31 January 2013

ప్రాధమిక ప్రశ్న

ఒకవేళ
ఈ కాగితం, ఒక పూవు కాగలిగితే/ఈ పూవు ఒక పావురం కాగలిగితే\ ఈ పావురం తిరిగి/ఒక కాగితమై, నే రాసిన ఉత్తరమై/నా శ్వాసను పొరలు పొరలుగా లేఖలో పొదివి పుచ్చుకున్న/ నీ వైపు వీచే సాయంత్రపు గాలైతే/గాలిలో ఊపిరి అందక/నీ వైపు/తపనగా సాగే/తన్నుకులాడే నా పదాలు అయితే / ఇకీవేళ/ నీకు ఇది చెబుతాను: /చూడూ/నీవు లేకుండా/నేను బ్రతకగలను/ (ఖచ్చితంగా)-

ఇంతకూ ఎవరన్నారు/చీకటిలో/ నా నీడ కనపడక/పోతే/నేను లేనని? 

ఇక/తిప్పివేయి త్వరగా/ ఈ నల్లటి కాగితాన్ని. (ఎందుకంటే..............)

30 January 2013

అన్నం

నేను నీకు అవసరం లేదు. నువ్వు నాకు అవసరం లేదు. అందుకని

రాత్రి అంచున పరావర్తనమయ్యే, పరివర్తన లేని ఒక కాంతి రేఖనై
ఊగిసలాడుతూ ఉంటాను (ఆ రాత్రి అంచునే). మరి నీ అంచులకు

ఒక వైపున పూల దహనం, మరో వైపు చీకటి శూన్యం.
ఎలా బ్రతికించుకోగలం ఇటువంటి సంబంధాన్ని-?
కలసి ఉండలేనీ, విడిపోయి వెళ్లిపోలేనీ కాలాన్ని-?

నుదిటికి పైగా చేతిని వాల్చుకుని, కళ్ళను ఆ నీ మణికట్టు నీడల్లో కప్పుకున్న
నీ నిశ్శబ్ధం - నీకు కొద్ది దూరంలో కూర్చుని
నా చర్మాన్ని నీ నిశ్శబ్ధంతో కుట్టుకుంటున్న

నా మౌనం - ఎంత దగ్గరి దూరం. ఎంత అంతం లేని వలయాల భ్రమణం: చూడు
వొండిన అన్నం, చల్లబడుతోంది
గదీ మదీ గాలి విహీనమౌతోంది.

మనకి మన అవసరం లేకపోయినా ఒక పాపకి మనం అవసరం.
ఆ పాపకై, ఈ పరమ పంకిల పవిత్ర రాత్రికై
మనకై అన్నం అవసరం.దా.తిందాం మనం

ఎందుకంటే మరి మళ్ళా
రేపు రాత్రికి, ఈ గోడలపై
నీడలు మళ్ళా నిన్నూ నన్నూ కలపలేని నీ నా నీడల్ని కంటాయి!   

29 January 2013

కొన్నిసార్లు

కొన్నిసార్లు నీ ముఖం ఏమిటంటే
వేళ్ళ చివర్లన వేలాడే ఒక చిన్న అమృత పాత్ర. మరి
కొన్నిసార్లు నీ ముఖం ఏమిటంటే 
అరచేతుల్లో పొదివిపుచ్చుకున్న, ఎగరలేని ఒక బుజ్జి పావురం పిల్ల. ఇంకా 

కొన్నిసార్లు నీ ముఖం ఏమిటంటే 
ముంజేతిపై అలసటగా వాలిన, మసక చీకట్ల పొగ కమ్మిన నుదురు. మరి 

ఇక వెలగలేక ఆరిపోయిన ఒక దీపమూ 
నిస్సత్తువుగా బోర్లించిన రెండు మృణ్మయ 
పాత్రలూ, ఎక్కడో తచ్చట్లాడే కనులూనూ.
స్నానాల గదిలో అద్దంపై అంటించిన ఒక ఎర్రటి చమట బిందువు కూడానూ
నెమ్మదిగా తీసి దిండు కింద ఉంచిన, నేను 

ఎప్పుడూ కొనివ్వని, నీ తల్లి నీకు కొనిచ్చిన 
నలిగిన ఆ ఆకుపచ్చ మట్టి గాజులూనూ.సరే

ప్రేమంటే ఏమిటో నాకు తెలియదు. నేను నీకు 
చెప్పానా ఎన్నడైనా నిన్ను నేను  
తెలియకుండా  ప్రేమిస్తున్నానని?  

పచ్చి ముళ్ళ వాసన

"తప్పుగా అనుకోకు. కానీ, ఒక మనోహరమైన గాజు పాత్ర

తేనె పూవై, నీ పెదాలపై
సాయంకాలపు ధూళితో
                                 వాన వెలిసిన వాసనతో మెత్తగా వీస్తే
నువ్వైనా నేనైనా
ఏం చేయగలం?
ఒక స్త్రీ నిను తపనగా తన వక్షోజాలకు అదుముకుంటే

నువ్వైనా నేనైనా ఇక
ఏం మాట్లాడగలం? చూడు ఆ లేత ఎరుపు గులాబీ రెక్కలున్న
తెల్లని లిల్లీ వనాన్ని

తను మాట్లాడే విధానాన్ని
తను నడిచే పద్ధతినీ. ఒక
సన్నటి నవ్వుతో నిన్ను
                                 నిలువునా కోసే స్త్రీని నువ్వు చూసాక

ఇక నువ్వైనా నేనైనా
తాగకుండా ఎలా
ఉండగలం. త్రాగు
                        ఈ మట్టి కుండ నిండి పోర్లిపోయేదాకా, మత్తుతో

నీ శరీరం ఒక నావై ఆ రహస్య
లోకాలలోకి సాగిపోయేదాకా -"

అని అన్నాడు జోర్భా నిన్న రాత్రి
కృతజ్ఞతతో ఏడ్చి ఏడ్చి
నను గట్టిగా పట్టుకుని
                                వెక్కిళ్ళు పెడుతో: అది సరే కానీ

ఆ పచ్చి ముళ్ళ వాసన
ఎంత బావుంటుంది నీ
నెత్తురుని తొలిసారిగా తాకుతూ, నీ హృదయంలోకి సలుపుతూ దిగినాంక!

28 January 2013

Rowson's Reserve గ్లాసులో AC Premium మందు

నడిచొచ్చీ నడిచొచ్చీ, ఈ చెట్టుకు ఆనుకుని
     ఎండకి తాళలేక, నీ వైపు తల ఎత్తి కళ్ళు చికిలించి చూస్తాను కదా: మరి

ఇన్ని ఆకుల మధ్య తళతళలాడుతూ, అన్ని
     చేతివేళ్ళతో నా ముఖంపై వేడిగా రాపాడేందుకు నువ్వు.
     కొంత పచ్చదనం కొంత కరకుదనం, మరి కొంత గాలీ కొంత నీడా
     మరి కొంత బెరడుతనంతో, గూళ్ళతో వొంగి

మట్టితో నింగిలోకి ఎగిరే నువ్వు: వానల్లో వెన్నెల్లో
నెత్తురు కురిసిన రాత్రుళ్ళలో, చిగురాకులు మొలిచే వేళల్లో
మొగ్గలని నులిమే కాలాలలో

కళ్ళు కురిసే దినాలలో, పెదాలు విరిసే క్షణాలలో
కడుపు చించుకుని రహదారులపై పడి ఒంటరిగా
గుండెలు చరుచుకుంటూ 'మ్మా, మ్మా' అంటో ఈ

లోకంలో ఒక మిత్రుడి కోసమో, ఒక శత్రువు కోసమో
ఒక తల్లి కోసమో ఒక వేశ్య కోసమో
ఒక తండ్రి కోసమో ఒక ప్రియురాలి

కోసమో ఎలుగెత్తి ఏడ్చి ఏడ్చి, ఆఖరికి తుపుక్కున ఈ ఎండమావి లోకంపై
ఉమ్మినప్పుడో, నడిచొచ్చీ నడిచొచ్చీ-

ఇక నీ వీపుకి నా వీపుని ఆనించి కూర్చుంటాను కదా
ఇక అప్పుడు, నువ్వు యధాలాపంగా తల ఎత్తి
నా వైపు చూసి "How's the day?" అని అడిగితే
ఇల్లా అంటాను:

"The day was like AC premium whiskey in a Rowson's Reserve glass.
What would you like to have?"

