29 September 2011

నమిలే తిను

నమిలే తిను గుండ్రటి గుండెకాయని
మొసలి కన్నీళ్ళతో:

వా/నరుడే అతడు. వామహస్త విచారస్తుడే అతడు.
ఈ చిన్ని హృదయంతో తాకాలి దివిని
దాటాలి భువిని ముద్దిడాలి చెట్ల ముంగురులని
ముడుచుకుని, కళ్ళను తుడుచుకుని
హత్తుకోవాలి నల్లటి చేతుల తెల్లటి మనుషులని

అని అనుకొన్న నరుడే అతడు.
నాగరికత తెలియని వా/నరుడే
అతడు: అందుకని నువ్వు

నమిలే తినాలి అతడి గుండ్రటి
కన్నీళ్ళ గుండెకాయని కాసింత కనురెప్పల మోసంతో
లేత చేతివేళ్ళ ద్రోహంతో దాహమైన దేహంతో

మునుపటి మున్ముందు ఉండే
మొసలి కన్నీళ్ళతో కలలతో:

సాగు ముందుకు సున్నా చుట్టుకున్న
శూన్యమైన నోటితో
ఎర్రటి నాలికతో మోహపు చూపులతో

ఇక నిన్ను ఆపేదేవరు ఆపగలిగేదెవరు?

28 September 2011

పద

వేయి నాలికల నాగు తిరుగుతోంది
పదాలలో: నాదా నీదా?

ఎక్కుతావు మెట్లు
మెట్లు మెట్లుగా ఆకాశంలోకి
తుంపుకు వద్దామని
పూవుల మబ్బులని
చినుకుల చిత్రాలని

అందాయా అవి పాపం నీకు
పవిత్ర పాపివైన నాకూ నీకూ
కొన్నే పదాలు
కొన్నే శబ్ధాలు
కొన్నే కొంతకాలం మన్నే
ని/శబ్ధాలూ?

ఏకదంతం మొలిచిన
జ్ఞానదంతంతో నాలికతో

నీ అక్షర కీర్తికీ
నీ అస్పష్ట పద కాంతికీ
ఎల్లలు లేవు

పద పద పద
అధముడు నిద్ర లేచే
అనాగరిక సమయం

ఆసన్నమయ్యింది.

ఎవరక్కడ

అద్దంలోకి దూకాను: కొంత విసుగుతో

అదొక ముఖమైతే అరచేతులలోకి తీసుకుందును
అదొక స్త్రీ అయితే కౌగలించుకుందును
అదొక స్నేహితుడైతే మనస్సు విప్పి మాట్లాడి ఉందును
అదొక శత్రువైతే నిలువెల్లా ప్రేమించి
అపరమితంగా ద్వేషించి ఉందును
అదొక పాపైతే తనతో పరిగెత్తి ఆడుకుని ఉందును

కాదది ఒక జీవం కాదది ఒక మృగం
కాదు కాదది ఒక విహంగం: నింగీ కాదు నిప్పూ కాదు
నీరూ కాదు నేలా కాదు
పచ్చని చెట్టూ కాదు ఎర్రని పూవ్వూ కాదు
వీచే గాలీ కాదు రాలిపోయే ఆకూ కాదు

నల్లని నీడలు నల్లగా నల్లటి నీడలలోకి
తీసుకువెళ్ళే మాయ మంత్ర దర్పణం

ఎవరక్కడ: ఈ అద్దాన్నీ అద్దంలో అద్దంగా మారిన
నా ముఖాన్నీ మరిక చూడలేను

తీసుకు వెళ్ళండి నన్ను ఇక్కడ నుండి.

25 September 2011

గుర్తు/ఉంచుకో

లోపలి రాకు అసలే

చినుకులు రాలుతున్నప్పుడు
పూవులు మెత్తగా చిట్లుతున్నప్పుడు
రాలిన ఆకుల కింద గాలి
గునగునగలతో గుసగుసలు
ఆడుతున్నప్పుడు

హృదయాన్ని ఎవరో పగతో
ప్రళయం వంటి తీవ్రతతో ఒడిసిపుచ్చుకున్నప్పుడు

గోడలలో వదనాలు
రోదనలలో నీడలు దాగినప్పుడు
తెరిచిన తలుపులలోంచీ
తలపులలోంచీ చీకటే చిత్రంగా

చిగురాకులతో కొట్టుకువస్తున్నప్పుడు
నేను ఒంటరిగా ఉండాలనుకున్నప్పుడు

అసలే లోపలికి రానే రాకు: గుర్తుంచుకో

ఇది ఎవరూ లేని ఎవర్నీ ఏదీ కానివ్వని
ప్రశంసం ఆశించని ప్రసంగం లేని

అ/సంపూర్ణ అనామక చోటు.

24 September 2011

అ/సంపూర్ణం

కూర్చుంటావు ఒక విచిత్ర దీపం కింద ద్వీపమై
ఒక విచిత్ర వదనంతో

ఎందుకు వచ్చావో తెలియదు
ఎవరూ చెప్పరు ఎవరూ: రాత్రి

ఒక మోహిత శరీరమై కదులుతోంది
నీ పరిసరాల్లో నీ నిశ్శబ్ధంలో

ఎముకలు విరిగే సవ్వడి
కలలు కూలిపడే సవ్వడి

ఎంతని తీసుకోగలవు నీ రెండు కళ్ళైనా
ఎంతదాకని సాగగలవు నీ చూపులైనా

ఎంతమందినని ఎన్నిసార్లని
దారులలో ఇమడని వాళ్ళని
ఒంటరిగా ఏడిచేవాళ్ళని శాప
గ్రస్థులని దిగులుదాహార్తులని

హత్తుకోగలవు రోదించగలవు?

