05 January 2013

02-01-2013

ఇంటికి వస్తూ ఈ వేళ, కైరాన్*ను  తెచ్చుకున్నాను-

లేత సూర్యరశ్మిని వడకట్టి - బహుశా తనేనేమో -
ఒక దివ్యమైన స్త్రీ శరీర సువాసనతో, స్వర్గలోకంలో
ఒక నాజూకైన గాజుపాత్రలోకి
ఒరిమిగా ఇష్టంగా వంపినట్టు

ఇక ఈ వేళ సాయంత్రం నేనూ, నా కైరాన్. గాజుపాత్రలో

అని అంటారు కానీ విజ్ఞులు, నేను
మాత్రం దోసిళ్ళలో వంపుకుని
ప్రభువుని ఓసారి తలుచుకుని

కనులు మూసుకుని, తనని స్మరించుకుని
తాగుతాను ఈ సిప్రస్ నదిని. అందుకే
అమృతాన్ని తాకిన, ఏ నాలికానూ
ఇక ఓ అబద్ధాన్ని పలుకరాదు కదా

అందుకే చెబుతున్నాడు విను ఇక జొర్బా నీకు
కనులపై తన ప్రియురాలి అరచేతులు వాలినట్టు    
మెత్తగా నవ్వుతో, మత్తుగా తూగుతో-

'దారి తప్పిన లోకంలో కాలం తప్పాను నేను
పరలోకాన్ని ఆశించే పాపిని కాదు నేను
చేర్చండి ఎవరన్నా నన్ను ఫరీదా ఇంటికి'

అంటో: Oh. Yes. రాదు ఏదీ మరి తేలికగా
నేర్చుకోవాలి ఎవరైనా ఓపికగా, తనకు
హృదయాన్నీ, ప్రాణాన్నీ పణంగా పెట్టి

ప్రేమించడాన్నైనా, మధువు గ్రోలడాన్నైనా.
--------------------------------------------------------
Kairan: Name of a Brandy.

1 comment: