16 January 2013

ధ్యానం

ఉదయాన్నే ఇంత కాంతిని అరచేతుల్లోకి తీసుకుని
     కళ్ళని కడుక్కుంటావు నువ్వు: సరిగా అప్పుడు మరి
     అరుస్తాయి గూళ్ళలోని పక్షిపిల్లలు. కదులుతాయి వంటగదిలో

మరి గాజులు, పొయ్యి వద్ద నిప్పులతో. మెరుస్తాయి మంచంలో
     బద్ధకంగా పిల్లల ముఖాలు. ఇక ఒదుగుతోంది ఎక్కడిదో గాలి
     వలయమై ఆకుల హొరై ఆపై గుసగుసలై ఈ గదులలో-

ఎండ వాలిన నేలపై ఆగి, దాని రెక్కల కింద ఒక అద్దాన్ని ఉంచుకుని
     కూర్చుంటావు నువ్వు ఇక ఒక షేవింగ్ బ్రష్తో
     సముద్రాల నురుగనంతా రాసుకుని-

ఇక అప్పుడు, వాన వాసన వేసే చేతులతో, తెల్లటి కళ్ళతో
     చెంపలపై నుంచి కత్తిని దూస్తుంది తను, వేసవి కాలంలో
     ఎండలో వచ్చిన మనిషికి గ్లాసెడు చల్లటి మంచి నీళ్ళిచ్చి
     పక్కన కూర్చుని విసెన కర్రతో గాలి విసిరినట్టు- ఇక

ఏమీ లేదు ఈ పూటకీ, ఈ అక్షరాలకీ: నిమగ్నమై ఇష్టంతో
     గడ్డం చేసుకోవడమే ధ్యానం మోక్షం-పుణ్యం పరమార్ధం.

మరి ఇక ఆ తరువాత
 ఈ గొంతు తెగితేనేమీ, ఇక ఈ ప్రాణం ఉంటేనేమీ పోతేనేమీ?    

2 comments:

  1. baagundi
    ఏమీ లేదు ఈ పూటకీ, ఈ అక్షరాలకీ: నిమగ్నమై ఇష్టంతో
    గడ్డం చేసుకోవడమే ధ్యానం మోక్షం-పుణ్యం పరమార్ధం.

    మరి ఇక ఆ తరువాత
    ఈ గొంతు తెగితేనేమీ, ఇక ఈ ప్రాణం ఉంటేనేమీ పోతేనేమీ?

    ReplyDelete