ఎన్ని పూవులని
ఎన్ని పిట్టలని నీ రెక్కల కింద
దాచుకోగలవు

తెలుపు లేదు తెల్లవారలేదు
నలుపే నయనాలుగా నల్లటి
కన్నీళ్ళుగా మారిన మనిషికి
మోక్షం లేదు

ఇళ్ళని నమ్ముకున్న వాళ్ళెవ్వరూ
ఇక్కడ జీవించిన దాఖలాలు లేవు

ఎలుగెత్తి పిలిచి
ఎదురువెళ్ళి ఏకాకిగా మిగిలిపోయి
ఎదురుచూసి చూసే
ఏమీ కాక పిగిలిపోయి

విచిత్ర దీపం కింద ఒక్కడివే
అరచేతిని చదువుకుంటావు
గీతలని రాసుకుంటావు
రగిలిపోతావు రహస్యమైపోతావు

వెన్నెల లేని నీడలు
ఎప్పటివో పదాల జాడలు నిన్ను
వింటాడుతున్న అడుగులూ

రాలే ఆకుల తుంపర
వీచే గాలుల గలగల
నింగిలో నిర్మానుష్యంలో
నక్షత్రాల మౌనంలో

ఉందా నీ మృత్యువు?

మోము మీద మోము
పెదవిపై పెదవి
అరచేతిలో ఇమిడిపోయిన
ఒక పసి చేయి
ఒక పసి మాట

ఇప్పటికిదే నీ జీవితం

ఇక బ్రతుకు అంతదాకా
తెల్లని తెలెవారేదాకా
అనంతంలోకి జాడలా
తేలిపోయేదాకా


ఇంతకుమించి ఇంతకుమినా

నీకు మరో మార్గం ఉందా?

23 September 2011

ఏడువు

ఏడువు నాయనా ఏడువు
నన్ను పట్టుకునో ఒక స్త్రీని పట్టుకునో
ఒక రాతిని పట్టుకునో
ఒక రాత్రిని పట్టుకునో
ఏడువు నాయనా ఏడువు

బద్దలు కొట్టుకో నుదుటిని
విరుచుకో హృదయాన్ని
శపించు జాలిలేని జనాన్ని

నిర్మించకు
నివారించకు
వివరించకు

రహదారులలోనో
మధుశాలలలోనో
మతిమరుపు లేని
పూలతో ముళ్ళతో
పుణ్య పాపాలతో
ప్రేమించే ద్వేషాలతో

నీ అవసరం లేని
స్నేహితులకై
నిన్ను బంధించే
నినదించే భార్యకై
నువ్వు కాలేని
నీ బిడ్డకై

ఏడువు నాయనా ఏడువు
కడుపారా కసిదీరా ఏడువు

లోకం కరిగిపోవాలి
కాలం రాలిపోవాలి
ఈ జన్మ ఋణం ఏదో
ఇప్పుడే తీరిపోవాలి
ఇప్పుడే చచ్చిపోవాలి

చదరపు గదుల్లో
ఇమడని జీవితం
నేల లేని స్థలానికి
నీవు లేని స్థలానికి
రూపాయి మూల్యం
అంతా దరిద్రం

ఏడువు నాయనా ఏడువు
ఇంతకు మించీ
ఇంతకు మినహా
నీకూ నాకూ

మరో మార్గం లేదు
మరో మోక్షం లేదు

21 September 2011

ఆమె నవ్వుతుంది

నువ్వు ఎప్పుడూ రావు
గుర్తులు లేకుండా

ఎవరు ఇచ్చారు నీకు
ఎందుకు ఇచ్చారు
వినిర్మాణ విలీనపు
స్వేచ్చా ఇచ్ఛ?

మోపుతోంది పాదం
భూగ్రహం చంద్రగృహంలో
వామహస్తంతో:


ఏడు లోకాలు
ఏడు పదాలు
ఏడు చిత్రాలు

విశ్వమైదానంలో
విశ్వం కాని రాతి
వి/దేహంతో

వ్యామోహంతో
వ్యాప్తి విషంతో:

జరుగు ఇక:నువ్వే
నవ్వుతోంది తను
నవ్వలేక

నిన్ను ఆపలేక.

పోవా

పరిగెడతావు రాతి చదరాలలోకి
ముఖాన్ని దాచుకోలేని సిగ్గుతో

ఎవరు చెప్పారు నీకు
ఇదంతా నలుపుని/శ్శబ్దమని?

కోరుకో కొంత వినాశాన్ని
కోరుకో కొంత విపరీత
విషపు అర్థాన్ని:

వెలుతురులో ప్రతిబింబించే
గాజు పరదాలలో దూరాలలో
నక్షత్రాలని నక్షత్రాలకి
అపరచితం చేసే నక్షత్ర
మాయా మోహినీ యంత్రమోహ
సమ్మోహినీ

మేమిక చూస్తాము
నోరు పెగలని దూడలనీ తొండలనీ
చంద్ర వలయంలో చిక్కిన
సర్పనాలికల తెమ్మరలనీ
కప్పలనీ ఎప్పటికీ
కప్పలేని నీ కబోధి చూపులలో:

ఎవరు అనుకున్నారు
నువ్వొక మహిమాన్విత
మృత్యు దూతవని
ఇళ్ళను నమ్ముకున్నవాళ్ళని
కమ్ముకున్న వజ్రఖచిత
నలుపు మంచువని?

