31 August 2014

మెరుగు

ఏవో కొన్ని పదాలని అనుకుంటాను
'ఒక దీపం అనీ, ఒక పూవు అనీ, ఒక వాన అనీ, ఒక వెలుతురు అనీ
ఒక 'నువ్వు' అనీ. అన్నీ ఇట్లాంటివే -

అవి కొన్నిటిని సూచిస్తాయని అనుకుంటాను
'దీపం దీపాన్నీ, పూవు పూవునీ, వాన - చినుకులనీ
వెలుతురు కాంతినీ, నువ్వు అనే పదం
నిన్నే'ని సూచిస్తాయని అనుకుంటాను -
అలా కాకపోయినా

'దీపం ఒక పూవునీ, పూవు ఒక తుంపరనీ
వాన ఒక కాంతినీ, ఆ ఒక్క కాంతి కరుణనీ
ఆ కరుణ చివరికి 'నిన్ను'ని చూపిస్తాయనే అనుకుంటాను - లేక
నువ్వే ఆ కాంతివనీ

ఆ కాంతే నీలోంచి తుంపరగా
వానగా, పూలుగా, చీకట్లో వెలిగించిన దీపంగా మారిందనీ
రెండు అరచేతులు లేక గాలికి వణుకుతుందనీ

ఇలా - ఏవేవో ఊహిస్తాను: ఊహించినవే రాస్తాను

రాసిన వాటినే అవి
సూచిస్తాయని కూడా అమాయకంగా అనుకుంటాను-
ప్రతి పదంలో ఒక ముఖం ఉందనీ, ఆ పూర్ణబింబాన్ని
నా అరచేతుల్లో ఒడిసిపట్టుకుని

గుండెలకు హత్తుకుని, ఎంతో ఇష్టంగా
మాట్లాడదామని కూడా అనుకుంటాను.
మరి ఎలా తెలుసు నాకు, ముఖం స్థానంలో ఒక సమాధి ఉండవచ్చుననీ
ఒకరిని ఊహించి ఆత్రుతగా తలుపులు తెరిస్తే

అక్కడ మరొకరు లోపల ఊహించలేనన్ని గదులతో
మరిన్ని మూసిన తలుపులతో, గర్భ కుహరాలతో ఎదురౌవ్వచ్చుననీ
తాళం చెవులు లేక, మాట్లాడే పెదాలూ లేక
నేను స్థాణువై మిగిలిపోవాల్సి ఉంటుందనీ?!

అవును
నువ్వన్నదే నిజం.
మౌనాన్ని మరింత మెరుగు పరచగలిగేటట్లైతే తప్ప, అస్సలు మాట్లాడకు!

30 August 2014

విను

నింపుతారనుకున్న ఒక మట్టికుండ పక్కగా
కూర్చుని ఉన్నాను, చెవులాన్చి. మరి
దాని శరీరం లోపలికి చొచ్చుకుపోయి తోడేసే ఒక గాలి,  వ్రూమ్మంటూ- 

మరి, ఎలా ఉంటుంది
నీ లోపలికి నీళ్లై వస్తారనుకున్న వాళ్ళంతా గాలై 
చివరికు నిన్నూ, నీకు మిగిలిన ఖాళీతనాన్ని కూడా ఖాళీ చేసి

నిన్ను తోడుకుపోతున్నప్పుడు?

దా తండ్రీ దా. విను.

రూమీ కాదు,హఫీజ్ కాదు. చూసేదానినంతా
పూర్వ వాచకాల అల్లికలోకి మలిచి
శాంతుడివై ఆనందించే నీతో నాకేం

పని కానీ, దా తండ్రీ దా విను - ఈ వేణువు.
ఒక దీపం. ఒక చీకటి.
ఒక గాలి. ఒక నిప్పు-

ఒక జన్మ ఓ మృత్ర్యువూ.
ఒక వానా, ఒక కరవు-
మరి నీ శరీరానికీ, నా శరీరానికీ మించినది ఏమైనా ఉంటే చెప్పు తండ్రీ
ఇక, వస్తాను నీ వద్దకి

ఒక అనాధయై తిరుగుతున్న
ఈ మట్టికుండలోని గాలితో, అనంతంతో
ఆది మరియు అంతం అయిన

నాతో: నీతో - మరి నీ వద్దకు -

29 August 2014

అనుకున్నాను

అవును. అప్పుడు, నిన్ను కలుసుకుందామనే అనుకున్నాను-

నువ్వు వెళ్ళిపోయేలోపు ఒకసారి చూద్దామనే అనుకున్నాను
నువ్వు ఎలా ఉన్నావోనని అడుగుదామనే అనుకున్నాను
నీ పక్కన కూర్చుని నీ మాటలు విందామనే అనుకున్నాను
నీ అరచేతులలోకి నా అరచేతులని వొదిలివేసి
కాసేపు నిశ్శబ్ధం అవుదామనే అనుకున్నాను

నీ శరీర వనంలో వీచే గాలినీ, ఆ సవ్వడినీ కాసేపు శ్వాసించి
విందామనే అనుకున్నాను. నీ కనుల సెలయేటి అలజడుల్లో
నా ముఖం చూసుకుని, కడుక్కుందామనే అనుకున్నాను
నా నుదిటపై నిన్ను, ఒక పవిత్ర చిహ్నంలా దిద్దుకుందామనే అనుకున్నాను
నీ పెదాలపై నా పేరు మరొకసారి వినబడితే
చిన్నగా నవ్వుకుందామనే అనుకున్నాను-

నీ పూల తోటల్లో, నీ వర్షాల్లో, నీ ఋతువుల్లో
నీ లలిత వర్ణ లోకకాలలలో కాసేపు తిరుగాడి
నాకు నేను శుభ్రపడదామనే అనుకున్నాను

అవును. ఇది నిజం-

నిన్ను కలిసి, నాకు నేను తారస పడదామనే అనుకున్నాను
నిన్ను కలిసి, నేను ఇంకా బ్రతికే ఉన్నానని
నాకు నేను రూడీ చేసుకుందామనుకున్నాను
ఒక్కసారి నిన్ను కలిసి, నిన్ను చూసి, నిన్ను తాకి, నిన్ను శ్వాసించి
నెమ్మదిగా, వచ్చిన సవ్వడే లేకుండా వెళ్లిపోదామనే అనుకున్నాను
ఇవి కాక, వేరే పదాలు వ్రాసుకుందామనే అనుకున్నాను

అవును. ఇది నిజం.
'అప్పుడు, నిన్ను కలుసుకుందామనే అనుకున్నాను'
అలా అని నేను ఇప్పుడు చెబుతున్నానంటే
నువ్వు నన్ను- అస్సలే - నమ్మకు మరి!

