31 January 2012

ఇక ఏమీ చేయలేను

ఆకస్మికంగా ఆ పూవు మిరుమిట్లు గొలుపుతూ విచ్చుకుంది

పైన ఎగిరే పిట్టల రెక్కల్లో మేఘావృతం, కింద ఆకుల ఆవరణలో నీడల వలయం
ఎగిరే పిల్లల పాదాల కింద పగులుతున్న గాలి బలపం
కొద్దిగా నన్ను తాకుతున్న నీ నవ్వు పరిమళం

చిన్న జల్లు మొదలయ్యింది: ఇంకేం చేయగలను
నా విధికి నన్ను నేను సమర్పించుకుని
మిరుమిట్లు గొలుపుతూ విచ్చుకున్న, నిండు వానగా మారిన

నీ ముఖంలో, సాయంత్రంలో, ఆనక రాత్రిలో
నిండుగా తడిచి తడిచి, నిండుగా మునిగి మునిగి చివరకు నివ్వెరపోయి స్థాణువయ్యి

ఇక ఈ రోజుకు ఇదే మరణం, ఇదే జననం. ఇక ఇదే
సర్వజన్మ పాపపుణ్యాల పరమ పవిత్ర మోక్షం-

(ఇక ఏమీ చేయలేను, ఇక ఏమీ కాలేను. ఇంతకూ

నీ వదనం ముందు మోకరిల్లి శరణు కోరానా
మోహగ్రస్తుడనయ్యానా, శాపగ్రస్తుడనయ్యానా

జీవించి ఉన్నానా మరణించి ఉన్నానా

లేక జనన మరణాల మధ్య ఆ నిశ్శబ్దంలో
ఆ రంగుల కాంతిలో సంచరిస్తున్నానా -?)

30 January 2012

యిద్దరు స్నేహితులు

ఆ నీలి నీళ్ళల్లో నిలబడ్డారు ఆ యిద్దరు స్నేహితులు

రాత్రికి ఇటువైపుగా ఒకరు, రాత్రికి అటువైపుగా మరొకరు
కళ్ళల్లో ధూళితో, దూరంతో ఇక తిరిగి ఎన్నటికీ తాకలేని
విడిపోయ్యే అరచేతులయ్యిన ఆ యిద్దరు-

ఇవ్వడానికీ ఏమీలేవు ఇద్దరికీ, ఇటువైపుగా కానీ అటువైపుగా కానీ:
అందుకే ఇద్దరి మధ్యలో పూసిన నిశ్శబ్ధం పూవులోంచి
చెరో రెమ్మను తెంపుకుని ఇరువురిగా వెళ్ళిపోయారు ఇరువురు అందరిలోకీ-

ఇక ఆ రాత్రంతా రెండు రెమ్మలని కోల్పోయిన ఆ రోజా పూవు ఒక్కటే
వానలో గాలిలో విలవిలలాడిపోయింది రాత్రిలో రాత్రిగా మిగిలిపోయింది రాలిపోయింది

ఇంతకూ ఇరువురినీ ఇరువురిగా మార్చిన తను ఎక్కడ? తన తనువు ఎక్కడ?

29 January 2012

ఎందుకు 3

ఇలాగే తెల్లవారింది ఆనాడు కూడా- నువ్వు లేవక మునుపే, అందుకే

తోటలోంచి కొన్ని కనకాంబరం పూలనూ, దవనంనీ తెచ్చాను
పూలపాత్రలో నీళ్ళు మార్చాను

పాలు తెచ్చి నీకై తేనీరు తయారుచేసాను, ఆపై ఒక్కడినే నీ పక్కగా కూర్చుని
నిదురించే నీ ముఖంలో కదిలే లిల్లీపూల వనాలను చూసాను
ఊయలలూగే నీ ఊపిరిలో, నీ ఛాతిలో ఇరుక్కుని ఆ నీళ్ళలో ఆకై తేలిపోయాను
నుదిటిపై దొర్లే శిరోజాల మాయలో బందీని అయ్యాను
తాకాలని అనిపించే తాకలేక, నిన్ను లేపాలనిపించి లేపలేక ఆ ఇంటి నిశ్శబ్దంలో
నేనూ ఎగురలేని పావురాళ్ళూ ఆయమయంగా తిరిగాము
నీ చుట్టూతే బెదురు బెదురు బ్లులక్ బ్లుక్ శబ్దాలు చేసుకుంటూ-

ఇక ఆ తరువాత ఏ ఇంటిలోనైనా, ఏ కంటిలోనైనా చూసానా
మరువం దవనం కూడి ఏ అరచేతులలోనైనా విరిసిన కనకాంబరం పూలనీ?
తోటలో ఎగిరే పిచ్చుకలని? అటువంటి దినాలనీ?

ఇలాగే తెల్లవారింది ఆనాడు కూడా, నువ్వు లేని ఈనాడు కూడా- కాకపోతే
హృదయంలో ఒక శ్మశానం, సమాధిగా మారిన తోటలో
ఎవరూ పలుకరించని అతడి శరీరం, లోనంతా శిలగా మారిన ఎవరిదో మౌనం

తగలబడుతుంది, రాలిపోతోంది ఎక్కడో ఏదో నింపాదిగా, నిర్దయగా: సరే సరే

వెళ్ళిపోయావు. వెళ్ళేపోయావు. ఎందుకు అని అడగను కానీ, ఎందుకు?

28 January 2012

ఎందుకు 2

ఈ వీచే గాలి నీ నామాన్ని స్మరిస్తుంది

రాలే పూలు ఇక నయనాలలోకి దిగే
ఆకుపచ్చ ముళ్ళు: ఇక ఈ తోటలోకి నీళ్ళు చల్లే వాళ్ళెవ్వరూ రారు

ఆ గువ్వొక్కటే కూస్తుంది
ఆకులని కోసే వేసవిని, వేసవిని కోసే రాత్రినీ-

సరే సరే: ఇంతకూ నువ్వెందుకు వెళ్ళిపోయావు?

ఎందుకు 1

అరచేతుల మధ్య ప్రమిదె కాంతిని కాపాడుకున్నట్టు
నేను నీ ముఖాన్ని చూసుకున్నాను

ఎందుకు వెళ్లిపోయావు నువ్వు నా వదనాన్ని వొదిలి?

27 January 2012

కవిత గురించి ఒక అ/కవిత

కవిత ఎలా రాయాలో చెప్పు అని
ఆ నూనుగు మీసాల యువకుడు రాత్రంతా రాత్రిని అడిగాడు

నీటిలోని ముఖాన్ని
అరచేతుల్లోకి తోడుకుని, అద్దంలోకి విసిరివేసావా ఎన్నడైనా
ముఖంలోని అద్దాన్ని
అదిరే పెదవులతో అందుకుని, పరికించావా ఎన్నడైనా? నేను అన్నాను.

ప్రతీకలు ఎలా, పదాలు ఎలా
పోలికలని పోలికలతో పోల్చడం ఎలా? అని నెత్తురు నిప్పులు ఎగిసే శరీరంతో

అమాయకంగా మళ్ళా ఆ కుర్రవాడే అడిగాడు
తన ఎదురుగా కూర్చున్న ప్రేయసిని మాటలతో మాత్రమే తాకే ఆ కుర్రవాడు

మధుపాత్ర ముందు మాటలు వొద్దు
తలలో తురిమే పూలను, పోట్లాలలోనే దాచేయవద్దు: చెప్పాలనుకున్నదేదో చెప్పు
అడగాలనుకున్నదేదో అడుగు: కోరుకోవటం పాపమేదీ కాదు ఇక్కడ
పరమ పవిత్రమైన పుణ్యమేదీ లేదిక్కడ. చూసావా నువ్వు, విన్నావా నువ్వు
తను వొదిలిన నిట్టూర్పు నీ చుట్టూతా ఎగిరే చప్పుడు? అడిగాను నేను, అడగక-

కవిత ఎలా రాయాలో చెప్పు, కవిత ఎలా రాయకూడదో చెప్పు
అని పాపం పిల్లవాడు, అరచేతుల్లో ముఖాన్ని దాచుకునే ఆ

నూనుగు మీసాల కుర్రవాడు రాత్రంతా ఆ రాత్రినే అడిగాడు, తన ముందు
తన ముందే కూర్చున్న ఆ నీలి కళ్ళ యువతిని వొదిలి:

ఏడవటం వచ్చా నీకు? కన్నీళ్ళని వడగట్టడం వచ్చా నీకు? నీలోని ఇంకొకరిని
కలుసుకోవడం వచ్చా నీకు? ఆ ఇంకొకరిలోని నిన్ను పసిగట్టడం వచ్చా నీకు?
నీకు నువ్వు చచ్చిపోవడం తెలుసా నీకు? తిరిగి ఇద్దరై ముగ్గురై నలుగురిలోకి
జన్మించి అందరినుంచీ బహిష్కరింపబడటం తెలుసా నీకు?