చూడక్కడ చూడొకడు
ఏడుస్తున్నాడు ఏడవక
పడీ పడీ విడివడి
వీడలేక ఓడిపోలేక:

పాపం శమించుగాక
నిరంతర వార్తావాహిని
ఒకింత విశ్రమించుగాక

సూర్యుడి ప్రేమో కరుణో
గ్రహాల మోహమో
సృష్టి కిరణ వ్యామోహమో

కావాలి నీకొక జాబిలి
నీలోపల నీడలలోపల:

ఎడవకురా పిచ్చివాడా
పదాలేప్పుడూ పాదాల్ని
ఇవ్వలేదు
విరచితమైన విచిత్ర విష
నయనం తారాల లోంచి
నీకేన్నడూ కన్నీళ్ళని
కడిగే చూపునివ్వలేదు

బ్రతకడం ఎన్నడూ నేర్వలేదు
కనుక, కానుకగా
మరణించడం ఎన్నడూ
తెలియదు, రాదు: పోదు

దిగంతాలలోంచి వస్తోంది
ఒక జాడ జతయై జాతరై
స్త్రీయై దీవెన శాపమై:

ఎత్తుకున్న చేతులూ
తాగిన చనుబాలూ
ఊగిన ఊయలా అలా
ఏడ్చిన పీడిత కలా

రమ్మని పిలుస్తోంది నిన్ను
కొంత కోపమై
కొంత కోరికై
కొంత కాంతై
కొంత రాత్రై రగిలే రాగమై:

పోవా ఇకనైనా
ఇప్పటికైనా?

20 September 2011

తంత్రీ తంత్రం

ఒక తంత్రి తంత్ర ప్రసారం 24/7 365 రోజులు

కనులు విరిగే కధనాలుగా
ఒళ్ళు సాగిన నృత్యాలుగా

ఏర్పడుతోంది ఒక స్మశానం బహు అందంగా ఆకర్షణంగా:
శవాలు ఇంత రూప సౌందర్యవతులని, ఇనుప కౌగిళ్ళతో
నాగులు నడయాడే పెదాలతో నిన్ను కట్టి పడవేస్తాయనీ

తెలిసింది ఇప్పుడే:

24/7 365 రోజులు
పగలూ రాత్రుళ్ళూ
చేతిలో రిమోట్ తో

సంసార శ్మశానానికి
స్మశాన సంసారానికీ

నువ్వే రారాజువి: వార్తల వార్తాహరుల
యంత్ర మంత్ర తంత్రమాయాజాలానికీ
నువ్వే
రచయితవు=

కుండీలలో మొక్కలు మొక్కలకి పూవులు
చదరపు గదుల్లో పట్టనంతగా వ్యాకోచించిన
రతీ రాతి శరీరాలు

=
బల్ల అంచుపై నీళ్ళతో
ఊగిసలాడుతోంది ఒక
పసివదనం గాజుకూజా

నిస్సహాయంగా నీవైపు
చూస్తో కన్నీళ్లను
రాలుస్తో: ఆపుచేస్తావా
నువ్వు క్షణకాలం

నిన్ను నములుతున్న
రంగుల ప్రతీకల
రాక్షస ముఖఅద్దాన్ని?

19 September 2011

అమృతవిషం. 1

ప్రపంచ తీరాన నడుద్దామని అనుకొంటావ్
ఆమె చేయి పుచ్చుకుని

కష్టాలో నష్టాలో కన్నీళ్ళో, ఏమైనా కానీ రానీ
కాలాన్ని జయిద్దామని అనుకొంటావ్
ఆమె సాహచార్యపు నీడలో

కౌగిలించుకోవచ్చు ముద్దాడవచ్చు
వెన్నెల నీటిలో మంటను రగిల్చి
సమయాన్ని స్థంబింపచేయవచ్చు
ఆమె శరీరంతో నీ శరీరంతో

కలలలో పరిమళంతో, పరిమళంలో కలలతో
కలువరింతలతో ఎగురుతాయి
చిన్ని పిచ్చుకలు అప్పుడు
చినుకులతో చిగురాకులతో
ఉడుతలతో ఉరుములతో
పచ్చగడ్డిలో ఆడతాయి మిడతలు అప్పుడు
రాత్రిలో నక్షత్రాలలో రహస్య భాషలో
దాగిన కలలలో ఊయలలూగుతారు
పసినవ్వులతో పిల్లలు అప్పుడు

బావుంటుంది కదా లోకం అప్పుడు
వదనం దర్పణం అయినప్పుడు
శరీరం శాంతిసదనం అయినప్పుడు

నువ్వు యవ్వనంలో ఉన్నప్పుడు
నువ్వు తొలిప్రేమలో ఉన్నప్పుడు
తొలిసారిగా నిన్ను
ఎవరో తాకినప్పుడు

చేతులతో ఎవరో నీకు కళ్ళగంతలు
కట్టినప్పుడు, చెవులలో ఎవరో రహస్యంగా
నీ పేరుని గుసగుసలాడినప్పుడు
అద్రుస్యంగా ఎవరో నిన్ను
పూల వనాలకు తోడ్కొనిపోయినప్పుడు

బావుంటుంది కదా అప్పుడు
నీకు తొలి యవ్వనం వచ్చినప్పుడు
అమృత విషాన్ని తాగినప్పుడు
ఆమెను తొలిసారిగా తాకినప్పుడు=

16 September 2011

అ/సాధ్యం

తెరిచే తాళం ఏదీ లేదు నీ వద్ద

రంగుల అద్దాలు చుట్టూతా
అద్దంలోంచి అద్దంలోకి
అనంతంలోకి జాడలలోకీ:

పాపం పదాలతో పదాల
పాపంతో ముగ్గురు ఏడు
లోకాలలో తిరుగాడారు

తిరుగాడుతూ ఇక తిరగలేక
తను వాక్యానికి చిక్కుకుని
వ్యాకరణానికి తట్టుకోలేక
వాక్యానికి చెప్పుకోలేక
శిధిలాల వద్ద శిధిలమయ్యింది.

వదనం. విషముఖ నిర్మిత
సదనం. యంత్రోపనిషత్తులో
ఆగుతూ సాగుతూ

ఏడు ఏళ్ల తరువాత ఏడు పదాల
ఏడు అడుగుల నిశ్శబ్ధం తరువాత
మూడే ముళ్ళతో అతడు

అనేక శబ్దాలను పుటలనిండా
అబద్ధానికి నిబద్ధుడై
అందంతో అలికాడు.