28 August 2014

ఏమీ లేదు

చీకట్లోకి చూస్తూ
వాన కోసం ఎదురు చూసుకుంటూ కూర్చుంటాను-

ఎండిన రాత్రి.
బెంగటిల్లిన పసిపాపల ముఖాల వంటి పూవులూ, ఆకులూ
ఆగి ఆగి వీచే గాలికి తడబడుతూ కదిలే లతలు.
ఊగే నీడలు-

నిజానికి
నీకు చెప్పడానికి ఇక్కడేమీ లేదు.
చీకట్లోకి చూసే, ఆకాశంలోకి ఆర్తిగా సాగిన రెండు ఖాళీ అరచేతులు
రాత్రి  ముందు మోకరిల్లిన రెండు కళ్ళు. రెండు శూన్యాలై వేలాడే పాదాలు-
ఇక, ఎవరో పారతో తవ్వి పోస్తున్నట్టు, ఒంటరిగా ఊళ పెట్టే శరీరమో, నేనో-

మరి ఇదేమిటి అంటావా?

ఒక రాత్రిలోకి
రాత్రంతా ఎదురు చూసుకుంటూ కూర్చుంటే
మట్టి పూలను పొర్లించుకుంటూ, ఆకులతో, గాలితో, నీడల్ని కుదిపే పరిమళంతో
చెట్లలోంచి వానైతే వచ్చింది కానీ

నువ్వే తిరిగి రాలేదు -

25 August 2014

చూడండి

'పూల మొక్కలను ఎందుకు పెంచుకుంటావు?' అని అడిగేవాళ్ళకి నిజంగా ఏం చెప్పాలో తెలియదు -

ప్రతి ఉదయాన్నే లేచి, వాటికి నీళ్ళు చిలుకరించి, కొత్త ఆకులు ఏమైనా వచ్చాయా లేదా, లేక మొగ్గలు ఏమైనా తొడిగాయా లేదా అని చూసుకోవడం, వాటి సమక్షంలో కాస్త కాలం గడపటం, వాటి లోకంలోని సౌందర్యం, దానిలోని ఆనందం ఎలా చెప్పాలో తెలియక, చాలాసార్లు విభ్రాంతితో అతను మీ వైపు అయోమయంగా చూసి ఉంటాడు -

ఈ మొక్కలు ఒట్టి మొక్కలు కావనీ, పిల్లల చేతుల్లా మిమ్మల్ని పిలిచే, గాలికి కదులాడే ఈ ఆకులు, ఒట్టి ఆకులు కావనీ, మీకొక కూతురు ఉండి ఉంటే, తన ముఖంలా, వెన్నెల ఒదిగినట్టుగా ఉండే ఈ మొగ్గలు, ఏమాత్రం ఒట్టి మొగ్గలు కావనీ, ఏ రాత్రో మీరు

ఒంటరిగా గుండెను తడుముకుంటున్నప్పుడు, మీ పక్కగా ఉండి, మీ వైపు తలలొగ్గి మిమ్మల్ని వినే ఈ లతలూ, పూవులూ, వాటి నీడలూ, ఏ మాత్రం ఒట్టి లతలూ పుష్పలూ కావనీ, ఒకటి రెండు రోజులు మీరు లేక, అవన్నీ నీళ్ళు లేక ఎలా ఉన్నాయోనని

అతను పడే ఆదుర్థా, ఒట్టి కంగారు మాత్రమే కాదనీ, ఒకటికి రెండుసార్లు ఫోన్ చేసి "మొక్కలకి నీళ్ళు మరచిపోకు. పిట్టలకి కొన్ని బియ్యం గింజలూ..." అని అతను మళ్ళీ మళ్ళీ చెప్పటం పిచ్చితనం కాదనీ, అవన్నీ మీరేననీ, మిమ్మల్ని ఇంకా బ్రతికి ఉంచేవి అవేననీ

వినిమయ ఇంద్రజాలంలో పడి, చాలా విషయాలు మరచిపోయిన మీకు, ఆ విషయం ఎలా చెప్పాలో తెలియక విస్మయంతో అతను మీవైపు, చాలాసార్లు ఖచ్చితంగా చూసే ఉంటాడు. లేదా స్థాణువై మూగవాడైపోయీ ఉంటాడు - ఇప్పటికీ కూడా

అవన్నీ అతనికి ఒక పొడిగింపు అనీ, "పూవులూ మొక్కలతో గడపటం అంతా ఒక సెంటిమెంటల్ ట్రాష్" అనే మీకు అవి అతని అస్థిత్వంలో భాగమనీ, ఈ లోకానికీ అతనికీ ఉన్న సంబంధమే, వాటికీ అతనికీ ఉంటుందనీ, "వాటి లోకంలోకి ఒకసారి వచ్చి చూడండి. వానలోకి ఒకసారి చేతిని చాచి చూడండి. బంధాల నుంచి పారిపోవడం కాదు, ఒక అనుబంధం మొదలు పెట్టి చూడండి. ఇతరాన్ని ఒక్కసారి ప్రాణంగా ఇష్టపడి చూడండి" అని

ఇప్పటికి కూడా మీకు చెప్పలేక, ఈ మొక్కలనూ, ఆకులనూ, మొగ్గలనూ, పిట్టలనూ, కమ్ముకున్న మబ్బులనూ, వీచే గాలినీ, కురిసే నాలుగు చినుకులనూ, ఎలా మీ కోసం కొంత ఒరిమిగా వ్రాస్తున్నాడో చూడండి.

24 August 2014

నాకు తెలియదు

"పొద్దువోయింది
ఇగ ఇంటికి బో బిడ్డా. కాలం మంచిగ లేదు
నీ కోసం ఎవరో ఒకరు ఎదురు చూస్తూ ఉంటారు. నీ తల్లో, తండ్రో, పెళ్ళామో, పిల్లలో...

ఎంత తాగినా
ఎక్కిన లోకం దిగదు. వోయిన ప్రాణం తిరిగి రాదు

లోకం గిట్లనే ఉంటది బిడ్డా
దాంతో పెట్టుకున్నా, లంజతో పడుకున్నా ఒక్కటే. ఏదున్నా బతకాలె. పొయ్యెలిగించాలె-
కళ్ళలో నెత్తురుతో నేను బ్రతకతల్లే?

పో బిడ్డా.
జర భద్రంగా ఇంటికి బో-" అని నిన్న రాత్రి  తను చెబితే
ఆ చితికిన మనుషుల జనతా బార్ నుంచి
రాత్రి ఏ ఒకటింటికో చేరాను: మరి అది

ఇంటికో
మరి అది
ఇల్లో కాదో నాకు తెలియదు. 