దేవతలు(నుండి)

1
ఎలాగో చెప్పు నాకు, ఇప్పుడే చెప్పు నాకు: మరొక సమయానికి చెందిన ఇప్పటి ప్రదేశంలో నిన్ను పునర్నిర్మించడం ఎలాగో ఇప్పుడే చెప్పు నాకు 
వేయి ముఖాల నువ్వు, వేయి ప్రతీకల నువ్వు. నువ్వుకి ముందూ, నువ్వుకి తరువాతా వెంటాడే జాడలతో పునరాగమనంతో వెడలిపోయే నువ్వు

ఎలాగో చెప్పు నాకు, ఇప్పుడే చెప్పు నాకు మరొక సమయంలోకి కోల్పోయిన ఈ వర్తమానంలో  నిన్ను పునరుజ్జీవనం కావించడం ఎలాగో ఇప్పుడే చెప్పు నాకు

2
హింసా దేవతా, కలల దేవతా
నగ్నంగా, వడలిపోయి ఉన్న నిన్ను అతడు కాగితాల దొంతరల మధ్యా విస్మృతి చీకటి ఆలయాల మధ్యా కనుగొంటాడు. ఇక  అతడు జీవించి ఉండటానికి నీ రూపమే కారణం.
౩.
వొంటరి వొంటరి వొంటరి

సముద్రం లేని అలలా, చెట్టు లేని పిట్టలా 
అతడు అంటాడు, వొంటరి వొంటరి వొంటరి

అలలా పిట్టలా మారిన ఈ శరీరం
ఎవరికీ అందని ఒక ఒక వొంటరి

వొంటరితనం.

ఎక్కడ అతడి స్వీయ హింసా దేవత ఎక్కడ అతడి విషాద స్వర్గం?
4
అయితే అయితే అయితే, తరచూ అతడి ముందు విచ్చుకున్న ఒక పౌరాణిక గాధలో  ధ్యానంలో మునిగిన మనుషలని సమ్మోహన పరచి మైకంలో ముంచివేసిన దేవత వలె తరచూ అతడి ముందు ఒక పదం దిగంబరం అవుతుంది:  ఎలా అంటే

కాగితం పై అచ్చు కాబడిన ఆ దేవతా  రూపాన్ని రమించాలనే అతడి కోరికవలె:  అతడు అంటాడు. ఒక పదం, నా కోరికకు ప్రత్యామ్నాయం కాజాలదు అతడు అనుకుంటాడు, ఒక పదం కాలాన్నీ అంతరిక్షాన్నీ పదునుగా కోసివేసే ఒక నయనానికి ప్రత్యామ్నాయం కాజాలదు. ఒక పదం, ఇరువురుని ఒక దగ్గరకు చేర్చే నా కోరికకు ప్రత్యామ్నాయం కాజాలదు:
6.

వాస్తవం వాస్తవంగా కాకుండాపోయినదానిని పురాణాలంటాము

నాతో ఉన్న వాళ్ళు (భౌతికంగా: అతడు అంటాడు) , నాతో ఉన్న వాళ్ళు (ప్రతీకాత్మకంగా: అతడు అంటాడు) వాళ్ళకీ, నా అరచేతుల ఖాళీ స్థలంలో, నా భీతి చెందిన కనులలో తార్లాటలాడే గాలిలో సంధ్యా కాంతిలో, వలయాలుగా రాలిపడే పండిన ఆకుల చిహ్నాలలో ఇమిడి ఉన్న నా  వాస్తవపు దేవతకి ఏమవుతుంది? 

ఆమె కూడా ఒక చిహ్నం, ఆమె ఒక దేవతా చిహ్నం. చిహ్నాలకి చిహ్నం. పురాణ గాధలకి తను ప్రారంభం: అని అతడు విలపిస్తాడు.

7
ఒక దేహంతో గడిపే సౌఖ్యాన్ని నీకు కవిత్వం అందించదు: అతడు అంటాడు


ఒక శరీరంతో, రక్తంతో ఆమె ఎముకలతో గడిపే సౌఖ్యాన్ని నీకు కవిత్వం అందించదు. అదొక మేలిముసుగు, తొలగించకు. అతడు అంటాడు మేలిముసుగు వెనుకగా ఉంటాయి జ్వలిస్తూ, నా రతి మృత్యు జీవితపు దేవతా మర్మావయాలు.  ఆమె రుతుస్రావవు రక్తాన్ని త్రాగు, ఇక నువ్వు రుచి చూస్తావు శాశ్వత జీవితపు స్వర్గాన్నీ, నరకాన్నీ:
8
నీ దేహాన్ని మరచిపోయేటట్టు చేసే ఒక గీతం ఈ కవిత్వం, అతడు అంటాడు, ఈ పదాలతో నువ్వు చేయగలిగేదల్లా, మోరెత్తి రోదించడం సర్వాన్నీ కీర్తించడం పాప విమోచనం కలగాలనీ ఎలుగెత్తి అరవడం: ఈ దుస్తులను పెరికివేయి, ఈ పదాలను వొదిలివేయి ఇక అంతకు మునుపూ, ఇక ఆ తరువాతా ఉంటాయా అక్షరాలు నా దు:క్కపు దేవతను ఉచ్చరించేందుకు? ఇక అంతకు  నుపూ, ఇక ఆ తరువాతా ఉంటాయా పదాలు నా నీలి కళ్ళ ఉన్మాధపు దేవతను నాలికలపై చేక్కేందుకూ?