లిఖిత నీడలకీ, ఖాళీ కాగితాలకీ
రాత్రి వొదలని జాబిలీ
జాబిలిని వొదలని రాత్రికీ అతడు
విరిగిన వెన్నెముక అయ్యాడు.

ఇక ఆ తరువాత ఎవరూ
హాస్యానికైనా వివాహం గురించీ
విరోధం గురించీ పలుకలేదు!

= ఆ తరువాతా అంతకుమునుపూ
ఇద్దరూ నిప్పుకణికెలను
గుండె నిండుగా తాగుతూ

ఇతరులతో ఎన్నడూ సమ
భాషించలేదు. మరణించలేదు.
జీవించనూ లేదు =

: దీనితో, దీని అనే పదంతో
దీని అనే పదవాక్యాంతంతో
ఏకాంతంలో తాళంలో
రాగంతో ఒక వాన మొదలయ్యింది:

= నీకు చూపు పోయేదాక
దానినీ దీనినీ చూడకు=

15 September 2011

సరైన సమయం

మెత్తటి మంట సోకే నాలిక
చేతివేళ్ళ నుంచి రాలే
నీలి నిప్పు చినుకులు

కొంత మౌనం కొంత గానం

ఎవరో తెచ్చారు
వెన్నెల వనాన్ని
శరీరంలోకి

ఎవరో వొంపారు
అలల తాకిడిని
పెదాలలోకి

ఎవరివో అల్లారు
రంగుల కాలాన్ని
వక్షోజాలలోకి

చిలికారు ఎవరో
కొంత అమృతాన్నీ
కొంత విషాన్నీ నీ
పద సన్నిధిలోకి

సాగుతున్నాయ్
నెమ్మదిగా నీడలు
నీ హృదయ
ప్రాంగణంలో
చుట్టుకుంటోంది
సంధ్యాసమయపు
చల్లటి గాలి
వృక్షాలలో
వృత్తాలలో నీ
నయనాలలో

చూడు ఇటువైపు
అటువైపు నుంచి

వస్తునాడు అతడు
ఏమీ కాలేక
ఎక్కడా తనని తాను
కనుక్కోలేక

రాత్రివంటి కాంతితో
కాంతి వంటి భీతితో
నీ వద్దకు=

వెనుతిరగమని
తిరిగి వెళ్లిపోమ్మనీ
చెప్పేందుకు

ఇదే సరైన సమయం.

ఎందుకో

ఎందుకో పలుకరించావ్

వైపునుంచి
చూపులు కనలేని
తెరలోంచి:

నీ వదనం ఒక
మాయాదర్పణం
నీ మాట ఒక
దవనపు దీపం
నీ శరీరం ఒక
నింగి జలపాతం

ఎందుకో పలువరించావ్

వైపునుంచి
నేను తాకలేని
తెరలలోంచీ
శిలలలోంచీ:

చెప్పు నువ్వే

శిధిలాలలోంచి
శిఖరాలలోంచీ

తెగని తెరెలలోంచీ
నిన్ను ముద్దాయి
ముద్దాడటమెలాగో?

కోతులు

అక్కడ ఉంటాయి అవి
అప్పుడప్పుడు నిన్ను
నీ చూపులతో చూస్తో:

జతలుగా మిగిలిన జాతులుగా
చెట్లపై చెదిరిన ఇళ్ళ కప్పులపై

జారుతో జాగ్రత్తగా దిగుతో
తలకిందులుగా వేలాడుతో

తలకిందులైన లోకానికి తమ
పదును దంతాలను చూపిస్తో

ఉంటాయి అవి అక్కడ
వొంటరిగా విచిత్రంగా
ఒక మహా దిగులుతో తపనతో:

ఎక్కడనుంచి వచ్చాయవి?
ఎలా వచ్చాయవి?
ఎలా బ్రతుకతాయి అవి ఈ
నిర్ధయ మానవ లోకంలో?

ఏమీ తోచక, ఏమీ చేయలేక

సంచార జాతులని మిగల్చని
ఈ సదా యంత్ర మోహిత
వస్తు వికసిత కరకు కాలంలో

నువ్వు నీ తలను బరుక్కుంటూ
కళ్ళు చికిలించుకుని

నువ్వు కోతివి ఎందుకు కాలేదో
కనీసం తోక అయినా ఎందుకు
లేదో అని యోచించుకుంటో

ఎర్రని ముడ్లని చూపించిన
ఆ కోతులను స్మరించుకుంటో

ఆ ఇంటికి నీడల ముగ్గులను వేసే
చీకటి కమ్ముకున్న
తన ఇంటికి వెళ్ళిపోతావు=

13 September 2011

కథ

నీ కళ్ళనూ కనుగుడ్లనూ
వాటిపై జారే
చీకటి కుబుసాలనూ

నీ నాసికనూ శ్వాసనూ
వాటిలో వెలిగే
వెదురు వనాలనూ

నీ చెంపలనూ
నీ పెదాలనూ

నాకీపూట నాలికతో
లిఖించాలని ఉంది

నీ చెవులనూ
నీ నుదురునూ
రెండింటి మధ్యా నిర్మితమైన
పొదరిల్లులలో

నీ శ్వేతచుబుకంలో
మెడలోయలయలో
తేనెటీగలు కట్టుకున్న పదాల
గూళ్ళల్లో కళ్ళల్లో

పక్షులు విహరించే
నీ వక్షోజాలలో, తల్లి పాలు రాలే
నీ హృదయంలో

నీ నాభిలో, నాభిలో నిండిన
నాదైన స్వరంలో

నీ యోనిలో నీ ప్రేమలో
మెలికలు తిరుగుతూ
కిందకు సాగిన
వెన్నెల కాళ్ళతో
నీ గర్భంలోని
కాలంతో

నాకీపూట నా నాలిక కలంతో
లిఖించాలని ఉంది

ఏమంటావు నువ్వు?
ఏం చేస్తావు నువ్వు?