ఇవేమీ అడగలేదు నేను అతడిని, అతడి రాత్రిని, రాత్రిగా మారిన తననీ, ఆ తనువునీ-

అడగలేక, చెప్పలేక ఇక నేను కాంతిని వీడి, రాత్రిని తాగి
నా దుస్తులని నేను మూటకట్టుకుని అక్కడే
ఆ శిధిలాలలోకే మళ్ళా వెళ్ళిపోయాను ఎప్పటిలానే ఇలా గొణుక్కుంటూ:

ఎవరు చెప్తారు నీకు, నువ్వే ఒక కవితవని, తనే ఒక కవిత అని
ఇంతకు మించి ఇక్కడ మరేమీ లేదని, మరేమీ దొరకదనీ?-

డైరీ

ఆకులని విడిచి ఇంకా రాత్రి వెళ్ళిపోలేదు
రివ్వున తిరిగే గాలిని వెన్నెల ఇంకా వొదలలేదు: అరచేతుల్లో తన ముఖం ఇంకా ఆరలేదు

ఒక చలి మంటను వేసుకున్నాను ఇక్కడ రాత్రంతా
నా వాళ్ళ శరీరాలతో, వాళ్ళ పదాలతో వాళ్ళే అయిన మాటలతో-

మాట్లాడుకున్నవి పెద్దగా ఏమీ లేవు, అన్నీ అసంగతులే

తెచ్చుకోవాల్సిన సరుకులు, నెలకయ్యే ఖర్చులూ
భరించిన అవమానాలూ, భరించాల్సిన చికాకులూ ఎంతకూ తీరని అప్పులూ
కొన్ని భయాలూ కొన్ని భాధాలూ
కొన్ని ప్రేమలూ కొన్ని ద్వేషాలూ, అన్నీ ఇటువంటి మామూలు మాటలే
ఇటువంటి మామూలు మనిషిగానే

సదా వెన్నంటి ఉండే తనతోనే తన శరీరంతోనే చెప్పుకున్నాను మౌనంగా
చెమ్మగిల్లి వొణుకుతున్న కన్నుల్లాగా, నన్ను చుట్టుకున్న చేతులలాగా-

నిదురలో తటాలున ఉలిక్కిపడతారు పిల్లలు
ఎక్కడో చీకట్లో విలవిలా రెక్కలు కొట్టుకుంటాయి పావురాళ్ళు
చరుస్తోంది కిటికీ అద్దాలని ఒక సన్నటి జల్లు: ఉండీ ఉండీ తెగుతాయి కలలో కీచురాళ్ళు

ఇక ఇదే సమయం. వెలుతురికి మంచుదీపం వొలికే వేళ్ళల్లో
నెమ్మదిగా చందమామ మాయం అయ్యి, ఇరువురిలో ఇరువురు మాయం అయ్యి
ఒక్కరిగా మిగిలే తొలి కాంతి వీచే సమయం, అంతా ఒక రహస్య కాలం-

సరే సరే. ఇవన్నీ నీకు చెప్పుకునేంత పెద్ద విషయాలేమీ కావు. కాకపోతే

యుగాల తరువాత నేను నిదుర నీడలో సొమ్మిసిల్లాను: మరి నువ్వో?

25 January 2012

ఇది?

తెరుచుకుని ఉంది ఒక తలుపు
నువ్వు అవతల ఉన్నావో, ఇవతల ఉన్నావో నీకే తెలియదు

తను వస్తుందా రాదా, తను వచ్చి
నిన్ను వెలుపలకి వేస్తుందా, లేక తన తనువు ఇచ్చి నిన్ను

లోపలకి పిలుస్తుందా అని కూడా తెలియదు నీకు:
సమస్య అంతా లోపలెవరో, బయటెవరో అని. తెలీనితనమల్లా తను

ఎవరో నువ్వు ఎవరో అని, కిలకిలా నవ్వే పిల్లలు నిన్నెలా చూస్తారోనని:

రాత్రి గోడ మీద పావురాళ్ళు, ఆ గోడల రాత్రుల్ల మీద సాలెగూళ్ళు
వాటి మీద వాటితో పాకుతూ ఏవో అల్లుతూ కూర్చుంటావే నువ్వు

అప్పుడు అక్కడ ఏమనిపిస్తుంది నీకు? అరచేతిలో బాకుని దాచుకుని
నిద్రమాత్రలతో ఎవరో ఊపిరి ఉరికై నువ్వలా ఎదురు చూస్తున్నప్పుడు?

తెరిచి ఉన్న తలుపులతో ప్రేమ గీతాలు రాయకురా అని అతనే చెప్పాడు
తెరిచి ఉన్న హృదయాలతో స్త్రీలని నమ్మకురా అని అతనే రాసాడు

తెరువక, మూయక లోపలి రాక, బయటకు పోక
పూలపాత్రల్లో సూర్యరస్మిని తనకి దాచకని ఉంచకని నీకు చెప్పక చెప్పింది ఎవరు?

ఇక ఒక రాయి శరీరంలోంచి ఒక వింత విషంతో విచ్చుకుని
సీతాకోకచిలుక రెక్కలతో పురి విప్పి ఆడటం మొదలయ్యింది ఇప్పుడే: ఇక రాత్రీ లేదు

నువ్వు తలదాచుకునే చోటూ లేదు. వస్తావా నువ్వు
ఈ ముగ్ధ మనోహర నరబలి స్వప్న వీక్షణానికి, అతడికి ముందూ తరువాతా

తనకి బయటా తన లోపలా ఏమీ కాని తనంతో, ఏమీలేనితనంతో ఒక్కసారి?

సామాజిక వృక్షం (అను) సమాజ వాచకం

లోకం ఆగిపోయింది
తెరలతో, ముఖంలేని పుస్తకంతో కాలం తిమ్మిరెక్కింది

చదరపు శీతల గదులు, రహదారులలో శిలలైన మనుషులు. నిన్ను
సర్పలై చుట్టుకునే చేతులూ, కళ్ళూ ఎవరివో కాళ్ళూ: ఇక నిన్ను కనని ఇనుప గర్భాలు -

ఏదైనా ఉందా నీది ఇక్కడ
ఏదైనా ఉందా నీది అనుకునే నీదైన, నువ్వైన నీది ఇక్కడ

ఈ నీ ఉదయాలు, నువ్వు నీ ఫ్రిడ్జ్ లో దాచుకునే మొన్నటి పాలు
ఈ నీ రాత్రుళ్ళు, నువ్వు నక్షత్ర ప్రసారాలలో మునిగే శృంగార కార్యక్రమాలు
ఈ నీ పిల్లలు, నువ్వు భద్రంగా బీరువాలో దాచుకునే ఖాతా పుస్తకాలు
నువ్వు బ్రతికి ఉన్నావో, మరణించావో అని తలంచే ఆ స్త్రీ ఆ తల్లీ ఆ తండ్రీ
నువ్వు విసుగు పుట్టినప్పుడు తిరగవేసే వినోదపు పత్రికలు
ఈ నీ సాయంత్రాలు నువ్వు మ్రోగించే మధుపాత్రాలూ, లోహ శబ్ధాలు-

కాలం ఆగిపోయింది, అద్దంలో లోకం లిఖితమయ్యింది
నిరంతర 'నువ్వు' అనే తెరలలో, ముఖాలలో శరీరం వ్యసనమైపోయింది

ఉంది ఉంది అనుకున్న చోట, హృదయంలోంచి ఒక నల్లని సర్పమే
ఎలుగెత్తి నిను మొహిస్తూ ప్రేమంత విషం కక్కుతుంది ఇక్కడ-

వీటన్నిటిలో ఎక్కడున్నావురా, వీటన్నిటిలో ఎక్కడ మునిగిపోయావురా
వీటన్నిటిలో ఎక్కడ తప్పిపోయావురా
హితుడా, సన్నిహితుడా మిత్రుడా నా ప్రియమైన శత్రువా?