అప్పుడప్పుడూ

అప్పుడప్పుడూ
వెళ్లిపోదామనే అనుకుంటావు ఈ లోకం మధ్య నుంచి

తాకీ తాకక
అసలు వచ్చిన ఆనవాలు కూడా లేకుండా
ఒక తెమ్మరలానో, పల్చటి ఎండలానో, నీటి తుంపరలానో
చెట్ల కింద నుంచి సాయంత్రానికి వెళ్ళిపోయే నీడలానో, కొలనులోని తామర పూవులానో

అప్పుడప్పుడూ
వెళ్లిపోదామనే అనుకుంటావు ఈ మనషుల మధ్య నుంచి-

వీళ్ళంతా
ఒట్టి ప్రతిబింబాలనీ, బోలు శబ్ధాలనీ, మాన్పుకోలేని
గాయాలనీ, ముసుగులు వేసుకుని తిరిగే పాములనీ, తోడేళ్ళనీ
నరమాంసం రుచి మరిగి - రాత్రికి నీ వద్దకు - పదే పదే తిరిగి వచ్చే పులులనీ
నవ్వే, ఏడ్చే, నడిచే మర్మావయాలనీ

వీళ్ళంతా, ఎప్పటికీ
ఇన్ని మంచి నీళ్ళు తోడుకోలేని బావులనీ
మట్టికుండా, గాలీ, వాన వాసనా, వెలిగించిన పొయ్యీ
ఉడికే మెతుకుల శబ్ధాలూ, నీళ్ళని పీల్చుకునే మట్టి కదలికా, పూల రేకుల కరుణా
తెలియని వింత జీవాలనీ, మృగాలనీ

అన్నిటినీ మించి
అద్దంలో నిన్ను నువ్వు చూసుకునే క్షణాలు వాళ్ళేనని, వాళ్ళు తప్ప
మరో మార్గం, గమ్యమూ లేదని తెలిసీ
అప్పుడప్పుడూ

వెళ్ళిపోదామనే అనుకుంటావు
నీలోంచి నువ్వు ఈ లోకంలోకీ, ఈ కాలంలోకీ, స్వర్గం నరకం
పాపం పుణ్యం, శాపం శోకం, మోక్షం జ్ఞానం, జననం మరణం, బ్రతుకు పరిమళమూ
వేదనానుబంధమూ అయిన ఈ మనుషులలోకి

అప్పుడప్పుడూ-

23 August 2014

దూరం నుంచి వచ్చేవాళ్ళు

అలసిపోయి చాలా నెమ్మదిగా నీ వద్దకి వస్తారు వాళ్ళు -

ఒక వృక్షమేదో నరకబడి బరువుగా నేల కొరిగినట్టు, శరీరమంతా 
విలవిలలాడే ఆకులై చలించి, నీ పక్కగా పడుకుండి పోతారు వాళ్ళు-
మన అమ్మలో, పిల్లలో, మన స్త్రీలో లేదా మన స్నేహితులో 

ఎవరో ఒకరు - గాలి లేని పగళ్ళలో కాంతి లేని రాత్రుళ్ళలో 
నీడలు కమ్ముకునే మధ్యాహ్నాలలో నిలువ  నీడ లేని సాయంత్రాలలో
హటాత్తుగానో, అతి నెమ్మదిగానో, నీ పక్కన చేరి, బేలగా 
నీ కళ్ళల్లోకి చూసే వాళ్ళు. అడగకనే అన్నీ అడిగేవాళ్ళు 

చెప్పకనే అన్నీ చెప్పేవాళ్ళు. నీ అరచేతిలో మరొక అరచేయై, వణికే చేతివేళ్ళయి  
చెమ్మై, నీ గుండెలోని బుగులు కపోతాలై, నీలో ఒదిగి 
నిరంతరం, నీటిబుడగలు పగిలే శబ్ధాలను చేసేవాళ్ళు
నిరంతరం, నీటి బుడగల లోకాన్ని నీకు చూయించే 

వాళ్ళు. వాళ్ళే 
నీలో నాటుకుని, నీ తనువంతా పుష్పించే వాళ్ళు. పుష్పించడంతో నిన్ను 
రుధిరమయం చేసేవాళ్ళు. నీలో, నీకు కొంత కష్టం కొంత ఇష్టం 
అయ్యేవాళ్ళు. నీకు కొంత బలమూ, మరి కొంత బలహీనతా 
అయ్యేవాళ్ళు. నీకు కొంత ప్రేమా చాలా చాలా నిస్సహాయతా 
అయ్యేవాళ్ళు . నిన్ను వొదలని వాళ్ళు. వొదులుకోలేని వాళ్ళు 
వాళ్ళు. వాళ్ళే 


అమ్మలో, పిల్లలో, స్త్రీలో, భార్యలో, ప్రియురాల్లో లేక స్నేహితులో

చాలా అలసిపోయి, చాలా పగిలిపోయి, మరో దారి లేక, మరో దిక్కు కనపడక
సమసిపోదామని, పొర్లిపోదామని, ఈ లోకపు గట్టు ఏదో దాటి 
నీలోకి దుమికి కొట్టుకుపోదామనీ, ఆనవాలు లేకుండా వెళ్లి 
పోదామనీ నీ వద్దకు వస్తే, అటువంటి వాళ్ళని ఎన్నడూ 

'ఎందుకు?' అని అడగకు. పొరబాటున కూడా ఎన్నడూ 
ముఖం దాచకు. చాచిన చేతినీ, తెరచిన ఛాతినీ, నీ ఇంటి 
తలుపులనూ నీ తోటి దేహసారికి ఎన్నడూ మూయకు
జాగురూకత లోకపు సంకెళ్ళ రీతిని, అస్సలే పాటించకు -

ఎందుకంటే మిత్రుడా, ఈ పూటకు ఇక 
ఇదే, మనకు మిగిలిన ఆఖరి మధువు!

22 August 2014

రెండు

ద్వేషం నిండిన వాళ్ళతో మాట్లాడటం ఎట్లాగా అని, కిటికీలూ తలుపులూ మూసిన ఇంటిలో 
నేనొక్కడినే, నాలో నేను చాలా తర్కించుకుంటూ కూర్చుంటాను. 
చాలా మధన పడుతూ కూడా ఉంటాను. 
చెబుదామని కూడా అనుకుంటాను చాలా -

'జీవితం చాలా తాత్కాలికమనీ, నీకూ నాకూ మధ్య విడదీయలేనంతగా బిగిసిపోయిన ఈ  
చిక్కు ముడులన్నీ ఎక్కువ కాలం ఉండవనీ, మనం నిజమని 
అనుకునేవన్నీ మరి కొంత కాలానికి ఎవరికీ గుర్తుండవనీ 
ఆఖరికి నువ్వూ నేనూ కూడా మిగలమనీ' - 

ఎలా చెప్పాలో తెలియక, నాకు నేను పరిమితమయ్యి, నాతో నేనే ఒక సంభాషణయ్యి
'ఇవతలి వాళ్ళూ, అవతలివాళ్ళూ అని లోకాన్ని చూడటం, ఒక 
అసంపూర్ణ వీక్షణ' అని నీతో చెప్పాలనీ చెప్పలేక, ఇక నేనే 
ఒక 'ఇవతలా- అవతలగా' చీలిపోయి, రెండుగా మారిపోయి 

నువ్వు ఊహించుకునే ఒక ద్వేషంలోకి, నేనే ఒక చీకటిగా మారిపోయి, ఊపిరందక తలెత్తి చూస్తే
ఇల్లంతా నీలాంటి చీకటి. ఇల్లంతా నాలాంటి చీకటి. ఇంటి బయటి కాంతినీ
ఊయల ఊగే గాలినీ, అల్లుకునే లతలనీ, అరిచే పిట్టలనీ, రంగుల పూలనీ 
లోపలి రానివ్వక బంధించిన తలుపులూ, కిటికీల 
దిగ్బంధనం. బావురుమనే ఊపిరాడనివ్వనితనం-

ఇక, ద్వేషం నిండిన వాళ్ళతో మాట్లాడటం ఎట్లాగా అని - నాకు నేనే - నా ఇంటి తలుపులూ
కిటికీలూ మూసుకుని, నేనొక్కడినే, నాలో నేను చాలా తర్కించుకుని 
మధనపడీ, తపన పడీ లేచి అసహనంగా కిటికీలూ తలుపులూ తెరిస్తే 

గదిలోకి వరదలా పొర్లుకు వచ్చే వెలుతురు. వాన చినుకుల తడి
చినుకుల కాంతిలో పొదగ బడుతున్న రంగుల పూల పరిమళం-
చిట్లుతున్న విత్తనాలూ, తొలి చివుర్ల జీవన ఉత్సాహమూ, ఇంకా 

నేను. నేను అనే నువ్వునువ్వు అనే సమస్థం - ఒక శాంతి లోకం, కాలం. 

