27 January 2012

కవిత గురించి ఒక అ/కవిత

కవిత ఎలా రాయాలో చెప్పు అని
ఆ నూనుగు మీసాల యువకుడు రాత్రంతా రాత్రిని అడిగాడు

నీటిలోని ముఖాన్ని
అరచేతుల్లోకి తోడుకుని, అద్దంలోకి విసిరివేసావా ఎన్నడైనా
ముఖంలోని అద్దాన్ని
అదిరే పెదవులతో అందుకుని, పరికించావా ఎన్నడైనా? నేను అన్నాను.

ప్రతీకలు ఎలా, పదాలు ఎలా
పోలికలని పోలికలతో పోల్చడం ఎలా? అని నెత్తురు నిప్పులు ఎగిసే శరీరంతో

అమాయకంగా మళ్ళా ఆ కుర్రవాడే అడిగాడు
తన ఎదురుగా కూర్చున్న ప్రేయసిని మాటలతో మాత్రమే తాకే ఆ కుర్రవాడు

మధుపాత్ర ముందు మాటలు వొద్దు
తలలో తురిమే పూలను, పోట్లాలలోనే దాచేయవద్దు: చెప్పాలనుకున్నదేదో చెప్పు
అడగాలనుకున్నదేదో అడుగు: కోరుకోవటం పాపమేదీ కాదు ఇక్కడ
పరమ పవిత్రమైన పుణ్యమేదీ లేదిక్కడ. చూసావా నువ్వు, విన్నావా నువ్వు
తను వొదిలిన నిట్టూర్పు నీ చుట్టూతా ఎగిరే చప్పుడు? అడిగాను నేను, అడగక-

కవిత ఎలా రాయాలో చెప్పు, కవిత ఎలా రాయకూడదో చెప్పు
అని పాపం పిల్లవాడు, అరచేతుల్లో ముఖాన్ని దాచుకునే ఆ

నూనుగు మీసాల కుర్రవాడు రాత్రంతా ఆ రాత్రినే అడిగాడు, తన ముందు
తన ముందే కూర్చున్న ఆ నీలి కళ్ళ యువతిని వొదిలి:

ఏడవటం వచ్చా నీకు? కన్నీళ్ళని వడగట్టడం వచ్చా నీకు? నీలోని ఇంకొకరిని
కలుసుకోవడం వచ్చా నీకు? ఆ ఇంకొకరిలోని నిన్ను పసిగట్టడం వచ్చా నీకు?
నీకు నువ్వు చచ్చిపోవడం తెలుసా నీకు? తిరిగి ఇద్దరై ముగ్గురై నలుగురిలోకి
జన్మించి అందరినుంచీ బహిష్కరింపబడటం తెలుసా నీకు?

ఇవేమీ అడగలేదు నేను అతడిని, అతడి రాత్రిని, రాత్రిగా మారిన తననీ, ఆ తనువునీ-

అడగలేక, చెప్పలేక ఇక నేను కాంతిని వీడి, రాత్రిని తాగి
నా దుస్తులని నేను మూటకట్టుకుని అక్కడే
ఆ శిధిలాలలోకే మళ్ళా వెళ్ళిపోయాను ఎప్పటిలానే ఇలా గొణుక్కుంటూ:

ఎవరు చెప్తారు నీకు, నువ్వే ఒక కవితవని, తనే ఒక కవిత అని
ఇంతకు మించి ఇక్కడ మరేమీ లేదని, మరేమీ దొరకదనీ?-

10 comments:

  1. ఏడవటం వచ్చా నీకు? కన్నీళ్ళని వడగట్టడం వచ్చా నీకు? నీలోని ఇంకొకరిని కలుసుకోవడం వచ్చా నీకు? ఇంకొకరిలోని నిన్ను పసిగట్టడం వచ్చా నీకు?
    నీకు నువ్వు చచ్చిపోవడం తెలుసా నీకు? తిరిగి ఇద్దరై ముగ్గురిలోకి జన్మించడం తెలుసా నీకు?<<< eeline baagundi dhanyavaadamulu srikanth garu

    ReplyDelete
  2. అద్భుతం. ఇంత చక్కగా కవిత్వం గురించి ఆలంకారికులు కూడా చెప్పి ఉండరు. అభినందనలు!
    ఆలేరు కు చెందిన సాహితీవేత్త ’పోరెడ్డి రంగారెడ్డి’ కవిత్వంపై ఒక కవితా సంకలనం రూపొందిస్తున్నారు. అందులో ప్రచురణార్థం ఈ కవితను పంపండి.

    ReplyDelete
  3. chalaa bagundi sree ...jus no words ...love urs j

    ReplyDelete
  4. nissabdhangaa chaduvukovadame....thanks for sharing with us Srikanth jee

    ReplyDelete
  5. అయ్యబాబోయ్! వ్వె వ్వె వ్వే కవిత్వం వ్రాసిన శ్రీకాంత్ గారేనా అని ఒక క్షణం ఆశ్చర్యపోయాను! ఎంత అద్భుతముగా పదాలను పొందుపరిచారు! అమోఘం! భావ వ్యక్తీకరణ కూడా చాలా బాగుంది! ఇప్పుడు నేను మిమ్మల్ని ఇంతటి అద్భుతంగా ఎలా వ్రాయాలి అని ఈ బ్లాగ్ముఖంగా అడుగుతున్నాను చెప్పరూ!

    ReplyDelete
  6. goppa kavita. i will remember this for some days...no doubt.

    ReplyDelete
  7. Srikanth! kavitha ela rayalo cheppu???...............:)

    ReplyDelete
  8. ఒక విభిన్న కవిత్వ ధార!

    ReplyDelete
  9. ఎవరు చెప్తారు నీకు, నువ్వే ఒక కవితవని

    ReplyDelete