ఆహ్, అతడు అంటాడు, ఇదంతా ఇది అంతా నా కవిత్వపు దేవత విలవిలలాడే ఆకులు లేని వృక్ష విలాపం.
9
గతించిన కాలంలో రాసిన పదాలపై, గతించిన పదాలపై జీవించే వాళ్ళందరూ మృతులు మరణించి, ఇక వాళ్ళు ఒక పదాన్ని ఉచ్చరించలేరు మరణించి, ఇక వాళ్ళు ఒక పదానికి రంగులు వేయలేరు, మరణించి మరణించి, మరణించీ ఇక వాళ్ళు ఒక స్వరంతో, తమ స్వరంతో గానం చేయలేరు  మరణించి, ఇక వాళ్ళు  గతించిన కాలంలో రాసిన పదాలలోంచి, గతించిన  పదాలలోంచి ఒక పాచిపట్టిన నాలికవలె దూసుకు వచ్చే  ఒక నామవాచకం పై బ్రతుకుతారు: అతడు అంటాడు

పదాలు ఈ క్షణపు ముద్రను తమలో నింపుకుంటాయి, నిన్నూ నన్నూ కాదు. మరణించారు అందరు కవులు గతకాలంలో రాసిన పదాలపై జీవించే వాళ్ళూ గతించిన పదాలపై బ్రతికే వాళ్ళూ. మరణించారు అందరు కవులూ నా కవిత్వ దేవత కనుల నృత్యాన్ని చూడలేని వాళ్ళు. మరణించారు వాళ్ళు కూడా నీతి భావాజాలపు భూతాల కోరల్లో చిక్కుకున్న వాళ్ళూ. మరణించారు కవులూ మరణించారు మనుషులూ మరణించాయి కలలూ నీతీ భావజాలపు లోగిళ్ళలో ఆగిపోయినవారూ: అతడు అంటాడు

తెలీదా మీకు, నా అస్తిత్వపు దేవతకి కావలసింది: విశృంఖలమైన జీవితం:
10
సత్యం అనేది ఒక కాముక వినోదం, సత్యం అనేది ఒక విశ్వాస ద్రోహం 

దూరంగా ఉండి అది మైమరుస్తుంది. దగ్గర ఉండి అది నీ శిరస్సుని ఖండిస్తుంది. ఉంటుంది దానిలోనే, నువ్వు ఆత్మహత్య చేసుకునే ఒక సమ్మోహన క్షణం, నిజం సత్యం ఒక లైంగిక దేవత. అనేక పొరలతో నిరంతరం తప్పించుకుపోయే తనని తాను ఎప్పటికప్పుడు తుడిపి వేసుకునే నిన్ను నిరంతరం  మరో తీరానికి ఆహ్వానించే ఈ సత్యం - అతడు అంటాడు- రాతి కళ్ళ రాతి వక్షోజాల పేరులేని వాంఛా దేవత.
11
ఎవరికీ కావాలి అది, ఎవరు జీవిస్తారు దానితోటి?
వెడలిపోకుండా ఎవరు వెడలిపోతారు దాని నుండి, అతడు అడుగుతాడు: నా రాతి కళ్ళ దేవతా, నీ వేయి ముఖాలలో, వేయి విధాలుగా వేయి రాత్రుల్లలో పునర్ జన్మించేది ఎవరు?

ఒకప్పుడు మట్టిలోకి కరిగిపోయినదీ, ఒకప్పుడు దిగంబరుడై రాళ్ళతో చంపబడినదీ ఒకప్పుడు వాళ్ళ మధ్య జీవించినదీ, ఇకప్పుడు వాళ్ళ మధ్యే జీవిస్తున్నదీ ఒక్కడే. ఒక్కతే: అతడు అంటాడు: నా గాయాల దేవతను నువ్వు చూసావా? నా గాయాల రక్తాల కన్నీళ్ళ దేవతను  నువ్వు గుర్తుపట్టావా?
12
సత్యం ఆమె గర్భంలో ఎదిగే పిండం, సత్యం ఒక గర్భం: తండ్రి ఎవరూ లేని ఒక విశ్వపు అందం, ముఖ్యంగా  నా జీవితపు దేవతకి- అతడు అంటాడు -  ఎవరికీ కావాలి తను, ఎవరు జీవిస్తారు తనతోటి వెడలిపోకుండా ఎవరు వెడలిపోతారు తన నుండి, అతడు అడుగుతాడు

వేయి శరీరాలలో వేయి విధాలుగా వేయి శతాబ్దాలుగా పునర్ జన్మించిన గర్భవతి అయిన నా దేవతని? సత్యం తప్పక ఒక గర్భం అందరూ పంచుకుని వాడుకుని వొదిలివేసిన సత్యం తప్పక ఒక అవాంచనీయ గర్భం. సత్యం ఒక వొంటరి గర్భం భాషలో, ప్రతీకలలో జాడలలో, ఎప్పటికీ తిరిగి పునరావృతం కాలేని శబ్దాలలో, నిశబ్దాలలో తిరుగాడే సత్యం ఎవరికీ చెందని ఒక తల్లి గర్భం, అని అంటూ  అతడు నేలపై రాలిపడి రోదిస్తాడు.
13
నా ఈ ముఖం మరో కాలంలోంచి ఇక్కడికి ప్రకాశిస్తున్న మరొకరి వదనం: అతడు అంటాడు

నేను మరెక్కడో ఉన్నాను, నీకు తెలుసా అది? ఎక్కడైతే ఏకాంతం అంతం అవుతుందో అక్కడ  అంగడి ప్రదేశం మొదలవుతుంది, నీకు తెలుసా అది? ఎవరూ జీవించరు ఒక గృహంలో, ఒక దేశంలో. ప్రతి ఒక్కరూ జీవిస్తారు తమలో ఉన్న ఒక రహస్యమైన ప్రదేశంలో ఒక వలయపు కాలంలో, నీకు తెలుసా అది?  తమలోనే దాగి ఉన్న ఉద్యానవనాలో, ఎడారులలో ఎప్పటికీ వెళ్ళలేని దారులలో ప్రయాణిస్తారు అందరూ అక్కడినుంచే వెడలిపోతారు అందరూ. తెలుసా నీకది? అతడు అంటాడు

నా అస్తిత్వపు దేవత, వెడలిపోవడంలోనే జీవితాన్ని కనుగొనడంలోనే తను జీవిస్తుంది, పదం పై పదాన్నీ జాడ పై జాడనీ ఎప్పటికీ విప్పి చెప్పలేని అనంతపు నిశబ్దాన్ని  శబ్దంపై ఓపికగా  పేరుస్తూ, నా అస్తిత్వపు దేవత  వెడలిపోవడంలోనే తిరిగి వస్తూ జీవిస్తుంది.
14
మాతృదేశం అనేది ఒక అభిసంధానం, అతడు అంటాడు, ఇతర దేశం సరైన ప్రదేశం, పదం తల్లితనం, తల్లీ ఎప్పుడూ ఇతరం, ఎప్పుడూ ఉండే ఒక కోల్పోయినతనం తనని తాను బయటా లోపలా రాసుకునే ఒక  పునరావృతం, పురాకృతం: అతడు అంటాడు

లేనిదాని ఆనవాళ్ళకై జీవిస్తూ వాళ్ళు, ఉన్నదానిని హత్య చేస్తారు వాళ్ళు గతించినదానికై తవ్వుతూ వాళ్ళు ఇతరుని కళ్ళనూ కడుపులనూ చేతులనూ కాళ్ళనూ తవ్వుతారు వాళ్ళు. గర్భాలను రక్తపు చెలమలుగా మారుస్తారు వాళ్ళు  వక్షోజాలని నరికి హారాలుగా వేసుకుని తిరుగుతారు వాళ్ళు  యోనులను చించివేసి, పిండాలను నరికివేసి సర్వాన్నీ మూడు తలల మర్మావయపు అయుధంగా మార్చి మూడు నెలల పిండాన్ని ఈ మాతృదేశానికి అర్పిస్తారు వాళ్ళు. దేశభక్తి అంటే ఏమిటో, మాతృభక్తి అంటే ఏమిటో శతాభ్దాల సమాధులపై లిఖిస్తారు వాళ్ళు. చూసావా నువ్వు, అతడు అంటాడు: నా సమాధుల, కన్నీళ్ళు అడుగంటిన, మొండి గర్భంతో తిరుగాడే ఈ దేశపు దేవతని?
15
వేయి తలల సర్పపు నీడ కింద, పేరులేని వాళ్ళూ నీడ లేని వాళ్ళూ  ఎక్కడికి వెళ్ళగలరు? 

