24 August 2014

అప్పుడప్పుడూ

అప్పుడప్పుడూ
వెళ్లిపోదామనే అనుకుంటావు ఈ లోకం మధ్య నుంచి

తాకీ తాకక
అసలు వచ్చిన ఆనవాలు కూడా లేకుండా
ఒక తెమ్మరలానో, పల్చటి ఎండలానో, నీటి తుంపరలానో
చెట్ల కింద నుంచి సాయంత్రానికి వెళ్ళిపోయే నీడలానో, కొలనులోని తామర పూవులానో

అప్పుడప్పుడూ
వెళ్లిపోదామనే అనుకుంటావు ఈ మనషుల మధ్య నుంచి-

వీళ్ళంతా
ఒట్టి ప్రతిబింబాలనీ, బోలు శబ్ధాలనీ, మాన్పుకోలేని
గాయాలనీ, ముసుగులు వేసుకుని తిరిగే పాములనీ, తోడేళ్ళనీ
నరమాంసం రుచి మరిగి - రాత్రికి నీ వద్దకు - పదే పదే తిరిగి వచ్చే పులులనీ
నవ్వే, ఏడ్చే, నడిచే మర్మావయాలనీ

వీళ్ళంతా, ఎప్పటికీ
ఇన్ని మంచి నీళ్ళు తోడుకోలేని బావులనీ
మట్టికుండా, గాలీ, వాన వాసనా, వెలిగించిన పొయ్యీ
ఉడికే మెతుకుల శబ్ధాలూ, నీళ్ళని పీల్చుకునే మట్టి కదలికా, పూల రేకుల కరుణా
తెలియని వింత జీవాలనీ, మృగాలనీ

అన్నిటినీ మించి
అద్దంలో నిన్ను నువ్వు చూసుకునే క్షణాలు వాళ్ళేనని, వాళ్ళు తప్ప
మరో మార్గం, గమ్యమూ లేదని తెలిసీ
అప్పుడప్పుడూ

వెళ్ళిపోదామనే అనుకుంటావు
నీలోంచి నువ్వు ఈ లోకంలోకీ, ఈ కాలంలోకీ, స్వర్గం నరకం
పాపం పుణ్యం, శాపం శోకం, మోక్షం జ్ఞానం, జననం మరణం, బ్రతుకు పరిమళమూ
వేదనానుబంధమూ అయిన ఈ మనుషులలోకి

అప్పుడప్పుడూ-

No comments:

Post a Comment