((ఆ దినమంతా వర్షం పడగా
పాపం అతడు పాపంతో
రాత్రంతా దహించే శాపంతో
తాకని తన దేహంతో

ఇల్లు లేని కప్పలతో గడ్డిలో
అరుచుకుంటో
మొహంతో తాపంతో తీరని
కోరికతో సొమ్ముసిల్లాడు))


=
నీకా కధ తెలుసా?=

ఏం చేయాలో

తరుముకు వస్తుంది
నువ్వు తురుముకున్న హారం
తుది వెచ్చని బాహువులతో

మెత్తటి శ్వాసై మరచి వచ్చిన
పూల పరిమళంతో :

తప్పించుకోలేను తిరిగి పోలేను
తిరిగి తిరిగి
తెగి వచ్చినవాడిని కనుక
తిరిగి విరిగి
పోలేను: చెప్పు నువ్వే

చీకటిలో ఈదుతున్న
తెల్లటి మచ్చల రాత్రి చేపను
నేను ఏం చేయాలో
నువ్వు ఏం చేస్తావో?

12 September 2011

అది చదవొద్దు

నా సామిరంగా నువ్వసలు అది చదవొద్దు

ఎవరు ఎక్కడ మొదలు పెడతారో
ఎవరు ఎక్కడ అంతం అవుతూ అనంతంగా మారతారో
ఎవరు ఎక్కడికి ఎలా పోతారో
ఎందుకు పోతారో ఎవరు ఎందుకు ఎవరు అవుతారో
ఎవరు ఎందుకు ఎవరు కారో అయినవాళ్ళు ఎవరూ
ఎందుకు అవ్వరో అవ్వకుండా అవుతూ ఎవరూ
ఎందుకు ఎక్కడా కానరారో, కానరానివాళ్ళు కనుమరుగు
కన్ను మరుగు ఎలా కారో
కనుగుడ్డు మీద మీగాడలా పదాల జాడలలా కలల్లా ఎలా
ఇలా ఇలలో ఇందులో అందుకునేందుకు
అందుకు మున్ముందు నుంచి ముసుగులలోంచీ ముందు
మాటలు లేకుండా కాకుండా వస్తారో

ఒరే నా నాయనా నీకు ఎప్పటికీ అర్ధం కాదు. వినిర్మాణం ఒక
విచిత్ర వాహనం నీకు నాకూ
మన ముందున్న వెనకి నుంచి వచ్చే మూడు కాలాల సప్తలోకాల
తత్వవేత్తలకూ: రా నా బిడ్డా

పాక కింద కల్లూ, కల్లులోని ముంతా
ముంతలోని చిగురు చింతాకు, ఆకులలో బోమికలూ బోటీ
కలలలో కాలిన కాలేయంలో

మెరుస్తున్నాడు ఒక చంద్రుడు నిండిన వానలో: ఇక నీకూ
నాకూ విదేహ విధేయులతోటీ, నిర్యాణ న్యాయాల తోటీ,తోటి
వారితోటీ ఏం పని? పిలుస్తోంది ఒక

అనాది వాచకం సంగర్షణల యుద్ధ జీవితమై
కదను తొక్కుతోంది ఒక చరిత్ర గీతం ముద్రణ

కాని, కానరాక తిరిగి వచ్చే జాడై, మన నీడై: దుముకు నాయన
దుముకు రాజ వాచకాలలోంచి అనేక ప్రతిపతార్ధాలలోకి
ఇతర పునర్ నిర్వాచాకాలలోకి, కాలాలలోకీ:

ఇంతకు మించీ ఇంతకు మినహా
నీకూ నాకూ మరో మరణం లేదు.

దూరం కాని దూరం

దూరం కాని దూరం

నువ్వే చెబుతావ్
దూరం ఏదో తీరం ఏదో
ఎందుకో ఏమిటో

వెన్నెల్లో కనుసన్నల్లో
నిశ్శబ్ధపు పలుకు
బాహువుల్లో పెదాల్లో
వెచ్చటి వొణుకు

ఇంద్రజాల దర్పణాలు
దర్పణాల శరీరాలు: కరిగి
కలసిపోయే దహనాలు

నువ్వేం చెబుతావు
మరో అంచునుంచి

దేహమేదో ధూపమేదో
వానలో వొణికే
ఇంద్రధనుస్సు ఏదో
ఎవరిదో ఎప్పటిదో

చినుకులని దాటి
చిగురాకుల మీద
మెరుస్తున్నాయ్ కిరణాలు
నువ్వు నవ్వేందుకు
కారుణ్య కారణాలు

రాత్రీ అయ్యింది పగలూ
అయ్యింది. నువ్వు

వొదిలిన దుస్తులు
ఇక్కడే ఛాతిపై కోస్తున్నాయి
మునుపటి కన్నీళ్ళతో=

తీసుకువెళ్ళవా వాటిని
తిరిగి రాలేని
నీ చేతులతో?

11 September 2011

వంకీలు

వంకీలు తిరిగిన వజ్రాల పెదాలపై తిరుగుతున్నాయ్
తెల్లని సర్పాలు, దాగిన నవ్వులు:

నువ్వాపలేవ్ అ జలపాతపు నురగ హోరునీ
ప్రతిబింబపు హాహాకారాలనీ:

ఎదురుచూసే ఎదురుచూపే
మెలికలు తిరిగిన పాదాలేలే
ఎప్పుడూ నీకు:

జరుగు కొద్దిగా: వానని తాకిన కాంతి
సూర్యనయనాలలో పిల్లల అరుపులతో
మెరుస్తోంది, మురుస్తోన్నది

పచ్చిక బయళ్ళపైనుంచి
తెరలు తెరలుగా గాలి నువ్వు అందుకోలేని
తన హస్తాల వలె దూసుకువస్తున్నది

ఎవరిదీ కాని గీతం, అందరిదీ అయిన శోకం
దిగంతాలలోంచి దిగులుగా
నీడలుగా జాడలుగా ప్రతీకలుగా రాలుతోన్నది

తెచ్చుకున్నావా ఇంత వివశితమైన విషం
జన్మతో జన్మాంతానికై? తీరని కోరిక ఒకటి

కరుస్తోంది కరకు దంతాలతో.
ఇక ఏం చేయగలవ్ నువ్వు కరాళ స్వప్నాలతో
లిఖిత శాపాలతో? తప్పుకో కొద్దిగా

నిశ్శబ్ధపు గమనంతో సీతాకోకచిలుక ఒకటి
నిశ్శబ్ధంలో నిశ్శబ్ధంతో
నెలవంక రెమ్మల చుట్టూ గిరికీలు కొడుతుంది.