24 January 2012

ఏం చెప్పొద్దు నువ్వు

ఏం చెప్పొద్దు నువ్వు
రాలిన కళ్ళను తీసి రాత్రిలో, రాళ్ళల్లో నాటాను

అరచేతిలోంచి ఓ కల రాలిపోయింది
రెండు చేతుల మధ్య నుంచి ఒక శరీరం తొణికిపోయింది

నుదిటిపై లోతుగా దిగిన నీ పెదాల ముద్ర
నిరంతరం నెత్తురు చిప్పిల్లే త్రికాలాల శిక్ష

ఇక ఏం చెప్పొద్దు నువ్వు

ఆనాటినుంచే రాత్రి, కన్నీళ్లు చిందే ఒక రాయిగా
నా హృదయంలో నిదురించడం మొదలయ్యింది

ఇక ఏం చెప్పగలను?

వ్వె వ్వె వ్వే...

నన్ను పొగిడే వాళ్ళే నాకిష్టం
పొగిడినంత పొడుగ్గా పెరుగుతా, ఇంకా కొన్ని పదాలు పొదుగుతా

ణా ముక్కు ఖండాలు దాటింది
ణా చేతులూ, ణా వాఖ్యలూ భూమిని మొత్తం చుట్టేసాయి

ఆదీ నేణే , అంతం నేణే
మంచీ నేనే, మహా అధ్బుత రాతగాడినీ ణేనే

ఇంత గొప్ప కవిత్వం రాసారెవరు?
ఇంత మహా కధలు చెప్పారెవరు?

ఆదియందు నేనే, ఆధ్యుడను నేనే
ణా కీర్తి యందు దశదిశలా వెలుగొందే భానుడను నేనే

ఆహ్హ... ఎంత పొగడ్తకు అంత దక్షిణం
రాసిన దాన్ని చచ్చేవరకూ బూరలూపుకుంటూ తిరిగే జ్ఞానం

ఆహ్, నన్ను పొగిడేవాళ్ళే ణాకు మహా ఇష్టం

చూసావా శరీరమంత సాగి
శరీరాన్ని నింపాదిగా నాక్కుంటూ కూర్చున్న నువ్వనే నాలికని?

ఒట్టిగా/ ఒట్టి ఓటి రాత

నువ్వేమైనా రాసి ఉంటావేమోనని వస్తాను ఇక్కడికి, నీ వద్దకి-

ఆకులని తాకి వీడిన గాలి తిరిగి, తిరిగి తిరిగి వానతో వచ్చి
అదే ఆకుల్లో, అదే కొమ్మల్లో స్థిరపడి స్థిమితపడ్డట్టు-

తెలుసు నాకూ, నీకూ: ఇవన్నీ ఒట్టి పదాలని, ఒట్టి ప్రతీకలనీ
వలయమైన నీటిలో తేలే ఈనెపుల్ల వంటి కదలికలనీ కథలనీ

ఎక్కడో ఏరుకుంటాను, రంగు రంగుల గులకరాళ్ళని. దాచుకుంటాను వాటిని
గూట్లో పుస్తకాల వెనుక పుస్తకాలలో: పొందికగా అమర్చుతాను వాటిని
నువ్వు చదివే ఈ అక్షరాల చుట్టూ- రాత్రుళ్ళు తలగడ కిందుగా దాచుకుని
నదులని కలగంటాను, నిదురలో నుదిటిపై నీ చల్లని అరచేతిని ఊహిస్తాను
కలలో వినిపించిన సన్నటి నవ్వు మెలుకువలోకి తొలుచుకు రాగా

దాచుకున్నవన్నీ తప్పక ఎప్పుడో ఎక్కడో పారవేసుకుంటాను

తెలుసు నాకు ఇవన్నీ నిలువవని, అయినా కొన్ని మాటలనే నమ్ముకుంటాను
నీతో ఈ శరీరంతోనే మాట్లాడతాను, నీ శరీరాన్నే మాట్లాడతాను
నీ వద్దకే, నువ్వు రాసి ఉంటావనే నీ పదాల వద్దకే తిరిగి వస్తాను-

వడలిపోనివ్వకు పూలపాత్రలోని నింగిగులాబీని
రాలిపోనివ్వకు గులాబీ రేకులలలోని రాత్రుళ్ళని
ఆరిపోనివ్వకు పెదాలపై కదులాడే తడినీ-

ఇంతకు మించీ, ఇంతకు మినహా నాకు తెలిసి
పెద్దగా చేసేదేమీ లేదు ఇక్కడ, పెద్దగా సాధించేదీ ఏమీ లేదు ఇక్కడ- అందుకనే

అందించు ఇక నీ చేయిని, దానిని నా అరచేతులలో పదిలంగా పుచ్చుకుని
ఈ వాక్యం చివర నాకై, నీకై నిలిచిపోతాను నేను =

21 January 2012

ఇరువురు

నీకు ఇరువైపులా ఇద్దరు: నీకు నువ్వే-
మెడ చుట్టూ చేతులు వేసి ఒకరు, అరచేతిని పుచ్చుకుని లాగుతూ మరొకరు

ఇరువైపులకూ లాగుతూ ఇద్దరు: నీకు నువ్వే-
అంతం వైపుకు ఒకరూ, మొదలు వరకు ఒకరూ, మధ్యలో మరొకరూ: అదీ నువ్వే.

నీటి చెలమ చుట్టూ మొలచిన గడ్డిరెమ్మలు
రాత్రి కాంతికీ, వెన్నెల తాకిడికీ కదులుతాయి: ఎటువైపో, ఎందుకో నీకు తెలియదు
చీకటి చెట్లలో జలదరించిన గాలి, వెనుదిరిగి
కన్నుల తడినీ వొలికిపోయిన అరచేతులనీ ఇస్తుంది: ఇరువురిలో ఎవరికో నీకు తెలియదు

రెండుగా అయిన కలనీ, రెండుగా మారిన శరీరాన్నీ
ఈ భూమి నిండుగా కౌగలించుకుని ముద్దుపెట్టుకుంటుంది. ముద్దు ఒకటే, పెదాలే రెండు:
మూడుగా అయిన కాలాన్నీ, ఏడుగా అయిన విశ్వాన్నీ
నీ చేతులే దరి తీసుకుని దారీ తీరం చూపిస్తాయి. ప్రమిదె ఒక్కటే, కాంతి ఒక్కటే
మృత్యువు రాకుండా కాపాడే అరచేతులే రెండు

నువ్వు ఎదురుచూసే వర్షం ఒక్కటే, చినుకులే రెండు, మూడు...
నువ్వు నాటే విత్తనం ఒక్కటే, మొలకెత్తే ఆకులే రెండు మూడు...
నువ్వు నవ్వే నవ్వు ఒక్కటే , ప్రతిధ్వనే రెండు మూడు నాలుగు..
నువ్వు కావలించుకునే శరీరం ఒక్కటే, తిరిగ పలికే పలుకులే అయిదు ఆరు ఏడు...
నువ్వు ప్రేమించే ప్రేమ ఒక్కటే, జననించే కారుణ్యం తొమ్మిదీ, ఎనిమిదీ ఏడు...
నువ్వు మరణించే మృత్యువు ఒక్కటే, కన్నీళ్లు కారే కన్నులే ఒకటీ రెండూ మూడు...