వస్తారు వాళ్ళు వేయి హస్తాలతో, వేయి తలలతో వేయి ఆయుధాలతో  వస్తారు వాళ్ళు ఆకాశం నుండి ఆశ్వాలపై ఐరావతాలపై భూమిలోంచీ సముద్రాలలోంచీ నదులలోంచీ వస్తారు వాళ్ళు, నలువైపులనుండి వేయి ఖడ్ఘాలతో వేయి నాలుకలపై ప్రతిధ్వనించే వేయి శాపాలతో వస్తారు వాళ్ళు, శిధిలాల మధ్య వొంటరిగా కూర్చుని ఒంటరి మనిషికై ప్రార్ధిస్తున్న ఒక వొంటరి మనిషి వద్దకు, అంగుళం భూమైనా లేని అతడి వద్దకు  హత్య కావింపబడ్డ తన పిల్లలను తలచుకుని, మానభంఘం చేయబడ్డ తన స్త్రీలను గుర్తు తెచ్చుకుని మోకాళ్ళ మధ్య ముఖాన్ని దాచుకుని ఈ భూమి యొక్క మొదటి ఆఖరి శభ్దాన్నిఆలపించే అతడి వద్దకు వస్తారు వాళ్ళు 

చేతులోని పుర్రెల హారాలతో వేయి త్రిశూలాలతో అతడిని నరికివేసేందుకు, అతడి జీవితపు జనన మరణాల దేవతను పెరికివేసేందుకు వస్తారు వాళ్ళు. ఇంతకూ చూసావా నువ్వు 

మానభంగం చేయబడిముక్కలు కావింపబడిన నా దేవతను? 

(excerpt) 

మన కృతజ్ఞత

"నీ చీకటిని ఏ దీపమూ వెలిగించలేదు

నీ చేతులే, తలను పాతుకున్న నీ     చేతులే
నువ్వు తల ఎత్తలేని కర్మాగారాలు.

శరీరమంతైన కళ్ళల్లో, ఆకాశాన్ని      తాకేంత
చీకటి గోడలూ, పొగలూ ఆకులు
ఒరుసుకుని నీడల్లా కదిలే నీలి         శబ్ధాలు-

మెడపై కాడిని దించి కొద్దిగా ఇటు      చూడు
నీ ఎదురుగా నేను, కొంత మసక
వెన్నెల వలె, మరి కొంత

ఉదయం వండి, నీకై దాచిన అన్నం
వలే, నెత్తురు చిప్పిల్లిన నీ పెదాలకి
అందించిన మంచి నీళ్ళ వలే - ఒక    పాక వలే-

దా. నన్ను కావలించుకో. నిర్భీతిగా
తేలికయ్యేదాకా వెక్కి వెక్కి ఏడ్చుకో
నీ తల్లిని కూడా కదా నేను-" అని అంది తను తనువుతో:

ఉగ్గబట్టుకున్న అతను ఇక జలజలా
రాలిపడి, తన కన్నీటితో ఆమె దేహ
దీపాన్ని వెలిగించాడు, అవిసె చెట్లు

హోరున వీచే గాలుల్లో ఆ రాత్రంతా
వెలిగిన నిదుర గుడిసెలో: ఇక అది
'ఏమిటి' అని అడిగేందుకు నేనెవరు మీరు ఎవరు?  

25 January 2013

digital సమాధి

ఒక ఎండ తటాకం. నువ్వు నీ ముఖం
చూసుకోలేవు ఆ నీళ్ళల్లో - ఆ కళ్ళల్లో

మంచుపొగల వంటి ఎండ తెరలలో, అస్పష్టంగా
ఈ స్మృతి నావ: ఎవరో అరచేతిలో వేళ్ళతో రాస్తూ
నీ కాలాన్ని చదువుతున్నట్టు.

కొన్నిసార్లు తీరం లేదని ఒప్పుకుని
తెరిపి పడటమే మంచిది. ఇక, ఈ

పిట్టకి క్షణకాలం ఆగి ఊపిరి తీసుకునే కొమ్మే ఏదీ లేదు
రెక్కలు విరిగి తెగి తటాకంలో రాలి, నీట మునిగేదాకా-

శ్వాస ఒక విలాస వస్తువైన లోకం
నీకు నిన్నే ఒక వలనీ బలి శాలనీ
నరుక్కునే ఖడ్గాన్నీ చేసి తిరిగి నీకే

అతి జాగ్రత్తగా, అదమరపు లేకుండా అందించి వినోదం
చూస్తున్న జనం: మనకి ఇక దిన దిన
ధారావాహిక కార్యక్రమాలు అనవసరం.

ఇక మనం ఎలా చనిపోతామో మనకి
ఎవరైనా ప్రత్యేకంగా చెప్పాలా, ఫరీదా?    

24 January 2013

నేర్చుకున్నావా నువ్వు

తెలియాలి నీకు

నల్ల గులాబీ మొగ్గలలో 
వికసించిన ఒక
తెల్ల గులాబీని

పొందికగా అరచేతులలోకి
హత్తుకోవడం.

అప్పుడు నేర్చుకుంటావు
నువ్వు

తన ముఖాన్ని
అందుకోవడం
ఎలాగో.

నేర్చుకున్నావా నువ్వు
పూవులు నలగకుండా

వాటి పరిమళంలో
తడచిపోవడం ఎలాగో?  

23 January 2013

నాలుగు

1
నువ్వేమైపోయావో అనుకుంటాను
2
నిశ్చలమైన సరస్సు. నిటారుగా
ఒక వొంటరి కొంగ. ఇక  నీ చుట్టూ

ఎండలో నానిన వస్త్రాన్ని
రివ్వున దులుపుతారు
ఎవరో -
3
ఇక నువ్వు వెళ్లిపోతావు
నుదిటిపై ఒక
నల్లగులాబీని 
ఉంచి
4.
విదిల్చిన తుంపరలో 
నీతో మాట్లాడని నేను
5
ఏమై/పోయాను? 

