01 February 2011

మళ్ళా మొదలు*

వెనక్కి వెళ్లిపోవడం
మళ్ళా ముందుకు రావడం= అలలా
నేలపైకి, నేలలోకి రాలిపోయి
మళ్ళా పైకి, గాలిలోకి అదృస్యంగా లేవడం=
ఇదొక నిరంతర ప్రక్రియ.

వానలా, ఎండకు ఆవిరవుతున్న నదిలా
ఒకే ఒక్క క్షణంలో
చుట్టుకునే అసంఖ్యాక విషయాలు=
దేహంలోకి కరిగిపోయి
రక్తంలోకి వ్యాపించి, తిరిగి
శరీరం అణువణువులోంచి శ్వేదంలా
చెమర్చే నేనులు=

ఇంతకూ నేనెక్కడ?

నువ్వు విసిరివేస్తావు. నాలోని
కొంత సారాన్ని అందుకుని వొదిలివేస్తావు
ఇక మళ్ళా నేను నింపుకోవాలి.
కొమ్మల మధ్య నిర్విరామంగా శ్రమిస్తూ
గూడును పదిలంగా
పుల్ల పుల్లతో కట్టుకునే పక్షిలా
ఇక మళ్ళా నన్ను నేను నింపుకోవాలి.

ఆ పక్షికీ తెలుసు అభద్రత.
బలమైన గాలి వీస్తుండవచ్చు. గాడమైన
వర్షం కురుస్తుండవచ్చు.
రోజుల తరబడి ఏర్పరుచుకున్న గూడు
చెదిరిపోతుండవచ్చు. దాని పిల్లలు
కంపిస్తూ నెలకు రాలిపోతుండవచ్చు=
కానీ నిర్మించకుండా ఉండటం ఎలా?
మళ్ళా మొదలు
మొదటనుంచి ఏర్పరుచుకోవటం

చాలాసార్లు, (బహుశా, అన్నిసార్లు)
నేను ఆ తల్లి పక్షిని=
విధ్వంసం అవుతుందనీ తెలిసి
ప్రేమించడం మానను
విధ్వంసం అయ్యాక తిరిగి
నిర్మించుకోవడం ఆపను=

ఒక తుమ్మ ముళ్ళ పొదలా (బహుశా
నేనే ఒక తుమ్మ ముళ్ళ పొదను)
మొదలుకంటా నరికినా
తిరిగి చిగురించటం మానను
ఈ ఖాళీలను పూరించలేననీ తెలిసీ
నింపుకోవటం ఆపలేను.
తల్లి కుక్క కళ్ళు తెరవని తన కూనల
వద్దకు ఆత్రుతగా పరుగెత్తినట్టు
నేను నాలోకి వెళ్ళిపోవడమూ ఆపలేను=

వీటన్నిటిలో విషాదముంటుంది
ప్రేమించడంలో కూడా=
నీటిలో తడిలా, మంటలో వేడిలా
ఒకే ఒక్క క్షణంలో
అసంఖ్యాక విషయాలలో
క్లుప్తీకరణం అవ్వడంలో శూన్యం ఉంటుంది=

తరచూ అందుకే నాకు నేనూ
నీకు నేనూ (నీ ప్రపంచానికి )
నాకు నువ్వూ నేనూ (నా ప్రపంచానికి కూడా)
అపరచితుడిని అవుతాను
నాలో నేను తునాతునకలౌతాను
ఎండలేని చల్లటి మధ్యాన్నం
గాలిలో తూలుతూ నెమ్మదిగా నేల రాలుతున్న
పసుపుపచ్చటి ఆకుల్లా
దేహం నుంచి వీడిపోయి
తుంపులు తుంపులుగా
రహస్య ప్రదేశాలలోకి కొట్టుకుపోతాను=

భూమిపైకి వొంగిన కొమ్మలా
కొమ్మపై వొంగిన ఉడుతలా
తాతులన కదిలిపోతూ, అంతలోనే ఆగిపోతూ
ఆకస్మికంగా విషాదంలో వొణికిపోయి
మళ్ళా అంతలోనే నిశ్చలమయ్యి
నీ వద్దకు నేను (నా వద్దకు నేను)
ఖచ్చితంగా ఒక అలలా, ముఖాన్ని చుట్టుకునే
తెమ్మరలా, సముద్రపు ఒడ్డున
ఇసుకగూడు కట్టుకునే ఒక పిల్లవాడిలా
ఒక ముసలివాడిలా నాకు ఖచ్చితంగా తెలుసు

కొంతకాలమైనా ఇది ఉండదని తెలుసు
ఈ సజలతనంలో ఏదీ
ఎక్కువకాలం మన్నలేదనీ తెలుసు
అరచేతుల మధ్య ఇసుకను
దగ్గరకు తీసుకునే లోపల
అలలు తిరిగి లాక్కు వెళతాయనీ తెలుసు=

కానీ తాకకుండా ఎలా? వీటన్నిటినీ
ఒక్కసారైనా లోపలి ఇంకించుకోకుండా ఎలా?
పోనీ నువ్వైనా చెప్పు
ధ్వంసం అవ్వకుండా దగ్గరవ్వడం ఎలాగో లేదా
గాయపడకుండా
ప్రేమించడం ఎలాగో?

No comments:

Post a Comment