నీకు ఇరువైపులా, నీకు నీకులా, నీకే నీకు ఇరువురూ:
గుండెలో దాగుని, ఒడిలో చేరి

నీ మైదానాలలో కురిసే దుమ్ము వర్షాలలో గెంతే పిల్లలే ఇరువురు
నీ ముంగిట వాలి నీ ముందు పూవుల్లా మారే సీతాకోకచిలుకలే ఆ ఇరువురు
నీకు ఇరువైపులా, నీ ముందూ వెనుకా, నీ చుట్టూతా
నువ్వు ఒదులుకోలేని, నువ్వు కోరుకోలేని ఇరువురు: నువ్వైన, నీ ఇరువురు!

ఇక నీకు బ్రతకడమెలాగో మరొకరు చెప్పాల్సిన పనేముంది?

నగర అర్థ/ రాత్రిలో, రహ(స్య)దారులలో మిగిలిన వోడ్కా రాత్రి

గజిబిజి గీతల నల్లటి ఆకాశం, అర్థాంతరంగా మూసుకున్న కనురెప్పల చీకటి ప్రదేశం

ఆ రోజు, ఆ రాత్రి, చారికల చందమామ చీరికలైన మబ్బులపై చీల్చుకుపోయి
నెత్తురు చిప్పిల్లిన అరచేయి అయ్యింది: ఆ కధే ఇది.

తెల్లని గులాబీ మొగ్గల కన్నులతో, తెల్లని చల్లని మెత్తని చిరునవ్వుతో ఆ చిన్నారి
తన హృదయాన్ని గాలికి కదిలే, రాత్రి పొదరిల్లుకి పూసిన చుక్కలకి ఇచ్చివేసింది

ఆనక అనుకోకుండా అతడి ఆవరణలో, తన దూరంలో ఒక ఇంటిలో జల్లు కురిసింది

అతడి హృదయం, అతడి శరీరం

చినుకులతో రాలిన ఆకులతో, కొమ్మల మాటున దాగి రెక్కలు ముడుచుకుంటున్న కాకులతో
దారిన ఆగిన చిరిగిన కాగితాన్ని తమతో లాక్కువెళ్ళే గాలులతో నిండిపోయింది

ఎవరైతే ఉండీ వొదిలివేసారో, ఎవరైతే ఉండీ వెళ్ళిపోయారో, ఎవరైతే వెళ్ళిపోవడంతోనే
తిరిగివచ్చి మిగిలిపోయారో, అటువంటి వాళ్లు ఇచ్చిన కట్టెలతోనే
వాళ్ళు ఇచ్చిన కట్టెలపైనే వాళ్ళ ముద్రలతోనే అతని హృదయం
అతడి శరీరం, అతడి లోకం తగలబడి/పోయింది. ఇక ఈ వేళకు

వెన్నెల నుంచి వానతో, వానలోని సంపెంగ పూల పరిమళంతో, బోల్డంత నవ్వుతో
కళ్ళల్లో పూదోటలతో తిరిగి వచ్చిన, తిరిగి తిరిగి వచ్చిన చిన్నారికి
'నాన్నా' అనే అన్నం ముద్దను కలిపి, తన కథలతో పెట్టే వారెవరు?

గడపవద్ద, గడపవలె అటూ కాక ఇటూ కాక, ఆ ఇంటి లోపలికీ ఇంటి వెలుపలకీ కాక
శరీరం లోపలా శరీరం బయటాకాక ఒక స్త్రీ తనువు నిలువెల్లా పురుషులతో, భర్తలతో
తన తనంతో తన తనువుతనంతో తల్లితనంతో ఆ ఇతరత్వంతో
అలసిపోయి, పులిసిపోయి ఒక్కత్తే, ఒక్కతిగా నిదురపోయింది:

గజివిజి గీత నల్లని ఆకాశంలో, మూసుకున్న కనురెప్పల చీకటి ప్రదేశంలో
ఇక పాప ఒక్కటే రాత్రంతా ఎదురుచూస్తూ కూర్చుంది

ఇక అతడే, నేనే ఆ రాత్రి అంతా రాత్రితో పాటు రాత్రిగా మారి
గంజాయి మంచుతో ఊగే ఒక గడ్డిపూవుతో సరి/తూగాడు

బ్రతికి ఉన్నావా, చచ్చిపోయావా, లంజా/కొడకా
తిన్నావా తినలేదా అని ఎవరూ తననీ అడగలేదు, నన్నూ అడగలేదు.

19 January 2012

.................ఎవరు?

ఎవ్వరూ అడగరు నిన్ను
ఎక్కడి వెళ్ళిపోయావని, ఎందుకు వెళ్ళిపోయావని

చిట్లిన నీడల చుట్టూ తచ్చట్లాడుతూ
మధ్యాన్నం పూసిన ఎండని

గోడపై ఒంటరిగా ఉన్న అద్దంలో తురుముతూ
ఒక్కడే అతడు: ఒంటరిగానే అతడు. ఎప్పుడూ

'ఎందుకు'గానే, 'ఎన్నడూ'గానే, ఒంటరిగానే అతడు.

అందుకని ఇక ఈ వేళకు
స్నానాల గదిలో నువ్వు అంటించి మరచిన
నీ నుదిటి సింధు బిందువు నెత్తురులో

ఒక్కసారిగా మిళితమయ్యి, అనేకంగా అంతమవుతారు
రాత్రీ అతడూ, అతడూ తన తనువూ. (ఒంటరిగానే)

ఇంతకూ, ఇంతగా శిక్షించబడే సుఖాన్ని ఇచ్చి
నిత్యం పరదాలమాటున దాగి ఉండే ఆ నువ్వు:

..........................................................ఎవరు?
నవ్వకు. ...............ఇంతకూ ఎవరు? ఆ నువ్వు?

18 January 2012

అస్థిమితం

నిలకడగా నిలువాలేవు, నింపాదిగా కూర్చోలేవు

కాటుక రాత్రి అంటిన ముఖాన్ని తుడుచుకుని ఎదురుచూడాలేవు
కనుపాపని చీరిన కొనగోరు ఎవరిది అని అడగాలేవు
ఆకాశమంత విశాలంగా విస్తరించిన ఆ సమాధిలోకి
హృదయాన్ని పంపించాలేవు, అలా అని ఎవరినీ మరువాలేవు

ఏం చేస్తావు నువ్వు, ఏం చేయగలవు నువ్వు? ఏం చేసీ ఏం చూసీ
ఎవరిని కాదని ఎవరిని ఔనని ఇలా మిగిలిపోయావు నువ్వు? ఇలా
మిగిలే పోయావు నువ్వు? రాలే పోయావు నువ్వు? ఇంతాచేసి

అలా నిలకడగా ఉండాలేవు, అలా నింపాదిగా బ్రతుకాలేవు.
మనుషులకు దూరంగా పారిపోనూలేవు, దరి చేరనూలేవు

ఎవరి చేతివేళ్ళ చివర్లలోనో పూసిన మంచుపూలు
నిన్ను నిలువెల్లా తడిపి తడిపి, కుదిపి కుదిపి
నిన్నొక శవంగా మార్చి తగలపెడుతున్న వేళల్లో

చెప్పు నాకు, నిజానికి ఏ నీడల చినుకుల గూళ్ళల్లో
ఏ ఏ నీడల బాహువుల్లో, ఏ ఏ బాహువుల వి/స్మృతి
విష దర్పణాలలో ముఖాన్ని ముంచుకుని ఏ ఏ ముఖాలని తోడుకొని
తలదాచుకుని రోదిస్తావు నువ్వు?

16 January 2012

చాలదా ఇక?