21 August 2014

దీపశిఖ

1
ఇది నేను నీకు
ఎప్పుడో ఇవ్వాల్సిన ఒక కానుక.
2
నువ్వు
ఒంటరిగా కూర్చున్నప్పుడో
నీతో నువ్వు మాట్లాడుకుంటున్నప్పుడో

నువ్వొక్కదానివే
నీలోకి నువ్వు, లోలోపలికి ముడుచుకుపోయి
మూలకు ఒదిగిపోయి
ఒక పావురమై
చీకటి గూట్లో పడుకున్నప్పుడో

లేక
ఆ ఒక్క క్షణం ముందు
నా చీకట్లో, నువ్వు ఒక దీపం వెలిగించి
గూట్లో పెట్టినప్పుడో-
3
రెండు వేళ్ళని
దగ్గరగా చేర్చి, నెమ్మదిగా నులిమి వొదిలితే
ఒక పూవు

తనని వదలమని
నిను అర్థిస్తూ తల వాల్చినట్టు
కనపడని దూరాలకు
ఒక పక్షి ఎగిరిపోయినట్టూ
ఆరిపోయే కాంతి -

ఇక
ఒక తెల్లటి పొగ
క్షణకాలం నన్ను అల్లుకుని, బహుశా
నిదురించిన నీ శరీరాన్ని
మరొకసారి గుర్తుచేస్తూ మాయమయితే
4
క్షమించు.

ఇక్కడంతా
పూలు తెగిన చీకటి.
ఇక్కడంతా, తల్లి పాలకై నోరు తెరిచి
అలానే చనిపోయిన
ఒక శిశువు కనులలోని నిశ్శబ్ధం -
ఇక్కడంతా
క్షణకాలం క్రితం వరకూ
ఆ తల్లి స్థన్యానికై వెదుకులాడిన ఆ శిశువు చేతుల తండ్లాట -

ఇక్కడంతా
5
ఇదంతా
నేను నీకు ఎప్పుడో ఇవ్వాల్సిన
నేను అనే
ఒక మృత్యు కానుక. 

20 August 2014

ఒక పెర్సనాలిటీ డెవలప్మెంట్ పోయమ్

మనుషులపై కోపం ఉండటం తప్పేమీ కాదు, అది నిన్ను అంధుడిని చేయనంత వరకూ. లోకంతో కటినంగా వ్యవహరించడం తప్పేమీ కాదు, అది నిన్ను స్పర్శా రాహిత్యంగా మార్చనంతవరకూ. మరి, అవన్నీ నీ పట్ల కోపంగానూ, కటినంగానూ ఉన్నాయా అంటే మరి ఇటు చూడు. ఇప్పుడు

నీ చుట్టూ చెట్లు ఉన్నాయి. పూసిన పూవులూ ఉన్నాయి. నీళ్ళు చిలుకరించిన ఆవరణలూ అప్పుడే లేచిన పిల్లలూ ఉన్నారు. చల్లగా వీచే గాలీ, వెడుతూ వెడుతూ ఎవరో నిన్ను చూసిన స్నేహపూర్వకమైన నవ్వూ ఉంది. తినడానికి అన్నమూ, తాగడానికి నీళ్ళూ, తల దాచుకోడానికి ఒక గూడూ, దానిలో పక్షి పిల్లలూ ఉన్నాయి. వాటి రెక్కల్లో కొంత గోరువెచ్చదనం ఉంది. ఇష్టమూ ఉంది. అన్నిటినీ మించి, నువ్వు ఇంకా బ్రతికే ఉన్నావు. నువ్వు ఇంకా బ్రతికి, చూడవలసిన ఉత్సవమేదో, చేయవలసిన పనులేవో, వొదిగిపోవాల్సిన వేదన ఏదో మిగిలే ఉన్నాయి-

నిర్వచనాలదేముంది? ఎన్నైనా చెప్పవచ్చు. సత్యానిదేముంది? ఎంతైనా వ్యాఖ్యానించవచ్చు. ప్రేమంటే ఇష్టం లేకపోతే, ఆ పదం వాడకు. కానీ, లోకంపై కోపంతో మనుషులనూ, మనుషులపై కోపంతో లోకంనూ చిన్నబుచ్చకు. మరీ అంత కటినంగా ఉండకు. బిడ్డా, కొంత ఓరిమి ... కొంత ఓరిమి పట్టు ...  

ఇంకొద్దిసేపట్లో, కనిపించేవన్నీ నిజమనిపించేవన్నీ మంచు తెరల వలే ఎలా కరిగిపోతాయో చూడు-  

a noem and a cautionary tale

ముందే చెబుతున్నాను
ఇదొక చెత్త పొయమ్. ఆపై నీ ఇష్టం.  

(ఇదొక మెటఫర్. 
ఇందులో కనిపించేది ఏదీ
ఏది కాదు.) 

రాత్రి రేకులు విచ్చుకోగా 

అడగకుండా వచ్చిన వెన్నెల
చెప్పకుండానే   
వెళ్లిపోయింది-

(ఇక)


ఉన్నదంతా ఒక్కటే


చీకటీ,గాలీ,వాన చినుకులూ 

పూల పరిమళం 
ఇంకా, తన శ్వాస.

19 August 2014

రాత్రి నీ కోసమే ఫోన్ చేసాను

రాత్రి నీ కోసమే ఫోన్ చేసాను.

అప్పుడు నా పైన ఆకాశం కొద్దిగా కుంగి ఉండింది. అప్పుడు నా పాదాల కింది నేల కొద్దిగా పగుళ్లిచ్చి ఉండింది. అప్పుడు నా చుట్టూ గాలి చాలా ఒంటరిగా, తల్లి లేని పిల్లి పిల్లలా బావురుమంటూ తిరుగాడుతూ ఉండింది. అప్పుడు నువ్వు రోజూ చూసే చీకటే, నెత్తురు వలే నా ముఖంపైకి చిలకరించబడి ఉండింది. అప్పుడు బాల్కనీలోని ఈ మొక్కలూ, పూలూ, లతలూ అన్నీ విగతజీవులై నన్ను భయభ్రాంతుడిని చేస్తూ ఉండినై -

అవును. రాత్రి నీ కోసమే ఫోన్ చేసాను.

