13 August 2014

అతిధి

తన ఇంటికి వెళ్లాను-

అప్పుడు చప్పున తన ముఖం వికసించింది. నన్ను లోపలకి రమ్మని పిలిచి
కూర్చోమన్నది. మంచి నీళ్ళు తాగుతావా
కాఫీ పెడతాను. టిఫిన్ చేసావా అని పాపం

ఆదరాబాదరాగా తను కిందా మీదా అయ్యింది.
కలగాపులగం అయ్యింది. కంగారు పడింది- 
నేను అప్పుడు అన్నాను

"ఇప్పుడేమీ వద్దు. నేను తినే వచ్చాను.
ఇంతకూ నువ్ టిఫిన్ చేసావా?" అని
తదేకంగా తన ముఖంలోకి చూసాను.

అప్పుడు
ఆ ఇంటి ఆవరణలోని వేపచెట్టు చలించి, పాలిపోయిన ఆకులు
రాలాయి. ఎక్కడిదో గాలి, హృదయాన్ని
చెక్కేలా నింపాదిగా వీచింది. పిల్లి ఒకటి

గోడపై నుంచి కడిగిన గిన్నెల మధ్యకు దూకగా
అవన్నీ చెల్లాచెదురై పెద్ద శబ్ధం చేసాయి-
ఇంటి వెనుక ఆరవేసిన దుస్తులు కూడా

ఒకదానికి మరొకటి ఒరుసుకుని ఏవో గొణిగాయి.
ఆనక నిశ్చలమయ్యాయి. ఇక వరండాలో
నేలపై, తను అప్పటిదాకా దువ్వుకున్న

దువ్వెనలో ఇరుక్కుని, తొలిగిన జుత్తే ఆ ఎండలో, నేలపై 
తెల్లగా, మెల్లిగా, తన చేతివేళ్ళ వలే
వణుకుతూ, వేపాకులతో దొర్లిపోతూ-

ఏమీ లేదు.
ఈ ఉదయం ఇంటికి వెళ్లాను.
ఒక అతిధి వలే అమ్మను చూసొచ్చాను. 

No comments:

Post a Comment