నువ్వు దారి తప్పి మత్తిల్లి రాలిపోయేందుకు
ఇదే సరైన సమయం: వేగిరంగా వెళ్ళిపో

మధుమోహిత మృత్యు కాంక్షిత స్త్రీల వద్దకూ
స్నేహితుల వద్దకూ. ఇది వినా

ఇంతకు మించీ మరో మార్గం ఉందా నీకు?

10 September 2011

కురూపి

దరికి రాకు దారి చూపకు

రంగులను ఉరుమే కనులు
చినుకులని చివరి పెదాలతో

నిమిరే అనాది చేతి వేళ్ళు
అతడివి.

చుబుకంపై జారిన కన్నీటిలో
కర్మాగారాలూ కమిలిన స్త్రీల
వక్షోజాలూ:

అడగకు చిన్నారి బొజ్జను నింపే
తల్లి పాలను: ఆశించకు

చివరి శ్వాసను అందించే స్పర్శను:
చదరపు గదులలో మెరిసే తెరలలో

ఊహించకు వనాన్నీ వదన జలాన్నీ
నువ్వు ప్రేమించే జనాన్నీ.

వాహన ముద్రిత యంత్ర లిఖిత విశ్వ
వినాశక రాతి రతి మైదానం ఇది=

జరుగు కొద్దిగా.

శిలల ఊపిరిలలోంచి అతడు
పాలరాతి పుష్పాలని

తనకి బహుమతిగా
అర్పించదలచాడు!

తెరలు

తెల్లటి తెరలు

తెల్లటి నల్లని తెరలు
వదనాలపై పదాలపై

మెరిసిన దంతాల
మెరుపు నవ్వుల హారం
తెగింది ఇక్కడే

తెల్లటి తెరలతో
తెల తెల్లని తెల
వారని కధలతో

నువ్వూ చూడలేదు
ఇటువైపు
నేనూ చూడలేదు
ఇటువైపు
ఎవరూ రాలేదు ఇటు
మనవైపు

తెల్లటి తెరలు
నల్లగా మెల్లగా
ముఖాలపై
మెత్తగా ముళ్ళై
మరువలేని
మల్లెమొగ్గలై
త్రాచులై:

తెలీలేదు
హృదయాన్ని
ఇంత వేగంగా
మూయ
వచ్చునని
మాయ చేయ
వచ్చునని

తలుపులు
వేసుకో ఇక.

కాదు/పోదు

చేతులే, వికసిత పద్మాల వలె విచ్చుకున్న అర
చేతులే, వాటితోనే వాటితో కదిలే రెండు

పాదాలతోనే వచ్చాను ఇక్కడికి. ఏమీ తెచ్చుకోలేదు
ఎవరినీ నమ్ముకోలేదు
ఎవరినీ అమ్ముకోలేదు.

శరీరమే, వికసితమైన పక్షుల గూళ్ళను నింపుకున్న
శరీరమే, దానితోనే దానితో వలయమై చూసే

కళ్ళతోనే, చూపులని తిరిగి తీసుకువచ్చే చూపులనే
తెచ్చుకున్నాను ఇక్కడికి.

ఎవరు కావాలి? ఎవరు పోవాలి? స్నేహితులూ వద్దు
స్త్రీలూ వద్దు. వాడిపోని పూల పరిమళమూ వద్దు.

గుండెలో రాతి దిగులు తెల్లటి సర్పమై చుట్ట చుట్టుకుని
ఉన్నది, విషంతో వేగిరంగా ఎదురు చూస్తో ఉన్నది

పదాలు, నేను వెదజల్లిన పదాలు విస్తృతమై వస్తున్నవి
నా వైపే మహా దాహంతో, ప్రతీకారంతో వేచి ఉన్నవి

ప్రతీకలు, నువ్వు ఇచ్చిన ప్రతీకలే
వీడని బహుమతుల వలె, ఉరికొయ్యలై తలారులై
మృత్యు ఆహ్వాన గీతాలను పంపుతున్నవి

శ్రద్ధాంజలి రాసే వేళ్ళకి నీ తలపుల విలాపం ఎందుకు?
కడతేరిన కలలకి మళ్ళా నీ పునర్యాన
విషాద విన్యాసం ఎందుకు?

చేతులే, ముఖాన్ని తమ లోపలి లాక్కున్న అరచేతులే
నీ కళ్ళ తడిని నా కళ్ళ నిండుగా నింపుకుని
పగిలిని గోడలవలె తడిని పీల్చున్న అరచేతులే అవీ ఇవీ=

ఇక ఈ వాక్యాన్ని మరింతగా కొనసాగించలేను. తప్పుకో
తరువాతి ఖననానికి తగినంత సమయమయ్యింది:

06 September 2011

మనిద్దరం (అను ఒక పూర్వ వాచకం)*

అనాదిగా అతడిని మొహిస్తున్న యువతి
ఈ కింది పదాలను పలువరించింది:

"పట్టించుకోవడం హింస అవుతున్నప్పుడు
ప్రేమించడం విడిపోవడం అవుతుంది:
మనిద్దరమూ, మనం ఇద్దరమూ ఇప్పటికీ
ప్రేమికులమేనా?"