ఆదిమ ప్రశ్న

'నీతో నే లేనపుడు ఏం చేస్తావు నువ్వు', అని అడుగుతావు కానీ నువ్వు
నిజానికి ఎవరూ ఏమీ చేయరు

తొలిసారిగా, ఎండ ఒక పొద్దుతిరుగుడు పూవులా ఉందని గ్రహిస్తారు వాళ్ళు

గాలి నీళ్ళలా తోస్తేనూ, తోసుకుపోతుంటేనూ ప్రవహిస్తుంతుంటేనూ
తొలిసారిగా చేతులు ఊపుకుంటూ, నీళ్ళు
చిందించుకుంటూ నడుస్తారు వాళ్ళు

తళతళలాడే కాంతిలో ఎగిరే తూనీగలనీ, వేప చెట్ల బెరడు మెత్తదనాన్నీ
రాళ్ళల్లో ఊగే పూల వాసననీ తొలిసారిగా
సంభ్రమంతో ఆఘ్రాణిస్తారు వాళ్ళు. రాత్రి

చీకటి ఒక వానలా ఉంటుందనీ, ఒక పొగమంచులా తమని హత్తుకుంటుందనీ
ఊరి చివరి పాకలో వెలిగించిన చిరుదీపం
ఒక పొదుగులా, తమని ఆదరిస్తుందనీ

ఎవరివో రెండు చేతులు -తమ చుట్టూతా కప్పిన ఒక దుప్పటిలా - తొలిసారిగా
తమని కావలించుకుంటే జీవితం పట్ల కృతజ్ఞత కలిగి కనులు చెమర్చుతాయని

తెలుసుకుంటారు వాళ్ళు. ఆకలికి దొరికిన చద్దన్నం
తాగడానికి దొరికిన మట్టికుండలోని నీళ్ళూ
పడుకునేందుకు దొరికిన ఆరడుగుల స్థలం

ఇవి అన్నీ, ఇవన్నీ దివ్యమైనవనీ, ఈ లోకపు అధ్బుతాలనీ, విత్తు చిట్లి మొలకెత్తే
మహా నిశ్శబ్ధంలోని విశ్వ రహస్యమనీ
తెలుసుకుంటారు వాళ్ళు. చిరునవ్వూ

ఆక్రందనా, అలకా ఏడుపూ తడిచిన
కనురెప్పల్ని తుడిచే ఏ చేతివేళ్లైనా
పసిచేతులతో సమానమనీ, ఒక అంతిమ శబ్ధ రహిత భాష అనీ తెలుసుకుంటారు             

దారి తప్పి దిగులు వేసి ఒంటరిగా
ఆగిపోయి, భయంతో విరిగిపోయి
తాకితే ముడుచుకుపోయి, పలుకరిస్తే దూరంగా పారిపోయే శరనార్ధుల హృదయాల్లోని       

ఏకాకి గూళ్ళ అనాధ నిశ్శబ్ధపు ప్రతిధ్వనులని
వింటారు వాళ్ళు. అవి తమ కన్నా భిన్నమైన
వేమీ కావనీ, దగ్గరగా తీసుకుని ఊపిరి ఊదితే

వొళ్ళంతా నిలువెత్తు వేణువులై, వెదురువనాలై
నాట్యం చేసి శరీర ఖగోళ గీతాలని సాంద్రతతో ఆలపిస్తాయని గ్రహిస్తారు వాళ్ళు: సర్వ
లోకాలనీ సప్తరంగులతో తనలో ఇముడ్చుకుని
ఒక గడ్డి పరక అంచున ఊగిసలాడే ఓ చినుకులో      

తమ జననం, మరణం పుణ్యం పాపం వరం శాపం
అర్థం పరమార్ధం అలా ఆగి ఉన్నాయనీ, సర్వమూ
రాలి, అంతం అయ్యి తిరిగి మొదలయ్యే ఒక క్రీడ ఇది కదా అనీ కూడా అనుకుంటారు
వాళ్ళు. 'నీతో నే లేనపుడు, ఏం చేస్తావు నువ్వు?'

అని నువ్వు అడుగుతావు కానీ, నిజానికీ ఎవరూ
ఏమీ చేయరు. ఇన్నాళ్ళూ, అన్నీ నువ్వైనందుకు
అన్నీ అయిన నీలో సర్వం మరచినందుకు, మరచినవారికి తిరిగి స్మృతి కలిగించినందుకు
స్మృతిలో సర్వాన్నీ, సర్వంలో తిరిగి నిన్నూ, నీలో

తిరిగి తమనూ కనుగొన్నందుకు, నీ రాహిత్యానికి
కృతజ్ఞతలు చెప్పుకుంటారు. నీ 'రాహిత్యాన్ని' ఓ
ముగ్గుగా మార్చి, పుప్పొడితో ఇంద్రధనుస్సులతో

ఒక చైతన్యంతో నలుదిశలా వెదజల్లుతారు వాళ్ళు
ఇక్కడ నీచే లిఖించబడ్డ వాళ్ళు, నీ భాషైన వాళ్ళూ
ఇక ఆఖరకు, విచ్చుకున్న రోజా పూవులతో సమాధుల ముందు ప్రణమిల్లి ఇలా అడుగుతారు

నిన్నే, లేకపోవడం వాళ్ళ ఉంటూ, ఇరువైపులా
'లేనితనమై' ఉండే, ఉన్న వెళ్లిపొవడమైన నిన్ను
ఇలా: "ఛాతిపై ముద్రికయై జ్వలించే నువ్వు ,  

నువ్వు , మేం నీ వద్ద లేనప్పుడు, మరి మేం లేక, కానరాక, కనలేక  ఏం చేస్తావు నువ్వు?" 

21 January 2013

అనిశ్చితి

తనకి తెలుసు, ఈ నగరమొక రహస్య మృత్యు కుహరమని
    మానవ రుచి మరిగిన, పొంచి ఉన్న ఒక వ్యాఘ్రమని- అందుకనే

ప్రతీ ఉదయం, రెల్లు దుబ్బల్లా సూర్యకిరణాలు రెపరెపా వీచే వేళల్లో
     తన కళ్ళల్లో కొద్దిగా అలజడి: వంట చేస్తున్నంత సేపూ
     ఆపై, నీకై తను బాక్సు సిద్ధం చేస్తున్నంతసేపూ కొంత
     దిగులు సవ్వడి. అన్యమనస్కంగా కదులుతూ తనలో
     తానే ఏదో మాట్లాడుకుంటుంది తను

తనకు తానే ధైర్యం చెప్పుకుంటున్నట్టూ, తనను తానే ఒదార్చుకుంటున్నట్టూ-

అంతా చేసి ఇక నిబ్బరం పట్టుకుని, నువ్వు వెళ్ళే సమయానికి
     పమిటెతో ముఖం తుడుచుకుంటూ నీ చేతికి బాక్సు అందించి
     ఒక బలవంతపు చిరునవ్వుతో "వెళ్లిరా. జాగ్రత్త" అని అంటుంది
     కానీ లోపలే ఎక్కడో మొక్కలు, పూలూ పిట్టలూ గాభరాగా విసవిసా మంటూ
     పిచ్చి గాలితో, ఈకలు ఎగిరే రెక్కలతో కొట్టుకుంటున్న చప్పుడు-

"తొందరగా వచ్చేస్తాను" అని నువ్వు చెబుతావు కానీ, ఇక దారి పొడుగూతా

పల్చటి నీటిపొర అలుముకున్న తన కనులు వాసనే నీ చుట్టూతా
ఆ దినమంతా, నీ లోకమంతా నీ కాలమంతా
రెండు వొణికే చేతులై, బేలగా తాకే తన పెదాలై

నీ చిట్టి పిల్లలై, నీ ముసలి తల్లై తండ్రై, చివరికి
ఎవర్నీ ఏమీ అనలేని ఇళ్ళు లేని మహాకాలమై-  

19 January 2013

నువ్వు లేని చోట

/నువ్వు/ లేని/ చోట/

/రాత్రుళ్ళలో/
/వెన్నెల లేని/చీకటి/ చినుకు/ బరువుకి/

/నేలని/ తాకేంతగా/
/వొరిగిందీ/ గడ్డిపరక/

/ఇక/ ఎవరికీ/ తెలియదు/

/దానిపై/ ఆగిన/ అశ్రువుని/ /తొలగించి/ 
/దానిని/ ఎలా/ 

/విముక్తం/ చేయాలో/

(నిజానికి/ అలసి/వేలాడే/
/ఒక/ వంటరి/ చేతి/ భాష/
/ఎవరికి/తెలుసు?/)   

18 January 2013

సామాన్యుడి ప్రేమగీతం

నిన్ను ప్రేమిద్దామని అనుకుంటాను కానీ, ఈ పాడు ఈగలే---

సరే. నువ్వు చెప్పు -ఎవరైనా
ఎలా ప్రేమించగలరు, చుట్టూ రయ్మని ఎగిరే ఈ ఈగలతో?

