16 January 2013

నీ చేతులు

సూర్యకిరణాలు ప్రతిఫలించే తామర తూడు వలే మెరుస్తోంది నీ చేయి -
అందుకే,

నీ వేళ్ళ అంచులలో పుష్పించే
మొగ్గలను చూసాను ఈ వేళ-

మొగ్గలు పూవులై, లతలై ఇల్లంతా అల్లుకుపోయి, చల్లటి నీడగా మారి
పచ్చి వాన వాసనతో మమ్మల్ని చుట్టుకుంటే
నీ చుట్టూ పిట్టల్లా మూగి కూర్చున్నాం మేము

నాట్యం చేసే నీ చేతి వేళ్ళనీ, అవి సృష్టించే చిరు
మెరుపుల సంగీతం వింటూ: అవే
మరి నీ అరచేతులే- నిదుర లేచి

నీళ్ళని కాగబెట్టే చేతులు. స్నానం చేయించే చేతులు. అన్నం వండే చేతులు
నోటికి, అన్నం ముద్దలు అందించే చేతులు
మండే నుదిటి మీద తడిగుడ్డ వేసే చేతులు

నిన్ను ఎత్తుకునే చేతులు, నన్ను హత్తుకునే చేతులు. సర్వం రాలి నువ్వు
రోదిస్తే, నీ కన్నీళ్లు తుడిచే చేతులు. నిన్ను
కాపాడే చేతులు. నిన్ను ప్రాధేయపడే  చేతులు. నిన్ను కరుణించే చేతులు

చల్లటి చేతులు, వెచ్చటి చేతులు. ఏడుస్తూ వొణికే చేతులు. సరస్సులు
గుమికూడే చేతులు. వొంటరిగా ఉంటే
ఎడారులయ్యే చేతులు. జీవిత భారాన్ని

అరచేతిలో వదనపు బరువయ్యి ఆపే చేతులు. చీకటిని కాటుకగా దిద్దుకుని
నీకు వెలుగునిచ్చే చేతులు. నీ మనో
ఫలకాన్ని తుడిచి నిన్ను నిర్మలంగా

మార్చే చేతులు. గాజులు పచ్చటి పోలాలై వీచే చేతులు. నదులై పారే చేతులు
గుప్పెడంత దీపాన్ని, నీ హృదయాన్ని
ఆరిపోకుండా కాపాడే చేతులు. అవే -

అన్ని వేళలా అన్నీ అయ్యి నిన్ను చూసుకునే చేతులు. నిన్ను చేసుకున్న చేతులు
ఇంద్ర ధనుస్సులు అయిన, చేతులు
వెన్నెల అయిన చేతులు.నిన్ను తాకి
అమావాస్యలుగా కూడా మారిన

చేతులు. నవ్వే  చేతులు, నవ్వించే చేతులు. నీతో పాటు నీతో నెమ్మదిగా మరణించే
చేతులు. అవే, అవే

ఉదయంపూట సూర్యకాంతి ప్రతిఫలించే
మగ్గిన బంగారంలాంటి తామరతూడులు
అయిన చేతులు. నువ్వు నేనూ జన్మించే
                
మట్టి ఈ చేతులు. భూమి ఈ చేతులు. విశ్వం ఈ చేతులు. పరమ దైవం ఈ చేతులు.
అందుకే,

మొక్కలమై, వాటి వేర్లమై వేలాడుతున్నాం  నీ చేతికి, తిరుగుతున్నాం నీ చుట్టే
రాసుకుని రాసుకుని  పిల్లి పిల్లలమై.
చెబుతున్నాం అందుకే విను నువ్వు

నిన్ను తాకడం, కృతజ్ఞతగా నీ చేతివేళ్ళని పెనవేసుకోవడం, రెండు చేతులని
సాధ్యమైనంతగా చాపి నిన్ను ఎరుకతో
కావలించుకోడం ఎంతో బావుంది. మా

జీవితాలని నీ అరచేతుల్లో పెట్టి నిశ్చింతగా ఉంటాం ఇక అని చెప్పడానికి మాకు
సిగ్గు ఎందుకు, అహం ఎందుకు?

No comments:

Post a Comment