౧.

శిధిల ఆకాశంలో మిగిలిన రాత్రిలో
దారినీ దాహాన్నీ తాకుతో నడుస్తావ్ నువ్వు
ఒక దీపం ఒక దేహం ఉండే గూటికై=

పదాలు, నువ్వు ప్రవచించిన పదాలు మాత్రమే
ప్రార్ధన వలె, స్వప్నావస్థలో మిగిలిన
శబ్దాల వలె అతడికి సర్వస్వం అవుతాయ్: అప్పుడు
అడుగుతాడు అతడు అడగలేక
ఇక ముందుకి సాగలేక=

౨.

ఎక్కడ ఉన్నావ్ నువ్వు నేను రాలి
పోతున్నప్పుడు?
ఏం చేస్తున్నావ్ నువ్వు నేను రాలి
పాలి పోతున్నప్పుడు?

ఒడి ఏది తడి మది ఏది
వడివడిగా సాగే నీ హృదయపు ధ్వనుల
చప్పట్లు ఏవి?

రెండు నిమిషాల మౌనం పాటించావా
నువ్వు? చూడటానికైనా
వినడానికైనా ఉన్నావా నువ్వు? అక్కడ
స్రవించే సరిహద్దు కావల?

వద్దు. మాట్లాడవద్దు. సైగ చేయవద్దు.
వద్దు. మాట్లాడ
వద్దు.

౩.

నువ్వక్కడే ఉన్నావు. ఎల్లప్పుడూ
దిగంతాల నుంచి తిరిగి వచ్చే
దిగులు చూపులతో ఆ చేతులతో:

అతడు చూసి ఉండడు ఎదురు
చూసే చూపునీ నిశ్శబ్దాలలో
చిక్కుకున్న నీ పెదాలనీ:

దహనానికై నెగళ్లు రగిలినప్పుడు
మననానికై ధరిత్రి పూవై
చిగురించినప్పుడు
చిగురులో చింతలో వెన్నెల రాలి
వాన రాలి శరీరం చిట్లినప్పుడు
చిరుసవ్వడులతో ఆత్మ
ప్రవహించినప్పుడు

ఇవన్నీ అవన్నీ ఎందుకు?
తను ఎలా మరణించినదో
తను ఎలా జీవించిందో తన
జీవి ఎలా ఇంకిపోయిందో

తెలుసా నీకు?

౪.

పదాలతో అనాధులతో

అనాధుల పదపాదాలతో

పాదాలు లేని
పద అనాధులతో పదే పదే
వచ్చిందీ అతడే
వెళ్లిపోయిందీ అతడే:

ఎవరూ వారెవరూ వీడని
జాడ లేని తన గురించి
పలుక లేదు.
పలుకే లేదు.

౫.

అనాదిగా ఆమెను ప్రేమిస్తున్న
అతడు ఈ కింది పదాలను రాసాడు:
(అని అనుకున్నాడు)

"పట్టించుకోవడం హింస అవుతున్నప్పుడు
ప్రేమించడం విడిపోవడమౌతుంది.
మనిద్దరమూ, మనం ఇద్దరమూ ఇప్పటికీ
ప్రేమికులమేనా?
__________________________
*06.01.2001

05 September 2011

కప్పల కన్నీళ్లు

నువ్వే దూరం. దూరపు తీరాన్ని చేరని
పదపు చూపే దూరం.

ఎవరు చూసారు నిన్ను
తమ కళ్ళతో. స్వప్నవాచాకాల్ని లిఖిస్తూ
మూగవాళ్ళం అవుతున్నాం ఇక్కడ: అక్కడ

సమీరంలోకి జారే నీ శరీరం
నీ శరీరంలోకి జారే
అతడి మృగనయనం. మృగనయనంలో
ముద్రితమయ్యే ముద్రిత సమయం.

రాలేదు నేను ఇక్కడికి ఇది చెప్పటానికి

పుటల మధ్య నిలిచిన నిర్మాణాలలో

తిరిగి వచ్చే తిరిగి తిరిగి వచ్చే
ప్రేతాత్మొకటి తిరుగాడుతోంది

తిరగతోడుతోంది తోడునీ
తోటి చరిత్రనీ ఒక నిర్మానుష్య జాగ్రత్తతతో:

జాగ్రత్త: రాలేదు నేను ఇక్కడికి

అది చెప్పడానికీ రాయడానికీ
వాచక వాగ్దానాన్ని
భంగం చేయడానికీ:

చూడు: రాత్రి కురిసిన వానలో మిగిలిన
పచ్చిగడ్డి జాడలో కదులుతోంది
తన మెత్తటి పాదం

పురుషుడు కాని పు/రుషిడికై

తప్పుకో. దారి ఇవ్వు. నీటిలో దాగిన
కప్పల కన్నీళ్ళని వినే నిశ్శబ్దం తనది
కరుణా వ్యా/కరణం తనది

తప్పుకో. దారి ఇవ్వు. ఇక వేరే దారి లేదు
నీకు. ఇక నిదురపో నువ్వు

చీకటి కనురెప్పల కింద ఊగే
కన్నీటి అలల అలజడిలో

ని/స్పృహలో ప్రతిధ్వని ప్రతిధ్వనించే
ప్రతిధ్వనిలో, ప్రతి ధ్వనిలో=

ఆమెన్.

04 September 2011

ఎవరు (అను ఒక మునుపటి వాచకం)

ఉరుముల నృత్యం ఇది
మధువూ గంజాయీ కలగలసి
శ్వేతసర్పాల్లా అల్లుకుని
రమించే మై/మరపించే
మెరుపుల నృత్యం ఇది

జ్వలిస్తూ సుడులు తిరుగుతూ
నిరంతరం అనంతం
కాంతిపుంజాల్ని వెదజల్లే
అవ్యక్తమైన దానియొక్క నృత్యం ఇది

వీటన్నిటిలోనూ
వీటన్నిటిమధ్యా
ఇవన్నీ అయి మరణిస్తూ
మళ్ళా అంతలోనే జన్మిస్తూ
విస్మృతిగా మారిపోతూ
మళ్ళా అంతలోనే స్మృతిగా
మిగులుతూ

ఒక మనిషి. ఒకే
ఒక్క మనిషి.

