రాత్రి నీ కోసమే ఫోన్ చేసాను.
అప్పుడు నా పైన ఆకాశం కొద్దిగా కుంగి ఉండింది. అప్పుడు నా పాదాల కింది నేల కొద్దిగా పగుళ్లిచ్చి ఉండింది. అప్పుడు నా చుట్టూ గాలి చాలా ఒంటరిగా, తల్లి లేని పిల్లి పిల్లలా బావురుమంటూ తిరుగాడుతూ ఉండింది. అప్పుడు నువ్వు రోజూ చూసే చీకటే, నెత్తురు వలే నా ముఖంపైకి చిలకరించబడి ఉండింది. అప్పుడు బాల్కనీలోని ఈ మొక్కలూ, పూలూ, లతలూ అన్నీ విగతజీవులై నన్ను భయభ్రాంతుడిని చేస్తూ ఉండినై -
అవును. రాత్రి నీ కోసమే ఫోన్ చేసాను.
అప్పుడు నా కళ్ళు కొంత తడిగా ఉండినాయి. అప్పుడు నా బాహువులు ఖాళీగా ఉండినాయి. అప్పుడు నా శరీరం వానకి నేల రాలిన గూడు అయ్యి, పగిలిన గుడ్లు అయ్యీ ఉండింది. అప్పుడు నా గొంతు రెక్కలు కొట్టుకుంటూ అరిచే తల్లి పావురం అయ్యి ఉండింది. అప్పుడు నా తలపంతా నువ్వై, 'నువ్వు ఎక్కడా? ఎక్కడా-?' అని ప్రతిధ్వనిస్తూ ఉండింది.
అవును - రాత్రి నీ కోసమే ఫోన్ చేసాను. అవును - రాత్రి నీ కోసమే, నన్ను కనే ఒక రాత్రి కోసమే ఫోన్ చేసాను. అవును - రాత్రి, నేను ఎక్కడ ఉన్నానో తెలుసుకుందామనే, నన్ను నేను కనుక్కుందామనే, నేను బ్రతికి ఉన్నానో లేనో తెలుసుకుందామనే
నా కోసమే, నీ కోసమే - నేను నీకు ఫోన్ చేసాను.
No comments:
Post a Comment