అప్పుడు నా కళ్ళు కొంత తడిగా ఉండినాయి. అప్పుడు నా బాహువులు ఖాళీగా ఉండినాయి. అప్పుడు నా శరీరం వానకి నేల రాలిన గూడు అయ్యి, పగిలిన గుడ్లు అయ్యీ ఉండింది. అప్పుడు నా గొంతు రెక్కలు కొట్టుకుంటూ అరిచే తల్లి పావురం అయ్యి ఉండింది. అప్పుడు నా తలపంతా నువ్వై, 'నువ్వు ఎక్కడా? ఎక్కడా-?' అని ప్రతిధ్వనిస్తూ ఉండింది. 

అవును - రాత్రి నీ కోసమే ఫోన్ చేసాను. అవును - రాత్రి నీ కోసమే, నన్ను కనే ఒక రాత్రి కోసమే ఫోన్ చేసాను. అవును - రాత్రి, నేను ఎక్కడ ఉన్నానో తెలుసుకుందామనే, నన్ను నేను కనుక్కుందామనే, నేను బ్రతికి ఉన్నానో లేనో తెలుసుకుందామనే 

నా కోసమే, నీ కోసమే - నేను నీకు ఫోన్ చేసాను. 

17 August 2014

అందుకే

నేను
నీ వాడినని ఎన్నడూ చెప్పలేదు
పూలల్లో దారం గుచ్చుకుంటూ నువ్వూ,  ఎన్నడూ అడగనూ లేదు-

ఇక
ఈ సాయంత్రాన్ని చీకట్లోకి తురుముకుని
నువ్వు చినుకులని వినే వేళ, రాత్రి దారుల్లో నెత్తిన రుమాలుతో
ఒక్కడే 

ఒక బాటసారి.
శరీరం తప్ప ఆత్మ అంటూ ఏమీ లేని దేహధారి.
నీ సువాసనలో కాలి బూడిదై, చుక్కలు ఇంకిన చినుకులతో, గాలితో

రాలే ఆకులతో
గులకరాళ్ళకు పైగా, చిన్ని చిన్ని చివుక్ చివుక్ శబ్ధాలు చేసుకుంటూ
తనలో తాను మాట్లాడుకుంటూ

బహుశా
ఇటువంటి ఒక కవితను వ్రాసుకుంటూ
చీకట్లలో, పక్షులు బెంగగా ముడుచుకున్న చెట్ల కింద నుంచి
వణుక్కుంటూ, గొణుక్కుంటూ
తనలో తాను నీరై పారిపోయే మనిషి -

బహుశా అతనికి
నువ్వూ, ఎన్నడూ తన దానివని చెప్పనూ లేదు. బహుశా,  అతనూ
ఎన్నడూ నిన్ను, 'ఎందుకు?' అని అడగనూ లేదు.

బహుశా, అందుకే
పూలల్లో దారం గుచ్చుకుంటూ, చిన్నగా పాడుకుంటూ
గడప వద్ద దీపపు కాంతిలో వెలిగిపోయే
-నువ్వు-

మరెక్కడో
తెంపబడిన పూల చీకట్లలో నేను! 

అతి సాధారణమైన

ఆదివారం,ఉదయం వేళ. 

ఆడుకుంటూ పిల్లలు. సగం తెరచిన కిటికీలోంచి గాలి. నేలపై వెలుతురు. బాల్కనీలో, బియ్యం గింజల చుట్టూ తిరుగుతూ పిచుకలు. సన్నగా ఊగుతూ లతలు. మట్టి కుండీలలో మొక్కలు. డైనింగ్ టేబుల్పై, ఒక గాజు గ్లాసు నీళ్ళల్లో నువ్వు ఉంచిన రెండు గులాబీలూ, వాటికి మిగిలిన రెండు రెమ్మలూ. మరి అవి నీ కళ్ళూ, కదిలే నీ కనురెప్పలూ -


ఉదయం, మధ్యాహ్నంగా మారుతున్న వేళ 

ఆడుకుంటూ పిల్లలు. తెరచిన తలుపులలోంచి గాలి. ఊడ్చిన గదులు. మెరిసే గోడలు. వంటగదిలో అన్నం ఉడికే చప్పుడూ, ఇంకా నీవే మరి కొన్ని మాటలూ. అప్పుడు, ఆడుకునే పిల్లలకి స్నానాలూ, నెత్తికి కుంకుడు వాసనలూ, నోట్లో ఉప్పూ, కంట్లో నీళ్ళూ, వాళ్ళని చూస్తూ ఒక మూలగా ఉగ్గపట్టుకుని నేనూ-

ఇక ఉదయం, మధ్యాహ్నమైన వేళ 

ఇంత అన్నం తిని ఒక దగ్గరిగా ఒదిగిన పిల్లలు.తెరచిన కిటికీలలోంచి, కొమ్మల్లో ఒక దగ్గరిగా ముడుచుకున్న పిట్టలు. గాలికి కదిలే వాటి ఈకలు. ఆ పక్షులని గుండెపై వాల్చుకుని, నునుపైన వాటి మెడల్లో తల ఆన్చి, వాటి చేతివేళ్లని పట్టుకుని పడుకుంటే, నా కలలోకి వచ్చే

పిల్లలు కదులాడే నీ నిండైన కళ్ళూ, వాటి గుండె చప్పుళ్ళూ, ఆ గుప్పిట్ల తోటలల్లో, ఆ పొదరిళ్ళలో, వాన కురిసిన ఆ పచ్చి చెట్ల సువాసనల్లో ఇరుక్కుపోయిన నేనూ నా చేతివేళ్లూ, ఈ అక్షరాలూ, ఒక మధ్యాహ్నం, ఒక జీవితం, ఒక క్షణం అను ఈ ఒక అతి సాధారణమైన కవిత- 

16 August 2014

లాంతరు

రావి ఆకులు గలగలా కదిలినప్పుడు, అలలు ఒడ్డుకు నింపాదిగా
కొట్టుకుని వస్తున్నప్పుడు, సాయంత్రంలో
ఆ నారింజరంగు కాంతిలో, చల్లటి గాలిలో

నువ్వొక్కడివే తల దించుకుని నడుస్తూ వస్తున్నప్పుడు
తటాలున నీకొక ముఖం జ్ఞాపకం వస్తుంది -

ఎవరితోనైతే ఉందామని అనుకున్నావో, ఎవరితోనైతే కలిసి
నవ్వుదామనీ, నడుద్దామనీ, మంచు కురిసే
రాత్రుళ్ళలో, గాట్టిగా కావలించుకుని పడుకుందామనీ
కరడు కట్టిన కాలంలో కలిసి రోదిద్దామనీ

కొంత జీవిద్దామనీ, మరి కొంత మరణిద్దామని అనుకున్నావో
ఆ ముఖం! అవును అదే ముఖం.
నువ్వే వదిలివేసావో, తనే నిన్ను
మరచిపోయిందో కానీ, ఇప్పుడు

రావి ఆకులు చిక్కటి రాత్రిలోకి మునగదీసుకుంటున్నప్పుడు, చీకటి
ఒక వ్యాఘ్రమై నువ్వు వచ్చే దారిలో
పొంచి చూస్తూ ఉన్నప్పుడు, ఒకప్పుడు

నీ చేతిలో ఒక లాంతరూ, ఒక ఖడ్గమూ, శాంతి ముద్రా అయ్యి
నిన్ను పూల సువాసనతో, అతి సునాయాసంగా
తేలికగా, ప్రమాదభరితమైన ఈ దారిని దాటించి

మరో దారిలోకీ, మరో లోకంలోకి, రోజా పూల వంటి చినుకులలోకి
నీ కాలాన్ని అలలపై కాగితం పడవ చేసి
వొదిలివేసిన ఆ ముఖం, అవును అదే -
ఆ ముఖం ... ఆ ఒకే ఒక్క ముఖం ...