తండ్రీ తనయుడూ
తల్లీ కూతురూ
ప్రియురాలూ ప్రియుడూ
తనూ ఇతరుడూ
అయిన ఒకే
ఒక్క మనిషి.

నీతోపాటు ఈ నృత్యంలోకి
వచ్చేది ఎవరు?
నీతోపాటు ఈ నృత్యంతో
వెడలిపోయేది ఎవరు?
నీతో మాట్లాడుతూ
నీ స్వరంగా నీ చూపుగా
మారేది ఎవరు?

అనంతాలలోంచి
అద్రుశ్య ధూళిలా వచ్చి నిన్ను
తనలో దాచుకునే
ఆ అస్తిత్వపు గులాబి ఎవరు?

ఒకే ఒక్క మనిషి. అన్నీ అయ్యి
ఒక్కడిగా మిగిలిపోయే
ఒకే ఒక్క మనిషి
ఏకాంతంగా ఒంటరిగా
ఈ భూమిపై తన అస్థిత్వాన్నే
తన చైతన్యాన్నీ
తనే కాంచిన ఎరుకతో
అన్నీ తెలిసి అన్నింటినీ చూస్తూ
అన్నీ తానే అయ్యి
ఒక మహా తపనతో, దిగులుతో
వొణికిపోయే
ఒకే ఒక్క మనిషి.

పౌర్ణమినాడు సంపూర్ణతతో
అసంపూర్ణంగా
మిగిలిపోయిన జాబిలి
రేకులు పిగిలిపోయి
అసంపూర్ణతతో
సంపూర్ణతను నింపుకున్న
ఒక నీలి గులాబి
స్రవిస్తూ, సంపూర్ణ
అసంపూర్ణాల మధ్య
భాషగా మారి
భాషను అనుభూతి చెంది
జాబిలిగానూ
గులాబిగానూ మారిన
ఒకే ఒక్క మనిషి

ఉరుముల నృత్యం మధ్య
మధువుతో వివశితమైన
పగటి రాత్రి మధ్య
అవ్యక్త అనంతం మధ్య
మృత్యు మార్మిక హస్తాల మధ్యా
ఒకే ఒక్క మనిషి=

అ ఒకే ఒక్క మనిషి
మీలో మీరు
ఎపుడైనా ఎక్కడైనా
చూసారా?

02 September 2011

మూర్ఖుడు

తన చేతిలో ఛాతిలో ఉందొక రహస్య ఖడ్గం

రంగులను వెదజల్లే తన కళ్ళు. అవి
పదాలను వెదజల్లే పూలు.

వానని ఆపే అరచేతులు కావు నీవి
శ్వాసను ఆపే ఆ పెదాలు కావు నీవి

తన వెన్నముక ఒక శ్వేతసర్పం
తన వదనం ఒక వెన్నెల వనం

గరళ కంటుడివి కావు నీవు
వనంలో విరిసే తోటమాలివి
కావు నీవు

తన సన్నటి తెల్లటి వెళ్ళే అవి
పాకుతాయి నీ వద్దకు పరమ
పవిత్ర పాపంతో

అంతులేని దయతో దిగులుతో

తన పొడుగాటి తెల్లటి కాళ్ళే అవి
సాగి వస్తాయి నీ వద్దకు విరామ
వేగిరంతో కోరికతో

ఎదురుచూసే తెల్లటి కళ్ళే తనవి
బావురుమంటో కావలించుకుంటాయి
నీ ముందు రాయలేని కన్నీళ్ళతో

దినమొక శ్వేతాశ్రువు. క్షణమొక
పదమృత్యువు. పద పద పద
త్వరగా త్వరత్వరగా

తన పద సన్నిధికి పరమపద
సోపానంతో ప్రేమ శాపంతో=

ఎందుకంటే ఉందొక రహస్య ఖడ్గం
తన చేతిలో ఛాతిలో

నీ అస్తిత్వపు పరిమళంతో
నువ్వు ఊహించని
ప్రేమ పగతో, తేనె తాపంతో
వింత విషంతో=

హతం కావడానికి
నీలి రాత్రిలో కుంగి
కరిగిపోడానికీ

ఇంతకంటే ఏం కావాలి
నీకు? నీకూ?

01 September 2011

తనే

చెట్టు కింద నీడలలో తనే ఉంది

రాత్రికీ, అతడికీ
దారి లేని మదికీ
తనే దిక్కు

ఇక నువ్వు, నవ్వే నువ్వు
నవ్వలేని తన నవ్వుని
ఎన్నటికీ చూడలేవు.

***

(మంచు గాలిని నింపుకున్న
చదరపు గదిలో
దీపమొక్కటే
తల్లిలేని పిల్లలతో
వెలుగుతోంది.

వాళ్ళని రమ్మని
త్వరగా, త్వరత్వరగా
వాళ్ళని తెమ్మని

మంత్ర నగరాన్ని
కమ్ముకున్న
యంత్రవదనాలకి
చెప్పు:

నీటిలోని చిరుచేప
చేపలోని నీటికై
తపిస్తోంది. నీళ్ళు
రాళ్ళని
రాళ్ళు నీళ్ళని
వానలో గాలిలో
కనుమరుగయ్యే
లోకలోలకంలో

బందీలైన వాళ్ళకి
నీళ్ళు నిండిన
పసి కళ్ళను
చూపించు.)

=ప్రభూ మరొక దినం
మొదలయ్యిందా
ఇలా, ఈ నీ పదంలా?=