అలా నవ్వుతూ, నీకు దూరంగా జారిపోతూ, తన వెనుకగా దాచుకున్న
ఆ బాలుడి లేత గుప్పిళ్ళలోనే ఒక మహావిశ్వం దాగి ఉంది: చూడు

మెరిసే ఆ కళ్ళనూ, పాలరాతి పూలనూ
పెదాలపై కురుస్తూన్న హర్షపుజల్లునూ:

తననే , నిన్ను మెల్లగా తాకిన తననే తనవితీరా ఒక్కసారి నీ గుండెకు హత్తుకుని
మంచు వెన్నెల రాలే, మల్లెపూల పరిమళం కురిసే తన ఆ ముఖాన్నే
తనవితీరా ఒక్కసారి చూసుకుని, ఇక ఆ తెల్లని మెల్లని చూపులలోకి

ఆ నునుపైన చేతివేళ్ళ చివర్ల ఆహ్వానానలోకి నువ్వు
తెల్లగా, మెలమెల్లగా, చల్లగా పాదం మోపాక

మరణమైనా, జననమైనా స్వర్గమైనా నరకమైనా
అనంత లోకాల అనంత కాలాల
పురాకృత జీవితమైనా, ఇక ఏది

బయపెట్టగలదు నిన్ను? ఇక ఏది
ఎలా ఆపగలదు నిన్ను? చాలదా

ఇక ఈ ఆ ఒక్క అమృతమయ మృత్యుక్షణం, ఈ ఆ లిప్తకాల వీక్షణ మోక్షం?

రాత్రంతా

రాత్రంతా వెలుగుతూ ఒక దీపం, అవతలగా ఇవతలగా-

లోపలో, బయటో తెలిసేదెలా
తను ఏమిటో తెలియని తన మనిషికి?

రాత్రంతా కాలిపోతూ, రాత్రంతా రాలిపోతూ
తన చితాభస్మాన్ని తానే ఏరుకున్న ఒక

అనామక ఒంటరి దేశ దేహ ద్రిమ్మరి: ఇక
తన దేహంలో అతడి అస్థికలని కలుపుకొని

తను నిదురలేచి లోకాన్ని నిదురపుచ్చింది

ఇప్పుడే! ఇక్కడే! అంటుకున్న ఈ కాగితపు
సరిహద్దుల నలుపు అంచులలోనే!

14 January 2012

అది నువ్వేనా?

ఆ రాతిరి దారులలో, ఆ హృదయ ద్వారాలలో అక్కడే, నువ్వుండే చోటే

రాలిపోయారు ఎవరో, ఏమీ చెప్పలేక ఏమీ అనలేక
ఎవరికీ ఏమీ కాక ఎన్నటికీ తానేమిటో తెలియరాక:

పెరికివేసాక వాళ్లు నీ కన్నులను, తడుముకుంటూ ఈ లోకంలో
తిరుగాడుతూ ఒక శోకంతో ఒక శాపంతో

స్పృహ తప్పి పడిపోయిన, ఈ నేలా ఆ నింగీ శోకించిన
ఆ నీలి కళ్ళ కన్నీళ్ళ మైనా నువ్వేనా?

12 January 2012

ఆ/ప్రధమ పాపి

చీకటితో చీకటిలో బల్లను పేర్చి, ఆటువైపూ ఇటువైపూ ఆ ఇరువురికీ
నీకొకటీ నాకోకటీ కుర్చీలు వేసాను

రాత్రి కూజాను నక్షత్రాలతో నింపి, బల్లపై మధుపాత్రను
అతి దివ్యమైన కాంతివలె ఉంచాను, నిన్ను పిలిచాను

తెరిచి ఉంచిన తలుపులు, తెరిచి ఉంచిన తలపులు
అరవిరిసిన మన వదనాలు, ఎదురుచూసీ చూసీ ముకుళితమయిన అలసిన మన హస్తాలు
ఎదురుగా దారి లేక విలవిలలాడే ఆ కీటకపు రెక్కలు. పదునైన కాంతిని కోస్తున్న చూపులు

ఎవరిదో ఊపిరి ఊపివేస్తుంది ఇక్కడ ఆ చిక్కటి అశోకా వృక్షాలను
ఎవరిదో చేయి నిమురుతోంది ఇక్కడ గుడ్లను పొదిగే పావురాలను
ఎవరిదో రహస్య స్వరం తరుముతుంది సంకేతమై పిలుస్తోంది ఇక్కడ
వొడలు జలదరించగా, ఉలిక్కిపడి లేచి రాత్రిలోకి కదిలే పిల్లులను

ఇక ఏమీచేయలేక ఇక ఏమీ కాలేక ఇక ఏమీ కానరాక ఇక

కొంత నొప్పి కొంత దిగులు ఇక్కడ
ఆ కొంత శోకం కొంత గానం ఇక్కడ

ఇక ఆ కొంత స్మృతీ కొంత విస్మ్రుతీ ఇక్కడ
కొంత శాపం కొంత వరం ఇక్కడ: ఇకందుకే

తన
శిరోజాలను అలలుగా ఎగురవేసే ఆ పరిమళపు గాలి
తిరుగాడుతుంది ఇక్కడ. నిన్ను గుప్పిళ్ళలోకి తీసుకుని
ఆనక తీరికగా అరచేతులు తెరిచి నిన్ను ఉఫ్ మని ఊదే
తన వలయాల నవ్వు ప్రకంపిస్తుంది ఇక్కడ. వొంటి చుట్టూ
చేతులు చుట్టుకుని, తను మిగిల్చిన వొంటరితనం తడినీడై
నిన్ను నిస్పృహగా తాకుతుంది ఇక్కడ

ఇక ఏమీ చేయలేం, ఇక ఏమీ కాలేం: చీకటిలో చీకటిని చీకటితో పేని
ఒక బల్లను ఆ అనంత శూన్యంలో ఆకాశంగా పరిచాను
భూమి కూజాను సముద్రాలతో నింపి, బల్లపై ఉంచాను
ఆ మధుపాత్రాలను నింపాను, నిన్నే పిలిచాను. రా మరి

మధువు తాగి మత్తిల్లి, విశ్వాన్ని కప్పుకుని సప్తలోకాలలో
సప్త కాలాలలో తిరిగేందుకు ఇదే సరైన సమయం ఇక్కడ

11 January 2012

ఆ ఒక్క చోటు

ఇరువైపులా ఇద్దరు. మధ్యలో, మధ్యగా అర్ధాంతరంగా సమాంతరంగా
ఇరువురినీ విడదీస్తూ ఆ ఇరువైపులా ఒక్కరే

బల్లపై నిలిచిన పూలపాత్ర. నీటికి చెమ్మగిల్లిన రెమ్మలు
ఎవరివైపు వొంగాలో తెలియక వడలిపోతూ
తలలు వొంచి ప్రార్ధిస్తాయి, సన్నగిల్లుతున్న

ఉదయపు తోటల పరిమళాన్ని సాయంత్రానికి
వొదిలివేస్తాయి, రాత్రికి బలి ఇస్తాయి: ఏమో

ఇక ఒక జాబిలి గదిలోకి పలకలు పలకలుగా రాలిపడవచ్చు
ఒక వర్షపు తెర పదునైన గోళ్ళతో ఆ వదనాలని చీల్చవచ్చు
ఒక అన్నం ముద్ద అరచేతిలో అలా ఎండిపోతూ మిగలవచ్చు

ఒక మంచం, ఒక దుప్పటి
ఒక దిండూ, ఒక దేహం స్వ
దేహం కోసమే దాహంతో పిడచకట్టుకుపోయి, పాడె కట్టుకుపోయి
ఖననానికై, దహనానికై ఎదురుచూస్తుండవచ్చు

ఆ రెండు చేతులూ, ఆ రెండు కాళ్ళూ
ఆ రెండు కళ్ళూ, ఆ రెండు పెదాలూ
మరో రెండుకై, అంధులై అద్దాల చీకటిలో తిరుగాడుతుండవచ్చు
ఎప్పటిలోకో, ఎవరికోసమో, ఎందులోకో రాలిపోతుండవచ్చు రాలి
పిగిలిపోయి ఏమీ కాకుండా ఎవరికీ లేకుండా మిగిలిపోతుండవచ్చు

ఇరువైపులా ఇద్దరు. ఇరువైపులా ఇద్దరిలో ఒక్కరు. మధ్యలో
ఒక్కరిని ఇరువురిని చేస్తూ, ఇరువురిని ఆ ఇద్దరిగా విడదీస్తూ

రెండుగా, అనేకంగా చీలిపోయిన
చెమ్మగిల్లుతూ వడలిపోతున్న వొణికిపోతున్న
ఆ ఒక్క సప్తరంగుల శ్వేత పుష్పమే
ఆ ఒక్క సప్తరంగుల నీలి తనువే -

కుంచించుకు పోతున్న ఆ ప్రమిదె కాంతిలో
వెడలిపోతున్న ఆ రెండు శరీరాల ఒక్క నీడే!

