ఆదివారం,ఉదయం వేళ.
ఆడుకుంటూ పిల్లలు. సగం తెరచిన కిటికీలోంచి గాలి. నేలపై వెలుతురు. బాల్కనీలో, బియ్యం గింజల చుట్టూ తిరుగుతూ పిచుకలు. సన్నగా ఊగుతూ లతలు. మట్టి కుండీలలో మొక్కలు. డైనింగ్ టేబుల్పై, ఒక గాజు గ్లాసు నీళ్ళల్లో నువ్వు ఉంచిన రెండు గులాబీలూ, వాటికి మిగిలిన రెండు రెమ్మలూ. మరి అవి నీ కళ్ళూ, కదిలే నీ కనురెప్పలూ -
ఉదయం, మధ్యాహ్నంగా మారుతున్న వేళ
ఉదయం, మధ్యాహ్నంగా మారుతున్న వేళ
ఆడుకుంటూ పిల్లలు. తెరచిన తలుపులలోంచి గాలి. ఊడ్చిన గదులు. మెరిసే గోడలు. వంటగదిలో అన్నం ఉడికే చప్పుడూ, ఇంకా నీవే మరి కొన్ని మాటలూ. అప్పుడు, ఆడుకునే పిల్లలకి స్నానాలూ, నెత్తికి కుంకుడు వాసనలూ, నోట్లో ఉప్పూ, కంట్లో నీళ్ళూ, వాళ్ళని చూస్తూ ఒక మూలగా ఉగ్గపట్టుకుని నేనూ-
ఇక ఉదయం, మధ్యాహ్నమైన వేళ
ఇంత అన్నం తిని ఒక దగ్గరిగా ఒదిగిన పిల్లలు.తెరచిన కిటికీలలోంచి, కొమ్మల్లో ఒక దగ్గరిగా ముడుచుకున్న పిట్టలు. గాలికి కదిలే వాటి ఈకలు. ఆ పక్షులని గుండెపై వాల్చుకుని, నునుపైన వాటి మెడల్లో తల ఆన్చి, వాటి చేతివేళ్లని పట్టుకుని పడుకుంటే, నా కలలోకి వచ్చే
పిల్లలు కదులాడే నీ నిండైన కళ్ళూ, వాటి గుండె చప్పుళ్ళూ, ఆ గుప్పిట్ల తోటలల్లో, ఆ పొదరిళ్ళలో, వాన కురిసిన ఆ పచ్చి చెట్ల సువాసనల్లో ఇరుక్కుపోయిన నేనూ నా చేతివేళ్లూ, ఈ అక్షరాలూ, ఒక మధ్యాహ్నం, ఒక జీవితం, ఒక క్షణం అను ఈ ఒక అతి సాధారణమైన కవిత-

No comments:
Post a Comment