లాంతరు వంటి ముఖం, కాంతి వలయం వంటి, వెలుగు వాసన వంటి ముఖం
తెప్పవంటి  ముఖం, వాన వంటి ముఖం
గాలి వంటి ముఖం, ఊపిరి వంటి ముఖం
శిశువుకు తల్లి పాల వంటి, ఒడి వంటి

జోలపాట వంటి తన ముఖం, ఇప్పుడు ఎక్కడ?      

13 August 2014

అతిధి

తన ఇంటికి వెళ్లాను-

అప్పుడు చప్పున తన ముఖం వికసించింది. నన్ను లోపలకి రమ్మని పిలిచి
కూర్చోమన్నది. మంచి నీళ్ళు తాగుతావా
కాఫీ పెడతాను. టిఫిన్ చేసావా అని పాపం

ఆదరాబాదరాగా తను కిందా మీదా అయ్యింది.
కలగాపులగం అయ్యింది. కంగారు పడింది- 
నేను అప్పుడు అన్నాను

"ఇప్పుడేమీ వద్దు. నేను తినే వచ్చాను.
ఇంతకూ నువ్ టిఫిన్ చేసావా?" అని
తదేకంగా తన ముఖంలోకి చూసాను.

అప్పుడు
ఆ ఇంటి ఆవరణలోని వేపచెట్టు చలించి, పాలిపోయిన ఆకులు
రాలాయి. ఎక్కడిదో గాలి, హృదయాన్ని
చెక్కేలా నింపాదిగా వీచింది. పిల్లి ఒకటి

గోడపై నుంచి కడిగిన గిన్నెల మధ్యకు దూకగా
అవన్నీ చెల్లాచెదురై పెద్ద శబ్ధం చేసాయి-
ఇంటి వెనుక ఆరవేసిన దుస్తులు కూడా

ఒకదానికి మరొకటి ఒరుసుకుని ఏవో గొణిగాయి.
ఆనక నిశ్చలమయ్యాయి. ఇక వరండాలో
నేలపై, తను అప్పటిదాకా దువ్వుకున్న

దువ్వెనలో ఇరుక్కుని, తొలిగిన జుత్తే ఆ ఎండలో, నేలపై 
తెల్లగా, మెల్లిగా, తన చేతివేళ్ళ వలే
వణుకుతూ, వేపాకులతో దొర్లిపోతూ-

ఏమీ లేదు.
ఈ ఉదయం ఇంటికి వెళ్లాను.
ఒక అతిధి వలే అమ్మను చూసొచ్చాను. 

11 August 2014

నేనే

1
నిరంతరం
నిన్ను నీకే విసుగు కలిగించేలా చేసే దైనందిన వ్యాపకం - అందుకే
ఎక్కడికైనా
తప్పించుకు పోదామని అనుకుంటావు. నిన్ను నువ్వు పూర్తిగా
మరచి పోదామని కూడా.
2
తోటలో పూలతో గడపటం సాంత్వన అనుకుంటావు. పూలని
కిలకిలా నవ్వే శిశువులుగా ఊహిస్తావు. లేదా, కిటీకీ పక్కన కూర్చుని
మబ్బులు కమ్మిన మధ్యాహ్నం, గాలి మునివేళ్ళని తాకుతూ
ఒక వానని స్వప్నిస్తావు. కలలోని చినుకులతో ఆడుకుంటావు

లేదా రాత్రుళ్ళని చల్లగా కప్పుకుని నక్షత్రాలని విందామని కూడా -
అవి నీకు చెప్పే, నీకు తెచ్చే యుగాల భూమి కథలనీ మట్టి వాసననీ
నీ హృదయంలోకి ఇంకించుకుందామనీ, అతీతమైనదేదో అర్థమయితే

నీ కనులలోకి
ఊటలా నీరు ఊరితే, పూలని స్వప్నించే ఒక పచ్చని చెట్టు ఒడిలో
నిదురోదామనీ

తిరిగి
కనులలో పూల రంగులతో, పూల చినుకులతో నిదుర లేచి
తప్పటడుగులతో
ఈ లోకంలోకి బ్రతకడానికి బయలుదేరుదామనీ -
3
నిరంతరం

నీపై నీకే చికాకు కలిగేలా చేసే రోజూవారీ ప్రదర్సనశాలలో ఎక్కడో తప్పిపోతావు.
పూలూ, నక్షత్రాలూ, వాన కురిసే సాయంత్రాలూ
అమలినమైన ప్రేమలూ, శరీరాలకు అతీతమైన
ఆత్మల కోసం వెదికీ వెదికీ వేసారిపోతావు-

అవన్నీ
వాచాకాలపై వాచకాలు అనీ, ఒక నాటకం అనీ
నీలోకి నెమ్మదిగా చేరే, నిన్ను నీ నుంచి దూరం చేసే ఒక మహామాయాజాలం అనీ
భాషలోకి రాని సత్యమేదీ లేదని గ్రహిస్తావు-

ఇదే లోకం అనీ
పాపం పుణ్యం, శాపం శోకం, వేదం వాదం, కర్మా కర్తా క్రియ అంతా మనిషేననీ
ఇంతా చేసి, తప్పించుకుపోదామనుకున్న ఆ మనుషులే
మనకు చివరికి మిగిలే పరమ సత్యమనీ, వారితోనే జననమనీ, మరణమనీ
వాళ్ళే జనన మరణాలనీ తెలుసుకుంటావు ఒక దినాన

మధుశాలల్లో
రద్దీ రహదారుల్లో, వాళ్ళ మోసాలలో వాళ్ళ అమాయకపు ఇష్టాలలో, నీకు ఎదురేగి
నిన్ను బలంగా కౌగాలించుకునే బాహువుల్లో
వాళ్ళ నవ్వుల్లో, ఆ ఒక్క వ్యక్తికై నువ్వు ఎంతో దూరం ప్రయాణించే కన్నీటి దూరాల్లో
వేసవి ఎడారుల్లో

వర్షాకాలపు నదులలో
వాళ్ళ నాట్యాలలో, వాళ్ళ యుద్ధాలలో, వాళ్ళ దినదిన కార్యాకలాపాలలో, కాలకృత్యాలలో
వాళ్ళ సువాసనల్లో, వాళ్ళ మాటల్లో, వాళ్ళ చేతల్లో
వాళ్ళే ఋతువులైన ఒక మహా కాలంలో

ఇతరమే తాననీ
తానే ఇతరమనీ -
4.
 నిరంతరం
నీపై నీకే విసుగు కలిగించేలా, నిరాసక్తత పెంపొందించేలా చేసే ఈ యాంత్రిక
దినదిన యధాలాపపు వ్యాపకంలో
నిన్ను నువ్వు పూర్తిగా గుర్తుంచుకోవడమే అంతిమ మార్గమని బోధపడి

మేలుకొని, లేచి కూర్చుని
ఇలా, ఒక పాటని వింటూ...
5
నువ్వూ వింటున్నావా, నేనే అయిన ఈ గీతాన్ని?   

