11 August 2014

నేనే

1
నిరంతరం
నిన్ను నీకే విసుగు కలిగించేలా చేసే దైనందిన వ్యాపకం - అందుకే
ఎక్కడికైనా
తప్పించుకు పోదామని అనుకుంటావు. నిన్ను నువ్వు పూర్తిగా
మరచి పోదామని కూడా.
2
తోటలో పూలతో గడపటం సాంత్వన అనుకుంటావు. పూలని
కిలకిలా నవ్వే శిశువులుగా ఊహిస్తావు. లేదా, కిటీకీ పక్కన కూర్చుని
మబ్బులు కమ్మిన మధ్యాహ్నం, గాలి మునివేళ్ళని తాకుతూ
ఒక వానని స్వప్నిస్తావు. కలలోని చినుకులతో ఆడుకుంటావు

లేదా రాత్రుళ్ళని చల్లగా కప్పుకుని నక్షత్రాలని విందామని కూడా -
అవి నీకు చెప్పే, నీకు తెచ్చే యుగాల భూమి కథలనీ మట్టి వాసననీ
నీ హృదయంలోకి ఇంకించుకుందామనీ, అతీతమైనదేదో అర్థమయితే

నీ కనులలోకి
ఊటలా నీరు ఊరితే, పూలని స్వప్నించే ఒక పచ్చని చెట్టు ఒడిలో
నిదురోదామనీ

తిరిగి
కనులలో పూల రంగులతో, పూల చినుకులతో నిదుర లేచి
తప్పటడుగులతో
ఈ లోకంలోకి బ్రతకడానికి బయలుదేరుదామనీ -
3
నిరంతరం

నీపై నీకే చికాకు కలిగేలా చేసే రోజూవారీ ప్రదర్సనశాలలో ఎక్కడో తప్పిపోతావు.
పూలూ, నక్షత్రాలూ, వాన కురిసే సాయంత్రాలూ
అమలినమైన ప్రేమలూ, శరీరాలకు అతీతమైన
ఆత్మల కోసం వెదికీ వెదికీ వేసారిపోతావు-

అవన్నీ
వాచాకాలపై వాచకాలు అనీ, ఒక నాటకం అనీ
నీలోకి నెమ్మదిగా చేరే, నిన్ను నీ నుంచి దూరం చేసే ఒక మహామాయాజాలం అనీ
భాషలోకి రాని సత్యమేదీ లేదని గ్రహిస్తావు-

ఇదే లోకం అనీ
పాపం పుణ్యం, శాపం శోకం, వేదం వాదం, కర్మా కర్తా క్రియ అంతా మనిషేననీ
ఇంతా చేసి, తప్పించుకుపోదామనుకున్న ఆ మనుషులే
మనకు చివరికి మిగిలే పరమ సత్యమనీ, వారితోనే జననమనీ, మరణమనీ
వాళ్ళే జనన మరణాలనీ తెలుసుకుంటావు ఒక దినాన

మధుశాలల్లో
రద్దీ రహదారుల్లో, వాళ్ళ మోసాలలో వాళ్ళ అమాయకపు ఇష్టాలలో, నీకు ఎదురేగి
నిన్ను బలంగా కౌగాలించుకునే బాహువుల్లో
వాళ్ళ నవ్వుల్లో, ఆ ఒక్క వ్యక్తికై నువ్వు ఎంతో దూరం ప్రయాణించే కన్నీటి దూరాల్లో
వేసవి ఎడారుల్లో

వర్షాకాలపు నదులలో
వాళ్ళ నాట్యాలలో, వాళ్ళ యుద్ధాలలో, వాళ్ళ దినదిన కార్యాకలాపాలలో, కాలకృత్యాలలో
వాళ్ళ సువాసనల్లో, వాళ్ళ మాటల్లో, వాళ్ళ చేతల్లో
వాళ్ళే ఋతువులైన ఒక మహా కాలంలో

ఇతరమే తాననీ
తానే ఇతరమనీ -
4.
 నిరంతరం
నీపై నీకే విసుగు కలిగించేలా, నిరాసక్తత పెంపొందించేలా చేసే ఈ యాంత్రిక
దినదిన యధాలాపపు వ్యాపకంలో
నిన్ను నువ్వు పూర్తిగా గుర్తుంచుకోవడమే అంతిమ మార్గమని బోధపడి

మేలుకొని, లేచి కూర్చుని
ఇలా, ఒక పాటని వింటూ...
5
నువ్వూ వింటున్నావా, నేనే అయిన ఈ గీతాన్ని?   

No comments:

Post a Comment