ఇంతకూ నువ్వు వచ్చావా ఎప్పుడైనా ఎందుకైనా
ఆ ఇద్దరు ఎదురుచూస్తున్న ఆ ఒక్క చోటకి?

10 January 2012

విస్మయం/సమయం/అవిస్మయ ఆసమయం

1.

నిదురించు నిదురించు నిదురించు
స్వప్నించు స్వప్నించు స్వప్నించు

మొదలకి మునుపూ, చివరికి చివరా
తరువాతా అంతకు మునుపూ

నీ నా రాసిన వాక్యాలకే ఎటువంటి గూడూ లేదు

2.

వీచిన గాలికీ, రాలిన ధూళికీ
ఎగిరిపోయింది తన ముఖం

అతడే, నీచే ఊహించబడి నీకై తనని తాను వొదులుకున్న అతడే
నువ్వు అడిగిన ఆ పూలను ఎప్పుడూ, ఎన్నడూ తీసుకురాలేదు.

౩.

అనుకోని సమయం, అపరచిత వర్షం

తడిచి ముద్దైన రెక్కలతో ఆకులలో
మునగదీసుకున్న ఆ కొమ్మలలో

సర్పమణి కాంతులతో చల్లటి గాలి
జరజరా పాకుతోంది నల్లటి రాత్రితో:

తన చుట్టూ తానే చుట్టకుని
తన చుట్టూ తానే కప్పుకుని
వొణుకుతున్న ఇంట్లో, ప్రమిదె వెలిగించినది ఎవరు?

4.

ఎగిరిపోయిన తన అనేక ముఖంపై
నిలిచిపోయిన ప్రశ్నార్ధక చిహ్నం

నిలిచిన నీటిలో, నిలువని నీడలలో
కదిలిపోయే కాలం, లోకం

గొడుగుల కింద దాగని ఆ శరీరాలలో
ఒక మౌన రాగచిహ్నం, నీ నిశ్శబ్ధం

ఎదురయ్యే, మలుపులో మలుపయ్యే
తలపయ్యే మరుపయ్యే హృదయం: తను తన చేతులని
అతని కనులలో ముంచి వెళ్ళిపోయాక
ఇక తుడిచేదెవ్వరు తుడవబడేదెవ్వరు?

5.

ఉన్న రాత్రి, ఉన్న కాంతి. లేకున్నా, కాకున్నా
నువ్వున్న, నువ్వున్నావనే ఒక భ్రాంతి

రెండు చేతుల మధ్య విచ్చుకున్న దూరంలో
లోతైన అద్దంలో మునిగిన తన ముఖంలో
అల్లుకుంటుందో సాలెగూడు ఆగక అలసటై

కూజాలో కరుగుతున్న ఆ నీళ్ళు
గోడలపై చిట్లుతున్న ఆనవాళ్ళు:
విత్తనం చిట్లిన శబ్ధంలో తల్పంపై
తెలుపౌతున్న తన శిలాశిరోజాలు
తన చాతిపై దిగే లోహనఖక్షతాలు

ఒక శ్వేత దేవతా అశ్వం మట్టిని చీల్చుకుని
వానై వచ్చింది ఇక్కడ: చూసావా నువ్వు
ఆ మృత్యు మోహిత జీవిత కాంక్షితను?

6.

వీచి వెళ్ళిపోయిన గాలికీ, రాలి వెళ్ళిపోయిన ధూళికీ
రాయై దూళై రాత్రి మిగిలిపోయింది తన ముఖం

తను అడిగిన తను దాచిన అతనికి దొరకని పూలను
ఎన్నడూ, ఎవ్వరూ తీసుకురాలేదు

రాత్రి కురిసి వెళ్ళిపోయిన పగటి ఛాయలలో జాడలలో:

7.

నిదురించు నిదురించు నిదురించు
కలహిస్తూ స్వప్నించు స్వప్నించు

మొదలకి మునుపూ, చివరి చివరా
ఆ తరువాతా, అంతకు మునుపూ

నీ శ్వాసలో నా శ్వాసతో రాసుకున్న పదాలకే
ఎటువంటి గూడూ లేదు, ఎటువంటి నీడా లేదు:

ఇక బ్రతికేదెవ్వరు? మరణించేదెవ్వరు?

వేరేగా

గుబులుగా కూర్చుంది దిగులు కపోతం
రాత్రంతా వొంటరిగా, రాతి పలక మీద=

వెన్నెల మరకలూ చీకటి చినుకులూ
దాని ఒళ్లంతా: ఆగి ఆగి, అగాగీ ఆగక
గ్ళుక్ గురర్ గ్ళుక్ ఉర్ర్ర్ర్రూర్ మని రాత్రంతా రాత్రి రాతి సమయమంతా-

పిలుస్తోందా అది రోదిస్తోందా అది ఏమైనా చెబుతోందా అది
అది, అదే తెలియదు నీకూ నాకూ, నాకూ
నా కళ్ళలో నీళ్ళు నింపుకున్న నీకూ, నీ చూపులకూ, నాకూ.

దిగంతాల నుంచి తీసుకువచ్చిన ఖడ్గదంతాలతో గండుపిల్లులు
ఆదిమ సృష్టినుంచి ఆ ప్రభువు నుంచి తీసుకువచ్చిన ఆకలితో
అసహనంగా, ఓపికగా, ఆ మెత్తటి రెక్కల వద్దకే పాకే సర్పాలు
నునుపైన మెడ చుట్టూ అల్లుకుని ఆపై శరీరమంతా చుట్టుకునే
పవిత్రమైన తొలి పాపపు చేతివేళ్లు, ఆ ఆదిమ కోరిక ఆనవాళ్ళు

దట్టమైన అడవుల్లో, ఆ చిమ్మచీకటి వశించే గుహలలో
మహా జలపాతాలలో, లంఘించే చురుకైన మృగాలలో
తొలి జననంలో మలి మరణంలో తొలి మలి జీవనంలో
ఆ వెన్నెల మరకలే ఆ చీకటి చినుకులే ఆ రాత్రంతా: (నీకూ నాకూ తనకూ) :అందుకే

గుబులుగా కూర్చుంది దిగులు కపోతం రాత్రంతా, పగలంతా
వొంటరిగా, వొదిలివేయలేనంత విచారంగా, విషాదంగా

ఇక ఆ రాత్రికి మునుపూ, ఇక ఆ రాత్రికి తరువాతా నేనెన్నడూ
తనని తాకలేదు. తనని తాకి తిరిగి నేనెన్నడూ నిదురించలేదు.

ఇక నువ్వు: ఇక నిన్ను నువ్వు నీకై ఊహించుకునే నీకు
అద్దంలోంచి అద్దంలోకి మెరుపుల పరిమళంతో సాగిపోయే
నీకు చెప్పానా నేను ఎన్నడైనా ఇష్టపడుతున్నానని నిన్ను

కనీసం అబద్ధంగానైనా? కనీసం ప్రతిబింబంగానైనా?