మరే, ఒకదానిని ఒకటి అతుక్కుని ఎం చక్కగా
ప్రేమించుకుంటాయి ఈ ఈగలూ, దోమలూ:
ఎందుకంటే మరి వాటికి మన అవసరాలు లేవు

కదా, మరి మనం ప్రేమించుకోవాలంటే చాలా కావాలి-

సమయానికి నీళ్ళు రావాలి, గ్యాస్ రావాలి
కరెంట్ కావాలి రాళ్ళు లేని బియ్యం కావాలి
సమయానికి జీతం రావాలి పిల్లల ఫీజు కట్టి
ఉండాలి, కేబుల్వాడి బిల్లూ పాలవాడి బిల్లూ

పనిమనిషి జీతం, అన్నీ తీరి ఉండాలి. కూరగాయలూ
కందిపప్పూ రిన్నూ లక్సూ సర్ఫూ పొద్దు పోకముందే
పిల్లల నిద్రా, టీవీ సీరియళ్ళూ ముఖ పుస్తకపు
అలజడీ...అన్నీ సద్దుమణగాలి, అన్నీ కుదరాలి

పగలంతా పనితో అలసిన నీకూ నాకూ  ఓపిక ఉండాలి
రేపంటే భయంలేని తొందర లేని
అటువంటి సమయమూ కావాలి

మరి, ఇవేమీ లేని ఈ పాడు ఈగలతో దోమలతో ఎట్లా మనం?

సరేలే. వస్తూ తెస్తాను
ఇంట్లోకి, నిండుకున్న
ఫినాయిలూ, జెట్ మాట్లూ ఎప్పటినుంచో నువ్వు అడుగుతున్న
కొత్త చీపిరీనూ- మరిక

 ప్రేమించుకుందామా మనం, ఈ రాత్రికి?                

రాకు

/నన్ను/
/ఉన్నది/ ఉన్నట్టుగానే/ తీసుకో/

/నిన్ను/ నిన్న లేనిది/
/ఉండ/లేనట్టుగానే/
ఇలా /తీసుకుంటాను/

అందుకే/ రాకు/
మళ్ళా/ఇక్కడికి

పొదుగు/ పోయిన/ దూడ
నీళ్ళు/ నిండిన/ కనులతో

కాస్త/ తెరిపి/ పడింది/ ఇప్పుడే/ 

16 January 2013

నీ చేతులు

సూర్యకిరణాలు ప్రతిఫలించే తామర తూడు వలే మెరుస్తోంది నీ చేయి -
అందుకే,

నీ వేళ్ళ అంచులలో పుష్పించే
మొగ్గలను చూసాను ఈ వేళ-

మొగ్గలు పూవులై, లతలై ఇల్లంతా అల్లుకుపోయి, చల్లటి నీడగా మారి
పచ్చి వాన వాసనతో మమ్మల్ని చుట్టుకుంటే
నీ చుట్టూ పిట్టల్లా మూగి కూర్చున్నాం మేము

నాట్యం చేసే నీ చేతి వేళ్ళనీ, అవి సృష్టించే చిరు
మెరుపుల సంగీతం వింటూ: అవే
మరి నీ అరచేతులే- నిదుర లేచి

నీళ్ళని కాగబెట్టే చేతులు. స్నానం చేయించే చేతులు. అన్నం వండే చేతులు
నోటికి, అన్నం ముద్దలు అందించే చేతులు
మండే నుదిటి మీద తడిగుడ్డ వేసే చేతులు

నిన్ను ఎత్తుకునే చేతులు, నన్ను హత్తుకునే చేతులు. సర్వం రాలి నువ్వు
రోదిస్తే, నీ కన్నీళ్లు తుడిచే చేతులు. నిన్ను
కాపాడే చేతులు. నిన్ను ప్రాధేయపడే  చేతులు. నిన్ను కరుణించే చేతులు

చల్లటి చేతులు, వెచ్చటి చేతులు. ఏడుస్తూ వొణికే చేతులు. సరస్సులు
గుమికూడే చేతులు. వొంటరిగా ఉంటే
ఎడారులయ్యే చేతులు. జీవిత భారాన్ని

అరచేతిలో వదనపు బరువయ్యి ఆపే చేతులు. చీకటిని కాటుకగా దిద్దుకుని
నీకు వెలుగునిచ్చే చేతులు. నీ మనో
ఫలకాన్ని తుడిచి నిన్ను నిర్మలంగా

మార్చే చేతులు. గాజులు పచ్చటి పోలాలై వీచే చేతులు. నదులై పారే చేతులు
గుప్పెడంత దీపాన్ని, నీ హృదయాన్ని
ఆరిపోకుండా కాపాడే చేతులు. అవే -

అన్ని వేళలా అన్నీ అయ్యి నిన్ను చూసుకునే చేతులు. నిన్ను చేసుకున్న చేతులు
ఇంద్ర ధనుస్సులు అయిన, చేతులు
వెన్నెల అయిన చేతులు.నిన్ను తాకి
అమావాస్యలుగా కూడా మారిన

చేతులు. నవ్వే  చేతులు, నవ్వించే చేతులు. నీతో పాటు నీతో నెమ్మదిగా మరణించే
చేతులు. అవే, అవే

ఉదయంపూట సూర్యకాంతి ప్రతిఫలించే
మగ్గిన బంగారంలాంటి తామరతూడులు
అయిన చేతులు. నువ్వు నేనూ జన్మించే
                
మట్టి ఈ చేతులు. భూమి ఈ చేతులు. విశ్వం ఈ చేతులు. పరమ దైవం ఈ చేతులు.
అందుకే,

మొక్కలమై, వాటి వేర్లమై వేలాడుతున్నాం  నీ చేతికి, తిరుగుతున్నాం నీ చుట్టే
రాసుకుని రాసుకుని  పిల్లి పిల్లలమై.
చెబుతున్నాం అందుకే విను నువ్వు

నిన్ను తాకడం, కృతజ్ఞతగా నీ చేతివేళ్ళని పెనవేసుకోవడం, రెండు చేతులని
సాధ్యమైనంతగా చాపి నిన్ను ఎరుకతో
కావలించుకోడం ఎంతో బావుంది. మా

జీవితాలని నీ అరచేతుల్లో పెట్టి నిశ్చింతగా ఉంటాం ఇక అని చెప్పడానికి మాకు
సిగ్గు ఎందుకు, అహం ఎందుకు?