10 August 2014

ఈ వేళ ఎందుకో

ఈ చీకట్లో, ఈ గాలిలో, ఈవేళ ఎందుకో

చెట్ల కింద నాకై ఎదురుచూస్తూ, కురులను వెనక్కి తోసుకునే నువ్వూ
నీ ముఖమూ, నీ చేతివేళ్ళ కదలికలూ జ్ఞాపకం వచ్చాయి-
ఆపై వెనువెంటనే, వెల్లువలా కమ్మివేసే, నన్ను నిలువెల్లా

దహించివేసే, దాహార్తిని చేసే, త్రికాలాలను ఏకం చేసే

దవనం వాసన వేసే నీ శరీరమూ, నీ గొంతూ, కనకాంబరం పూలూ జ్ఞాపకం వచ్చాయి-
ఆపై, ఒకప్పుడు నన్ను కావలించుకున్న నీ రెండు చేతులూ
నన్ను నిర్ధయగా వేటాడాయి. ఇకా తరువాత నీ రెండు కళ్ళూ
నా శిరస్సుపై ఉన్న ఒకే ఒక గూటిని కూల్చివేసాయి-

ఈ చీకట్లలో, ఈ గాలిలో, ఈ నక్షత్రాలలో, ఈ రాత్రి శబ్దాలలో, ఊగే నీడల్లో
కనుచూపుమేరా అనంతంగా సాగిన
డస్సిపోయిన ఈ ఒంటరి రహదారిలో

ఈ వేళ ఎందుకో
నువ్వే గుర్తుకువచ్చావు.
నేనే ఎక్కడో, తప్పిపోయాను-

08 August 2014

అంతే

'అప్పుడేం మిగలవు ఇవన్నీ

గాలులు వీచే సాయంత్రాలూ, సాయంత్రాలలో వీచే స్త్రీలో పూలో, మరి  
పూలల్లో, పిల్లల్లో వానల్లో వాగుల్లో, అలలుగా 
తెరలు తెరలుగా పోర్లిపోయే వెన్నెల రాత్రుళ్ళో  

అప్పుడేం మిగలవు ఇవన్నీ. 

నువ్వేం కప్పుకున్నా, విప్పుకున్నా 
నువ్వెన్ని జలతారు దుస్తులు వేసుకున్నా, ప్రదర్శించినా, ప్రవచించినా  
అంతా ఇప్పుడే మరి
అంతా ఇక్కడే మరి-

నిజం చెబుతున్నాను నేను 
అప్పుడేమీ మిగలవు ఇవన్నీ. ఇక్కడ లేని మరో లోకం లేదు' అని నేను అంటున్నానంటే 
నువ్వు నన్నునమ్ము మరి- 

ఎందుకంటే, అప్పుడు 

ఎప్పటిలా, ఒక మధ్యాహ్నం 
కొమ్మల్లో ఒక కాకి రికామిగా అరుస్తూ ఉంటుంది. 
నువ్వు ఎప్పుడూ కూర్చునే

ఆ కుర్చీ ఒక్కటే , చెట్ల కింది నీడల్లో 
ఖా
ళీ
గా
.
.
.
అంతే. 

తాకాలని

ఈ నగరం తాకని, ఏ వెన్నెల వానో కురిసే రాత్రిలో తడిచే పూలను
సున్నితంగా పరికించినట్టు, నీ చేతివేళ్ళని
తాకాలని అనుకుంటాను -
అవే

నిద్దురలో ఒక పక్కకి ఒత్తిగిల్లి, నాకు తెలియని భాషలో కలవరించే నీ చేతివేళ్ళు -
అద్దంపై పొగమంచుని తుడిచి ముఖాన్ని చూసుకున్నట్టు
అప్పుడొక

గగుర్పాటు. ఉదయమంతా పొగచూరి, మసిబారి, ఇప్పుడిక ముడుతలు పడి
వెక్కి వెక్కి ఏడ్చి నిదురలోకి జారిన, పసిపాపల వంటి నీ
చేతివేళ్ళు -

చీపుర్లు అయిన చేతివేళ్లు. వంట గిన్నెలయ్యిన చేతివేళ్ళు. దుస్తులయ్యిన చేతివేళ్లు.
సబ్బూ, రుబ్బురోలు పత్రమూ, గదులూ మలమూ మూత్రమూ ఏర్పరిచిన
పసుపుపచ్చ
మరకలనూ
శుభ్రం చేసే

శ్రమా అయిన చేతివేళ్ళు. నువ్వు కక్కుకున్నప్పుడు మట్టికుండై నిన్ను నింపుకున్న
చేతివేళ్లు. అన్నం పెట్టే చేతివేళ్లు. నీకు నీళ్ళు తాపించే చేతివేళ్లు.
అప్పుడప్పుడూ
తలుపు చాటున

కండ్లల్లో నీళ్ళు కుక్కుకునే చేతివేళ్లు. అప్పుడప్పుడూ మూగవోయె చేతివేళ్లు. నుదురుని
అరచేతిలోకి వంపుకుని రాత్రంతా కూర్చునే చేతివేళ్లు.
నిన్ను శపించలేని చేతివేళ్లు.
నిన్ను దీవించే చేతివేళ్లు -

నిన్ను ప్రేమించీ, ప్రేమించీ, గరకుగా మారి, ఇప్పుడిక ఒక కలత నిద్రలో
పెరడులో ఆరవేసిన దుస్తులు రెపరెపా కొట్టుకుని, ఒక ముళ్ళతీగకు చుట్టుకుని
ఆగిపోయినట్టున్న, నీ చేతివేళ్లు-
తిరిగి గాలికి కదిలి

తను కొద్దికొద్దిగా చిరుగుతూ, ముల్లుతో ఉండా లేకా, పూర్తిగా వొదిలి వెళ్లిపోలేకా
మరింతగా చీలిపోయే నీ చేతివేళ్లు.
చీకట్లో దీపాన్ని వెలిగించే చేతివేళ్లు.

అదే దీపాన్ని ఆర్పుతూ మరెవరివో చేతివేళ్లు. ఇక మరి ఎక్కడిదో ఒక గాలి ఇక్కడ
వీచీ వీచీ, ఇక వీయలేక వెళ్ళిపోతే
కాలం స్థంబించిన ఆ క్షణాన

ఈ నగరం తాకిన, ఏ వానా కురియని రాత్రిలో సొమ్ముసిల్లిన నీవంటి, అమ్మవంటి
నీ చేతివేళ్ళని తాకాలని అనుకుంటాను. తాకుతాను.
ఇంత ఎరుకతో
నిన్ను తాకాక

తాకడమంటే, తాను ఇతరమవ్వడం అని తెలిసాక, తాకడమే శోక నివారణ అని తెలిసాక
ఇక మునుపటిలా, నేను, నేనులా
ఎలా ఉండగలను?     