07 January 2012

మూర్ఖుడు

కొంత తక్కువ, కొంత ఎక్కువ: అలా అని తన ముందూ కాదు
అలా అని తన తరువాతా కాదు

అలా అని ఎదిగినంత కాదు. అలా అని ఎదగలేకా కాదు.
అలా అని తాకాననీ కాదు, అలా అని తాకలేకా కాదు.
ఏంటంటే ఎదిగిన హృదయం ఏదీ లేదిక్కడ. అందుకని

అందుకనే అతడి శరీరం భస్మీపటలం అయ్యింది ఇక్కడ. అందుకనే

అతడి కనులు హిమసుమాలు అయ్యాయి ఇక్కడ. అందుకనే
నీ చూపుడు వేలిని అతడి అరచేయి వొదిలివేసింది ఇక్కడ
అందుకనే నీ చూపు చిహ్నంగా అతడికి మిగిలింది ఇక్కడ

అలా అని ఎదిగానని కాదు. అలా అని ఎదగలేకా కాదు. అలా అని
నీ ముందనీ కాదు, అలా అని నీ తరువాతా అని కాదు.

నిన్ను ఆపలేక, నిన్ను ఓపలేక, నిన్ను రాయలేక
ధరిత్రిన కుంగి, తనని తాను దహించుకుని
అనంతం నుంచి అనంతం దాక నుదిటిన నీ ముద్రతో
నిదురించినది అతడేనా?

06 January 2012

నువ్వు చూస్తావనే

నువ్వు చూస్తావని, చూస్తావనే రాస్తాను ఈ నా నీ పదాలని

నువ్వు చూస్తావనీ, తాకుతావనీ, తాకబడి
వొణికిపోతావనీ వొదిలివేస్తాను ఈ పదాలని
అందుకనే గాలిలోకీ, ఆకాశంలోకీ నేలలోకీ
పూవుల్లా, తొలి ప్రేమికుల తొలి గుసగుసల్లా:

అరచేతుల మధ్య చుబుకాన్ని ఇరికించుకుని నువ్వలా
గాలికి దొర్లుకు వెళ్ళే చిన్ని పసుపు ఆకులను నువ్వలా
కోల్పోయినతనపు చూపులతో సాగనంపుతున్నప్పుడు

ఈ పదాలేమైనా పూవుల్లాంటి పిట్టలై, సీతాకోకచిలుకలై
నీ నిశ్శబ్ధంలోకి వొలికి నిన్ను కొంతసేపు కాంతివంతంగా
తొణికిసలాడేటట్టు చేస్తాయామోనని రాస్తాను ఈ పదాల్ని

రాస్తూ వొదిలివేస్తూ, ఈ నీ నా పదాలను, నీకు ఏమీ కాకుండా మిగిలిపోతాను
రాస్తూ వొదిలివేస్తూ, వొట్టి పదాలుగా, వొట్టి మూగ పెదాలుగా మూగపదాలుగా
ఈ నా నీ పదాలుగా మిగిలిపోతూ నీకు అపరిచితం అవుతాను:

మృత్యువు ఇంతకంటే మరేమీ కాదు, మరేమీ కాబోదు

చూసావా నువ్వు, నీ చుట్టూ రహస్యంగా తిరుగాడుతూ నీ
తనువుని తాకీ తాకక, నీ తనువుని వీడీ వీడక, నీ వెంటే
నీ శరీరపు పరిమళమై నిన్ను చుట్టుకుని, నీ వెనుకెనుకే
గెంతుకుంటూ వస్తున్న పిల్లలలాంటి ఈ పదాల్ని

నువ్వు చూస్తావని, చూస్తావనే రాసిన నా నీ పదాల్ని?

అ/వాచకం (how to write a bad poem. 4)

హృదయంలో ఒక కంత, ఒక వింత చింత

దానిని నేను ఇవాళ శూన్యం అని
పిలువదలుచుకున్నాను: దానికి
ఈవేళ నీ పేరు పెట్టి మరొకసారి స్మృతిగీతం పాడదామని అనుకున్నాను

పూలు తెచ్చాను. నీళ్ళు చిలుకరించాను
కిటికీలు తెరిచాను. వచ్చే పిచ్చుకలకు
బియ్యం గింజలు చల్లాను. మట్టిదొనెలో
వాటికి నీళ్ళు ఉంచాను.
నిన్ను సదా వి/స్మరిస్తూ

నిన్ను మరువక తలుపులు తెరిచి పరదాలు జరిపి
గదిలోకి కాంతిని పిలిచాను. ముఖాన్ని కడుక్కుని

అద్దంలో వదనాన్ని అద్దంతో తుడుచుకుని
ఆ తెల్లటి కాగితం ముందు కూర్చున్నాను
ఒక్కడినే ఆ తేనీరు తెచ్చుకుని తాగాను
నిన్నే నిన్నొకసారి మళ్ళా తలుచుకున్నాను:

బలహీనుడను, భయస్తుడను, పిరికివాడను
ఈ లోకంలో ఇంతవరకూ, ఇప్పటివరకూ
స్త్రీల ముందు ధైర్యస్తుడెవరో ఒకసారి చెప్పు:

రెక్కలు అల్లార్చుతూ తేలి వచ్చే వొంకీలు తిరిగే గాలి
నిదురలో దాగిఉన్న నీ ఊపిరి ఊయలది
తెరలుగా వ్యాపిస్తున్న వెలుతురు వేడిమి

నిదురలో పక్కకు ఒత్తిగిల్లుతున్న నీ మెత్తని శరీరానిది:
ఆగక వినిపించే సవ్వడి తోటలో విచ్చుకునే పూల అలజడి
నీ కలలోని మరొక కలలో నువ్వు పలుకుతున్న పదాలది

బలహీనుడను, భయస్తుడను, గృహస్తుడను
ఈ లోకంలో ఇప్పటివరకూ, ఇంతవరకూ
స్త్రీల ముందు ఖండితం కానివాడెవ్వడో చెప్పు!

అందుకే వెళ్ళాలి: నీ ముందుగానో నీ వెనుకగానో
అంధులమై అస్తవ్యస్తమై అనంతందాకా : మరి ఇక
అందుకే ఈ ఈవేళ హృదయంలో ఒక వింత చింత

దానిని నేను 'నువ్వు శూన్యం' అని సూత్రీకరించాను
దానిని నేను 'నా మరణం' అని పిలువదలిచాను
దానికి నన్ను నేను బలి ఇవ్వదలిచాను. కోరాను

అందుకే, వచ్చి నువ్వు, నవ్వే నాలుగు నల్లని పూలను
నీలాంటి చేదుపూలను ఈ నా శూన్యం సమాధి వద్ద
ఉంచేందుకు, స్మరించేందుకు
ఇదే సరైన సమయం,
అదే సరైన నియమం:

వచ్చావా నువ్వు ఎపుడైనా, నేను రాకమునుపూ
నేను వెళ్ళిపోకమునుపూ ఎందుకైనా?

05 January 2012

ప్రేమ లేదా తప్పిపోయినవాళ్ళు (draft: love is a draft. love is always a draft)

నువ్వంటే నాకు ఇష్టం.

ఎందుకు?

తెలియదు. కానీ నాకు నువ్వు కావాలి.

కావాలా? అంటే ఏమిటి?

నువ్వు నాతో ఉండాలి, ఎప్పుడూ.

ఎప్పుడూ అంటే?

చివరిదాకా.

చివరిదాకా అంటే శరీరం చివరిదాకా లేక
అనుభవం చివరిదాకా?

అదంతా నాకు తెలియదు. కానీ
నువ్వు నాకు కావాలి.

ఎందుకు?

ప్రేమించేందుకు. నేను నిన్ను ప్రేమిస్తున్నాను.

లేకపోతే, ఉండకపోతే ప్రేమించలేవా?

అదేమో అవేమీ నాకు తెలియదు. కానీ
నువ్వు నాకు కావాలి
నువ్వు నాతో ఉండాలి. ఎప్పటికీ-

ఎప్పటికీ అంటే, అంతం దాకానా? అనంతం దాకానా?