ధ్యానం

ఉదయాన్నే ఇంత కాంతిని అరచేతుల్లోకి తీసుకుని
     కళ్ళని కడుక్కుంటావు నువ్వు: సరిగా అప్పుడు మరి
     అరుస్తాయి గూళ్ళలోని పక్షిపిల్లలు. కదులుతాయి వంటగదిలో

మరి గాజులు, పొయ్యి వద్ద నిప్పులతో. మెరుస్తాయి మంచంలో
     బద్ధకంగా పిల్లల ముఖాలు. ఇక ఒదుగుతోంది ఎక్కడిదో గాలి
     వలయమై ఆకుల హొరై ఆపై గుసగుసలై ఈ గదులలో-

ఎండ వాలిన నేలపై ఆగి, దాని రెక్కల కింద ఒక అద్దాన్ని ఉంచుకుని
     కూర్చుంటావు నువ్వు ఇక ఒక షేవింగ్ బ్రష్తో
     సముద్రాల నురుగనంతా రాసుకుని-

ఇక అప్పుడు, వాన వాసన వేసే చేతులతో, తెల్లటి కళ్ళతో
     చెంపలపై నుంచి కత్తిని దూస్తుంది తను, వేసవి కాలంలో
     ఎండలో వచ్చిన మనిషికి గ్లాసెడు చల్లటి మంచి నీళ్ళిచ్చి
     పక్కన కూర్చుని విసెన కర్రతో గాలి విసిరినట్టు- ఇక

ఏమీ లేదు ఈ పూటకీ, ఈ అక్షరాలకీ: నిమగ్నమై ఇష్టంతో
     గడ్డం చేసుకోవడమే ధ్యానం మోక్షం-పుణ్యం పరమార్ధం.

మరి ఇక ఆ తరువాత
 ఈ గొంతు తెగితేనేమీ, ఇక ఈ ప్రాణం ఉంటేనేమీ పోతేనేమీ?    

14 January 2013

గ్రహణం

దేహధారి వైనందుకు దేహం దొరకదు
పాత్రధారివైనందుకు ముఖం దొరకదు

దినాలూ ఆ దినాలూ ఆలుపు లేక తిరిగినా స్నేహ వాంఛవైనందుకు
ఒక స్నేహితుడు దొరకడు

మృత్యువు వరకు సాగినా
ప్రాణధారి వైనందుకు 
ఒక పదం దొరకదు-

నలుమూలలా నిన్ను వెదికి గాలించి శోధింఛి, నిన్ను శుభ్రపరిచే ఒక 
మహిమాన్విత స్త్రీ దొరకదు 

ఇక కడవరకూ ఛాయ లేని గోడలపై ఈ నీడలే, పక్షులు వొదిలివేసిన
గూళ్ళే, వడలిపోయిన సంధ్యలే.

ఇక మిగిలింది అంతా బ్రాంతి బ్రాంతి, బ్రాంతి- ఈ శాంతి.

తప్పుకో ఇక్కడ నుంచి. రాలిన పూలను ఏరుకుంటున్నాను. 

అమ్మ చెప్పిన కథ

"అమ్మా చలేస్తే, మనం దుప్పట్లు కప్పుకుంటాం. మరి పిట్టలూ?"

కరెంట్ పోయిన చీకట్లో, కొవ్వొత్తిని వెలిగిస్తూ ఆ తల్లి చెప్పింది ఇలా:
పిచ్చి కన్నా, చలేస్తే పిట్టలు ఆకుల్ని కప్పుకుంటాయి
ఆకులు ఆకాశాన్ని కప్పుకుంటాయి, ఆకాశం చుక్కల్నీ
చుక్కలు నీ కళ్ళనీ కప్పుకుంటాయి

నీ కళ్ళని అమ్మా, అమ్మని నాన్నా, నాన్నని నీ తమ్ముడూ
నీ తమ్ముడిని తాతా, తాతని నాయనమ్మా
నాయనమ్మని ఈ ఇల్లూ కప్పుకుంటుంది -

ఈ ఇంటిని వేపచెట్టూ, వేపచెట్టుని నేలా, నేలను గాలీ మరి గాలిని
పచ్చని చేలూ, చేలని నీరూ, నీరుని నిప్పూ
కప్పుకుంటాయి. ఇక పూలని పురుగులూ
పురుగులని పుట్టలూ, పుట్టల్ని పాములూ
పాములని పరమ శివుడూ, ఆ శివుడుని

పార్వతీ, పార్వతిని ఈ భూమి, ఈ భూమిని
పగలూ రాత్రీ మార్చిమార్చి కప్పుకుంటాయి.
ఇక పడుకుందామా?" అని తను తల తిప్పి

పక్కకు చూసేటప్పటికి, మంచంపై పిట్టలూ ఆకులూ పూవులూ
చుక్కలూ, నింగీ నేలా నీరూ నిప్పూ  గూళ్ళూ
చెట్లూ పుట్టలూ పురుగులూ, పగలూ రాత్రీ

వెన్నెల వాసనా, చల్లటి నిద్రా తెరలుతెరలుగా కదులాడే గంధపు
వదనంతో ఒక పిల్లవాడు నోరు తెరుచుకుని
నిద్రపోయి ఉన్నాడు-                            

13 January 2013

గడపలేని రాత్రి

చీకట్లో మెరిసే రెండు ఆకుపచ్చని ఆకులు
నీ కళ్ళు

ఇక
వేళ్ళతో రాస్తాను వాన చినుకులని చిగురాకులపై
వెన్నెల

శ్వేత సీతాకోకచిలుకలై మన చుట్టూ ఎగిరే వేళల్లో

మరి
చీకటి కాటుకని కొసవేళ్ళతో రాసుకున్న నీ చేతిని
ఇలా
ఇవ్వు

ఇక
రాసుకుంటాను ఈ అక్షరాలను
నింగి నిదురంటిన
నా

రెండు ఆకుపచ్చని కలలపై-  గడప/లేని రాత్రినై.

10 January 2013

గూళ్ళు, కట్టుకున్నదెవరు

"దేశం, దేహం, ద్రోహం
నీకీ  పదాలు తెలుసు
     నా?" అని తను అడిగింది (ఎందుకో నాకు తెలియదు)

"this body" ( చూపుడు
     వేలితో  తన శరీరాన్ని
     చూపిస్తూ)

"is a site of exploitation
     ఇదొక మగవాళ్ళ  సాంసృతిక యుద్ధ రంగమని
     ఇదొక విపణి వీధి అనీ 
     నిర్వచనాల నిశీధి అనీ  తెలీయదా నీకు?

దేశం దిగివచ్చి, దేహంపై రాజ్యమై
ఒక చట్టమై ఒక ముద్రికగా మారు
     తుందని  తెలియదా నీకు? నీ

వాచకాలు ముద్రించేందుకూ
నీ దేశాన్నీ, నీ మతాన్నీ భద్ర
     పరిచేందుకూ, కొననసాగించేందుకూ, ఈ దేహం

ఒక పరిశోధనాలయం అవుతుందనీ

ఇదంతా దేవుళ్ళ దేవతల పురాణాల
     నిలయమనీ, తెలియదా నీకూ?"

అని మళ్ళా అంది తను
    తల వంచుకున్న నా
    కళ్ళను పైకి లేపి- " How do you know

that this is my body?
How do you know
That there is a body beyond your inscription?