03 August 2014

అయిపోయినవి

(Is it over? He mumbled
To himself)
*
ఆ తరువాత రోజు
ఏవీ గుర్తుకు లేవు
రాత్రంతా నీ శరీరం నా శరీరానికి అద్దిన సువాసన తప్ప. పూల తాకిడి తప్ప-
*
ఉదయాన్నే, పొగమంచు వీచే సరస్సు ఒకటి జ్ఞాపకం వచ్చింది
దానిలో తీరాన, నిశ్చలంగా ఆగి ఉన్న పడవ ఒకటి జ్ఞప్తికీ వచ్చింది
పడవలోని ఒంటరితనం, సరస్సులోని చల్లదనం

రెండూ ఒకేసారి తెలిసి వచ్చి, అరచేతుల్లోని ముఖం వొణికి
రాలిపడి, వీచే గాలికి ధూళితో ఎటో కొట్టుకుపోయింది
కొంత నొప్పిగా అనిపించింది. రావాల్సిన వాళ్ళు ఎవరో

వస్తానని చెప్పి రాకుండా గాయపరచినట్టూ అనిపించింది-
*
ఆ తరువాతి రోజు
ఏవీ గుర్తుకులేవు
రాత్రంతా నీతో మిళితమయ్యి, నీతోనే వెళ్ళిపోయిన నా శరీరపు
అశ్రు వాసన తప్ప
*
Is it really over? Between us?

(Now
He couldn't even utter
Those words
To himself
Anymore)
*
ఆmen!

02 August 2014

నీ గది

తళతళలాడింది నీ గది: ఆనాడు. అప్పుడు, ఇంకా మబ్బు పట్టక మునుపు -

నీకు నచ్చిన
అగరొత్తులను వెలిగించి నువ్వు కూర్చుని ఉంటే, నీ చుట్టూతా
నిన్ను చుట్టుకునే

సన్నటి, పొగల లతలు:
అవి, నా చేతివేళ్ళు  అయితే బావుండునని ఊహించాను నేను, ఆనాడు:
అప్పుడు

చిరుగాలికి, చిన్నగా కదిలాయి
కర్టెన్లూ, నేలపై నువ్వు చదివి ఉంచిన దినపత్రికలూ, నువ్వు రాసుకున్న
కాగితాలూ

పచ్చిక వలే
నీ ముఖం చుట్టూ ఒదిగిన నీ శిరోజాలూ, చివరిగా నేనూనూ. "కొమ్మల్లోంచి
ఒక గూడు రాలిపోయింది
సరిగ్గా

ఇటువంటి
వానాకాలపు మసక దినాన్నే. చితికిపోయాయి గుడ్లు - వాటి చుట్టూ
గిరికీలు కొట్టీ కొట్టీ
అలసిపోయాయి

రెక్కలు. తెలుసా నీకు?
అమ్మ ఏడ్చింది ఆ రోజే " అని చెప్పాను నేను. "నాకు తెలుసు" అని అన్నావు
తిరిగి పొందికగా నీ గదిని

సర్దుకుంటూ నువ్వు:
నేలపై పరచిన తివాచీ, తిరిగిన ప్రదేశాల జ్ఞాపకార్ధం కొనుక్కు వచ్చిన బొమ్మలూ
పింగాణీ పాత్రలూ

ఓ వెదురు వేణువూ
ఇంకా సముద్రపు తీరం నుంచి నువ్వు ఏరుకొచ్చుకుని దాచుకున్న శంఖమూనూ.
ఇక నేనూ పొందికగా

ఆ వస్తువుల మధ్య
సర్ధబడీ, అమర్చబడీ, బొమ్మగా మార్చబడీ నువ్వు ముచ్చటగా చూసుకుంటున్నప్పుడు
ఎక్కడో అలలు

తెగిపడే వాసన -
తీరాలలో అవిసె చెట్ల హోరు. ఒడ్డున కట్టివేయబడిన పడవలు అలజడిగా కొట్టుకులాడే
తీరు. కళ్ళల్లో కొంత
ఇసుకా, ఉప్పనీరూ-

మరి, తళతళలాడి
ఆనక మబ్బుపట్టి, ఈదురు గాలికి ఆకులూ, పూవులూ, ధూళీ రాలడం మొదలయ్యిన
ఆనాటి నీ గదిలో

ఇక ఇప్పటికీ ఒక వాన కురుస్తూనే ఉందా?  

01 August 2014

ఎక్కడ?

నీ ఇంటికి దారి మరచిపోయాను నేను: ఆనాడు -

నగర రహదారులు 
అజగరాల వలే వ్యాకోచించి, తిరిగి చుట్ట చుట్టుకుంటున్న వేళ, దీపస్థంబాలు 
ఉరికొయ్యలై 

వేలాడుతున్న వేళ
దివి నుంచి భువికి కారు మబ్బులు చేతులు చాస్తున్న వేళ, దారి పక్కన 
లోకం లుంగలు చుట్టుకుని 

కడుపుని కావలించుకుని మూలుగుతున్న వేళ, రివ్వున కోసుకుపోయే 

నుసులేవో కళ్ళలో పడి 
చూపులు నెత్తురయ్యే వేళ, మృతశరీరం వలే కాలం మంచుగా మారే వేళ
నాతో నేను విసిగి 

దారి తప్పి, నీ ఇంటిని 
మరచి, ఎంతకూ భూమిలో కరగని - చిరిగిన ఒక ప్లాస్టిక్ కవర్నై, పూవునై  
కొట్టుకుపోతున్న వేళ

కనుగొన్నావు 
నువ్వు నన్ను ఆనాడు, ఆ చీకటి రాత్రుళ్ళలో, వెలుగుతున్న ఒక ప్రమిదెవై
పసుపు పచ్చని 

శరీరమై, మొగలిపూల 
సువాసనవై, పసిపిల్లలు కట్టుకునే ఇసుక గూడువై, నేను ఆడుకుని, పగులగొట్టి 
విసిరి వేసే ఒక 
మట్టి బొమ్మవై - 

ఇక ఇప్పుడు ఇక్కడ 
నీ నెత్తురు అంటిన అరచేతుల్లో, నీ ముఖాన్నీ, తన ప్రతిబింబాన్నీ, దారినీ  
చూసుకుంటూ అతను

ఇల్లే లేక, కానరాక  
ఇలా అంటున్నాడు, సంధ్యవేళ మసక చీకట్లలో, చినుకుల ఝుంకారంలో, ధూళిలో  
ఈ కొన్ని పదాలతో:

'నీ ఇంటికి, నీ వద్దకీ ఇప్పటికీ దారి మరచిపోయి ఉన్నాను నేను. 
త్రొవ్వ  ఎక్కడ?'