అవును. నువ్వు ఏమనుకున్నా సరే
అప్పటిదాకా నువ్వు నాకు కావాలి-

నాకు మరొకరు కావాలనిపిస్తే?

అనిపించదు. నేను ఉన్నాను. నేను నిన్ను
చక్కగా చూసుకుంటాను.

నీకు మరొకరు కావాలనిపిస్తే
మరొకరిని ప్రేమించాలని అనిపిస్తే?

నాది చాలా స్వచ్చమైన ప్రేమ.

అందరూ అలానే అనుకుంటారు అని
నా యుగాల నమ్మిక.

అయితేనేం. చెప్పు. నువ్వు ఉంటావా
నాతో నా జీవితంలో?

(ఆ తరువాత ఇద్దరిలో ఎవరో ఒకరు తిరిగి తిరిగి
తిరిగి రానంత దూరం వెనక్కి వెళ్ళిపోయారు)

ఎవరో వాళ్లు, ఆ ప్రేమికులు
తెలుసా మీకు ఎప్పుడైనా
ఎక్కడైనా ఎందుకైనా చూసారా ఎన్నడైనా?

=నేను నిన్ను ప్రేమిస్తున్నాను.

అంటే ఏమిటి? ఎందుకు?

ఎందుకో ఒకందుకు. కానీ
నువ్వు నాకు కావాలి.

ఎప్పుడు?

ఎప్పుడూ.
(Ad infinitum)=


పోస్ట్-స్క్రిప్ట్:

(కనబడుటలేదు)
ఈ కింద తెలుపబడిన వ్యక్తి వివరాలు ఎవరైనా ఆచూకి ఇచ్చిన
వారికి తగిన పారితోషకము లభించబడును:

పేరు: తెలియదు
ఊరు: తెలియదు
ఎత్తు : తగినంత
గుర్తులు: అప్పుడప్పుడూ సంతోషంగా అప్పుడప్పుడూ రోదిస్తూ
అప్పుడప్పుడూ తత్వీకరిస్తూ అప్పుడప్పుడూ వాదిస్తూ, తనలో
తాను గొణుక్కుంటూ, చాలాసార్లు యంత్రాలతో కలిసి తక్కువసార్లు
మనుషులతో కలిసి (వాళ్ళేవ్వరో అతడికి/ఆమెకీ తెలియదు)

మట్టిలో చిత్రాలని గాలిలో మాటలనీ
వారసత్వపు గుణాంకాలని లెక్కిస్తూ శపిస్తూ ఎవరైనా ఎక్కడైనా
ఎందుకైనా కనిపిస్తే వారు ఈ కింది చిరునామాకి తెలియచేయగలరు:

AFSPB 138664 (PAN)
subcontraries@gmail.com (mail & Facebook account)
lostandneverfound.blogspot.com

మరొక్క మరొకసారి

నీలిమంచులో నిర్మితమౌతున్న ఎరుపు అద్దానికి
అటువైపు తను, ఇటువైపు నీవు

ఆ అద్దం తనువులో తనవితీరా తనువులని ముంచి
తాగుదామని నెత్తురుని పెదాలతో, పదాలతో వాళ్ళు

తన తనువుకు అటువైపు నువ్వు
నీ తనువుకి ఇటువైపు తను, మధ్యలో పాపం పసివాడు
చేతిలో నిన్నటి పుష్పగుచ్చాలతో

మరచిపోలేదు ఎవరూ ఆకుపచ్చటి ఆ సాయంత్రాలని
వర్షపు తెరలు వదనాలని చరిచే ఆ ఈ సాయంత్రాలని
శరీరాలకు అతుక్కుపోయిన ఆ ఈ దిగులు దుస్తులనీ
సన్నగా సాగే పిల్లి పాదాలతో, నూనుగు శిరోజాలతో
నీలోకి జొరబడి గగుర్పొడిపించిన ఆ ఈ సాయంత్రాలని:

నీలిరాత్రిలో నిర్మితమౌతున్న నీలిఎరుపు అద్దానికి
అటువైపు ఉన్న తన తనువునీ, ఇటువైపు ఉన్న నిన్నునీ
ఎవరూ మరచిపోలేదు, ఎవరూ మరచిపోరు

వాడిన పుష్పగుచ్చాలతో రాత్రి నదిలోకి రాలిపోయి
రేపటికి శవమై తేలిన ఆ నీలికళ్ళ అమ్మాయి కూడా-

ఇక ప్రేమించలేక, ఇక రమించలేక తనే, అతడిలోని తనే
ఆ తరువాత వెళ్లి, తెరచి ఉంచిన తలుపులను మళ్ళా
మరొకసారి, మరి ఒకే ఒక్కసారి తెరచి వచ్చింది=

04 January 2012

నీకు. 5

ఒక్కదానివే ఎప్పుడూ నువ్వు నీ ఒక్కదానితోనే

అద్దంలోని నీళ్ళను అందుకుని
అలసిన ముఖాన్నిఅద్దంలో అద్దంతో కడుక్కుని

చీకటిని నుదుట దిద్దుకుని
నీలోకి నువ్వే చుట్టుకుని దిగులు దువ్వెనతో
వంకీల శిరోజాలని విడదీసుకుంటూ

ఒక్కదానివే ఎప్పుడూ నువ్వు నీతోనే
నీ ఒక్కదానితోనే నీ ఒక్కతనంతోనే:

=ఇక ఆ స్వప్నమీనం రాత్రంతా తిరుగాడింది
నీ తనపు తనువు సరస్సులోనేనా?=

03 January 2012

మరచి/పోయినది

మరచిపోయాను, చెప్పడమెలాగో
దిగంతాలకు సాగిన నీ ఎదురుచూసే చేతులకీ కళ్ళకీ
నేను ఎవరో, ఎందుకు వచ్చానో


హృదయాల కోసం తలారులు తిరిగే దేశంలో దేహాలకు చోటు లేదు
సీతాకోకచిలుకలకు తావు లేదు

నీకై తిరిగిన చేతులు, తిరిగి తిరిగి ఆగిపోయాయి ఇక్కడే
నీకై విరిగిన కనులు, విరిగి విరిగి రాలిపోయాయి ఇక్కడే

చెప్పడమెలాగో మరచిపోయాను!
ఏం చెప్పాలనుకున్నానో అడగకు, ఏమీ చెప్పకు

ఎప్పటికీ, ఇప్పటికి= చూడు, చీకటికి తోడైన వెలుతురు
రాత్రికి ఉరివేసుకున్నది ఈ కిటికీ అంచునే:

ఏమని అందాం దీనిని?

తిరిగారు ఇరువురూ
దేశద్రిమ్మరీ దేహద్రిమ్మరీ ఆశువులను అమ్ముకునే అనేక కాలాలలో అనేక రాజ్యాలలో

వెన్నెల కళ్ళలో ఒకరూ వేసవి బాహువుల్లో మరొకరూ

చిట్లిన ఆ మంచు ముఖంతో ఒకరూ
ముఖం లేని ప్రదేశాలలో మరొకరూ

తిరిగారు ఇరువురూ: దేశం లేని దేహంతో ఒకరూ
దేహం లేని దేశంతో మరొకరూ అంతం లేని లోకాలలో ఎవరూ లేని రాని కాలాలలో:

=
నిలువునా చీలిన ఆరడుగుల అద్దపుపేటికలో
ఇరువైపులా చెరో వైపునా చీలి
తనని కావలించుకుని పునర్జన్మించినది ఎవరు?=

(దేహభక్తుడా దేశభక్తుడా అని ఇక
నేను నిన్ను ఎన్నటికీ అడగను)

*ఉన్నంతకాలం, తను ఉన్నంతకాలం
తన తనువు ఉన్నంతకాలం, నీళ్ళల్లో కళ్ళల్లో కలలపూల జగత్తులో
నిదురపో నిశ్చింతగా: ఇక నిన్ను కదిలించేదెవరు?*