First of all
How do you know  that  there is a body?" అని
పిచ్చిగా తుళ్ళి తుళ్ళి  నవ్వింది

తను, కనుల వెంట
నీళ్ళు చిప్పిల్లేదాకా-

"మూర్ఖుడా. నిన్ను నువ్వు తెలుసుకునే ముందు
ముందుగా, నీ దేహాన్ని తెలుసుకో" అంటో తనే

"Know your body, before you know yourself
Know your body to be nobody"
అని అంటే ఇక నేను కూలబడ్డాను

ఈ తెల్లని తెరల ముందు
ఈ నల్లని పదాలని రాస్తో
అంతిమంగా మీకీ కింది వాక్యాన్ని అనుమతిగా ఇస్తో-

Don't you know that
Words do have sex
And that language is sexed, and that don't you know that

గూళ్ళు కట్టుకుని భద్రంగా ఉన్న
పక్షులేవీ ఇక్కడ మిగిలి లేవనీ?

07 January 2013

తమలపాకులు

తమలపాకులై సాగిన నీ అరచేతుల్లో
పచ్చి వక్కై వొదుగుతాడు ఫిరోజ్-

అత్యంత సరళత్వంతో, తెల్లటి నీ కళ్ళని
రాసిన ఆ ఆకులను
వేళ్ళ మధ్య ముడిచి

నింపాదిగా నీ పెదాల వద్దకు
తీసుకుంటావు: ఫరీదా, ఇక

నెత్తురు తుళ్ళిన అతని శరీరాన్ని
నీ హృదయంలో, నీ నిర్లక్ష్యంతో
నమిలి వేయబడటమే బాకీ-

మరి
చూసుకున్నావా నువ్వు ఇంతకూ
రాత్రిలో ఎర్రగా పండిన, నీ నాలికని

రహదారి పక్కగా నువ్వు ఊసేసాక
మధుశాలల్లో
చందమామై

మెరిసిపోయిన అతనినీ? ఫిరోజ్నీ?

06 January 2013

01-01-2013

అందరూ పడుకున్నాక, ఇదిగో ఈ సమయానికి
కిటికీ పక్కన నేను

చల్లటి చీకటి వాసన, మెత్తగా ఒరుసుకుని ఒక
పాల నది వెడుతున్నట్టు, శరీరంలో ఒక శాంతీ
కనురెప్పల కింద అరనిద్ర ఒత్తిడీ-

అరచేతితో నోరు కప్పుకుని
నవ్వు ఆపుకుంటూ నువ్వు, నవ్వు ఆపుకోలేకా
అటువైపు తిరిగిన నీ నవ్వులా
రెపరెపలాడే కాయితాల గాలిలా

ఇంత రాత్రీ, అక్కడక్కాడా లోకం ఎక్కడో మునిగి
మరలా తేలుతున్న శబ్ధం. ఇక

అలలై వెళ్ళిపోయే నీళ్ళపై
ఈ పొరల  పొరల  చీకటిపై

నేనో శ్వాసను ఊది వెలిగించేలోగా, వెళ్లిపోయిందీ
రాత్రి ఇలాగే, నిన్నటి లాగే

నువ్వు నిద్ర లేచే సమయానికి
నిద్రలోకి కరిగిపోయిన -నాలాగే.

05 January 2013

02-01-2013

ఇంటికి వస్తూ ఈ వేళ, కైరాన్*ను  తెచ్చుకున్నాను-

లేత సూర్యరశ్మిని వడకట్టి - బహుశా తనేనేమో -
ఒక దివ్యమైన స్త్రీ శరీర సువాసనతో, స్వర్గలోకంలో
ఒక నాజూకైన గాజుపాత్రలోకి
ఒరిమిగా ఇష్టంగా వంపినట్టు

ఇక ఈ వేళ సాయంత్రం నేనూ, నా కైరాన్. గాజుపాత్రలో

అని అంటారు కానీ విజ్ఞులు, నేను
మాత్రం దోసిళ్ళలో వంపుకుని
ప్రభువుని ఓసారి తలుచుకుని

కనులు మూసుకుని, తనని స్మరించుకుని
తాగుతాను ఈ సిప్రస్ నదిని. అందుకే
అమృతాన్ని తాకిన, ఏ నాలికానూ
ఇక ఓ అబద్ధాన్ని పలుకరాదు కదా

అందుకే చెబుతున్నాడు విను ఇక జొర్బా నీకు
కనులపై తన ప్రియురాలి అరచేతులు వాలినట్టు    
మెత్తగా నవ్వుతో, మత్తుగా తూగుతో-

'దారి తప్పిన లోకంలో కాలం తప్పాను నేను
పరలోకాన్ని ఆశించే పాపిని కాదు నేను
చేర్చండి ఎవరన్నా నన్ను ఫరీదా ఇంటికి'

అంటో: Oh. Yes. రాదు ఏదీ మరి తేలికగా
నేర్చుకోవాలి ఎవరైనా ఓపికగా, తనకు
హృదయాన్నీ, ప్రాణాన్నీ పణంగా పెట్టి

ప్రేమించడాన్నైనా, మధువు గ్రోలడాన్నైనా.
--------------------------------------------------------
Kairan: Name of a Brandy.

03-01-2013

గోరువెచ్చని పసి చేతివేళ్ళు నీ నిదురవి

నేను అటువైపు తిరిగి పడుకున్నా
మరి మలుపుకుంటాయి నీ వైపు.

కలవరిస్తాయి ఏవో అవి, మరి
విప్పర్చుతాయి నీ కళ్ళ కింద
కలల తామర పూలనూ, నిదుర రంగులనూ-

గోరువెచ్చని, తల్లి స్థన్యాలు నీ నిదురవి.

చూడు ఇక.
కనులు మూసుకుని అలా నిశ్చింతగా
నిదురోతున్న నీ ఒడిలో
కనులు విప్పార్చుకుని

-పాలు తాగి- రాత్రంతా ఎలా కేరింతలుతో
ఆడుకుంటానో నేను. 

03 January 2013

అప్పుడు (Another version)

గోచీ ఎగలాగుకుని, ఆ కాలవ గట్టున కూర్చుని
నీళ్ళల్లో చందమామని
కాళ్ళతో కెలుకుతుంటే

వెల్లకిల్లా పడుకుని, ఒక అరచేయి తల కిందా
మరోక చేతితో బీడిని ఊదుతూ

"బట్టలు వేసుకున్న ఒరే నా బట్టా, ఇలా రా  
చందమామ జున్నుముక్కలా ఉంది
ఎన్నేలేమో కల్లులా. ఈయేళ చేతిలో 

కాల్చిన ఎండు చేపా, నోటికింత
మందూ ఉంటే ఎంత బావుండు"

అని అంది, తిరనాళ్లలో పిచ్చిగా ఎగిరే నా నాయికా  
అపర మహంకాళీ, అప్పటికి
ఆరు పాకెట్లు సారా తగిన ఆ

ఒంటిపై, నెత్తురు కోతలూ కన్నీటి మరకలూ తప్ప 
జానెడు గుడ్డా గుప్పెడు గూడూ 
అరచే నోరంత మెతులుకూ లేని 
అ లేతకళ్ళ నీటిముళ్ళ చిన్నారి           

ఆ రాత్రి ఊరవతల ఆ తాడిచెట్లు 
తళతళలలో, పచ్చిక గమత్తుగా 
పూనకమై ఊగే వేళల్లో.ఇక 

ఏమీ చేయలేక, ఏడుపునీ, కన్నీళ్ళనీ ఉగ్గపట్టుకుని
దూకాం చితికిన మా కడుపులతో
డోక్కుపోయిన, తన కడుపులోకే
అర్చుకుపోయిన తన పేగులలోకే  

ఇక నేనూ రాత్రి మేనూ కాలిన వెన్నెలమై, రాలిన కళ్ళమై-