మనుషులపై కోపం ఉండటం తప్పేమీ కాదు, అది నిన్ను అంధుడిని చేయనంత వరకూ. లోకంతో కటినంగా వ్యవహరించడం తప్పేమీ కాదు, అది నిన్ను స్పర్శా రాహిత్యంగా మార్చనంతవరకూ. మరి, అవన్నీ నీ పట్ల కోపంగానూ, కటినంగానూ ఉన్నాయా అంటే మరి ఇటు చూడు. ఇప్పుడు
నీ చుట్టూ చెట్లు ఉన్నాయి. పూసిన పూవులూ ఉన్నాయి. నీళ్ళు చిలుకరించిన ఆవరణలూ అప్పుడే లేచిన పిల్లలూ ఉన్నారు. చల్లగా వీచే గాలీ, వెడుతూ వెడుతూ ఎవరో నిన్ను చూసిన స్నేహపూర్వకమైన నవ్వూ ఉంది. తినడానికి అన్నమూ, తాగడానికి నీళ్ళూ, తల దాచుకోడానికి ఒక గూడూ, దానిలో పక్షి పిల్లలూ ఉన్నాయి. వాటి రెక్కల్లో కొంత గోరువెచ్చదనం ఉంది. ఇష్టమూ ఉంది. అన్నిటినీ మించి, నువ్వు ఇంకా బ్రతికే ఉన్నావు. నువ్వు ఇంకా బ్రతికి, చూడవలసిన ఉత్సవమేదో, చేయవలసిన పనులేవో, వొదిగిపోవాల్సిన వేదన ఏదో మిగిలే ఉన్నాయి-
నిర్వచనాలదేముంది? ఎన్నైనా చెప్పవచ్చు. సత్యానిదేముంది? ఎంతైనా వ్యాఖ్యానించవచ్చు. ప్రేమంటే ఇష్టం లేకపోతే, ఆ పదం వాడకు. కానీ, లోకంపై కోపంతో మనుషులనూ, మనుషులపై కోపంతో లోకంనూ చిన్నబుచ్చకు. మరీ అంత కటినంగా ఉండకు. బిడ్డా, కొంత ఓరిమి ... కొంత ఓరిమి పట్టు ...
ఇంకొద్దిసేపట్లో, కనిపించేవన్నీ నిజమనిపించేవన్నీ మంచు తెరల వలే ఎలా కరిగిపోతాయో చూడు-
No words !
ReplyDelete